పండగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. సెలబ్రిటీలకైతే మరీనూ.. ముఖ్యంగా సంక్రాంతి పండగకు తమ సినిమా రిలీజ్ చేయాలని తహతహలాడిపోతుంటారు. హీరోలు, దర్శకనిర్మాతలు సినిమా మొదలుపెట్టకముందే సంక్రాంతికి విడుదల చేస్తామంటూ ముందే కర్ఛీఫ్ వేసుకుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. చాలామంది పండగపూట ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటారు. పైగా సెలవులు కూడా కలిసొస్తాయి.
దీంతో పండగ సమయంలో రిలీజ్ చేస్తే కథలో కొన్నిలోటుపాట్లు ఉన్నా మినిమమ్ వసూళ్లు అయినా వస్తాయి. మిగతా సినిమాలతో పోటీ లేకుంటే విజయం తథ్యం. కథ అద్భుతంగా ఉంటే మాత్రం ఆ సినిమాకు తిరుగులేదంతే! సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు కూడా సంక్రాంతి అంటే సెంటిమెంట్. అలా ఇప్పటివరకు మహేశ్ బాబు నుంచి ఎన్ని సినిమాలు ఈ పండక్కి రిలీజయ్యాయో చూద్దాం..
టక్కరి దొంగ
మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ మూవీ 2002లో జనవరి 12న విడుదలైంది. డైరెక్టర్ జయంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లిసా రాయ్, బిపాసా బసు హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం ఐదు నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం.
ఒక్కడు
గుణశేఖర్ డైరెక్షన్‌లో మహేశ్ నటించిన చిత్రం ఒక్కడు. 2003లో సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో భూమిక హీరోయిన్‌గా నటించింది.
బిజినెస్‌మెన్
పోకిరి తర్వాత మహేశ్‌బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన మరో చిత్రం బిజినెస్‌మెన్. 2012లో సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. మహేశ్ పంచ్ డైలాగ్స్‌కు బాక్సాఫీస్ షేకైపోయింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మహేశ్‌బాబు, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013 జనవరి 11న రిలీజైంది. ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసిన ఈ మూవీ నాలుగు నంది అవార్డులు సైతం అందుకుంది.
1 నేనొక్కడినే
మహేశ్‌బాబు చేసిన ప్రయోగాత్మక చిత్రం 1 నేనొక్కడినే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2014లో విడుదలైంది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని జనాలు ఆదరించలేదు.
సరిలేరు నీకెవ్వరు
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేశ్‌బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. 2022లో సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో మహేశ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడినట్లైంది.
గుంటూరు కారం
ఈ ఏడాది కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు మహేశ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ నటించిన మాస్ ఎంటర్‌టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల మైలురాయిని దాటేసింది. కానీ గుంటూరు కారం మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. మరి లాంగ్‌రన్‌లో ఈ సినిమా హిట్‌గా నిలుస్తుందో? లేదో చూడాలి!
చదవండి: ఆఫీసుల చుట్టూ తిరిగా.. అవమానించారు.. భరించలేక వెళ్లిపోదామనుకున్నా!
Comments
Please login to add a commentAdd a comment