దేవభూమిలో వేసవి విహారం..! | Tourism: Most Beautiful Places To Visit In The Himalayas | Sakshi
Sakshi News home page

దేవభూమిలో వేసవి విహారం..!

Published Mon, Feb 24 2025 11:32 AM | Last Updated on Mon, Feb 24 2025 11:32 AM

Tourism: Most Beautiful Places To Visit In The Himalayas

హిమాలయ పర్వత శ్రేణులకు ముఖద్వారం అని చెప్పవచ్చు. హిల్‌ స్టేషన్‌ల రాష్ట్రం అనడం కంటే దీనిని హిల్‌స్టేట్‌ అనడమే కరెక్ట్‌. మబ్బులు... అన్ని చోట్లా నేలకు నింగికి మధ్యలో పర్యటిస్తుంటాయి. ఇక్కడ మాత్రం... నేల మీదకు దిగి పర్యాటకుల్ని పలకరిస్తుంటాయి. అందుకే దీనిని దేవభూమి అంటారు... ఓసారి వెళ్లి చూసొద్దాం...

అడ్వెంచరస్‌ ఔలి
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఏడాదంతా మంచు దుప్పటి కప్పుకునే ప్రదేశం ఔలి. పదివేల అడుగుల ఎత్తులో ఉంది. ఇది సాహసక్రీడల వేదిక. మంచు మీద స్కీయింగ్‌ చేయడానికి మనదేశంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ప్రదేశం ఇది. ఔలి ఎక్కడుంది అని చె΄్పాలంటే దగ్గరలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాన్ని చెప్పాలి. జోషిమఠ్‌కు ఏడు కిలోమీటర్ల దూరాన ఉంది. ఔలి నుంచి హిమాలయ శిఖరాలను చూడవచ్చు. 

మబ్బుల మధ్య కేబుల్‌ కార్‌
జోషిమఠ్‌ నుంచి ఔలికి కేబుల్‌ కార్‌లో వెళ్లాలి. నేల మీద విస్తరించిన తెల్లటి మంచు, మంచును చీల్చుకుని ఎదిగిన చెట్లను తాకుతూ మంద్రంగా కదులుతున్న మబ్బుల మధ్య సాగుతుంది విçహారం. ప్రభుత్వ రిసార్టులు, గెస్ట్‌ హౌస్‌లలో బస చేయడం మంచిది.

ఐఏఎస్‌ బడి ముస్సోరీ..
ముస్సోరీ... ఐఏఎస్‌లకు పాఠాలు చెప్తుంది. వింటర్‌ స్పోర్ట్స్‌ ఆడిస్తుంది. వేసవిలో చల్లగా అలరిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరాన ఉంది ముస్సోరీ పట్టణం. ఢిల్లీ నుంచి ముస్సోరీకి డెహ్రాడూన్‌ మీదుగానే వెళ్లాలి. ఇది ఆ రాష్ట్ర శీతాకాలపు రాజధాని డెహ్రాడూన్‌ నుంచి 35 కిమీల దూరం.

ముస్సోరీ పట్టణానికి చేరడానికి ముందే ముస్సోరీ లేక్‌ పలకరిస్తుంది. కొండల మీద సరస్సును ఆసక్తిగా చూసి ఒక ఫొటో తీసుకుని ముందుకు సాగాలి. ఈ పట్టణం అంతా కొండవాలులోనే ఉంటుంది. మాల్‌రోడ్, క్యామెల్స్‌ బ్యాక్‌ రోడ్‌... లైబ్రరీ రోడ్‌... ఇలా ప్రదేశాల పేర్లన్నీ రోడ్లే. ఇక్కడ హ్యాపీవ్యాలీ కనిపించేటట్లు రోడ్‌ మీదనే వ్యూ పాయింట్‌ ఉంటుంది. 

