బాబే మొదటి ముద్దాయి: వైఎస్‌ జగన్‌ | YS Jaganmohan Reddy Fires On Chandrababu About Tirupati Stampede | Sakshi
Sakshi News home page

బాబే మొదటి ముద్దాయి: వైఎస్‌ జగన్‌

Published Fri, Jan 10 2025 5:11 AM | Last Updated on Fri, Jan 10 2025 6:53 AM

YS Jaganmohan Reddy Fires On Chandrababu About Tirupati Stampede

స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శిస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజం

ఆరుగురు భక్తులు మరణించడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే 

టీటీడీ చరిత్రలో ఈ దుర్ఘటన మాయని మచ్చ 

పోలీసులంతా చంద్రబాబు కుప్పం పర్యటన సేవలో తరించారు 

తిరుపతిలో భక్తుల భద్రతను గాలికొదిలేశారు 

ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఎవరూ పట్టించుకోలేదు 

లక్షల మంది భక్తులు వస్తారని ముందు తెలియదా? 

కనీసం మంచి నీరు, ఆహారం ఇవ్వాలని కూడా తెలీదా? 

అందరూ గుమిగూడేలా చేసి ఒక్కసారిగా గేట్లు తెరుస్తారా? 

క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో టీటీడీకి ఉన్న విశిష్టతను పాడు చేశారు 

బాబుతో పాటు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, ఎస్పీ, కలెక్టర్‌ అందరికీ ఈ పాపంలో భాగముంది 

దేవుడికి, భక్తులకు క్షమాపణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు.. బాబుకు తెలిసింది తాను చేసిన తప్పును ఇంకొకరి మీద మోపడమే  

వైష్ణవులందరికీ మార్గదర్శకంగా నిలిచే ఆలయం తిరుమల. గతంలో లక్షలాది మంది భక్తులు వచ్చినా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగాం. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శాస్త్రం తెలియదు. ఆచరణలు తెలియవు. దేవుడిపై భయం లేదు. భక్తీ లేదు. భయమూ, భక్తి ఉన్న వాడెవడైనా తిరుమల శ్రీవారి ప్రసాదంపై ఇష్టమొచ్చి­నట్టుగా అబద్ధాలు చెప్పగలుగుతాడా? టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ముఖ్యమంత్రి అనే­వాడు చేస్తాడా? ఈ ఘటనలో ముమ్మా­టికీ చంద్రబాబే మొదటి ముద్దాయి.

తొక్కిసలాట ఒక ప్రాంతంలో జరగలేదు. రకరకాల ప్రదేశాల్లో జరిగింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్‌ ఫోర్స్‌ లేకపోవడం, కనీస ఏర్పాట్లు లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంబులెన్స్‌లను ప్రోటోకాల్‌ ప్రకారం పెట్టాలన్న బాధ్యత కూడా లేదు. తొక్కిసలాట తర్వాత అంబులెన్స్‌ రావడానికి, క్షతగాత్రులను తీసుకెళ్లడానికి ముక్కాలు గంట (45 నిమిషాలు) పట్టిందని బాధితులు చెబుతున్నారు. అది కూడా అప్పుడొకటి.. అప్పుడొకటి వచ్చాయని చెప్పారు. కొంత మంది వాళ్లంతట వాళ్లే కిందా మీద పడి వచ్చామని చెప్పారు. మరికొంత మంది రోడ్డున పోయే వారి సాయంతో వచ్చామని చెబుతున్నారు. ఈ రకమైన పరిస్థితులుండడం ఎంత దారుణం? 

ఈ ఘటనకు చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, ఎస్పీ, కలెక్టర్‌.. బాధ్యత వహించాలి. ఇందులో వీరందరి తప్పు ఉంది. చంద్రబాబు నాయుడుకు ఈ పాపం తగలక మానదు. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశానంటూ దేవుడికి, భక్తులకు క్షమాపణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. సిన్సియార్టీ లేదు. చిత్తశుద్ధి అంతకంటే లేదు. తాను చేసిన తప్పును ఇంకొకరి మీద మోపడమే ఆయనకు తెలుసు.  
– వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చనిపోవడం దురదృష్టకరమని వైఎ­స్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చరిత్రలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. టీటీడీ చరిత్రలో ఇది మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. 

ఈ ఘటనలో ముమ్మాటికీ మొదటి ముద్దాయి చంద్రబాబేనని స్పష్టం చేశారు. తొక్కిస­లా­టలో గాయపడి, పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రి (స్విమ్స్‌)లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర టీటీడీలో ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలను అందరూ ఆలోచించాలన్నారు. తొక్కిసలాట ఘటనలో ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వచ్చా­యని చెప్పారు. 

‘మనం వైకుంఠ ఏకాదశిని ప్రతి ఏటా జరుపుకుంటాం. ఆ రోజు లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని తరలివస్తారు. 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. ఈ విషయాలన్నీ తెలిసీ.. ప్రభుత్వం ఎందుకు టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర భద్రత చర్యలు, ప్రొటోకాల్స్‌ పాటించలేదు? అసలు చంద్రబాబుకు 10న వైకుంఠ ఏకాదశి అని తెలుసు కదా? అయినా కూడా కుప్పంలో తన ప్రోగ్రాం పెట్టుకున్నాడు. 

6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలోనే ఉన్నారు. పోలీసు శాఖ మొత్తం ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కుప్పం తరలిపోయింది. 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన జరిగింది. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు, కుప్పం­లో చంద్రబాబు పర్యటన ఉందని తెలిసినప్పుడు పోలీ­సులు ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు? అందరూ చంద్రబాబు పర్యటనలో మునిగి పోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఒక్క సారిగా గేట్లు తెరవడంతో.. 
బైరాగిపట్టెడ కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులో ఉదయం 8 గంటల నుంచి భక్తులను గుంపుగా నిలబెట్టారు. రాత్రి 8.30 గంటలకు కౌంటర్‌ వద్దకు తీసుకొచ్చి గేట్లు తెరిచారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెబుతున్నారు. చీకట్లో.. పార్కులో నిలబెట్టిన భక్తులకు ఉదయం నుంచి ఏమైనా ఇచ్చారా? వచ్చిన భక్తులను వచ్చినట్టు ఎందుకు క్యూలైన్లలోకి పంపించలేదు? అన్ని సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. ఆయా సెంటర్లలో లైన్లలోకి పంపించడానికి పోలీసులు ఎక్కడా లేరు. 

అందుకే గుంపుగా నిలబెట్టి ఒకేసారి విడిచిపెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు పోలీసులు.. చంద్రబాబు దిక్కమాలిన అబద్ధాలు అడుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటన ఒక చోటే జరిగినట్టు చెబుతున్నారు. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయినట్టు, బైరాగిపట్టెడలో ఐదు మంది  చనిపోనట్టు ఎఫ్‌ఐఆర్‌లలో నమోదైంది. ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడినప్పుడు వివిధ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటల్లో గాయపడినట్టు చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కుప్పంలో 6,7,8 తేదీల్లో ప్రోగ్రామ్స్‌ పెట్టుకున్నారు. 

పోలీసులు మొత్తాన్ని తన దగ్గరకే పిలిపించుకున్నారు. తిరుపతిలో మాత్రం భక్తుల కోసం ప్రత్యా­మ్నాయ భద్రత ఏర్పాట్లను గాలికి వది­లేశారు. ఫలితంగా భారీ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేవుడి దయతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ప్రాణపాయం లేదు. రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులను కలుపుకుంటే దాదాపు 50 నుంచి 60 మంది భక్తులు తొక్కిసలాటలో గాయపడినట్టు సమాచారం. ఒక్క స్విమ్స్‌లోనే 35 మంది ఉన్నట్టు తెలుస్తోంది. 

 

భక్తుల భద్రత, వసతులపై చిత్తశుద్ధి ఏదీ? 
మొట్టమొదటి సారిగా తిరుపతిలో ఇలాంటి దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇక్కడి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు, టీటీడీ పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత తెలియకుండా ప్రవర్తించారు. దశాబ్దాలుగా టీటీడీలో ప్రొటోకాల్స్‌ ఉన్నా, వీళ్లెవ్వరూ పట్టించుకోలేదు. తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత, వసతుల కల్పన గురించి ఆలోచించలేదు. 

ఉదయం 9 గంటలకు వస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. అక్కడ మనుషులు ఉన్నారని వీళ్లు పట్టించుకుంటే కదా! మా ప్రభుత్వంలో ఐదేళ్లలో గొప్పగా భక్తులకు దైవ దర్శన సేవలందించాం. అలాంటిది ఈ రోజు భక్తులను క్యూలో నిలబెట్టేవారు లేరు. వారి ఆకలి, దప్పికలను కూడా గాలికి వదిలేశారు. 

ప్రభుత్వమే బాధ్యత వహించాలి 
ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల నష్టప­రిహారం ఇవ్వాలి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి.. ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ ఉచిత వైద్యం అందించాలి. వారు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేటప్పుడు కనీసం రూ.5 లక్షలు అందించాలని చంద్రబాబును డిమాండ్‌ చేస్తున్నాం. 

ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి, దేవదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్‌ ఈవో, ఎస్పీ, కలెక్టర్, రెవెన్యూ అధికా­రులు అందరూ బాధ్యత వహించాల్సిందే. మొత్తం పోలీసు శాఖను తిరుపతిలో లేకుండా చేసి.. పలచ­గా అక్కడక్కడా బందోబస్తు పెట్టి, భక్తుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారు
గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న ఘతన ఈ చంద్రబాబుది కాదా? తన షూటింగ్‌ కోసం అందర్నీ ఒకచోట పెట్టాడు. షూటింగ్‌ బాగా రావాలని చెప్పి గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. 
⇒ తిరుపతి ఘటనలో జరిగిన వాస్తవాలు ప్రజలకు చెప్పకూడదని చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయాడంటే.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను నేను రాకముందే ఇక్కడ నుంచి షిప్ట్‌ చేసే కార్యక్రమం చేశారు. దీనికి మీరే సాక్ష్యం. గాయపడిన వారు చాలా మంది మేము పోము.. మా పరిస్థితి ఇంకా బాగోలేదు.. మమ్మల్ని ఎక్కడకు పంపిస్తారు.. మేము ఎందుకు పోవాలని బీష్మించుకొని ఆస్పత్రిలో ఉండిపోయారు.

⇒ వారిని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేందుకు నా కాన్వా­య్‌ని పోలీసులు అడ్డగించారు. ట్రాఫిక్‌ పేరుతో నా కాన్వాయ్‌ ముందుకు కదలకుండా చేశారు. ఎస్పీకి ఒక మాట చెబుతున్నా.. 

చంద్రబాబుతో మీరంతా కుమ్మక్కై దారుణంగా వ్యవహ­రిస్తున్నారు. దేవుని విషయంలో కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారో పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎస్పీ నుంచి 
చంద్రబాబు వరకు ఆ దేవుడే గట్టిగా మొట్టికాయలు వేస్తాడు.

చిన్న కేసుగా పక్కన పడేసే కుట్ర
భక్తులు మృతి చెందిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో పేలవమైన సెక్షన్లు నమోదు చేశారు. ఇందులో 194 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ కింద కేసు పెట్టారు. దొమ్మీ జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లతో కేసు నమోదు చేస్తారా? ఇది ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఘటనా? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగితే.. 105 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ పెట్టాల్సింది పోయి.. కావాలని కేసును నీరు గార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటనను ఒక చిన్న కేసుగా.. తీసి పక్కన పడేసేందుకు దారుణంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారంటే.. వీళ్లకు అసలు మానవత్వం లేదు. 

చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలనే ఆలోచన అసలే లేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేసి టీటీడీ లడ్డూ విషయంలో ఒక అబద్ధాన్ని సృష్టించారు. దానికి రెక్కలు కట్టి తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్టపాలు చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇదే పెద్ద మనిషి తన చర్యలతో మరో­సారి టీటీడీలో బ్లాక్‌ మార్కుగా నిలిచిపోయే ఘట­నకు కారణమయ్యాడు. 

దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు సురక్షితంగా భగవంతుడి దర్శనం కల్పించడం. అందుకే క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో టీటీ­డీకి ఉన్న విశిష్టత ఎక్కడా లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు టీటీడీలోకి అడుగుపెట్టాలంటే.. అది కూడా చంద్రబాబు లాంటి పాలకుడు ఉన్నప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయోనని చూపించారు.

తప్పంతా చంద్రబాబుదే 
⇒ చంద్రబాబు.. ఓ షో పుటప్‌ చేసి, చిన్న స్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ వారిని బదిలీ, సస్పెండ్‌ చేసే శిక్షలతో సరిపెట్టే కార్యక్రమం చేస్తుండటం బాధాకరం. ఈ ఘటనలో చంద్రబాబు చేసిన తప్పు కన్పించడం లేదా? 

6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలో పర్యటించ లేదా? పోలీసులందరినీ తన చుట్టూ పెట్టుకో­లేదా? భక్తుల కోసం పోలీసుల కేటా­యింపు లేకపోవడం వాస్తవం కాదా? జిల్లా ఎస్పీ.. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే తాపత్రయ పడ్డారే తప్ప, లక్షల మంది భక్తులకు సెక్యు­రిటీ కల్పించాలని ఆలోచించ లేదు. ఈ విషయంలో ఎస్పీది తప్పు కాదా? 

⇒ కలెక్టర్‌ది కూడా తప్పు ఉంది. కనీసం అక్కడున్న వారిని క్యూలైన్‌లలో నిలబెట్టే కార్యక్రమంపై ప్రొటోకాల్‌ ప్రకారం ఆదేశాలు ఇచ్చేందుకు రివ్యూలు కూడా చేయక పోవడం తప్పు కాదా? కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. అక్కడకు వచ్చిన భక్తులకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. తినడానికి తిండి లేదు. ఇలా గంటల తరబడి భక్తులు పార్కుల్లో ఉండేలా చేశారు. అన్ని కౌంటర్ల వద్ద పోలీసులు లేకుండా చేయడంలో కలెక్టర్‌ది తప్పు కాదా?

⇒ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంత మందిని ప్రవేశింప చేయాలనే నిర్ణయం తీసుకున్నది ఈవో, అదనపు ఈవో. వీరందరినీ అజమాయిషీ చేసేది టీటీడీ చైర్మన్‌. వీరందరిదీ తప్పు కాదా? టోకెన్ల జారీపై రివ్యూలు తీసుకోకుండా ఇంత మంది చావులకు కారణం మీరు కాదా? మొత్తానికి ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement