
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో ఉండే ఓంకారేశ్వరుడు కోరిక కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి. అందుకే ఇక్కడి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కోరికలు తీరిన వారు.. కోరికలు కోరుకుని ముడుపులు కట్టుకునే భక్తులతో ఆలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆలయానికి తూర్పు, దక్షిణ ద్వారాలు కలిగి ఉన్నాయి. ఈశాన్యంలో పుష్కరిణి కలిగి ఉండడటం, సిద్దులు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.
ఆలయ చరిత్ర
ఇక్కడున్న శివలింగాన్ని సిద్ధేశ్వరుడు అనే ముని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం సిద్ధేశ్వరుడు అనే ముని తపస్సు చేసుకునేందుకు బయలుదేరి ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఓం అనే శబ్దం వినిపించిందట. తాను తపస్సు చేసుకునేందుకు ఇదే సరైన ప్రదేశమని నిర్ణయించుకున్న ఆ ముని ఇక్కడ ఓ శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు మొదలు పెట్టాడట. అప్పటి నుంచే ఈ ఆలయానికి ఓంకార సిద్ధేశ్వర స్వామి అనే పేరు వచ్చింది.
ఆ ముని వల్లే ఇక్కడ పంచ బుగ్గ కోనేరు వెలసిందనీ... ఆ నీటితోనే పార్వతీపరమేశ్వరులకు రోజూ అభిషేకం నిర్వహిస్తారనీ చెబుతారు. వ్యాస మహర్షి అశ్వత్థనారాయణ స్వామి (ఆంజనేయస్వామి)ని ఇక్కడ ప్రతిష్టంచడంతో ఈ ప్రాంతానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొన్నాళ్లకు వేంకటేశ్వరస్వామి, దుర్గాదేవి ఆలయాలనూ ఇక్కడ నిర్మించారు. ఇక్కడ అన్నదానం ప్రారంభించడానికి కాశీనాయన అనే యోగి కారణమని అంటారు.
నెల్లూరు జిల్లా బెడుసుపల్లిలో జన్మించిన కశిరెడ్డి మొదటి నుంచీ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. కొన్నాళ్లకు ఓ స్వామీజీ వద్ద మంత్రదీక్ష తీసుకుని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ చివరకు 1933లో ఇక్కడకు చేరుకుని ఆశ్రమం ఏర్పాటు చేశాడనీ ప్రతీతి. కశిరెడ్డి మహిమలు తెలిసిన భక్తులు ఆ యోగిని ‘నాయనా’ అని పిలవడం మొదలుపెట్టడంతో ఆ స్వామి కాశీనాయనగా గుర్తింపు పొందాడట.
ఆకలిగా ఉన్నవారికి లేదనకుండా అన్నం పెట్టాలనే సందేశాన్ని చాటిన ఈ యోగి ఇక్కడే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడనీ, ఆయన పరమపదించాక అద్దాల మండపాన్ని కట్టి ఆ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తున్నారనీ అంటారు. ధర్మస్థాపనకు కష్ణభగవానుడు వీరభోగ వసంతరాయలు రూపంలో ఎప్పుడైనా రావొచ్చని కాలజ్ఞానంలో రాసి ఉందనీ, అలా వచ్చే స్వామికి నివేదించాలనే ఉద్దేశంతోనే ఇలా పదమూడు రకాల వంటకాలతో భోజనాలు సిద్ధం చేస్తుంటామనీ చెబుతారు.
భక్తులే అన్నీ సమకూరుస్తారు
కొండపైనున్న శివాలయంతోపాటూ ఇతర ఉపాలయాల్లో పూజల్ని నిర్వహించే భక్తులు ఆ తరువాత కాశీనాయన క్షేత్రానికి చేరుకుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు దాదాపు 1,500 మంది భోజనం చేస్తే కార్తీక మాసం, శివరాత్రి సమయాల్లో అయిదారు లక్షల మందికి అన్నసంతర్పణ జరుగుతుంది.
ఈ ఆశ్రమంలో మధుమేహులకు ప్రత్యేక కౌంటరు ద్వారా కొర్ర అన్నం, రాగి,లడ్డూ వంటివి వడ్డిస్తారు. ఇరవై నాలుగు గంటలూ ఇక్కడ పొయ్యి వెలుగుతూనే ఉంటుందనీ, ఇందుకు అవసరమైన నిత్యావసరాలను భక్తులే ఎప్పటికప్పుడు సమకూరుస్తుంటారనీ అంటారు. అర్ధరాత్రో, అపరాత్రో ఇక్కడికి వచ్చేవారు భోజనం వండుకుని తినేందుకు వీలుగా నిత్యావసరాలను ఈ ప్రాంగణంలో ఉంచుతారు. ఏటా 20 లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తారు.
మార్చి 1 వరకు ఉత్సవాలు
మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం మార్చి 1వ తేది వరకు ఉత్సవాలకు ఓంకార క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ నాగప్రసాద్ తెలిపారు. 25న బండిఆత్మకూరు గ్రామంలో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. 26న ఉత్సవమూర్తులకు మంగళవాయిద్యాలతో బండిఆత్మకూరు గ్రామం నుంచి బయలుదేరి శింగవరం, సోయయాజులపల్లె, గ్రామాల్లో గ్రామోత్సవం జరిపి ఆలయ ప్రవేశం చేసి, గణపతిపూజ, రక్షాబంధనం, ద్వజరోహణం, వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
రాత్రి ఉత్సవమూర్తులకు కళ్యాణం ఉంటుంది. 27న నంది వాహనోత్సవం, 28న రథోత్సవం అనంతరం వసంతోత్సవం ఉంటుంది. మార్చి 1న స్వామివారు ఓంకారం నుంచి బయలుదేరి బండిఆత్మకూరు చేరటంతో బ్రహోత్సవాలు ముగుస్తాయి.
ఎలా రావాలంటే..
భక్తులు ఓంకారం చేరుకునేందుకు నంద్యాల, బండిఆత్మకూరు, ఆత్మకూరు ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వసులు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment