కేదార్‌నాథ్‌లో ఆది శంకరుల సమాధి స్థలి వద్ద నివాళులర్పిస్తున్న మోదీ, (ఇన్‌సెట్లో ) కేదార్‌నాథ్, హేమ్‌కుండ్‌సాహిబ్ రోప్‌వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశాక మాట్లాడుతున్న మోదీ
డెహ్రాడూన్: మత ప్రాముఖ్యమున్న దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప ఇంకోటి కాదంటూ ఆక్షేపించారు.
మహిమాన్విత పూజనీయ స్థానాల గత వైభవాన్ని తాము ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తున్నామని చెప్పారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో భారీ ఎత్తున చేపట్టిన పునర్నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ అన్నారు. ‘‘కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేరమన్నట్టుగా మాట్లాడేంతగా కొందరిలో బానిస మనస్తత్వం వేళ్లూనుకుపోయింది. ఇతర దేశాల్లో ఉండే ఇలాంటి పూజనీయ స్థానాలను ప్రశంసించేదీ వాళ్లే.
మన దేశంలో మాత్రం అలాంటి వాటిని చిన్నచూపు చూసేదీ వాళ్లే. నిజానికి మన ఘన వారసత్వం మనకెంతో గర్వకారణం. వాటి పునరుద్ధరణకు చేసే ప్రయత్నాలు 21వ శతాబ్దపు నయా భారత్‌కు పునాది వంటివి’’ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉత్తరాఖండ్ చేరుకున్న ఆయన ప్రఖ్యాత యాత్రా స్థలాలైన కేదార్‌నాథ్, హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అనంతరం చైనా సరిహద్దుల సమీపంలో మనా గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
‘‘మన ఆలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు మాత్రమే కాదు. వేలాది ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఘనమైన మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అవి మన జీవనాడులు’’ అని అభిప్రాయపడ్డారు. కేదార్‌నాథ్‌లో కొన్నేళ్లుగా చేపట్టిన పునర్నిర్మాణ పనుల వల్ల ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి వీలవుతోందని చెప్పారు. ‘‘కేదార్‌నాథ్‌కు గతంలో ఏటా మహా అయితే నాలుగైదు లక్షల మంది మాత్రం వచ్చేవాళ్లు. ఈ ఏడాది గత రికార్డులన్నింటినీ తుడిచిపెడుతూ ఇప్పటికే ఏకంగా 45 లక్షల మంది దర్శించుకున్నారు’’ అని అన్నారు.
ఉపాధికీ మార్గాలు
హిమాలయాల్లోని ఆలయాల అభివృద్ధి పనులు అక్కడికి యాత్రను సరళతరం చేయడమే గాక స్థానికులకు విరివిగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయని మోదీ చెప్పారు. స్థానికంగా వర్తక, వాణిజ్యాలకు కూడా ఎంతగానో ఊతమిస్తున్నాయన్నారు. ఈ సరిహద్దు ప్రాంతాల ఆలయాల సందర్శనకు వచ్చే పౌరులంతా తమ బడ్జెట్లో కనీసం 5 శాతం స్థానిక ఉత్పత్తులు కొనేందుకు వెచ్చించాలని కోరారు. ఈ చిన్న చర్య ఎంతోమంది స్థానికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.
‘‘దట్టమైన మంచులో నెలకొన్న ప్రఖ్యాత హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే నిర్మాణం దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిక్కు సోదరుల వరప్రసాదం కానుంది. ఉత్తరాన మన దేశంలో చిట్టచివరి గ్రామం ‘మన’. కానీ నా వరకూ దేశంలో ప్రతి గ్రామమూ ప్రగతికి బాటలు పరిచే తొట్టతొలి గ్రామమే. పాతికేళ్ల క్రితం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ భేటీని కూడా నేను మన గ్రామంలోనే జరిపాను.
కొండ సానువుల్లో కష్టతరమైన ప్రయాణం చేసి భేటీకి వచ్చేందుకు అప్పట్లో మావాళ్లు గొణుక్కున్నారు కూడా. కానీ పర్వత ప్రాంతీయులు కష్టజీవులు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. అభివృద్ధి వారికి అందని ద్రాక్ష కాకూడదు. మిగతా దేశవాసులకందే అన్ని సౌకర్యాలూ అందుకునే హక్కు వారికి ఉంది’’ అన్నారు. అంతకుముందు ప్రఖ్యాత కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో మోదీ పూజలు జరిపారు. కేదార్‌నాథ్‌లో ఆది శంకరుల సమాధి స్థలిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి బద్రీనాథ్‌లో గడిపారు. ప్రధాని హోదాలో మోదీ కేదార్‌నాథ్‌ను దర్శించడం ఇది ఆరోసారి. కాగా బద్రీనాథ్‌కు రావడం రెండోసారి.
రోప్‌వే ప్రాజెక్టుల విశేషాలు...
కేదార్‌నాథ్ రోప్‌వే: రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ ఆలయం దాకా 9.7 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక గౌరీకుండ్ నుంచి ఆలయానికి కేవలం అరగంటలో చేరుకోవచ్చు. ఎత్తైన హిమ సానువుల్లో అత్యంత కష్టతరంగా భావించే ఈ ప్రయాణానికి కనీసం 6 నుంచి 7 గంటలు పడుతోంది.
హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే: గోవింద్ ఘాట్ నుంచి ఏడాది పొడవునా మంచుతో కూరుకుపోయి ఉండే హేమ్‌కుండ్ సాహిబ్ వెళ్లే దారి అత్యంత క్లిష్టమైనది. అందుకు కనీసం ఒక రోజుకు పైగా పడుతుంది. ఇప్పుడు వాటి మధ్య 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో ముగుస్తుంది. అంతేగాక ప్రపంచ ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ముఖద్వారంగా చెప్పే ఘంగారియాను కూడా రోప్‌వే అనుసంధానించనుంది.
Comments
Please login to add a commentAdd a comment