ఖర్చుకు వెనకాడకుండా తీర్చిదిద్దుతాం: కేసీఆర్
- భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం
- కొత్తగూడెం–భద్రాచలం మధ్య విమానాశ్రయం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా అవతరించేలా భద్రాద్రిని అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఖర్చు విషయంలో వెనకాడకుండా క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి మలుపు తిరిగి తూర్పుగా ప్రవహిస్తుందని, కొంతదూరం తర్వాత ఉత్తర వాహినిగా మారుతుందని.. శ్రీరాముడు పశ్చిమ దిక్కు నుంచి తూర్పునకు వచ్చి ఇదే ప్రాంతంలో నడయాడాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి అంశంపై కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు.
ఇందులో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, భద్రాచలం ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణ తుది నమూనాకు సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు చేశారు. దేవాలయానికి ఉత్తర, పడమర దిక్కున ఉన్న స్థలాలను కలుపుకొని 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. దేవాలయ ప్రాంగణంలోనే కల్యాణ మంటపం, షాపింగ్ కాంప్లెక్స్, భక్తులు సేదతీరే ప్రాంతాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గర్భగుడి, ఇతర ప్రధాన కట్టడాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
అన్ని సదుపాయాలు కల్పించాలి
శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న భద్రాచలానికి ఇతర రాష్ట్రాలతోపాటు వేరే దేశాల నుంచి కూడా భక్తులు వస్తారని, సీతారామ కల్యాణం సందర్భంగా లక్షల సంఖ్యలో దర్శించుకుంటారని కేసీఆర్ పేర్కొన్నారు. అలా లక్షలాది మంది తరలివచ్చినా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి, దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. ‘‘భక్తులు భద్రాచలానికి రావడానికి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నాం. కొత్తగూడెం–భద్రాచలం మధ్య విమానాశ్రయం నిర్మిస్తున్నాం.
కొత్తగూడెం వరకు ఉన్న రైలుమార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించాలని ఇప్పటికే రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపాం. గోదావరి, ప్రాణహిత నదుల వెంట రహదారిని నిర్మించడం వల్ల మహారాష్ట్ర వరకు రోడ్డు సౌకర్యం కలుగుతుంది. ఏపీ రాజధాని అమరావతి, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలను కలిపే రహదారులు నిర్మిస్తున్నాం. గోదావరి నదిపై ప్రస్తుతమున్న బ్రిడ్జితో పాటు మరో వంతెన నిర్మిస్తున్నాం. నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. యాత్రికులు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. అన్ని విధాలా భద్రాద్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం..’’అని కేసీఆర్ వెల్లడించారు.
అర్చకుల వేతనాలపై 15న ప్రకటన
తమ వేతనాల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు, ఆలయ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో... ఈ అంశంపై కూడా బుధవారం భేటీలో చర్చించారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లింపు విధానం, వేతన స్థిరీకరణ, ధూపదీప నైవేద్యం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ వాకబు చేశారు. దీనిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపైనా చర్చించారు. ఇక జాప్యం లేకుండా ఈ అంశాన్ని కొలిక్కి తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడిన సీఎం.. 15వ తేదీన స్వయంగా ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు. ఆ రోజున ప్రగతిభవన్‌లో దేవాలయ ఉద్యోగులు, అర్చకుల సమక్షంలోనే వేతన అంశాన్ని వెల్లడిస్తామని చెప్పారు.
అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాల చెల్లింపు కోసం ప్రత్యేకనిధి ఏర్పాటు చేయాలని గతంలోనే మంత్రుల కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వోద్యోగుల తరహాలో ప్రతినెలా ఒకటో తేదీనే వారి ఖాతాల్లో వేతనాలు జమయ్యేలా చూడాలని సూచించింది. వీటినే సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్టు సమాచారం. దీనితోపాటు ధార్మిక పరిషత్ ఏర్పాటు అంశాన్ని కూడా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీంతో ఆరోజు భారీ సంఖ్యలో ఆలయ ఉద్యోగులు, అర్చకులను ప్రగతిభవన్‌కు తరలించేందుకు అర్చక, ఉద్యోగ జేఏసీ నేతలు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈనెల 15న ఉదయం 10 గంటల కల్లా అర్చకులు, ఆలయ ఉద్యోగులు నల్లకుంట రామాలయానికి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా ప్రగతి భవన్‌కు చేరుకోనున్నట్టు జేఏసీ చైర్మన్ భానుమూర్తి తెలిపారు.
ఇక బాసర అభివృద్ధి
రాష్ట్రంలో మరిన్ని దేవాలయాలను అభి వృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. యాదాద్రి, భద్రాద్రి తరహాలోనే వేములవాడ అభివృద్ధికి ఇప్పటికే చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో... గోదావరి తీరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. వెంటనే బాసరకు స్థపతులను పంపి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ఆలయాల పరిరక్షణకు చర్యలు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత దేవాలయాల విషయంలో చాలా నిర్లక్ష్యం, వివక్ష నెలకొన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేవాలయాల నిర్వహణలో, అర్చకులకు జీతాలు చెల్లించే విషయంలో అన్యాయం జరిగిందన్నారు. పూర్వకాలంలో మహారాజులు, జాగీర్దార్లు దేవాలయాలకు భూములు ఇచ్చారని.. ప్రభుత్వం ఆ భూములపై అజమాయిషీ చేస్తున్నదే తప్ప కొత్తగా భూములిచ్చిందేమీ లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తమ ప్రభుత్వం యాదాద్రి, వేములవాడ ఆలయాలకు భూములు ఇచ్చిందని.. అలాగే భద్రాద్రికి కూడా భూములు ఇస్తామని తెలిపారు. దేవాలయాల అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నామన్నారు. దేవాలయ భూముల పరిరక్షణ, ఆలయాల పరిరక్షణ జరగాలని పేర్కొన్నారు.