న్యూఢిల్లీ: ఢిల్లీ-హర్యానా వెళ్లడానికి ఇక రైళ్లు, బస్సుల కోసం వేచి చూడాల్సిన పని లేదు. ఈ మార్గంలో రూ.800కోట్ల బడ్జెట్ తో రోప్ వేను నిర్మించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం తెలిపారు. ఢిల్లీ నుంచి హర్యానా రాష్ట్ర సరిహద్దులో గల బాద్ షాపూర్ వరకూ 12.3 కిలోమీటర్ల మేర రోప్ వేను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దేశంలోనే తొలి డ్రైవర్ లెస్ పాడ్ గా రికార్డు సృష్టిస్తుందని తెలిపారు. మార్గంలో మొత్తం 13 స్టాప్ లు ఉన్నాయని, ఒక్క పాడ్ లో ఐదుగురు ప్రయాణించే వీలుందని తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు.
ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీల్లో లండన్, యూఏఈ, యూఎస్, పోలెండ్ లకు చెందిన కంపెనీలు ప్రాథమిక టెక్నికల్ బిడ్ లలో విజయం సాధించాయి. రవాణా శాఖ ఆమోదం తర్వాత ఫైనాన్షియల్ బిడ్లను దాఖలు చేయాలని కంపెనీలను కోరతామని ఓ అధికారి తెలిపారు. మొదట 1,100 పాడ్ లతో రోప్ వేను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో రూ.4వేల కోట్లతో రోప్ వే ప్రాజెక్టును నిర్మించాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టును నిలిపివేశారు.