సంక్రాంతి తర్వాతి రోజు వచ్చే పండుగ కనుమ. ఈ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు?. పైగా ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలు చెయ్యరు ఎందుకు?. తదితరాల గురించి తెలుసుకుందాం!
సంక్రాంతి వేడుకల్లో ఈ మూడవ రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి కేటాయిస్తారు. కాబట్టి ఇది కనుమ పండుగ. నిజానికి వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్న పశువులను రైతులు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు. కాబట్టి ఈ కనుమ పండుగను 'పశువుల పండుగ' అని కూడా సంబోధిస్తుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా ఓ వేడుకలా జరుపుతుంటారు. ఈ రోజు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు.
కొందరైతే కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి గజ్జలు, మెడలో పూలదండలు.. ఇలా చక్కగా అలంకరిస్తారు. పశువులతో పాటూ పక్షులను కూడా ఆదరించే సంప్రదాయం ఉంది. అందుకే ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేలాడదీస్తారు. వాటికోసం ఇంటి చుట్టూ చేరిన చిన్న చిన్నపిట్టలు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. పంట చేతికందేందుకు సహాయపడిన వారిందరికీ ఈ రోజున కొత్త బట్టలు కూడా పెడతారు. ఇక కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తోంది. మాంసాహారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక ఇది శాకాహారులకు మాంసంగా ఉపయోగ పడుతోంది.) సంతృప్తి పడతారు.
ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే..
సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ. దీంతో ప్రతీ లోగిలి బంధువులతో కళకళాలాడుతూ కన్నుల పండుగగా ఉంటుంది. అందువల్ల ఈ మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశ్యంతో బహుశా కనుమ రోజు ప్రయాణం చేయొద్దని చెబుతుంటారు పెద్దలు. ఈ కారణంతోనే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత వచ్చి ఉండొచ్చు.
మరికొందరైతే ఇలా పెద్దలు చెప్పారంటే దాని వెనుక ఏదో ఆంతర్యం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఈ కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవని నమ్మకం కూడా ప్రబలంగా ఉంది. అందువల్లే చాలామంది కనమ రోజున ప్రయాణాలు ఎట్టిపరిస్థితుల్లో చెయ్యరు.
(చదవండి: సంక్రాంతి వైభవాన్ని కనుమా!)
Comments
Please login to add a commentAdd a comment