అక్కడ మరొక ఫొటో తీసుకుని ముందుకెళ్లడమే. రోప్‌ వే లో ముస్సోరీ పట్టణం ఏరియల్‌ వ్యూ చూస్తూ గన్‌హిల్‌కి చేరాలి. ఆకాశం నిర్మలంగా ఉంటే ఇక్కడ నుంచి హిమాలయాలు కనిపిస్తాయి. కెంప్టీ వాటర్‌ ఫాల్, ఝరిపానీ జలపాతం, లాల్‌తిబ్బ, లాండౌర్‌లను చుట్టేసిన తర్వాత ఐఏఎస్‌లకు శిక్షణనిచ్చే (లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌) అకాడమీ తప్పకుండా చూడాలి. మౌంటనియరింగ్‌ ట్రైనింగ్‌ అకాడెమీ, దిగంతాల్లో కనిపించే యమునానదిని చూస్తూ తిరుగుప్రయాణం కొనసాగించాలి.

సంస్కృతంలో పాలించే నైనితాల్‌..
నైనితాల్‌... మహాపర్వతాలు, వాటి మధ్య విశాలమైన చెరువులు, వాటి తీరాన నివాస ప్రదేశాలు... ఇదీ నైనితాల్‌ భౌగోళిక స్వరూపం. నైనితాల్‌ ఆ రాష్ట్రానికి న్యాయ రాజధాని. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది తెలుసా! హిందీతోపాటు సంస్కృతం కూడా అధికారిక భాష. నైనితాల్‌ జిల్లా కేంద్రం నైనితాల్‌ పట్టణం. తాల్‌ అనే పదానికి అర్థం కూడా సరస్సు లేదా చెరువు అని. 

దీని చుట్టు పక్కల సాత్‌తాల్, భీమ్‌తాల్, నౌకుచియాతాల్‌ ఉన్నాయి. అందుకే దీనిని లేక్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ ఇండియా అంటారు. ఈ టూర్‌లో వరుసగా అన్నింటినీ కవర్‌ చేయవచ్చు. ఇక్కడి వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు. బ్రిటిష్‌ పాలకులు తాము నివసించడానికి అనువైన ప్రదేశాలను వెతుకుతూ ఈ చెరువు తీరాన అధికారిక నివాసాలను కట్టుకున్నారు. 

వాటిని కూడా ఈ టూర్‌లో చూడవచ్చు. అల్మోరా కూడా నైనితాల్‌కు దగ్గరలోనే ఉంది. అల్మోరాలో రామకృష్ణ కుటీరం ఉంది. స్వామి వివేకానందుడు కొంతకాలం ఇక్కడ ధ్యానం చేసుకుంటూ గడిపాడు. మనం మబ్బులను చూడాలంటే తల పైకెత్తాలి, కానీ ఇక్కడ తల దించి చూడాలి. మన పర్యటన మబ్బులకు పైన సాగుతుంటుంది.

నాటి రాణివాసం రాణికేత్‌..
ఈ ప్రదేశం సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో ఉంది. రాణికేత్‌... అల్మోరా పట్టణానికి దగ్గరలో ఉంది. ఇక్కడ జనావాసం కంటే మిలటరీ శిక్షణ కార్యకలాపాలే ఎక్కువ. అందమైన ప్రదేశం అని చెప్పడం అంటే ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తక్కువ చేయడమే. పదాలకందనంతటి మహోన్నతంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని పాలించిన కాత్యూరి పాలకుడు సుధార్‌దేవ్‌ సతీమణి రాణి పద్మిని ఇక్కడ నివసించేదని, రాణి నివాసం చుట్టూ ఉన్న ప్రదేశానికి రాణీకేత్‌ (రాణిగారి భూములు) అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ ప్రదేశం కొంతకాలం నేపాల్‌ రాజుల పాలనలో ఉండేది. బ్రిటిష్‌ పిలకులు స్వాధీనం చేసుకోవడంతో భారత్‌లో భాగమైంది. నేపాల్‌ సంస్కృతి కనిపిస్తుంది. రాణి నివాసం మాత్రం కనిపించదు.

