
సాక్షి, అమరావతి: ఆదాయం లేని ఆలయాల అభివృద్ధిపై దేవదాయ శాఖ దృష్టి పెట్టింది. దాతలు, ప్రవాసాంధ్రులను ప్రోత్సహించి.. వారి స్వగ్రామాల్లోని చిన్నచిన్న ఆలయాలను వారి ద్వారానే అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘మా ఊరు–మా గుడి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను తయారు చేయిస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 23 వేల వరకు ఆలయాలు ఉన్నాయి. వాటిలో 2,700 ఆలయాలను మాత్రమే దేవదాయ శాఖ తరఫున ఈవోలు పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన ఆలయాలు స్థానిక పూజారులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి.
నిధుల కొరత వల్ల అభివృద్ధికి నోచుకోని ఆ ఆలయాలను స్థానిక పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయాలని దేవదాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆలయాల అభివృద్ధి, నిత్య కైంకర్యాలకు విరాళాలు అందజేసేందుకు దాతలు, ప్రవాసాంధ్రులు ముందుకొస్తే.. వారి ఆధ్వర్యంలోనే ఆయా కార్యక్రమాలను దేవదాయ శాఖ చేపడుతుంది. తమ గ్రామాల్లోని ఆలయాల అభివృద్ధికి ముందుకొచ్చే దాతలు తమ ఆసక్తిని ఆన్‌లైన్ ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక దరఖాస్తు ఫారాన్ని దేవదాయ శాఖ వెబ్‌సైట్‌లో అధికారులు అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment