Temples development
-
ఆలయాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు
-
రాష్ట్రంలో కొత్తగా 3,000 ఆలయాలు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆధ్వర్యంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో కొత్తగా దాదాపు 3 వేల ఆలయాలను నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఆలయాల నిర్మాణం కొనసాగుతోందన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల చొప్పున 1,072 ఆలయాల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. వీటిలో 936 చోట్ల ఆలయాలను నిర్మించేందుకు భూమిని గుర్తించామని చెప్పారు. వీటిలో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారానే మరో 330 ఆలయాల నిర్మాణం హిందూ ధార్మిక సంస్థ సమరసత ఆధ్వర్యంలో కొనసాగుతోందన్నారు. ఇవికాకుండా మరో 1,568 ఆలయాల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. మరో 300 చోట్ల కూడా ఆలయాలను నిర్మించాలని అక్కడి ప్రజాప్రతినిధులు కోరుతున్నారన్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రతి 30 ఆలయాలకు ఒక ఇంజనీరింగ్ అధికారిని నియమించనున్నామని తెలిపారు. దేవదాయ శాఖ ఆలయాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు ఏక విధానంతో కూడిన ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్టు చెప్పారు. అన్నదాన సత్రాల ఏర్పాటుకు 18 దరఖాస్తులు.. శ్రీశైలంలో వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో అన్నదాన సత్రాల ఏర్పాటు, ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణకు 18 దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనకు వచ్చాయన్నారు. వీటికి ఒక నిర్ణీత విధానంలో భూకేటాయింపులు చేయాలనే యోచన చేస్తున్నట్టు వివరించారు. ముందుగా అక్కడ భక్తులకు వసతి కోసం ఎన్ని గదులతో సత్రాలు నిర్మిస్తారో పూర్తి ప్లాన్‌ను సమర్పించాల్సి ఉంటుందన్నారు. శ్రీశైలంలో భూముల కేటాయింపు ఆలయ అభివృద్ధికి దోహదపడేలా నిబంధనలు తీసుకొచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. శ్రీశైలం ఆలయం– అటవీ శాఖల మధ్య ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 4,700 ఎకరాల భూమిని అటవీ శాఖ.. ఆలయానికి స్వాధీనం చేసేందుకు ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడ దుర్గగుడిలో భక్తులకు అదనపు సౌకర్యాల కోసం పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ఆలయాల్లో వివిధ అవసరాలకు వస్తువుల కొనుగోలులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రతి ఆలయంలో మూడు వేర్వేరు టెండర్ల ప్రక్రియ ఉంటుందన్నారు. దేవదాయ శాఖ భూముల పరిరక్షణకు ప్రత్యేక సెల్ ఉందని తెలిపారు. -
ఛత్రపతి శివాజీ ప్రారంభించారు.. మోదీ కొనసాగిస్తున్నారు: అమిత్ షా
పుణే: మొగలులు, ఇతర విదేశీ దురాక్రమణదారులు ధ్వంసం చేసిన ఆలయాలను ఛత్రపతి శివాజీ పునర్నిర్మించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్లాఘించారు. మరాఠా యోధుడు ప్రారంభించిన ఆ పనిని ప్రధాని మోదీ నేడు కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడేందుకే శివాజీ తన జీవితాన్ని పణంగా చెప్పారన్నారు. పుణేలోని నర్హే–అంబేగావ్‌లో శివాజీ జీవితగాథ ఆధారంగా ‘శివసృష్టి’ ఇతివృత్తంతో 21 ఏకరాల్లో ఏర్పాటవుతున్న పార్క్ మొదటి దశను అమిత్ షా ప్రారంభించారు. ‘శివాజీ అనంతరం ధ్వంసమైన ఆలయాల పనర్నిర్మాణాన్ని ప్రధాని కొనసాగిస్తున్నారు. పలు దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు’అన్నారు. శివాజీ ఆశీస్సులతో విల్లు, బాణం: షిండే ఛత్రపతి శివాజీ ఆశీస్సులతో తమకు శివసేన ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ లభించిందని కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. శివసృష్టి ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దుతామని షిండే చెప్పారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, అమిత్ షా తమ వెనక కొండంత అండగా నిలిచారని శనివారం ఆయన పేర్కొనడం తెలిసిందే. -
మత ప్రాముఖ్య స్థలాలపై నిర్లక్ష్యం
డెహ్రాడూన్: మత ప్రాముఖ్యమున్న దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప ఇంకోటి కాదంటూ ఆక్షేపించారు. మహిమాన్విత పూజనీయ స్థానాల గత వైభవాన్ని తాము ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తున్నామని చెప్పారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో భారీ ఎత్తున చేపట్టిన పునర్నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ అన్నారు. ‘‘కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేరమన్నట్టుగా మాట్లాడేంతగా కొందరిలో బానిస మనస్తత్వం వేళ్లూనుకుపోయింది. ఇతర దేశాల్లో ఉండే ఇలాంటి పూజనీయ స్థానాలను ప్రశంసించేదీ వాళ్లే. మన దేశంలో మాత్రం అలాంటి వాటిని చిన్నచూపు చూసేదీ వాళ్లే. నిజానికి మన ఘన వారసత్వం మనకెంతో గర్వకారణం. వాటి పునరుద్ధరణకు చేసే ప్రయత్నాలు 21వ శతాబ్దపు నయా భారత్‌కు పునాది వంటివి’’ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉత్తరాఖండ్ చేరుకున్న ఆయన ప్రఖ్యాత యాత్రా స్థలాలైన కేదార్నాథ్, హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అనంతరం చైనా సరిహద్దుల సమీపంలో మనా గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మన ఆలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు మాత్రమే కాదు. వేలాది ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఘనమైన మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అవి మన జీవనాడులు’’ అని అభిప్రాయపడ్డారు. కేదార్‌నాథ్‌లో కొన్నేళ్లుగా చేపట్టిన పునర్నిర్మాణ పనుల వల్ల ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి వీలవుతోందని చెప్పారు. ‘‘కేదార్‌నాథ్‌కు గతంలో ఏటా మహా అయితే నాలుగైదు లక్షల మంది మాత్రం వచ్చేవాళ్లు. ఈ ఏడాది గత రికార్డులన్నింటినీ తుడిచిపెడుతూ ఇప్పటికే ఏకంగా 45 లక్షల మంది దర్శించుకున్నారు’’ అని అన్నారు. ఉపాధికీ మార్గాలు హిమాలయాల్లోని ఆలయాల అభివృద్ధి పనులు అక్కడికి యాత్రను సరళతరం చేయడమే గాక స్థానికులకు విరివిగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయని మోదీ చెప్పారు. స్థానికంగా వర్తక, వాణిజ్యాలకు కూడా ఎంతగానో ఊతమిస్తున్నాయన్నారు. ఈ సరిహద్దు ప్రాంతాల ఆలయాల సందర్శనకు వచ్చే పౌరులంతా తమ బడ్జెట్లో కనీసం 5 శాతం స్థానిక ఉత్పత్తులు కొనేందుకు వెచ్చించాలని కోరారు. ఈ చిన్న చర్య ఎంతోమంది స్థానికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘దట్టమైన మంచులో నెలకొన్న ప్రఖ్యాత హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే నిర్మాణం దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిక్కు సోదరుల వరప్రసాదం కానుంది. ఉత్తరాన మన దేశంలో చిట్టచివరి గ్రామం ‘మన’. కానీ నా వరకూ దేశంలో ప్రతి గ్రామమూ ప్రగతికి బాటలు పరిచే తొట్టతొలి గ్రామమే. పాతికేళ్ల క్రితం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ భేటీని కూడా నేను మన గ్రామంలోనే జరిపాను. కొండ సానువుల్లో కష్టతరమైన ప్రయాణం చేసి భేటీకి వచ్చేందుకు అప్పట్లో మావాళ్లు గొణుక్కున్నారు కూడా. కానీ పర్వత ప్రాంతీయులు కష్టజీవులు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. అభివృద్ధి వారికి అందని ద్రాక్ష కాకూడదు. మిగతా దేశవాసులకందే అన్ని సౌకర్యాలూ అందుకునే హక్కు వారికి ఉంది’’ అన్నారు. అంతకుముందు ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో మోదీ పూజలు జరిపారు. కేదార్‌నాథ్‌లో ఆది శంకరుల సమాధి స్థలిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి బద్రీనాథ్‌లో గడిపారు. ప్రధాని హోదాలో మోదీ కేదార్‌నాథ్‌ను దర్శించడం ఇది ఆరోసారి. కాగా బద్రీనాథ్‌కు రావడం రెండోసారి. రోప్‌వే ప్రాజెక్టుల విశేషాలు... కేదార్నాథ్ రోప్‌వే: రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం దాకా 9.7 