బహుగుణ పుట్టిన తెహ్రీ..
తెహ్రీ పేరు విన్న వెంటనే గుర్తు రాదు, కానీ ఇది మనకు తెలిసిన ప్రదేశమే. తెహ్రీ డ్యామ్‌ పేరు తెలిసిందే. పర్యావరణ ΄ోరాటయోధుడు సుందర్‌లాల్‌ బహుగుణ పుట్టిన ఊరు, చి΄్కో ఉద్యమం చేసిన ప్రదేశం ఇది. ఇప్పుడు మనకు కనిపించేది కొత్త తెహ్రీ పట్టణం. అసలు జనావాసం డ్యామ్‌ నిర్మాణంలో మునిగిపోయింది. భాగీరథి, భిలాంగ్న నదుల కలయిక ఈ ప్రదేశం. ఈ నదులు ఆ తర్వాత గంగ, యమున నదులతో సంగమిస్తాయి.

కవుల స్ఫూర్తి చమోలి
చమోలి పట్టణం జిల్లా కేంద్రం కావడంతో సౌకర్యాలు బాగానే ఉంటాయి. అనేక పుణ్యతీర్థాలకు, ప్రకృతి సౌందర్యక్షేత్రాలకు కేంద్రం వంటిది. బదరీనాథ్, కేదార్‌నాథ్, కర్ణ ప్రయాగ, నంద రయాగ, విష్ణుప్రయాగలు ఇదే రూట్‌లో కలుస్తాయి. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ తో΄పాటు మన దేశపు ఉత్తరభాగాన చివరి గ్రామం మాణా వరకు వెళ్లవచ్చు. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి కవులు వచ్చేవారని చెబుతారు. కాళిదాసు వంటి మహాకవుల రచనల్లో ప్రతిబింబించిన వర్ణన ఇక్కడి ప్రకృతి దృశ్యాల ప్రభావమే.

ప్రశాంత మున్సియారీ
ఈ ప్రదేశం7, 217 అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయ పర్వత శ్రేణులు మధ్యలో విస్తరించిన భూభాగం. ఇక్కడ నిలబడి ఎటు వైపు చూసినా హిమాలయాలే కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలను అదృష్టవంతులనవచ్చా లేక స్థితప్రజ్ఞత సాధించిన తాత్వికవాదులనవచ్చా అనేది అర్థం కాదు. ముఖాల్లో ప్రసన్నత తాండవిస్తుంటుంది. జీవితాన్ని ప్రశాంతంగా గడపడం, సంతృప్తిగా జీవించడం ఎలాగో తెలిసిన వాళ్లు. 

వాతావరణాన్ని బట్టి పంటలు పండించుకోవడం, ఆవులు, గేదెలను పోషించుకుంటూ ప్రకృతితో మమేకమై జీవిస్తుంటారు. పరుగులు ఉండవు, అసంతృప్తి ఉండదు, ఆవేదన కనిపించదు. జీవితం విలువ తెలిసిన వాళ్లు, జీవించడం తెలిసిన వాళ్లు అని చెప్పవచ్చు.

కిలకిలరవాల ముక్తేశ్వర్‌..
ఇది నైనితాల్‌ జిల్లాలో చిన్న గ్రామం. 7,500 అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయాల్లోని కుమావ్‌ పర్వతశ్రేణిలో ఉంది. (ఢిల్లీ నుంచి 343 కిమీలు). ఇక్కడ ముక్తేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివుడిని దర్శించుకోవడంతో సరిపెట్టుకోకూడదు. 

దగ్గరలో ఉన్న రుద్రధారి జలపాతాన్ని చూడాలి. రంగురంగుల పక్షులను, మృదువైన కువకులను ఆస్వాదించాలి. వాహనాన్ని ఆపి ఇంజన్‌ శబ్దం లేకుండా నిశ్శబ్దంలో వినిపించే పిట్టల రెక్కల టపటపలను, సన్నని తీయగా సాగే రాగాల మాధుర్యాన్ని ఆలకించాలి. ఈ అవకాశం నగరంలో దొరకదు. అలాగే 20 కి.మీల దూరాన ఉన్న ఐవీఆర్‌ఐ (ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)ని చూడాలి.

భానుడి విన్యాసాల చక్రత..
ఇది డెహ్రాడూన్‌ నుంచి వందకిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడి నుంచి చూస్తే హిమాలయాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు కనిపిస్తాయి. ఎండాకాలంలో హిమాలయాల వీక్షణంలో దాగిన అద్భుతం ఏమిటంటే... ఒక పర్వతశిఖరం సూర్యుడి కిరణాలు నేరుగా పడుతూ ఎర్రగా ప్రజ్వరిల్లుతున్నట్లు ఉంటుంది. 

దాని పక్కనే మరొక శిఖరం పక్క శిఖరం నీడ పడి ఇంకా సూర్యోదయాన్ని చూడలేదన్నట్లే కనిపిస్తుంది. సూర్యాస్తమయం సమయంలోనూ ఇలాంటి అద్భుతాలను ఆస్వాదించవచ్చు. వేసవిలో టైగర్‌ ఫాల్స్‌ జలపాతం జల్లును ఆస్వాదించవచ్చు. డెహ్రాడూన్‌ వంటి నగరాల్లో హోటల్‌ రూమ్‌ అద్దెతో పోలిస్తే ఇక్కడ అద్దెలు తక్కువ. వెకేషన్‌ని ఎక్కువ రోజులు ఎంజాయ్‌ చేయవచ్చు.

హానిమూన్‌ ధనౌల్టీ..
ఇది ఇటీవల పర్యాటక రంగం కొత్తగా అభివృద్ధి చేసిన ప్రదేశం. ముస్సోరీ పట్టణం జన సమ్మర్థం అధికం కావడంతో అది టూరిస్ట్‌ ప్లేస్‌కి పరిమితమైంది. వెకేషన్‌ కోసం పర్యాటకుల ప్రయాణం ధనౌల్టీ వైపు సాగుతోంది. ముఖ్యంగా హనీమూన్‌ జంటలకు ఇది బెస్ట్‌ వెకేషన్‌. ఢిల్లీ నుంచి 325 కి.మీ.ల దూరం. కారులో తొమ్మిద గంటల ప్రయాణం. 

ఈ టూర్‌లో ఢిల్లీ నగరం వదిలి, ఉత్తర ప్రదేశ్‌ భూభాగాన్ని దాటినప్పటి నుంచి ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించిన ఆనవాళ్లు పచ్చదనంతో స్వాగతం పలుకుతాయి. తమిళనాడు దాటి కేరళలో అడుగుపెట్టినప్పుడు కనిపించేటంతటి స్పష్టమైన మార్పును ఇక్కడా చూడవచ్చు. పచ్చదనాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రకృతి కొంత ప్రదేశాన్ని జీవితకాలపు లీజుకు తీసుకున్నట్లు ఉంటాయి ఈ ప్రదేశాలన్నీ. అందుకే ఈ రెండూ దేవుడి రాష్ట్రాలుగా పేరు తెచ్చుకున్నాయి.

ప్యాకేజ్‌లిలా...
డెహ్రాడూన్‌ నుంచి ఔలి మూడు రోజుల టూర్‌ ప్యాకేజ్‌ ఒక్కొక్కరికి 32 వేలవుతుంది. ఇందులో డెహ్రాడూన్‌ – ఔలి రెండువైపులా హెలికాప్టర్‌ జర్నీ, రెండు రోజులు లగ్జరీ హోటల్‌లో బస ఉంటాయి. హెలికాప్టర్‌ రైడ్‌లో హిమాలయాల శిఖరాలను చూడవచ్చు. ఔలిలో స్నో స్పోర్ట్స్‌ స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో స్లెడ్జింగ్, స్నో ట్యూబింగ్, స్నో బైకింగ్‌ చేయవచ్చు 

ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజ్‌లు కూడా సౌకర్యంగా ఉంటాయి. హిల్‌ స్టేషన్‌ ప్యాకేజ్‌లు 15 వేల నుంచి 35 వేల వరకు ఉన్నాయి. హనీమూన్‌ కపుల్‌ ప్యాకేజ్‌లు, ఏడెనిమిది మంది బృందం వెళ్లాలన్నా అందుకు తగిన ప్యాకేజ్‌లున్నాయి. రైలు ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం ఎదురైతే గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సెల్‌ కూడా ఉంటుంది. ఫోన్‌ లేదా ఈ మెయిల్‌లో సంప్రదించవచ్చు. 
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

(చదవండి: మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్‌ పాట్లు..! ఈసారి ఏకంగా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement