దేవదాయ శాఖపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణ పద్ధతులు తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. టీటీడీలో అమలు చేస్తున్న మంచి విధానాలను ఇతర దేవాలయాల్లోనూ ప్రవేశ పెట్టాలని, ఆన్‌లైన్ పద్ధతుల నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ దాకా టీటీడీ అనుసరిస్తున్న విధానాలను పాటించాలని ఆదేశించారు. దేవదాయ శాఖలో ఏమాత్రం అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. దేవదాయశాఖపై సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆలయాల ఆస్తుల పరిరక్షణ, భద్రత, దాతలిచ్చే విరాళాల వినియోగం, భక్తులకు వసతి, ప్రసాదాలపై ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు.
దుర్గమ్మకు తొలిసారిగా రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులు
దేవాలయాలకు లభించే ఆదాయాన్ని వాటి అభివృద్ధికే ఖర్చు చేయాలని, క్రమం తప్పకుండా సంరక్షణపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ దుర్గగుడిలో అభివృద్ధి పనులకు దాదాపు రూ.70 కోట్లను చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తోందని తెలిపారు.
తీపి గుర్తులా భగవంతుడి ప్రసాదాలు
భక్తుల వసతి, ప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేవాలయాల్లో భక్తులకు వసతి సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదని, నాణ్యమైన వసతి సదుపాయాలను వారికి అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రతి దేవాలయంలో ప్రసాదాల నాణ్యతపై దృష్టిపెట్టాలని, భక్తులకు గుర్తుండిపోయేలా అవి ఉండాలని, తిరుమలలో లడ్డూ తయారీ విధానాలను ఇతర ఆలయాల్లో పాటించేలా చూడాలని, దీనివల్ల నాణ్యతగా ప్రసాదాలు ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అన్ని దేవాలయాల కోసం మాస్టర్ ప్లాన్లు
దేవాలయాల్లో కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల దేవాలయాలపై పర్యవేక్షణ పెరుగుతుందన్నారు. అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం మాస్టర్ ప్రణాళికలను రూపొందించడంతో పాటు శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా వీటిని అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.
నిర్వహణపై ఈవోలకు శిక్షణ
దేవాలయాల ఈవోల పనితీరు మెరుగుపడాలని సీఎం సూచించారు. నిర్వహణలో మెరుగైన ప్రమాణాలు పాటించాలన్నారు. ఆలయాల అభివృద్ధి ఈవో పనితీరు మీద ఆధారపడి ఉంటుందని, టీటీడీ నిర్వహణ విధానాలపై ఈవోలందరికీ అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాలయాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన లోపాలు, తేవాల్సిన మార్పులను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వంశపారంపర్య హక్కు అమలు
అర్చకులకు వంశపారంపర్య హక్కును అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొనగా మిగిలిన వారికి కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దేవాలయాల్లో పనిచేసే 1,305 మంది అర్చకులకు కనీస వేతనం 25 శాతం పెంచుతామని హామీ ఇవ్వగా వాస్తవానికి 56 శాతం, 100 శాతం చొప్పున పెంచామని అ«ధికారులు తెలిపారు.
► దేవదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (ఎండోమెంట్స్) జి.వాణీమోహన్, టీడీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డితో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల కార్యనిర్వహణాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఆలయాల అభివృద్ధికే దాతల విరాళాలు
దేవదాయ శాఖలో ఆన్‌లైన్ విధానాలను అనుసరించడం ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేయవచ్చని, వ్యవస్థలో మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దాతలు ఆన్‌లైన్‌లో దేవాలయాలకు విరాళాలు ఇవ్వవచ్చని, ఈ విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాతలు ఇచ్చిన విరాళాలను ఆలయాల అభివృద్ధికి వినియోగించుకోవాలని, అవి పక్కదోవ పట్టకుండా నేరుగా దేవాలయాలకు ఉపయోగపడాలని, టీటీడీ తరహాలో ఇతర చోట్ల కూడా అలాంటి వ్యవస్థలు ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో నిర్దేశించుకున్న అంశాల పురోగతిని రెండు నెలల అనంతరం సమీక్షించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
పారదర్శకంగా ఆడిటింగ్..
దేవాలయాల్లో ఆడిటింగ్ పారదర్శకంగా జరగాలని సీఎం సూచించారు. ఆన్‌లైన్ బుకింగ్, కియోస్క్‌లు, క్యూ ఆర్ కోడ్ పేమెంట్స్, గదుల బుకింగ్ సిస్టమ్ తదితరాల డిజిటలైజేషన్ ప్రక్రియపై టీటీడీ సహకారాన్ని తీసుకోవాలని దేవదాయ శాఖకు సూచించారు.
ఆలయాల భూముల జియో ట్యాగింగ్..
దేవాలయాల భూముల పరిరక్షణలో భాగంగా సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. భూముల పరిరక్షణకు కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ న్యాయవాదితో ఒక కమిటీ ఏర్పాటుపై ఆలోచన చేయాలని సూచించారు.
భద్రతకు 47 వేల సీసీ కెమెరాలు
రాష్ట్రంలోని సుమారు 18 వేల ఆలయాల్లో భద్రత కోసం 47 వేలకుపైగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎక్కడ ఆలయాలున్నా భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేవదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కోసం ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలన్నారు. దేవాలయాల్లో భద్రత తదితర అంశాలపై పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
అర్చకులందరికీ ఇళ్ల స్థలాలు
అర్చకులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కార్యక్రమం అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధర్మపథం ప్రారంభించిన సీఎం
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కళ, సాంస్కృతిక, ఆరోగ్యవేదిక (ధర్మపథం) కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రాచీన కళలు, సాంస్కృతిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక సేవలకు ఆలయాలను వేదిక చేసేందుకు ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ‘ధర్మపథం’ పేరుతో ఆలయ ప్రాంగణాల్లో సాయంత్రం వేళ నాట్యం, శాస్త్రీయ సంగీతం, గాత్ర కచేరీలు, హరికథ, బుర్రకథ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు వంటివి ఏర్పాటు చేస్తారు.
ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారాంతాల్లో యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయుర్వేద, హోమియో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ విజయవాడ దుర్గ గుడిలో ఏర్పాటు చేసిన నృత్య కార్యక్రమాన్ని వర్చువల్‌గా తిలకించారు. మొదట రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలన్నింటిలో తక్షణమే ఈ కార్యక్రమాలను మొదలుపెట్టి క్రమంగా దేవదాయశాఖ ఈవోల పర్యవేక్షణలో ఉండే ఆలయాలన్నింటికి విస్తరించనున్నట్టు వాణీమోహన్ తెలిపారు. సింహాచలం, అరçసవెల్లి, అన్నవరం ఆలయాల్లో పైలెట్‌గా సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషన్, ఆయుర్వేద వైద్యశిబిరం వంటి కొన్ని కార్యక్రమాలను పదిరోజులుగా నిర్వహించినట్టు చెప్పారు.
విజయవాడ, శ్రీశైలం శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలోను, శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లిఖార్జునస్వామి ఆలయంలోను జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ సోమవారం ముఖ్యమంత్రికి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణీమోహన్, దుర్గగుడి, శ్రీశైలం ఆలయాల కార్యనిర్వహణాధికారులు భ్రమరాంబ, లవన్న ఆహ్వానపత్రాలు అందజేశారు. కనకదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాలని ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment