అహింసా సిల్క్పట్టుపురుగుకు పునర్జన్మ
పట్టువస్త్రం నేయడానికి పట్టుదారం కావాలి... పట్టుదారం పట్టుపురుగు నుంచే రావాలి. ప్రకృతి ఇచ్చిన ఆకులను తిని పెద్దదైన పట్టుపురుగు గూడు కట్టుకుంటే... బతికుండగానే ఆ గూడుతో సహా దాన్ని వేడి వేడి నీళ్లలో వేసి, మరిగించాలి... ఆ వేడికి పట్టుపురుగు చనిపోతేనేం..?! అంతచిన్ని ప్రాణంతో పనేంటి మనకు?! పదిహేనేళ్ల క్రితం వరకు ఇంచుమించు అందరి ఆలోచన ఇదే! కానీ పట్టుపురుగుకూ బతికే స్వేచ్ఛ ఉందని చాటుతూ వచ్చిన ‘అహింసా సిల్క్’ అందరి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. పట్టుకు ప్రాణం ఉందని నిరూపించింది.
‘సృష్టిలో ప్రతి జీవికీ బతికే స్వేచ్ఛ ఉంది. పట్టుపురుగు ఆ స్వేచ్ఛకు మినహాయింపు కాదు కదా!’ అంటారు కుసుమరాజయ్య. పట్టుపురుగును చంపకుండా ‘పట్టుబట్టి’ పట్టువస్త్రాన్ని తయారుచేశారీయన. ఆ పట్టుకు ‘అహింసా సిల్క్’ అని పేరు పెట్టారు. ‘సృష్టిలో ప్రతి జీవికి బతికే స్వేచ్ఛ ఉంది’ అనే ఈ మాట ఎన్నో దేశీ విదేశీ వేదికలపై మరీ మరీ చెప్పారు. తాను రూపొందించిన అహింసా పట్టును చేత పట్టి చూపించారు. పాతికేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయాణానికి పదమూడేళ్లుగా ప్రశంసలు వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ నాణ్యత సదస్సు రాజయ్యను ఆహ్వానించి, అవార్డుతో సత్కరించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భార్యా బిడ్డలతో నివాసం ఉంటున్న రాజయ్య వరంగల్ జిల్లా, నాగారం గ్రామవాసి. హైదరాబాద్‌లోని ఆప్కో సంస్థలో ఉద్యోగం చేసి, ఇటీవలే పదవీ విరమణ పొందిన రాజయ్య ‘అహింసా పట్టు’ అనుభవాలను ఇలా పంచుకున్నారు.
చేనేతకు చేయూత..
‘చదువు పూర్తయ్యాక ఆప్కో సంస్థలో ఉద్యోగిగా చేరాను. అన్ని రకాల వస్త్ర తయారీలను పరిశీలించడంతో పాటు చేనేతకారుల కష్టాలూ గమనించేవాడిని. చేసే పనిలోనే ఏదైనా కొత్తదనం తీసుకువస్తే చేనేతకు మరింత పేరు తీసుకురావచ్చు అనేది నా ఆలోచన. పట్టుపురుగుల పెంపకం కేంద్రాలకు వెళ్లాను. పట్టు వచ్చే పద్ధతుల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. కకూన్స్ (పట్టుపురుగు గూడు)ను వేడినీళ్లలో వేసి మరిగించే పద్ధతులు చూశాక ప్రాణం విలవిల్లాడింది. అన్ని వేల, లక్షల పురుగుల ప్రాణాలు మరిగిపోవడం... కొన్నేళ్ల పాటు ఆ బాధ నన్ను విపరీతంగా వేధించింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. గూడు నుంచి పట్టుపురుగు ఒకసారి బయటకు వస్తే ఆ దారం వస్త్రం నేయడానికి పనికి రాదు. పట్టుదారం కావాలి. కానీ, పట్టుపురుగు చావకూడదు. ఇవే ఆలోచనలతో కొన్నాళ్లు గడిచిపోయాయి. పట్టుపురుగును చంపి తయారుచేసే వస్త్రాన్ని ఆధ్యాత్మికవేత్తలు ధరించేవారు కాదు. పట్టును అహింసావాదు లూ ధరించేలా చేయాలి.. చేనేతకారుడికి సాయమవ్వాలి. ఈ తరహా ఆలోచనకు 1990లో ఒక రూపం వచ్చింది.
పట్టుపురుగుకు స్వేచ్ఛ...
‘పట్టుపురుగును చంపకుండా ఎక్కడైనా పట్టు తీసే ప్రక్రియ జరుగుతుందా’ అని దేశమంతా తిరిగాను. అన్ని స్పిన్నింగ్ మిల్స్ వారిని సంప్రదించాను. అంతా ఒకటే పద్ధతి. అహింసా మార్గాన పట్టును తయారుచేసేవారు ఎక్కడా కనిపించలేదు. మన దగ్గర పట్టుదారాన్ని చేత్తోనే తీస్తారు. ఒకసారి పురుగు బయటకు వచ్చాక దారమంతా తెగిపోతుంది. దాంతో వస్త్రాన్ని నేయడం సాధ్యం కాదు. పనికిరాని దారాన్ని తీసేస్తూ, పనికొచ్చే దారాన్ని వేరుచేసే మిషనరీస్ కావాలి. ఇందుకు ఛత్తీస్‌గడ్‌లోని లోహియా గ్రాప్ కంపెనీ వారిని మూడు నెలల పాటు కోరితే, చివరకు దారం తీసివ్వడానికి ఒప్పుకున్నారు. వారికి చిన్న మొత్తంలో కకూన్స్ ఇస్తే సరిపోదు, కనీసం వంద కేజీలైనా ఇవ్వాలి. ఏ నెల జీతం ఆ నెల ఖర్చులకే సరిపోయేది. అందుకని పి.ఎఫ్ డబ్బు 80 వేలు, స్నేహితుల దగ్గర మరో 50 వేల రూపాయలు తీసుకొని కకూన్స్ వంద కేజీలు కొన్నాను. మామూలుగా అయితే ఒక్కో కకూన్ నుంచి దాదాపు వెయ్యి గజాల దారం లభిస్తుంది. కకూన్ నుంచి పురుగు బయటకు వచ్చాక 150 గజాలకు మించదు. పనికిరానిది తీసేయగా వందకేజీలకు పదహారు కేజీల దారం వచ్చింది. దాంతోనే చేనేతకారులచేత మన జాతీయ జెండాను పోలిన మూడురంగుల పట్టువస్త్రాన్ని నేయించాను. అహింసా మార్గంలో జరిపే కృషికి గాంధీజీ మంత్రమైన ‘అహింస’ను ఈ పట్టుకు పేరు పెట్టాను.
ఎల్లలు దాటిన కృషి...
దేశంలోని పలురాష్ట్రాలలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌లలో ‘అహింసా సిల్క్’ చోటుచేసుకుంది. రంగుల కలయిక, నాణ్యత, హింసలేని పట్టు... ఎంతోమంది దృష్టిని ఆకట్టుకుంది. కంచి కామాక్షి, పుట్టపర్తి సత్యసాయిబాబా .... దేశంలోని ప్రముఖ దేవాలయాలకు అహింసా పట్టు వెళ్లింది. విదేశాలలో జరిగే ఎగ్జిబిషన్లలో ప్రముఖంగా నిలిచింది. ఇండోనేషియా రాజకీయవేత్త మేఘావతి సుఖర్నోపుత్రి, అవతార్ డెరైక్టర్ కామరూన్ భార్యతో సహా గాంధీజీని తమ వాడు అనుకున్న ప్రతి ఒక్కరూ అహింసా సిల్క్ కావాలనుకున్నారు. మొదట ఇది అయ్యేపని కాదు అన్నవారే తర్వాత నా కృషిని మెచ్చుకున్నారు. అహింసాపట్టుతో ఎన్నో దేశాలు తిరిగాను, ఎంతో మంది ప్రముఖులను కలిశాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను. అయితే, మొదటిసారి అహింసా సిల్క్ మూడు రంగుల వస్త్రాన్ని మా అమ్మనాన్నలకు చూపినప్పుడు, వారి కళ్లలో మెరిసిన గర్వం ఈ జన్మకు సరిపడిన ఆనందాన్ని ఇచ్చింది’ అని చెబుతూ సుతిమెత్తగా ఉన్న అహింసా పట్టు వస్త్రాన్ని బిడ్డలా నిమురుతూ ఆ వస్త్రం తయారీ వెనక చోటుచేసుకున్న పరిణామాలను, అనుభవాలను పంచుకున్నారు కుసుమరాజయ్య.
అందరూ పనులు చేస్తారు. కొత్తగా ఆలోచించనవారే విజేతలుగా నిలబడతారు. దాంట్లో సహప్రాణుల పట్ల కరుణ చూపేవారు ప్రత్యేకతను చాటుకుంటారు. వారిలో కుసుమరాజయ్య ముందుంటారు.
- నిర్మలారెడ్డి, ఫొటోలు: శివమల్లాల