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక గౌరీకుండ్ నుంచి ఆలయానికి కేవలం అరగంటలో చేరుకోవచ్చు. ఎత్తైన హిమ సానువుల్లో అత్యంత కష్టతరంగా భావించే ఈ ప్రయాణానికి కనీసం 6 నుంచి 7 గంటలు పడుతోంది. హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే: గోవింద్ ఘాట్ నుంచి ఏడాది పొడవునా మంచుతో కూరుకుపోయి ఉండే హేమ్‌కుండ్ సాహిబ్ వెళ్లే దారి అత్యంత క్లిష్టమైనది. అందుకు కనీసం ఒక రోజుకు పైగా పడుతుంది. ఇప్పుడు వాటి మధ్య 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో ముగుస్తుంది. అంతేగాక ప్రపంచ ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ముఖద్వారంగా చెప్పే ఘంగారియాను కూడా రోప్‌వే అనుసంధానించనుంది. -
ఏపీ: అత్యుత్తమంగా ఆలయాల నిర్వహణ
-
ఏపీ: అత్యుత్తమంగా ఆలయాల నిర్వహణ
సాక్షి, అమరావతి: దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణ పద్ధతులు తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. టీటీడీలో అమలు చేస్తున్న మంచి విధానాలను ఇతర దేవాలయాల్లోనూ ప్రవేశ పెట్టాలని, ఆన్లైన్ పద్ధతుల నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ దాకా టీటీడీ అనుసరిస్తున్న విధానాలను పాటించాలని ఆదేశించారు. దేవదాయ శాఖలో ఏమాత్రం అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. దేవదాయశాఖపై సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆలయాల ఆస్తుల పరిరక్షణ, భద్రత, దాతలిచ్చే విరాళాల వినియోగం, భక్తులకు వసతి, ప్రసాదాలపై ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు. దుర్గమ్మకు తొలిసారిగా రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులు దేవాలయాలకు లభించే ఆదాయాన్ని వాటి అభివృద్ధికే ఖర్చు చేయాలని, క్రమం తప్పకుండా సంరక్షణపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ దుర్గగుడిలో అభివృద్ధి పనులకు దాదాపు రూ.70 కోట్లను చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తోందని తెలిపారు. తీపి గుర్తులా భగవంతుడి ప్రసాదాలు భక్తుల వసతి, ప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేవాలయాల్లో భక్తులకు వసతి సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదని, నాణ్యమైన వసతి సదుపాయాలను వారికి అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రతి దేవాలయంలో ప్రసాదాల నాణ్యతపై దృష్టిపెట్టాలని, భక్తులకు గుర్తుండిపోయేలా అవి ఉండాలని, తిరుమలలో లడ్డూ తయారీ విధానాలను ఇతర ఆలయాల్లో పాటించేలా చూడాలని, దీనివల్ల నాణ్యతగా ప్రసాదాలు ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అన్ని దేవాలయాల కోసం మాస్టర్ ప్లాన్లు దేవాలయాల్లో కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల దేవాలయాలపై పర్యవేక్షణ పెరుగుతుందన్నారు. అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం మాస్టర్ ప్రణాళికలను రూపొందించడంతో పాటు శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా వీటిని అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్వహణపై ఈవోలకు శిక్షణ దేవాలయాల ఈవోల పనితీరు మెరుగుపడాలని సీఎం సూచించారు. నిర్వహణలో మెరుగైన ప్రమాణాలు పాటించాలన్నారు. ఆలయాల అభివృద్ధి ఈవో పనితీరు మీద ఆధారపడి ఉంటుందని, టీటీడీ నిర్వహణ విధానాలపై ఈవోలందరికీ అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాలయాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన లోపాలు, తేవాల్సిన మార్పులను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వంశపారంపర్య హక్కు అమలు అర్చకులకు వంశపారంపర్య హక్కును అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొనగా మిగిలిన వారికి కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దేవాలయాల్లో పనిచేసే 1,305 మంది అర్చకులకు కనీస వేతనం 25 శాతం పెంచుతామని హామీ ఇవ్వగా వాస్తవానికి 56 శాతం, 100 శాతం చొప్పున పెంచామని అ«ధికారులు తెలిపారు. ► దేవదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (ఎండోమెంట్స్) జి.వాణీమోహన్, టీడీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డితో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల కార్యనిర్వహణాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆలయాల అభివృద్ధికే దాతల విరాళాలు దేవదాయ శాఖలో ఆన్లైన్ విధానాలను అనుసరించడం ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేయవచ్చని, వ్యవస్థలో మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దాతలు ఆన్లైన్లో దేవాలయాలకు విరాళాలు ఇవ్వవచ్చని, ఈ విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాతలు ఇచ్చిన విరాళాలను ఆలయాల అభివృద్ధికి వినియోగించుకోవాలని, అవి పక్కదోవ పట్టకుండా నేరుగా దేవాలయాలకు ఉపయోగపడాలని, టీటీడీ తరహాలో ఇతర చోట్ల కూడా అలాంటి వ్యవస్థలు ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో నిర్దేశించుకున్న అంశాల పురోగతిని రెండు నెలల అనంతరం సమీక్షించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. పారదర్శకంగా ఆడిటింగ్.. దేవాలయాల్లో ఆడిటింగ్ పారదర్శకంగా జరగాలని సీఎం సూచించారు. ఆన్లైన్ బుకింగ్, కియోస్క్‌లు, క్యూ ఆర్ కోడ్ పేమెంట్స్, గదుల బుకింగ్ సిస్టమ్ తదితరాల డిజిటలైజేషన్ ప్రక్రియపై టీటీడీ సహకారాన్ని తీసుకోవాలని దేవదాయ శాఖకు సూచించారు. ఆలయాల భూముల జియో ట్యాగింగ్.. దేవాలయాల భూముల పరిరక్షణలో భాగంగా సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. భూముల పరిరక్షణకు కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ న్యాయవాదితో ఒక కమిటీ ఏర్పాటుపై ఆలోచన చేయాలని సూచించారు. భద్రతకు 47 వేల సీసీ కెమెరాలు రాష్ట్రంలోని సుమారు 18 వేల ఆలయాల్లో భద్రత కోసం 47 వేలకుపైగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎక్కడ ఆలయాలున్నా భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేవదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కోసం ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలన్నారు. దేవాలయాల్లో భద్రత తదితర అంశాలపై పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అర్చకులందరికీ ఇళ్ల స్థలాలు అర్చకులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కార్యక్రమం అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ధర్మపథం ప్రారంభించిన సీఎం విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కళ, సాంస్కృతిక, ఆరోగ్యవేదిక (ధర్మపథం) కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రాచీన కళలు, సాంస్కృతిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక సేవలకు ఆలయాలను వేదిక చేసేందుకు ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ‘ధర్మపథం’ పేరుతో ఆలయ ప్రాంగణాల్లో సాయంత్రం వేళ నాట్యం, శాస్త్రీయ సంగీతం, గాత్ర కచేరీలు, హరికథ, బుర్రకథ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారాంతాల్లో యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయుర్వేద, హోమియో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ విజయవాడ దుర్గ గుడిలో ఏర్పాటు చేసిన నృత్య కార్యక్రమాన్ని వర్చువల్‌గా తిలకించారు. మొదట రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలన్నింటిలో తక్షణమే ఈ కార్యక్రమాలను మొదలుపెట్టి క్రమంగా దేవదాయశాఖ ఈవోల పర్యవేక్షణలో ఉండే ఆలయాలన్నింటికి విస్తరించనున్నట్టు వాణీమోహన్ తెలిపారు. సింహాచలం, అరçసవెల్లి, అన్నవరం ఆలయాల్లో పైలెట్‌గా సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషన్, ఆయుర్వేద వైద్యశిబిరం వంటి కొన్ని కార్యక్రమాలను పదిరోజులుగా నిర్వహించినట్టు చెప్పారు. విజయవాడ, శ్రీశైలం శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలోను, శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లిఖార్జునస్వామి ఆలయంలోను జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ సోమవారం ముఖ్యమంత్రికి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణీమోహన్, దుర్గగుడి, శ్రీశైలం ఆలయాల కార్యనిర్వహణాధికారులు భ్రమరాంబ, లవన్న ఆహ్వానపత్రాలు అందజేశారు. కనకదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాలని ఆహ్వానించారు. -
‘మా ఊరు–మా గుడి’ పేరిట చిన్న ఆలయాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: ఆదాయం లేని ఆలయాల అభివృద్ధిపై దేవదాయ శాఖ దృష్టి పెట్టింది. దాతలు, ప్రవాసాంధ్రులను ప్రోత్సహించి.. వారి స్వగ్రామాల్లోని చిన్నచిన్న ఆలయాలను వారి ద్వారానే అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘మా ఊరు–మా గుడి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకోసం ఆన్లైన్ పోర్టల్‌ను తయారు చేయిస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 23 వేల వరకు ఆలయాలు ఉన్నాయి. వాటిలో 2,700 ఆలయాలను మాత్రమే దేవదాయ శాఖ తరఫున ఈవోలు పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన ఆలయాలు స్థానిక పూజారులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. నిధుల కొరత వల్ల అభివృద్ధికి నోచుకోని ఆ ఆలయాలను స్థానిక పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయాలని దేవదాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆలయాల అభివృద్ధి, నిత్య కైంకర్యాలకు విరాళాలు అందజేసేందుకు దాతలు, ప్రవాసాంధ్రులు ముందుకొస్తే.. వారి ఆధ్వర్యంలోనే ఆయా కార్యక్రమాలను దేవదాయ శాఖ చేపడుతుంది. తమ గ్రామాల్లోని ఆలయాల అభివృద్ధికి ముందుకొచ్చే దాతలు తమ ఆసక్తిని ఆన్లైన్ ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక దరఖాస్తు ఫారాన్ని దేవదాయ శాఖ వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. -
టీటీడీ తరహాలో ఆలయాల అభివృద్ధి: సీఎం స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పళని మురుగన్, తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి, సమయపు రం మారియమ్మన్ ఆలయాలను టీటీడీ తరహాలో అభివృద్ధి చేయ నున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. పర్యాటకం, సంస్కృతి, సంప్రదా యం, దేవదాయ శాఖల పనితీరుపై ఆయన సమీక్షించారు. స్థానికంగా ఆయా ఆలయాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి భక్తులను కొండపైకి చేర్చడాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని వంద ఆలయాలను మరింతగా తీర్చిదిద్ది బ్రహ్మోత్సవాలను నిర్వహించడం, గ్రామీణ ప్రాంత ఆలయాల్లో పనిచేసే పూ జారి, ఇతర సిబ్బందికి పింఛన్ సౌకర్యం కల్పించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. -
రాహుల్ ‘మిషన్ టెంపుల్’
సాక్షి, న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నారు. ఆలయ సందర్శనలు, హిందుత్వ పట్ల అనుసరిస్తున్న మెతక వైఖరి ఆయా ఎన్నికల్లో సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఇదే ఒరవడి కొనసాగించాలని రాహుల్ భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ హిందూ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించేందుకు మిషన్ టెంపుల్ వ్యూహానికి పదునుపెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన యూపీ నుంచే ఈ కసరత్తును ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఎంపీ నిధుల నుంచి అమేథి నియోజకవర్గంలోని ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మత్తులను చేపట్టాలని రాహుల్ నిర్ణయించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని 13 ఆలయాల్లో హైమాస్ట్ సోలార్ లైట్లను అమర్చాలని పార్టీ చీఫ్ నిర్ణయించారని కాంగ్రెస్ నేత అనిల్ సింగ్ తెలిపారు. అమేథి సంగ్రామ్‌పూర్‌లోని కాళీ దేవి, గౌరీ గంజ్‌లోని దుర్గా ఆలయం, సహఘర్‌లోని భవానీ ఆలయాలు వంటి పురాతన ఆలయాలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా ఆలయాల సుందరీకరణతో పాటు వాటిలో హార్మోనియం, డోలు, మజీర వంటి పరికరాలను అందుబాటులో ఉంచుతారు. ఆయా దేవాలయాల్లో తాగునీటి వసతినీ కల్పించనున్నట్టు స్ధానిక కాంగ్రెస్ నేత చంద్రకాంత్ దూబే వెల్లడించారు. కాగా రాహుల్ తన నియోజకవర్గంలోని ఆలయాలపై దృష్టిసారించడం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమాశంకర్ పాండే స్పందించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోరుతూ దేశవ్యాప్తంగా ధర్మ సభలు జరుగుతుండటంతో రాహుల్ కంగారు పడుతున్నారని, అందుకే అమేథిలో ఆలయాల మరమ్మత్తులపై ఆయన దృష్టిపెట్టారని వ్యాఖ్యానించారు. రాహుల్ నిర్ణయం మంచిదే అయినా రాజకీయ ప్రయోజనం పొందడమే ఆయన ఉద్దేశమని ఆరోపించారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌పై పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సైతం రాహుల్ కోటలో బీజేపీని బలోపేతం చేసేందుకు తరచూ అమేథిని సందర్శిస్తున్నారు. -
దేవుళ్లకు తప్పని కష్టాలు
కెరమెరి : అధికారుల నిర్లక్ష్యంతో పునరావాస కాలనీల ప్రజలకు దైవ దర్శనం కరువైంది. పునరావస కాలనీలు నిర్మాణమే తమ వంతు అనుకున్న అధికారులు అక్కడ దేవాలయాలను నిర్మించడం మరిచిపోయారు. దీంతో ప్రజలు విరాళాలు సేకరించి గుడిసెలు నిర్మించి పూజలు చేసుకుంటున్నారు. ఐదారేళ్ల క్రితం మండలంలోని నిషా ని, రింగన్‌ఘాట్ పునరావాస కాలనీల్లో దేవాలయాలు లేక పూజలు చేసేదెక్కడని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా పునరావాసం కాలనీలు ఉన్న చోట పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు, కోరుకున్న దే వాలయాలను నిర్మించాలని నిబంధనల్లో ఉంది. కాని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
దేశంలోనే గొప్పగా భద్రాద్రి
ఖర్చుకు వెనకాడకుండా తీర్చిదిద్దుతాం: కేసీఆర్ - భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం - కొత్తగూడెం–భద్రాచలం మధ్య విమానాశ్రయం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా అవతరించేలా భద్రాద్రిని అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఖర్చు విషయంలో వెనకాడకుండా క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి మలుపు తిరిగి తూర్పుగా ప్రవహిస్తుందని, కొంతదూరం తర్వాత ఉత్తర వాహినిగా మారుతుందని.. శ్రీరాముడు పశ్చిమ దిక్కు నుంచి తూర్పునకు వచ్చి ఇదే ప్రాంతంలో నడయాడాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి అంశంపై కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఇందులో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, భద్రాచలం ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణ తుది నమూనాకు సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు చేశారు. దేవాలయానికి ఉత్తర, పడమర దిక్కున ఉన్న స్థలాలను కలుపుకొని 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. దేవాలయ ప్రాంగణంలోనే కల్యాణ మంటపం, షాపింగ్ కాంప్లెక్స్, భక్తులు సేదతీరే ప్రాంతాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గర్భగుడి, ఇతర ప్రధాన కట్టడాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అన్ని సదుపాయాలు కల్పించాలి శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న భద్రాచలానికి ఇతర రాష్ట్రాలతోపాటు వేరే దేశాల నుంచి కూడా భక్తులు వస్తారని, సీతారామ కల్యాణం సందర్భంగా లక్షల సంఖ్యలో దర్శించుకుంటారని కేసీఆర్ పేర్కొన్నారు. అలా లక్షలాది మంది తరలివచ్చినా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి, దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. ‘‘భక్తులు భద్రాచలానికి రావడానికి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నాం. కొత్తగూడెం–భద్రాచలం మధ్య విమానాశ్రయం నిర్మిస్తున్నాం. కొత్తగూడెం వరకు ఉన్న రైలుమార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించాలని ఇప్పటికే రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపాం. గోదావరి, ప్రాణహిత నదుల వెంట రహదారిని నిర్మించడం వల్ల మహారాష్ట్ర వరకు రోడ్డు సౌకర్యం కలుగుతుంది. ఏపీ రాజధాని అమరావతి, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలను కలిపే రహదారులు నిర్మిస్తున్నాం. గోదావరి నదిపై ప్రస్తుతమున్న బ్రిడ్జితో పాటు మరో వంతెన నిర్మిస్తున్నాం. నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. యాత్రికులు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. అన్ని విధాలా భద్రాద్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం..’’అని కేసీఆర్ వెల్లడించారు. అర్చకుల వేతనాలపై 15న ప్రకటన తమ వేతనాల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు, ఆలయ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో... ఈ అంశంపై కూడా బుధవారం భేటీలో చర్చించారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లింపు విధానం, వేతన స్థిరీకరణ, ధూపదీప నైవేద్యం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ వాకబు చేశారు. దీనిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపైనా చర్చించారు. ఇక జాప్యం లేకుండా ఈ అంశాన్ని కొలిక్కి తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడిన సీఎం.. 15వ తేదీన స్వయంగా ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు. ఆ రోజున ప్రగతిభవన్‌లో దేవాలయ ఉద్యోగులు, అర్చకుల సమక్షంలోనే వేతన అంశాన్ని వెల్లడిస్తామని చెప్పారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాల చెల్లింపు కోసం ప్రత్యేకనిధి ఏర్పాటు చేయాలని గతంలోనే మంత్రుల కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వోద్యోగుల తరహాలో ప్రతినెలా ఒకటో తేదీనే వారి ఖాతాల్లో వేతనాలు జమయ్యేలా చూడాలని సూచించింది. వీటినే సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్టు సమాచారం. దీనితోపాటు ధార్మిక పరిషత్ ఏర్పాటు అంశాన్ని కూడా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీంతో ఆరోజు భారీ సంఖ్యలో ఆలయ ఉద్యోగులు, అర్చకులను ప్రగతిభవన్‌కు తరలించేందుకు అర్చక, ఉద్యోగ జేఏసీ నేతలు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈనెల 15న ఉదయం 10 గంటల కల్లా అర్చకులు, ఆలయ ఉద్యోగులు నల్లకుంట రామాలయానికి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా ప్రగతి భవన్‌కు చేరుకోనున్నట్టు జేఏసీ చైర్మన్ భానుమూర్తి తెలిపారు. ఇక బాసర అభివృద్ధి రాష్ట్రంలో మరిన్ని దేవాలయాలను అభి వృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. యాదాద్రి, భద్రాద్రి తరహాలోనే వేములవాడ అభివృద్ధికి ఇప్పటికే చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో... గోదావరి తీరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. వెంటనే బాసరకు స్థపతులను పంపి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆలయాల పరిరక్షణకు చర్యలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత దేవాలయాల విషయంలో చాలా నిర్లక్ష్యం, వివక్ష నెలకొన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేవాలయాల నిర్వహణలో, అర్చకులకు జీతాలు చెల్లించే విషయంలో అన్యాయం జరిగిందన్నారు. పూర్వకాలంలో మహారాజులు, జాగీర్దార్లు దేవాలయాలకు భూములు ఇచ్చారని.. ప్రభుత్వం ఆ భూములపై అజమాయిషీ చేస్తున్నదే తప్ప కొత్తగా భూములిచ్చిందేమీ లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తమ ప్రభుత్వం యాదాద్రి, వేములవాడ ఆలయాలకు భూములు ఇచ్చిందని.. అలాగే భద్రాద్రికి కూడా భూములు ఇస్తామని తెలిపారు. దేవాలయాల అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నామన్నారు. దేవాలయ భూముల పరిరక్షణ, ఆలయాల పరిరక్షణ జరగాలని పేర్కొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి కృషి
► మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నేరడిగొండ : ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బుద్ధికొండ గ్రామ శివారులోగల శ్రీ మహాలక్ష్మిదేవి ఆలయంలో శ్రీలక్ష్మిమదేవి విగ్రహ ప్రతిషా్ఠపన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి సరసాని లక్ష్మి కుటుంబ సభ్యులు విగ్రహాలు కొనివ్వడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సరసాని లక్ష్మిని మంత్రి శాలువా, పూలమాలలతో సన్మానించారు. శ్రీమహాలక్ష్మీ ఆలయ అభివృద్ధికి రూ.12లక్షల నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. నేరడిగొండలోని శబరిమాత ఆలయాన్ని రూ.12లక్షలతో దేవాదాయ శాఖ ద్వారా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ గోడంనగేశ్, రాష్ట్ర సహకార పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఏఎంసీ చైర్మన్ నల్ల శారద, ఉపాధ్యక్షుడు దావుల భోజన్న, స్థానిక సర్పంచ్ సునీత, ఎంపీటీసీ సభ్యురాలు దుర్వ గంగామణి, నాయకులు శ్రీనివాస్, రమణ, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు కుప్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతాం కుప్టి, కుమారి గ్రామాల ప్రజలు కుప్టి ప్రాజెక్టు ప్రస్తావన తేగా మంత్రి స్పందించారు. మండలంలోని కడెం నది పరీవాహక ప్రాంతమైన కుప్టి గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును 6.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి తీరుతామని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టును నిర్మించేందుకు సీఎం ఒప్పుకున్నారని తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. ముంపు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
ఆలయాల అభివృద్ధికి కృషి
నెల్లూరు రూరల్: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దచెరుకూరు, అల్లీపురంలోని వివిధ ఆలయాల ధర్మకర్తల పాలకమండళ్ల సభ్యుల ప్రమాణస్వీకారాన్ని అల్లీపురం వీరాంజనేయస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్దచెరుకూరులోని రామాలయం, శివాలయం, అల్లీపురం సీతారామాలయం, వీరాంజనేయ స్వామి ఆలయాలకు నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేశామని వివరించారు. నవాబుపేట నుంచి గుడిపల్లిపాడు వరకు రెండు లేన్ల రోడ్డు అభివృద్ధికి రూ.10 కోట్లను కేటాయించామని, త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ పనులను వేగవంతం చేసిందని, పెన్నా బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని వివరించారు. అనంతరం మాజీ మంత్రి, టీడీపీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. సోమిరెడ్డి నాయకత్వంలో అల్లీపురం, పెద్దచెరుకూరు గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. ఈ ప్రాంతంలోని చెత్తడంపింగ్ యార్డు, రైస్‌మిల్లులను తొలగించి, రింగ్‌రోడ్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని చెప్పారు. మైపాడు బీచ్ వరకు రోడ్డును అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. అనంతరం ఆలయ పాలకవర్గ సభ్యులను శాలువాలు, పూలమాలతో సత్కరించారు. విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కోడూరు కమలాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్‌రెడ్డి, కార్పొరేటర్ మేకల రామ్మూర్తి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనం జయకుమార్‌రెడ్డి, అల్లీపురం వీరాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్ బండి శ్రీకుమార్రెడ్డి, రామమందిర చైర్మన్ శివశంకర్‌రెడ్డి, పెద్దచెరుకూరు శివాలయ చైర్మన్ చంద్రమౌళీశ్వరరెడ్డి, సీతారామాలయ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రామాలయాల నిర్మాణం'
హైదరాబాద్: కామన్ గుడ్ ఫండ్ కోసం రూ. 100 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఆలయాలు, వాటి అభివృద్ధి పనులు అంశంపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రామాలయాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పురాతన, చారిత్రాత్మక ఆలయాల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.