rope way project
-
మూడు కొండలెక్కితేగానీ చేరుకోని ఆ ఆలయానికి..
హిందూ దేవుళ్లలో హనుమంతుని ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా హనుమంతుడిని భక్తిగా కొలుస్తారు. అలాంటి హనుమంతుని జన్మస్థలంగా భావించే నాసిక్‌లో అంజనేరి కొండల వద్ద ఉన్న ఆ స్వామి గుడిని సందర్శించడాని భక్తులు ఎన్నో ప్రయాసలు పడి వెళ్లాల్సి వస్తోంది. నిటారుగా ఉన్న ఆ రహదారి వెంబడి వెళ్లాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటలు పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయానికి త్వరితగతిన చేరుకునేలా రోప్‌వే నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో బ్రహ్మగిరి ట్రెక్కింగ్ పాయింట్ నుంచి అంజనేరి కొండల వరకు ఈ రోప్ వేని నిర్మించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏ1) పర్వరత్మల పథకం కింద ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెండర్లను ఆహ్వానించింది. ఇక హనుమంతుని జన్మస్థలం అయిన అంజనేరి కొండలు వద్ద ఆ స్వామికి సంబంధించిన గుహ తోపాటు అంజనీమాత ఆలయం కూడా ఉంది. వీటిని యాత్రికులు, ట్రెక్కర్లు సందర్శిస్తారు. సుమారు 4 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు పర్వతాలు ఎక్కాలి. ఇక్కడకు 5.7 కి.మీ పొడవున్న రోప్‌వే మూడు పర్వతాల మీదుగా వస్తే పైకి వెళ్లే ప్రయాణం కొన్ని నిమిషాలకు తగ్గిపోతుంది. కాగా, 2024 నాటికి మొత్తం 18 రోప్‌వే ప్రాజెక్టులను కేంద్ర ప్లాన్ చేస్తునట్లు సమాచారం. (చదవండి: కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు సమాధానం ఇచ్చిన శాస్త్రవేత్తలు) -
మత ప్రాముఖ్య స్థలాలపై నిర్లక్ష్యం
డెహ్రాడూన్: మత ప్రాముఖ్యమున్న దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప ఇంకోటి కాదంటూ ఆక్షేపించారు. మహిమాన్విత పూజనీయ స్థానాల గత వైభవాన్ని తాము ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తున్నామని చెప్పారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో భారీ ఎత్తున చేపట్టిన పునర్నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ అన్నారు. ‘‘కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేరమన్నట్టుగా మాట్లాడేంతగా కొందరిలో బానిస మనస్తత్వం వేళ్లూనుకుపోయింది. ఇతర దేశాల్లో ఉండే ఇలాంటి పూజనీయ స్థానాలను ప్రశంసించేదీ వాళ్లే. మన దేశంలో మాత్రం అలాంటి వాటిని చిన్నచూపు చూసేదీ వాళ్లే. నిజానికి మన ఘన వారసత్వం మనకెంతో గర్వకారణం. వాటి పునరుద్ధరణకు చేసే ప్రయత్నాలు 21వ శతాబ్దపు నయా భారత్‌కు పునాది వంటివి’’ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉత్తరాఖండ్ చేరుకున్న ఆయన ప్రఖ్యాత యాత్రా స్థలాలైన కేదార్నాథ్, హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అనంతరం చైనా సరిహద్దుల సమీపంలో మనా గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మన ఆలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు మాత్రమే కాదు. వేలాది ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఘనమైన మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అవి మన జీవనాడులు’’ అని అభిప్రాయపడ్డారు. కేదార్‌నాథ్‌లో కొన్నేళ్లుగా చేపట్టిన పునర్నిర్మాణ పనుల వల్ల ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి వీలవుతోందని చెప్పారు. ‘‘కేదార్‌నాథ్‌కు గతంలో ఏటా మహా అయితే నాలుగైదు లక్షల మంది మాత్రం వచ్చేవాళ్లు. ఈ ఏడాది గత రికార్డులన్నింటినీ తుడిచిపెడుతూ ఇప్పటికే ఏకంగా 45 లక్షల మంది దర్శించుకున్నారు’’ అని అన్నారు. ఉపాధికీ మార్గాలు హిమాలయాల్లోని ఆలయాల అభివృద్ధి పనులు అక్కడికి యాత్రను సరళతరం చేయడమే గాక స్థానికులకు విరివిగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయని మోదీ చెప్పారు. స్థానికంగా వర్తక, వాణిజ్యాలకు కూడా ఎంతగానో ఊతమిస్తున్నాయన్నారు. ఈ సరిహద్దు ప్రాంతాల ఆలయాల సందర్శనకు వచ్చే పౌరులంతా తమ బడ్జెట్లో కనీసం 5 శాతం స్థానిక ఉత్పత్తులు కొనేందుకు వెచ్చించాలని కోరారు. ఈ చిన్న చర్య ఎంతోమంది స్థానికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘దట్టమైన మంచులో నెలకొన్న ప్రఖ్యాత హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే నిర్మాణం దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిక్కు సోదరుల వరప్రసాదం కానుంది. ఉత్తరాన మన దేశంలో చిట్టచివరి గ్రామం ‘మన’. కానీ నా వరకూ దేశంలో ప్రతి గ్రామమూ ప్రగతికి బాటలు పరిచే తొట్టతొలి గ్రామమే. పాతికేళ్ల క్రితం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ భేటీని కూడా నేను మన గ్రామంలోనే జరిపాను. కొండ సానువుల్లో కష్టతరమైన ప్రయాణం చేసి భేటీకి వచ్చేందుకు అప్పట్లో మావాళ్లు గొణుక్కున్నారు కూడా. కానీ పర్వత ప్రాంతీయులు కష్టజీవులు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. అభివృద్ధి వారికి అందని ద్రాక్ష కాకూడదు. మిగతా దేశవాసులకందే అన్ని సౌకర్యాలూ అందుకునే హక్కు వారికి ఉంది’’ అన్నారు. అంతకుముందు ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో మోదీ పూజలు జరిపారు. కేదార్‌నాథ్‌లో ఆది శంకరుల సమాధి స్థలిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి బద్రీనాథ్‌లో గడిపారు. ప్రధాని హోదాలో మోదీ కేదార్‌నాథ్‌ను దర్శించడం ఇది ఆరోసారి. కాగా బద్రీనాథ్‌కు రావడం రెండోసారి. రోప్‌వే ప్రాజెక్టుల విశేషాలు... కేదార్నాథ్ రోప్‌వే: రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం దాకా 9.7 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక గౌరీకుండ్ నుంచి ఆలయానికి కేవలం అరగంటలో చేరుకోవచ్చు. ఎత్తైన హిమ సానువుల్లో అత్యంత కష్టతరంగా భావించే ఈ ప్రయాణానికి కనీసం 6 నుంచి 7 గంటలు పడుతోంది. హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే: గోవింద్ ఘాట్ నుంచి ఏడాది పొడవునా మంచుతో కూరుకుపోయి ఉండే హేమ్‌కుండ్ సాహిబ్ వెళ్లే దారి అత్యంత క్లిష్టమైనది. అందుకు కనీసం ఒక రోజుకు పైగా పడుతుంది. ఇప్పుడు వాటి మధ్య 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో ముగుస్తుంది. అంతేగాక ప్రపంచ ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ముఖద్వారంగా చెప్పే ఘంగారియాను కూడా రోప్‌వే అనుసంధానించనుంది. -
అసలు ట్రాఫికే లేకుండా గమ్యాన్ని చేరుకోగలిగితే!
ట్రాఫిక్ చిక్కులకు దూరంగా... సీట్లు దొరకని కిక్కిరిసే ప్రయాణాలకు భిన్నంగా... అలసట అనే మాటే వినపడకుండా... కాలుష్యమనేదే లేకుండా... ఆకాశవీధిలో విహరిస్తూ... ‘కాంక్రీట్ జంగల్’ మధ్యలోంచి నిమిషాల వ్యవధిలో గమ్యం చేరుకోగలిగితే..! కలల అలలపై తేలియాడేలా నిత్యం ఈ అనుభూతి కొనసాగితే? పర్యాటక ప్రాంతాలను గగన వీక్షణం ద్వారా తిలకించగలిగితే!! విదేశాల్లోనో లేదా పర్యాటక ప్రాధాన్యతగల రాష్ట్రాల్లోనో ఉండే ఈ సౌకర్యం మనకూ అందుబాటులోకి వస్తే ఎంతటి ‘భాగ్యం’ అనుకుంటున్నారా? సరిగ్గా ఇదే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరవాసులు ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు, నగర ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రాఫిక్ నరకప్రాయంగా మారిన సిటీలో మెట్రో రైలు సౌకర్యం వచ్చాక పరిస్థితి కాస్త మెరుగుపడినా కీలక సమయాల్లో మెట్రో రైళ్లు సైతం కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మరో రవాణా సాధనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే వివిధ దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న రోప్‌వే మార్గాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసే దిశగా యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూడు మార్గాల్లో రోప్‌వే మార్గాన్ని ప్రవేశపెట్టే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. హైదరాబాద్‌లో రెండు కారిడార్లతోపాటు యాదాద్రిలో మరో కారిడార్ ఏర్పాటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తోంది. ఈ మూడు మార్గాల్లో దాదాపు 17 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అస్సాం, గుజరాత్ గిర్నార్, తూర్పు ముంబైలోని సెవ్రీ నుంచి ఎలిఫెంటా గుహల వరకు ఉన్న రోప్‌వే మార్గాల తరçహాలోనే హైదరాబాద్‌లోనూ రోప్‌వే ఏర్పాటు చేయాలనుకుంటోంది. 50 నుంచి 150 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే ఈ రవాణా వ్యవస్థలో ఉండే ఒక్కో క్యాబిన్లో 8 మంది ప్రయాణికులు కూర్చొనే డిజైన్‌ను పరిశీలిస్తోంది. అలాగే కేబుల్ రిలే టవర్స్‌లో 30 మంది వరకు కూర్చొనేలా కూడా ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. సింగపూర్‌లో రహదారులపై ఏర్పాటు చేసిన రోప్‌వే మార్గం ఎలా ఉందనే దానిపై ఇప్పటికే అధ్యయనం చేసింది. ఏయే ప్రాంతాల్లో..? హైదరాబాదీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. అంటే పర్యాటకులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాల మధ్య రోప్‌వే రవాణా ఏర్పాటు చేయాలని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మెట్రో లేని మార్గమైన ఎంజీబీఎస్ నుంచి నెహ్రూ జంతు ప్రదర్శనశాల, ఖైరతాబాద్ నుంచి సచివాలయం, ప్యారడైజ్ నుంచి సచివాలయం మార్గంలో దాదాపు 12 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సెక్రటేరియట్‌కు సమీపంలోనే హుస్సేన్‌సాగర్‌తోపాటు లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు ఉన్నాయి. అలాగే పర్యాటకులతోపాటు భక్తులు ఎక్కువగా వెళ్లే యాదాద్రి జిల్లాలోని రాయగిరి నుంచి యాదాద్రి గుడి వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోప్ వేను అందుబాటులోకి తీసుకొచ్చేలా అధ్యయనం చేస్తున్నారు. -
ఇక రోప్ వే ప్రయాణం!
న్యూఢిల్లీ: ఢిల్లీ-హర్యానా వెళ్లడానికి ఇక రైళ్లు, బస్సుల కోసం వేచి చూడాల్సిన పని లేదు. ఈ మార్గంలో రూ.800కోట్ల బడ్జెట్ తో రోప్ వేను నిర్మించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం తెలిపారు. ఢిల్లీ నుంచి హర్యానా రాష్ట్ర సరిహద్దులో గల బాద్ షాపూర్ వరకూ 12.3 కిలోమీటర్ల మేర రోప్ వేను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దేశంలోనే తొలి డ్రైవర్ లెస్ పాడ్ గా రికార్డు సృష్టిస్తుందని తెలిపారు. మార్గంలో మొత్తం 13 స్టాప్ లు ఉన్నాయని, ఒక్క పాడ్ లో ఐదుగురు ప్రయాణించే వీలుందని తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీల్లో లండన్, యూఏఈ, యూఎస్, పోలెండ్ లకు చెందిన కంపెనీలు ప్రాథమిక టెక్నికల్ బిడ్ లలో విజయం సాధించాయి. రవాణా శాఖ ఆమోదం తర్వాత ఫైనాన్షియల్ బిడ్లను దాఖలు చేయాలని కంపెనీలను కోరతామని ఓ అధికారి తెలిపారు. మొదట 1,100 పాడ్ లతో రోప్ వేను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో రూ.4వేల కోట్లతో రోప్ వే ప్రాజెక్టును నిర్మించాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టును నిలిపివేశారు.