
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సాక్షి: భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సీతారాముల కల్యాణ క్రతువు సాగింది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తన సతీమణితో కలిసి ఆయన వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులు భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అభిజిత్ లగ్నంలో..
చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. సాధారణంగా నవమి రోజున అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటుఇటుగా రావడం పరిపాటి. ముహూర్త లగ్నం రాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు తాళిబొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం మూడు బొట్లు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది.
భద్రాచల వీధుల్లో వధూవరుల ఊరేగింపు..
తలంబ్రాల కార్యక్రమం ముగిసిన సీతారాములకు తర్వాత తాత్కాలిక నివేదన చేయించారు. నివేదన అనంతరం సీతమ్మ చీరకు, రామయ్య పంచె/ధోతితో కలుపుతూ బ్రహ్మముడి వేశారు. అనంతరం మంగళ హారతి అందించారు. బ్రహ్మముడి అనంతరం కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్లారు.