
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరహాలోనే దేవదాయశాఖలోను ఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వారం రోజుల కిందట దేవదాయశాఖ కార్యక్రమాలపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల భద్రత, దేవుడి భూముల పరిరక్షణ ఈ విభాగం పరిధిలోకి తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆలయాల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఈ విభాగం ఆకస్మిక తనిఖీలు చేపడుతుంది.
దేవదాయశాఖ పరిధిలోని ప్రముఖ ఆలయాలతోపాటు సున్నిత ప్రాంతాల్లో ఉండే ఆలయాలకు సమీపంలో 24 గంటలు పనిచేసే ప్రత్యేక పోలీసు ఔట్‌పోస్టులు ఏర్పాటు చేస్తారు. దేవదాయశాఖతో సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలన్నింటిలోను మూడు నెలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా ఆలయాల యాజమాన్యాలకు నోటీసులు జారీచేయనున్నారు. రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో మొత్తం 24,622 ఆలయాలు, మఠాలు ఉన్నాయి. వీటిలో 4,380 ఆలయాలు ఈవోల పర్యవేక్షణలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment