
ఒక ఉత్తమ సమాజ స్థాపనకు వెన్నెముక కుటుంబం కనుక పురుషుడు బయటి సామ్రాజ్యానికి అధిపతి అయితే స్త్రీని ఆ గృహ సామ్రాజ్యానికి మహారాణిగా చేసింది ఇస్లాం. పిల్లల ఆలన భర్త పాలన చేస్తూ, ఎలాంటి ఆర్థిక బాధ్యతలు లేకుండా స్త్రీని మినహాయించింది. ఏ విషయంలోనూ ఆడపిల్లను తక్కువగా చూడరాదని, మగపిల్ల వాడిని అధికుడిగా చూడరాదనీ, ఇద్దరిపట్ల సమానమైన ప్రేమను చూపించాలనీ, భ్రూణ హత్యలను నిషేధిస్తూ ఆడపిల్లను అన్యాయంగా హతమార్చితే కఠిన శిక్షకు గురవుతారని హెచ్చరించింది. తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని ప్రకటించి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని పతాక స్థాయికి చేర్చిన ఘనత ఇస్లాం ధర్మానికే దక్కుతుంది.
1400 సంవత్సరాలకు పూర్వమే స్త్రీలకు ఓటు హక్కును కల్పించి, తన తండ్రి, భర్త, పిల్లల ఆస్తిలో వాటాను కల్పిస్తూ, ఆమెకు ఆస్తిహక్కును ప్రకటించింది. వివాహ విషయంలో తనకిష్టమైన వరుడిని ఎంపిక చేసుకునే విషయమై ఆమె సమ్మతి తీసుకోవాలనీ, దుర్మార్గుడైన భర్త నుండి ‘ఖులా‘ అనే ప్రక్రియ ద్వారా విడిపోయి తనకు తానుగా జీవించే హక్కును కలిగి ఉండడమే కాక పునర్వివాహం చేసుకునే హక్కునూ ప్రసాదించింది.
కనుకనే తనకన్నా వయసులో 15 ఏళ్ల పెద్దదైన హజరత్ ఖదీజా అనే వితంతువును పాతికేళ్ల నిండు యవ్వనంలో వివాహమాడి స్త్రీ జాతి కీర్తిని సమున్నత స్థాయికి చేర్చారు ప్రవక్త ముహమ్మద్ (సం). స్త్రీ సహ ధర్మచారిణి అంటూ మీరు తిన్నదే ఆమెకు తినిపించండని సమాజానికి హితవు పలికారు.
విద్యనభ్యసించడం స్త్రీ పురుషుల విధి అని విద్యనభ్యసించడాన్ని ప్రోత్సహించడమే కాక, సమాజానికి స్ఫూర్తిదాయకమైన స్త్రీ మూర్తులను అందించింది ఇస్లాం. ఇస్లామీయ చరిత్ర లో హజరత్ ఆయిషా (ర) ప్రముఖ విద్వాంసురాలిగా, హజరత్ షిఫా(ర) ప్రముఖ గైనకాలజిస్టు గా, హజరత్ ఖదీజా(ర )అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారవేత్తగా సమాజానికి అమూల్యమైన సేవలందించారు.
ప్రముఖ మేధావి ఫాతిమా అల్ ఫహ్రీ మురాకోలో స్థాపించిన ‘అల్ ఖరావీన్’ యూనివర్సిటీ ప్రపంచంలోనే అతి పురాతన విశ్వవిద్యాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదయ్యింది. హదీసు విద్యావేత్తలలో మహిళా ఉపాధ్యాయులుగా పేరుగాంచి ఇస్లామీయ చరిత్రకు వన్నెతెచ్చిన వనితలు కోకొల్లలు. మహిళలు తమ కార్య పరిధిలో ఉంటూనే మౌలికమైన బాధ్యతలతో పాటు సమాజంతో చక్కటి బాంధవ్యాన్ని ఏర్పరచుకోగలరనే స్ఫూర్తినిచ్చింది ఇస్లాం ధర్మం..
– బతూల్ హుమైర్వీ
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment