సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి/ సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమ, మంగళవారాల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సీఎం జగన్.. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలివి..
► మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమలకు పయనం
► 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరిక
► అక్కడి నుంచి తిరుపతి బర్డ్ ఆస్పత్రికి చేరుకుని.. అక్కడ నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.
► అనంతరం అలిపిరి వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు.. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.
► మంగళవారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు.
► అక్కడ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి.. అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు.
► అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుపయనమవుతారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
రేపు దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఏర్పాట్లపై దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణీమోహన్ ఆదివారంఈవో కార్యాలయంలో దేవదాయ, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో సీఎం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి వస్తారని తెలిపారు.
ఏర్పాట్లను సమీక్షిస్తున్న దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకెళ్తామని, అక్కడ అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం వేద ఆశీర్వచనంతో పాటు, తీర్థప్రసాదాలు అందజేస్తామని వివరించారు. అమ్మవారి ప్రాశస్త్యాన్ని తెలిపే ఆగమెంటెడ్ రియాల్టీ షోను కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సమావేశంలో ఆలయ ఈవో భ్రమరాంబ, ఏసీపీ హనుమంతరావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రకుమార్, రీజనల్ జాయింట్ కమిషనర్ సాగర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment