జనవరి వచ్చిందంటే చాలు సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. పుట్టింటికి ఎపుడు పోదామా అని కొత్త పెళ్లి కూతుళ్లు ఎదురుచూస్తూ ఉంటారు. అటు కొత్త అల్లుళ్ళ మంచీ మర్యాదకోసం అత్తగారిళ్లు సిద్ధమవుతుంటాయి. రకరకాల పిండివంటల తయారీలో మునిగిపోతారు మహిళలు. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు అబ్బో.. సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎంత నిర్బంధం, ఆంక్షలున్నా కోడి పందాల సందడి మాత్రం మామూలుగా ఉండదు. సంక్రాంతి పండుగ మూడ్రోజుల పాటు కోస్తాకుర్రాళ్లలో కోడి పందాల జోష్ రేంజే వేరు. గతంలో సరాదాగా సాగిన ఈ వ్యవహారం ఇపుడు కోట్లాది రూపాయల వ్యాపారంగా మారిపోయింది. ఈ కోడి పందాల కథా కమామిష్షు ఏంటో ఒకసారి చూద్దాం.
కోడి పందాలు, పందెం కోళ్లు
కోడిపందెం అంటే.. స్పెషల్‌గా పెంచిపోషించిన, శిక్షణ ఇచ్చిన రెండు కోడి పుంజులు హోరాహోరీగా పోట్లాడుకోవడం. ఊపిరి ఆగేదాకా కాలు దూసి పోరాడటం. కాళ్లకు కట్టిన పదునైన కత్తులు దిగుతున్నా.. రక్త మోడుతున్నా వెన్ను చూపకూడదు. విజయమో వీర స్వర్గమో అన్నట్టు అయితే ప్రత్యర్థిని పడగొట్టాలి.. లేదంటే తన ప్రాణం పోవాలి. అదీ పందెం.
కోడి పుంజులకు శిక్షణ
ఇంత పకడ్బందీగా పందెం సాగాలి అంటూ ఏంతో కొంత ట్రైనింగ్ ఉండాలిగా. ప్రత్యర్థికి దీటుగా బలిష్టంగా ఉండాలిగా. అందుకే మరి పందెంకోళ్లకు ప్రత్యేక శిక్షణతోపాటు బలవర్ధక ఆహారాన్ని కూడా అందిస్తారు. అయితే ఇందులో పందేనికి పనికి వచ్చే పుంజు(మగకోళ్లను) గుర్తించడం ఒక కళ. ఇక్కడే తొలి అడుగు పడుతుంది.
ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలున్న పుంజును “కాకి” అని, తెల్లని ఈకలు ఉంటే దానిని “సేతు” అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే దానిని “పర్ల” అని, నల్లగా ఉండి, రెండు మూడు ఈకలు ఉన్న పుంజును కొక్కి రాయి అని దీనికి పెద్ద పురాణమే ఉంది. ముఖ్యంగా ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే డేగ అని, రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు. ఇంకా మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని పూల, నల్లబోర, ఎర్రపొడ, గేరువా లాంటివి ఇందులో ఉన్నాయి.
డేగ, నెమలి, కాకి
కోడి పందేలకు సంబంధించి డేగ, కాకి, నెమలి రకాలు పాపులర్. ఇలా తమకు నచ్చిన పందెం కోళ్లను గుర్తించి, వాటిని ప్రత్యేక షెడ్లలో సకల సదుపాయాలతో పెంచుతారు. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, తైలాలతో మసాజ్‌లు, దాణా దాకా అన్నీ రాచమర్యాదలే. రోజుకు రెండు పూటలా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించిన అనంతరం పిస్తా, బాదం, జీడి పప్పు అక్రూట్ లాంటి డ్రైఫూట్స్ తినిపిస్తారు. మధ్యాహ్నం , సాయంత్రం తృణధాన్యాల, డ్రై ఫ్రూట్స్‌తో దాణా పెడతారు.అంతేకాదు కొద్దిగా మద్యాన్ని కూడా పోస్తారట. దీంతో పౌరుషానికి ప్రతీకగా, పందేనికి సిద్ధం అన్నట్టు తయారవుతాయి.
కుక్కుట శాస్త్రం (కోళ్ల పంచాంగం)
మనుషులకు పంచాంగం ఉన్నట్టు కోళ్లకూ ఉంది మరి. అదే కుక్కుట శాస్త్రం. కోడిని సంస్కృతంలో కుక్కుట అంటారు అలా ఈ కోళ్ల పంచాంగానికి కుక్కుట శాస్త్రం అని పేరు వచ్చింది. తిధి, వార,నక్షత్రాలు, కోళ్లపై గెలుపోటముల ప్రభావం చూపుతాయని నమ్ముతారు. కుక్కుట శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలు వివిధ రకాల కోడిపుంజులపై వివిధ రకాల్లో ప్రభావం చూపుతాయట. వారం, తిధి, దిశ,నక్షత్ర బలంతోపాటు, తమ జాతకం బలానికి, కోడి జాతక బలంకూడా తోడైతే ఇక గెలుపు మాదేనని నమ్ముతారు పందెం రాయుళ్లు.
చివరకు మిగిలేది
చుట్టూ వేలాదిమంది గుమిగూడగా, యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. యజమాని పట్ల విశ్వాసంతో, బాస్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్నట్టు రంగంలోకి దిగుతాయి. రక్తం చిందించి మరీ పోరాడతాయి. ఈ క్రమంలో నెగ్గితే..వైభోగం. లేదంటే పరలోకం. అప్పటిదాకా రాజభోగాలు అనుభవించి, నేనే రాజు అన్నట్టుగా ఎదిగిన పుంజు కాస్తా.. చివరికి మందులోకి నంజులాగానో, అల్లుడుగారికి విందుగానో మారిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment