
అభిజిత్ లగ్నంలో వధూవరులకు జీలకర్ర బెల్లం
సీఎం హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించనున్న రేవంత్‌రెడ్డి
ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం, జిల్లా యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఈ వేడుకలు చూసేందుకు ఇరు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వేడుకలకు స్వయంగా హాజరై సీతారాములకు పట్టు వ్రస్తాలు సమర్పించనున్నారు.
అభిజిత్ లగ్నంలో..: చైత్రశుద్ధ నవమి, అభిజిత్ లగ్న ముహూర్తం రాగానే సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రం సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది. ముత్యాలు కలిపిన, భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు.
తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తర్వాత తాత్కాలిక నివేదన చేయించి, అనంతరం బ్రహ్మముడి వేసి మంగళహారతి అందిస్తారు. కాగా, ఎస్‌ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు తొమ్మిది రోజులపాటు మగ్గంపై నేసిన రెండు ఇక్కత్ చీరలు, ఆరు పట్టు పంచెలను కల్యాణం సందర్భంగా స్వామివారికి, సీతమ్మకు అలంకరించనున్నారు.
పట్టు వ్రస్తాలు సమర్పించనున్న సీఎం: తానీషా కాలం నుంచి భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి పాలకులు వచ్చి ముత్యాల తలంబ్రాలు, పట్టు వ్రస్తాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. నవాబుల కాలం నుంచి తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2016 వరకు ఈ సంప్రదాయం కొనసాగింది, ఆ తర్వాత నుంచి సీఎం హోదాలో పట్టు వ్రస్తా ల సమర్పణ జరగడం లేదు. ఈసారి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి భద్రాచలం వస్తున్నారు. పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత సారపాకకు చెందిన బూరం శ్రీనివాస్ అనే గిరిజనుడి ఇంట్లో ప్రభుత్వం సరఫరా చేసిన సన్నబియ్యంతో వండిన భోజనం చేయనున్నారు.
కట్టుదిట్టమైన భద్రత
భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు ప్రభావిత జిల్లా కావడంతో సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాకు చెందిన 500 మంది, పొరుగు జిల్లాల నుంచి మరో 1,300 మంది పోలీసులు భద్రాచలంలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం..
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భా గంగా శనివారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి వైభవాన్ని లోకానికి తెలియజెప్పేందుకే కల్యాణానికి ముందు రోజు ఈ వేడుక జరిపిస్తామని అర్చకులు తెలిపారు. మిథిలా స్టేడియం సీతమ్మవారికి మిథిలా నగరంగా, వైకుంఠ ద్వారం రామయ్యకు చెందిన అయోధ్యగా అభివర్ణిస్తూ పండితులు కనులపండువగా ఈ తంతు జరిపించారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌తో పాటు కొందరు అర్చకులు సీతమ్మ వారి వైపు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్‌తో పాటు మరికొందరు అర్చకులు రామయ్య వారి వైపు చేరి ఈ వేడుకను రక్తి కట్టించారు. ఈ సందర్భంగా గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాచల దేవస్థానంలో సంప్రదాయాన్ని పాటిస్తూ భక్తులపై గులాములు చల్లారు.