
సాక్షి, న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నారు. ఆలయ సందర్శనలు, హిందుత్వ పట్ల అనుసరిస్తున్న మెతక వైఖరి ఆయా ఎన్నికల్లో సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఇదే ఒరవడి కొనసాగించాలని రాహుల్ భావిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లోనూ హిందూ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించేందుకు మిషన్ టెంపుల్ వ్యూహానికి పదునుపెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన యూపీ నుంచే ఈ కసరత్తును ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఎంపీ నిధుల నుంచి అమేథి నియోజకవర్గంలోని ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మత్తులను చేపట్టాలని రాహుల్ నిర్ణయించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని 13 ఆలయాల్లో హైమాస్ట్ సోలార్ లైట్లను అమర్చాలని పార్టీ చీఫ్ నిర్ణయించారని కాంగ్రెస్ నేత అనిల్ సింగ్ తెలిపారు.
అమేథి సంగ్రామ్‌పూర్‌లోని కాళీ దేవి, గౌరీ గంజ్‌లోని దుర్గా ఆలయం, సహఘర్‌లోని భవానీ ఆలయాలు వంటి పురాతన ఆలయాలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా ఆలయాల సుందరీకరణతో పాటు వాటిలో హార్మోనియం, డోలు, మజీర వంటి పరికరాలను అందుబాటులో ఉంచుతారు. ఆయా దేవాలయాల్లో తాగునీటి వసతినీ కల్పించనున్నట్టు స్ధానిక కాంగ్రెస్ నేత చంద్రకాంత్ దూబే వెల్లడించారు. కాగా రాహుల్ తన నియోజకవర్గంలోని ఆలయాలపై దృష్టిసారించడం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమాశంకర్ పాండే స్పందించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోరుతూ దేశవ్యాప్తంగా ధర్మ సభలు జరుగుతుండటంతో రాహుల్ కంగారు పడుతున్నారని, అందుకే అమేథిలో ఆలయాల మరమ్మత్తులపై ఆయన దృష్టిపెట్టారని వ్యాఖ్యానించారు. రాహుల్ నిర్ణయం మంచిదే అయినా రాజకీయ ప్రయోజనం పొందడమే ఆయన ఉద్దేశమని ఆరోపించారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌పై పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సైతం రాహుల్ కోటలో బీజేపీని బలోపేతం చేసేందుకు తరచూ అమేథిని సందర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment