pattuvastram
-
పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!
శుభకార్యం ఏదైనా వధూవరులు, మహిళలు, పురుషులు, పిల్లలు అని తేడా లేకుండా అందరూ పట్టు వస్త్రాలను ధరించడం సాంప్రదాయంగా భావిస్తారు. పట్టు వస్త్రాలు ధరించడం వల్ల హుందాతనం, అందం ఉట్టిపడుతుంది. దీంతో మార్కెట్లో పట్టు వస్త్రాలకు మంచి ధర, డిమాండ్ ఉంది. వస్త్ర దుకాణాల్లో లైట్ల వెలుగులో పట్టు వస్త్రాలు దగదగా మెరుస్తుంటాయి. కానీ, అందులో ఏది అసలు, ఏది నకిలీ పట్టు వస్త్రమనేది వినియోగదారులు కనిపెట్టడం చాలా కష్టం. వస్త్ర దుకాణాదారులు కూడా వినియోగదారుడిని బురిడీ కొట్టించే అవకాశాలు లేకపోలేదు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ స్వచ్చమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్, మగ్గంపై నేసిన వస్త్రాలకైతే హ్యాండ్లూమ్ మార్క్‌ను అందజేస్తుంది. సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్ లేబుల్ ఉన్నట్లయితే అది స్వచ్చమైనదిగా గుర్తించవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న వస్త్ర వ్యాపారులకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి లోగోలను అందజేస్తారు. పట్టులో పలు రకాలు.. పట్టులో అనేక రకాలున్నాయి. అందులో సహజసిద్ధమైన మల్బరీ సిల్క్‌ను ‘క్వీన్ ఆఫ్ టెక్స్టైల్’గా పిలుస్తారు. ఇది మల్బరీ పట్టు పురుగైన బాంబేక్స్ మోరె నుంచి తయారవుతుంది. ఇది చాలా ఖరీదైనది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని 90 శాతం వినియోగిస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలన్నీ మల్బరీ పట్టుతోనే తయారవుతున్నాయి. ‘టస్సార్ సిల్క్’ కాపర్రంగులో ఉంటుంది. అడవుల్లో ఉండే పట్టు పురుగుల నుంచి తయారు చేస్తారు. టస్సార్ పట్టును ఎక్కువగా హోం ఫర్నీషింగ్, ఇంటీరియర్ డెకరేషన్లో వినియోగిస్తారు. ఇందీ పట్టు పరుగుల నుంచి ‘ఈరీ సిల్క్’ తయారవుతుంది. ఈరీ పట్టును కాటన్, ఉన్ని, జనపనారతో కలిపి ఫ్యాషన్, ఇతర అస్సెస్సరీస్, హోం ఫర్నీషింగ్ తయారు చేస్తారు. ‘ముంగా పట్టు’ బంగారు వర్ణంలో ఉంటుంది. దీనిని తయారు చేసే పట్టు పురుగులు అడవుల్లో ఉంటూ సోమ్ అండ్ సోఆలు అనే చెట్ల ఆకులను తింటాయి. అసలైన పట్టును ఇలా గుర్తించవచ్చు.. పట్టు పోగుని వెలిగించినప్పుడు నిరంతరంగా కాలకుండా ఆరిపోతుంది. పట్టు కాలినప్పుడు వెంట్రుకలు, ఈకలు కాలిన వాసన వస్తుంది. పోగు కొనలో చిన్న నల్లపూసలా మారుతుంది. పూసను నలిపినప్పుడు పొడి అయ్యి పోగు గరుకుగా మారుతుంది. పట్టు వస్త్రాలను ఎల్లప్పుడు సిల్క్‌మార్క్ అధీకృత షాపుల్లోనే కొనాలి. పట్టు వస్త్రాలకు ఉన్న సిల్క్‌మార్క్ లేబుల్ 100 శాతం పట్టు ప్రామాణికతను సూచిస్తుంది. పట్టు వస్త్రాలని సిల్క్‌మార్క్ వారిచే ఉచితంగా పరీక్షింప జేసుకోవచ్చు. స్వచ్ఛమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్ ఉంటుంది. మగ్గంపై నేసిన పట్టుకు హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ
సాక్షి, తిరుపతి/తిరుమల: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనమివ్వగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు.. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్న ఆయన సంప్రదాయబద్ధంగా నుదుటున తిరునామం.. పంచెకట్టుతో బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న తరువాత ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య గజరాజులు వెంటరాగా.. వైఎస్ జగన్ ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామివారి వైభవాన్ని తెలియజేశారు. ఆలయ జీయర్లు శేషవస్త్రంతో వైఎస్ జగన్‌ను సత్కరించారు. స్వామివారి దర్శనానంతరం రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేకూరాలని ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని శ్రీవారిని సీఎం ప్రార్థించారు. అనంతరం వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ చేసి విమాన వేంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్‌రెడ్డి స్వామివారి చిత్రపటంతో పాటు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ 2022 డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న సీఎం వైఎస్ జగన్ శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రికి శ్రీకారం శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రిని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలుత.. తాడేపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం సీఎం జగన్ పలు ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టులో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తిరుపతికి చేరుకున్నారు. బర్డ్ ఆస్పత్రి వద్ద టీటీడీ సహకారంతో రూ.64 కోట్లతో నిర్మించిన బాలల ఆరోగ్య వరప్రదాయని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు. ఆస్పత్రిలో వైద్య సేవలందించే వివిధ విభాగాలను పరిశీలించారు. ఇక గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ఉచిత వైద్య సేవలను అందించనుంది. ఈ నెల 12వ తేదీ మంగళవారం నుంచి ఓపీ సేవలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ మొదటి వారం నుంచి శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. దీంతో ఈ తరహా చికిత్సలకు ఇకపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలిపిరి నడకదారి పైకప్పు ప్రారంభం అలిపిరి నడక దారి పైకప్పు ప్రారంభ కార్యక్రమంలో శ్రీవారికి పూలు సమర్పిస్తున్న సీఎం అలిపిరి నుంచి తిరుమల వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. నిజానికి ఈ మార్గంలో 40 ఏళ్ల క్రితం పైకప్పు నిర్మించారు. ఇది పలుచోట్ల పాడవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.25 కోట్లతో దీనిని పునర్నిర్మించడానికి ముందుకొచ్చింది. ఈ కార్యక్రమాల్లో ఉపసభాపతి కోన రఘుపతితోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఉండగానే సామాన్యులకూ అనుమతి సహజంగా శ్రీవారి ఆలయంలో సీఎం ఉన్న సమయంలో సామాన్య భక్తులెవ్వరినీ అనుమతించరు. సీఎం బయటకు వచ్చిన తరువాతే వారిని దర్శనానికి అనుమతివ్వడం పరిపాటి. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా వైఎస్ జగన్ శ్రీవారి ఆలయంలో ఉండగానే సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనం కల్పించారు. స్వామివారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించి, శ్రీవారి ఆలయ గర్భగుడి నుంచి రంగనాయక మండపంలోకి చేరుకున్నారు. క్యూలో భక్తులు వేచి ఉండడంతో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని శ్రీవారి దర్శనానికి అధికారులు అనుమతించారు. దీనిపై భక్తులు హర్షం వ్యక్తంచేశారు. గరుడ వాహనంపై కొలువుతీరిన మలయప్ప స్వామి వారిని దర్శించుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సప్త గోప్రదక్షిణ మందిరం ప్రారంభం గో ప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత గోవుకు గ్రాసం తినిపిస్తున్న సీఎం తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిర సముదాయాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. గో సంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ సకల దేవతా స్వరూపిణిగా భావిస్తున్న గోమాతను దర్శించుకుని, తరువాత శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ మందిరాన్ని నిర్మించారు. చెన్నైకి చెందిన దాత శేఖర్‌రెడ్డి అందించిన రూ.15 కోట్ల విరాళంతో టీటీడీ దీనిని నిర్మించింది. నడకదారిలోనూ, వాహనాల్లోనూ తిరుమలకు వెళ్లే భక్తులకు అనువుగా ఉండేచోట ఈ మందిరాన్ని ఏర్పాటుచేశారు. కనుమరుగవుతున్న భారతీయ స్వదేశీ గోజాతులు, వాటి ఔన్నత్యాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా తెలియజేసే విధంగా గోవిజ్ఞాన కేంద్రాన్నీ ఏర్పాటుచేశారు. పూజకు సంబంధించిన వివిధ జాతుల గోవులను గోసదన్‌లో ఉంచారు. వాటి ఆలనాపాలనా చూసేందుకు వీలుగా గోసదన్ నిర్మించారు. గోప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించిన జగన్ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చిగడ్డిని తినిపించి నమస్కరించారు. ఇక్కడ ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, వాటి దూడల నడుమ శ్రీవేణుగోపాలస్వామి విగ్రహం ఏర్పాటుచేశారు. గోదర్శనం, గోపూజ, గ్రహశాంతి నివారణ పూజలు నిర్వహిస్తారు. భక్తులు వారు ఎంపిక చేసుకున్న గోవు బరువును బట్టి ద్రవ్యం, గ్రాసంగానీ తులాభారం ద్వారా దానంగా సమర్పించే అవకాశం కల్పించారు. -
అహింసా సిల్క్పట్టుపురుగుకు పునర్జన్మ
పట్టువస్త్రం నేయడానికి పట్టుదారం కావాలి... పట్టుదారం పట్టుపురుగు నుంచే రావాలి. ప్రకృతి ఇచ్చిన ఆకులను తిని పెద్దదైన పట్టుపురుగు గూడు కట్టుకుంటే... బతికుండగానే ఆ గూడుతో సహా దాన్ని వేడి వేడి నీళ్లలో వేసి, మరిగించాలి... ఆ వేడికి పట్టుపురుగు చనిపోతేనేం..?! అంతచిన్ని ప్రాణంతో పనేంటి మనకు?! పదిహేనేళ్ల క్రితం వరకు ఇంచుమించు అందరి ఆలోచన ఇదే! కానీ పట్టుపురుగుకూ బతికే స్వేచ్ఛ ఉందని చాటుతూ వచ్చిన ‘అహింసా సిల్క్’ అందరి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. పట్టుకు ప్రాణం ఉందని నిరూపించింది. ‘సృష్టిలో ప్రతి జీవికీ బతికే స్వేచ్ఛ ఉంది. పట్టుపురుగు ఆ స్వేచ్ఛకు మినహాయింపు కాదు కదా!’ అంటారు కుసుమరాజయ్య. పట్టుపురుగును చంపకుండా ‘పట్టుబట్టి’ పట్టువస్త్రాన్ని తయారుచేశారీయన. ఆ పట్టుకు ‘అహింసా సిల్క్’ అని పేరు పెట్టారు. ‘సృష్టిలో ప్రతి జీవికి బతికే స్వేచ్ఛ ఉంది’ అనే ఈ మాట ఎన్నో దేశీ విదేశీ వేదికలపై మరీ మరీ చెప్పారు. తాను రూపొందించిన అహింసా పట్టును చేత పట్టి చూపించారు. పాతికేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయాణానికి పదమూడేళ్లుగా ప్రశంసలు వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ నాణ్యత సదస్సు రాజయ్యను ఆహ్వానించి, అవార్డుతో సత్కరించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భార్యా బిడ్డలతో నివాసం ఉంటున్న రాజయ్య వరంగల్ జిల్లా, నాగారం గ్రామవాసి. హైదరాబాద్‌లోని ఆప్కో సంస్థలో ఉద్యోగం చేసి, ఇటీవలే పదవీ విరమణ పొందిన రాజయ్య ‘అహింసా పట్టు’ అనుభవాలను ఇలా పంచుకున్నారు. చేనేతకు చేయూత.. ‘చదువు పూర్తయ్యాక ఆప్కో సంస్థలో ఉద్యోగిగా చేరాను. అన్ని రకాల వస్త్ర తయారీలను పరిశీలించడంతో పాటు చేనేతకారుల కష్టాలూ గమనించేవాడిని. చేసే పనిలోనే ఏదైనా కొత్తదనం తీసుకువస్తే చేనేతకు మరింత పేరు తీసుకురావచ్చు అనేది నా ఆలోచన. పట్టుపురుగుల పెంపకం కేంద్రాలకు వెళ్లాను. పట్టు వచ్చే పద్ధతుల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. కకూన్స్ (పట్టుపురుగు గూడు)ను వేడినీళ్లలో వేసి మరిగించే పద్ధతులు చూశాక ప్రాణం విలవిల్లాడింది. అన్ని వేల, లక్షల పురుగుల ప్రాణాలు మరిగిపోవడం... కొన్నేళ్ల పాటు ఆ బాధ నన్ను విపరీతంగా వేధించింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. గూడు నుంచి పట్టుపురుగు ఒకసారి బయటకు వస్తే ఆ దారం వస్త్రం నేయడానికి పనికి రాదు. పట్టుదారం కావాలి. కానీ, పట్టుపురుగు చావకూడదు. ఇవే ఆలోచనలతో కొన్నాళ్లు గడిచిపోయాయి. పట్టుపురుగును చంపి తయారుచేసే వస్త్రాన్ని ఆధ్యాత్మికవేత్తలు ధరించేవారు కాదు. పట్టును అహింసావాదు లూ ధరించేలా చేయాలి.. చేనేతకారుడికి సాయమవ్వాలి. ఈ తరహా ఆలోచనకు 1990లో ఒక రూపం వచ్చింది. పట్టుపురుగుకు స్వేచ్ఛ... ‘పట్టుపురుగును చంపకుండా ఎక్కడైనా పట్టు తీసే ప్రక్రియ జరుగుతుందా’ అని దేశమంతా తిరిగాను. అన్ని స్పిన్నింగ్ మిల్స్ వారిని సంప్రదించాను. అంతా ఒకటే పద్ధతి. అహింసా మార్గాన పట్టును తయారుచేసేవారు ఎక్కడా కనిపించలేదు. మన దగ్గర పట్టుదారాన్ని చేత్తోనే తీస్తారు. ఒకసారి పురుగు బయటకు వచ్చాక దారమంతా తెగిపోతుంది. దాంతో వస్త్రాన్ని నేయడం సాధ్యం కాదు. పనికిరాని దారాన్ని తీసేస్తూ, పనికొచ్చే దారాన్ని వేరుచేసే మిషనరీస్ కావాలి. ఇందుకు ఛత్తీస్‌గడ్‌లోని లోహియా గ్రాప్ కంపెనీ వారిని మూడు నెలల పాటు కోరితే, చివరకు దారం తీసివ్వడానికి ఒప్పుకున్నారు. వారికి చిన్న మొత్తంలో కకూన్స్ ఇస్తే సరిపోదు, కనీసం వంద కేజీలైనా ఇవ్వాలి. ఏ నెల జీతం ఆ నెల ఖర్చులకే సరిపోయేది. అందుకని పి.ఎఫ్ డబ్బు 80 వేలు, స్నేహితుల దగ్గర మరో 50 వేల రూపాయలు తీసుకొని కకూన్స్ వంద కేజీలు కొన్నాను. మామూలుగా అయితే ఒక్కో కకూన్ నుంచి దాదాపు వెయ్యి గజాల దారం లభిస్తుంది. కకూన్ నుంచి పురుగు బయటకు వచ్చాక 150 గజాలకు మించదు. పనికిరానిది తీసేయగా వందకేజీలకు పదహారు కేజీల దారం వచ్చింది. దాంతోనే చేనేతకారులచేత మన జాతీయ జెండాను పోలిన మూడురంగుల పట్టువస్త్రాన్ని నేయించాను. అహింసా మార్గంలో జరిపే కృషికి గాంధీజీ మంత్రమైన ‘అహింస’ను ఈ పట్టుకు పేరు పెట్టాను. ఎల్లలు దాటిన కృషి... దేశంలోని పలురాష్ట్రాలలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలో ‘అహింసా సిల్క్’ చోటుచేసుకుంది. రంగుల కలయిక, నాణ్యత, హింసలేని పట్టు... ఎంతోమంది దృష్టిని ఆకట్టుకుంది. కంచి కామాక్షి, పుట్టపర్తి సత్యసాయిబాబా .... దేశంలోని ప్రముఖ దేవాలయాలకు అహింసా పట్టు వెళ్లింది. విదేశాలలో జరిగే ఎగ్జిబిషన్లలో ప్రముఖంగా నిలిచింది. ఇండోనేషియా రాజకీయవేత్త మేఘావతి సుఖర్నోపుత్రి, అవతార్ డెరైక్టర్ కామరూన్ భార్యతో సహా గాంధీజీని తమ వాడు అనుకున్న ప్రతి ఒక్కరూ అహింసా సిల్క్ కావాలనుకున్నారు. మొదట ఇది అయ్యేపని కాదు అన్నవారే తర్వాత నా కృషిని మెచ్చుకున్నారు. అహింసాపట్టుతో ఎన్నో దేశాలు తిరిగాను, ఎంతో మంది ప్రముఖులను కలిశాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను. అయితే, మొదటిసారి అహింసా సిల్క్ మూడు రంగుల వస్త్రాన్ని మా అమ్మనాన్నలకు చూపినప్పుడు, వారి కళ్లలో మెరిసిన గర్వం ఈ జన్మకు సరిపడిన ఆనందాన్ని ఇచ్చింది’ అని చెబుతూ సుతిమెత్తగా ఉన్న అహింసా పట్టు వస్త్రాన్ని బిడ్డలా నిమురుతూ ఆ వస్త్రం తయారీ వెనక చోటుచేసుకున్న పరిణామాలను, అనుభవాలను పంచుకున్నారు కుసుమరాజయ్య. అందరూ పనులు చేస్తారు. కొత్తగా ఆలోచించనవారే విజేతలుగా నిలబడతారు. దాంట్లో సహప్రాణుల పట్ల కరుణ చూపేవారు ప్రత్యేకతను చాటుకుంటారు. వారిలో కుసుమరాజయ్య ముందుంటారు. - నిర్మలారెడ్డి, ఫొటోలు: శివమల్లాల