దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ | CM YS Jagan Presented Silk Clothes To TTD Tirumala Srivaru | Sakshi
Sakshi News home page

దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ

Published Tue, Oct 12 2021 3:16 AM | Last Updated on Tue, Oct 12 2021 4:08 PM

CM YS Jagan Presented Silk Clothes To TTD Tirumala Srivaru - Sakshi

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు తదితరులు

సాక్షి, తిరుపతి/తిరుమల: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనమివ్వగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు.. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్న ఆయన సంప్రదాయబద్ధంగా నుదుటున తిరునామం.. పంచెకట్టుతో బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న తరువాత ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య గజరాజులు వెంటరాగా.. వైఎస్‌ జగన్‌ ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం జగన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామివారి వైభవాన్ని తెలియజేశారు. ఆలయ జీయర్లు శేషవస్త్రంతో వైఎస్‌ జగన్‌ను సత్కరించారు. స్వామివారి దర్శనానంతరం రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేకూరాలని ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని శ్రీవారిని సీఎం ప్రార్థించారు. అనంతరం వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ చేసి విమాన వేంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్‌రెడ్డి స్వామివారి చిత్రపటంతో పాటు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ 2022 డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రికి శ్రీకారం

శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రిని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తొలుత.. తాడేపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం సీఎం జగన్‌ పలు ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టులో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తిరుపతికి చేరుకున్నారు. బర్డ్‌ ఆస్పత్రి వద్ద టీటీడీ సహకారంతో రూ.64 కోట్లతో నిర్మించిన బాలల ఆరోగ్య వరప్రదాయని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు. ఆస్పత్రిలో వైద్య సేవలందించే వివిధ విభాగాలను పరిశీలించారు. ఇక గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ఉచిత వైద్య సేవలను అందించనుంది. ఈ నెల 12వ తేదీ మంగళవారం నుంచి ఓపీ సేవలు ప్రారంభమవుతాయి. డిసెంబర్‌ మొదటి వారం నుంచి శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. దీంతో ఈ తరహా చికిత్సలకు ఇకపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

అలిపిరి నడకదారి పైకప్పు ప్రారంభం

అలిపిరి నడక దారి పైకప్పు ప్రారంభ కార్యక్రమంలో శ్రీవారికి పూలు సమర్పిస్తున్న సీఎం 

అలిపిరి నుంచి తిరుమల వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును కూడా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నిజానికి ఈ మార్గంలో 40 ఏళ్ల క్రితం పైకప్పు నిర్మించారు. ఇది పలుచోట్ల పాడవడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ రూ.25 కోట్లతో దీనిని పునర్నిర్మించడానికి ముందుకొచ్చింది. ఈ కార్యక్రమాల్లో ఉపసభాపతి కోన రఘుపతితోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఉండగానే సామాన్యులకూ అనుమతి
సహజంగా శ్రీవారి ఆలయంలో సీఎం ఉన్న సమయంలో సామాన్య భక్తులెవ్వరినీ అనుమతించరు. సీఎం బయటకు వచ్చిన తరువాతే వారిని దర్శనానికి అనుమతివ్వడం పరిపాటి. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా వైఎస్‌ జగన్‌ శ్రీవారి ఆలయంలో ఉండగానే సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనం కల్పించారు. స్వామివారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించి, శ్రీవారి ఆలయ గర్భగుడి నుంచి రంగనాయక మండపంలోకి చేరుకున్నారు. క్యూలో భక్తులు వేచి ఉండడంతో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని శ్రీవారి దర్శనానికి అధికారులు అనుమతించారు. దీనిపై భక్తులు హర్షం వ్యక్తంచేశారు. 
గరుడ వాహనంపై కొలువుతీరిన మలయప్ప స్వామి వారిని దర్శించుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి    

సప్త గోప్రదక్షిణ మందిరం ప్రారంభం

గో ప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత గోవుకు గ్రాసం తినిపిస్తున్న సీఎం  

తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిర సముదాయాన్ని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. గో సంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ సకల దేవతా స్వరూపిణిగా భావిస్తున్న గోమాతను దర్శించుకుని, తరువాత శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ మందిరాన్ని నిర్మించారు. చెన్నైకి చెందిన దాత శేఖర్‌రెడ్డి అందించిన రూ.15 కోట్ల విరాళంతో టీటీడీ దీనిని నిర్మించింది. నడకదారిలోనూ, వాహనాల్లోనూ తిరుమలకు వెళ్లే భక్తులకు అనువుగా ఉండేచోట ఈ మందిరాన్ని ఏర్పాటుచేశారు.

కనుమరుగవుతున్న భారతీయ స్వదేశీ గోజాతులు, వాటి ఔన్నత్యాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా తెలియజేసే విధంగా గోవిజ్ఞాన కేంద్రాన్నీ ఏర్పాటుచేశారు. పూజకు సంబంధించిన వివిధ జాతుల గోవులను గోసదన్‌లో ఉంచారు. వాటి ఆలనాపాలనా చూసేందుకు వీలుగా గోసదన్‌ నిర్మించారు. గోప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించిన జగన్‌ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చిగడ్డిని తినిపించి నమస్కరించారు. ఇక్కడ ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, వాటి దూడల నడుమ శ్రీవేణుగోపాలస్వామి విగ్రహం ఏర్పాటుచేశారు.  గోదర్శనం, గోపూజ, గ్రహశాంతి నివారణ పూజలు నిర్వహిస్తారు. భక్తులు వారు ఎంపిక చేసుకున్న గోవు బరువును బట్టి ద్రవ్యం, గ్రాసంగానీ తులాభారం ద్వారా దానంగా సమర్పించే అవకాశం కల్పించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement