nirmalareddi
-
'పైసా' చిక ప్రేమ
మనసు దొంగిలించేవాళ్లు అనుకుంటే బీరువా తాళాలు అప్పగించినవాళ్లవుతారు.ఎక్కడ కాపు కాస్తున్నారో తెలీదు. ఎవరి మీద కన్నేశారో తెలీదు. మనం జాగ్రత్తగా లేకపోతే ఈ దొంగలు మనింటికే రావచ్చు. అరుణ్ హైదరాబాద్‌లో ఆటోవాలా. వయసు 24. అక్కడే ఉంటున్న సౌమ్య (పేరు మార్చాం) ఇంటర్ చదువుతోంది. వయసు 16. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు సౌమ్య. కాలేజీకి వెళ్లొస్తుండే దారిలో అరుణ్ పరిచయం అయ్యాడు. ముందు ఫోన్లలోనే మాట్లాడుకునే ఇద్దరు ఆ తర్వాత ఫేస్ బుక్, చాటింగ్ వరకు వెళ్లారు. ఆ పరిచయం... కలిసి తిరిగేంతవరకు వెళ్లింది. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం’ అని సడెన్‌గా అన్నాడు అరుణ్ ఒకరోజు. అంతే కాదు, మాయ మాటలతో సౌమ్య మనసు దోచుకున్నాడు. అరుణ్ తప్ప మరో ప్రపంచం లేనట్టుగా ఉంది సౌమ్యకు. చూస్తుండగానే ఆరు నెలలు గడచిపోయాయి. ఓ రోజు అరుణ్ (మూడు నెలల క్రితం) సౌమ్య దగ్గరకు వచ్చి, ‘నాకు కడుపులో అల్సర్ ఉందట. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంట. లేకపోతే బతకను. ఆరేడు లక్షలు అవుతుంది అంటున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వే ఎలాగైనా సర్దాలి’ అన్నాడు. సౌమ్య ప్రాణం విల్లవిల్లాడింది. కానీ అంత డబ్బు! ఎలా..? సౌమ్యకు దిక్కు తోచలేదు. రెండు మూడు రోజులుగా అరుణ్ అడగడం, సౌమ్య ఏమీ సమాధానం ఇవ్వకపోవడం జరుగుతూనే ఉంది. నాల్గవరోజు అరుణ్ ఫోన్ చేశాడు. ‘డబ్బు ఇవ్వకపోతే మనిద్దరికీ సంబంధం ఉందని అందరికీ చెబుతాను. మనం దిగిన ఫొటోలు అందరికీ పంచుతాను! నీ పరువు, మీ అమ్మనాన్నల పరువు పోతుంది’ అని వార్నింగ్ ఇచ్చాడు. సౌమ్య హతాశురాలైంది. నిజంగానే ఆ ఫొటోలు బయటపెడితే తన పరిస్థితి ఏంటి?! ఈ కష్టం నుంచి బయటపడటం ఎలా?’ అని ఆలోచించింది. ఒంట్లో బాగోలేదని ఆ రోజు ఇంట్లోనే ఉంది. అమ్మానాన్నలు ఆఫీస్లకెళ్లిపోయారు. బీరువా తాళాలు తీసి చూసింది. బంగారం, ఆ పక్కనే డబ్బు కనిపించాయి. నాన్నకు తెలియకండా ఆయన పర్సులోంచి ఎ.టి.ఎమ్ కార్డు కూడా తీసింది. అరుణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. వచ్చాక దాదాపు 30 తులాల బంగారం, 3 లక్షలకు పైగా నగదు ఇచ్చింది. ఎ.టి.ఎమ్ కార్డ్ తీసుకెళ్లి మరికొంత డబ్బు తీసి ఇచ్చింది. డబ్బు తీసుకుని అరుణ్ ఉడాయించాడు. సౌమ్య మళ్లీ ఆలోచనలో పడింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఊరుకోరు.. ఎలా? తనను తానే కట్టేసుకుని, దొంగలు పడి, దోచుకెళ్లినట్టుగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన ఈ సంఘటనను పోలీసులు దర్యాప్తు చేసి ఈ నెల 9న అరుణ్‌ని అరెస్ట్ చేసి, అసలు విషయం బయటపెట్టారు. ఇప్పుడీ విషయం గురించి మనమెందుకు మాట్లాడుకోవాలంటే.. మన ఇంట్లోనూ ఈ వయసు పిల్లలుంటారు. ఏది తప్పో, ఏది ఓప్పో తెలియని స్థితిలో కష్టాల ఊబిలో వారు పడిపోకూడదు. ప్రేమ పేరుతో ట్రాప్ చేసే వంచకుల చేతికి చిక్కకూడదు. అందుకు మనమేం చేయాలి? ► కుటుంబసభ్యుల మధ్య ఉండే ఆప్యాయతలు మాత్రమే అసలైన ప్రేమ అని అమ్మాయికి తెలియజెప్పాలి. ► ఎంతసేపూ పుస్తకాలు, మార్కులు, ర్యాంకుల గొడవలతో కాకుండా అమ్మాయి మానసిక వికాసానికి కావల్సిన పెద్దల అనుభవాలను జాగ్రత్తలుగా షేర్ చేసుకోవాలి. ► ఏ బాధ్యతా లేకుండా రోడ్లమీద తిరిగేవారే అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటారు. అదికూడా అమాయకమైన అమ్మాయిలనే టార్గెట్ చేస్తుంటారు. తమ ట్రాప్‌లో పడేందుకు కావల్సిన అన్ని శక్తులనూ ఉపయోగిస్తుంటారు. ఆ విషయాన్ని అమ్మాయిలకి అర్థమయ్యేలా చెప్పాలి. ► పిల్లల చిన్న చిన్న సమస్యలను, అవసరాలను వాయిదా వేయకూడదు. చిన్న అవసరాలే కదా అని కొట్టిపారేయకుండా సాధ్యమైనంతవరకు తీర్చాలి. సమస్యను పూర్తిగా విని సానుకూలంగా స్పందించాలి. ► పిల్లలు తమ సమస్యలను, భావోద్వేగాలను పంచుకునేలా ఇంటి వాతావరణం ఉండాలి. ► సమాచారం వేగవంతంగా మారిన ఈ రోజుల్లో ప్రేమ పేరుతో జరిగే మోసాలు కూడా రెట్టింపు వేగంతో జరిగిపోతున్నాయి. అందుకని, పిల్లల స్నేహాలు, వారి ప్రవర్తనవైపు గమనింపు తప్పనిసరి. ► బోర్ కొడుతోందని టైమ్ పాస్ కోసం ప్రేమలో పడ్డవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. కాబట్టి పిల్లలకి బోర్ అనిపించకుండా చదువుతో పాటు నృత్యం, సంగీతం, క్రీడలు, పుస్తకపఠనం... హాబీస్వైపుగా వారి దృష్టి మళ్లేలా చూడాలి. ► ‘ప్రేమలో పడ్డాం’ అని కౌన్సెలింగ్‌కు వచ్చే అమ్మాయిలు దాదాపు నిరుద్యోగులుగా తిరుగుతుండేవారినే ఇష్టపడటం చూస్తున్నాం’ అని కౌన్సెలర్లు చెబుతున్నారు. జాగ్రత్త అవసరం. - నిర్మలారెడ్డి ఇన్పుట్స్: యాదగిరి, సాక్షి, తుర్కయంజాల్ ఆకర్షణలు... లక్ష్యాలు ఒక బకెట్‌ను ముందు ఇసుకతో నింపాక అందులో రాళ్లు పట్టవు. అదే ముందు రాళ్లు వేసి, తర్వాత అంతే ఇసుకతో అదే బకెట్ నింపవచ్చు. పిల్లలు తెలియక తమ జీవితంలో ముందు ఇసుకనే నింపుకుంటున్నారు. రాళ్లుగా చెప్పుకునే లక్ష్యాలను వెనకేసుకోవాలనే జ్ఞానం వారికి ఉండటం లేదు. ఈ వయసులో ఆకర్షణలు ఇసుకతో సమానం అని, ఆ ఆకర్షణలో పడితే లక్ష్యాలను సాధించలేమని పిల్లలకు తెలియ చెప్పాలి. - డా. గీతాచల్లా, సైకాలజిస్ట్ మోసాలు పెరుగుతున్నాయి ప్రేమ పేరుతో నమ్మించి మోసాలు చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా టెన్త్, ఇంటర్మీడియెట్ అమ్మాయిలే ప్రేమ అనే ఆకర్షణలో పడుతున్నారు. తర్వాత మోసపోయి, బాధపడుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలపై దృష్టిపెట్టి వారిని సరిదిద్దాలి. - భాస్కర్‌గౌడ్, ఏసీపీ, వనస్థలిపురం -
70ల ఫ్యాషన్...ఆపాత అందాలు...
ముస్తాబు ప్రపంచం ఎంతో ముందుకు వెళుతోంది అనుకున్నప్పుడల్లా ఫ్యాషన్ ఒక్కసారి ‘కమ్ బ్యాక్’ అంటూ రీల్‌ని వెనక్కి తిప్పి చూపిస్తుంది. సంప్రదాయాన్ని, ఆధునికతను వేళవించి కాంటెంపరరీ దుస్తులను క్రియేట్ చేస్తుంది. లేటెస్ట్గా, లవబుల్‌గా 1970ల కాలం నాటి ఫ్యాషన్‌ని ఈ చలికాలానికి సరికొత్తగా కళ్లముందుంచుతోంది ఫ్యాషన్ ప్రపంచం. ఇప్పుడంతా 70ల కాలం నాటి దుస్తులు కనువిందు చేయబోతున్నాయి. నిజం! అతివలు ఆధునికతకు బ్రేక్ ఇచ్చి పాత కాలాన్ని లాక్కొచ్చి మరీ ముందు నిలుపుతున్నారు. ఎందుకంటే కాలం ఇప్పుడు ‘రెట్రో (అనుకరణ) స్టైల్’ వెంబడి పరుగులు తీస్తోంది. వేషధారణల్లో కాస్త ఫన్ ఉండేలా, జియోమెట్రికల్ ప్రింట్స్ అబ్బురపరిచేలా డ్రెస్ డిజైనర్స్ వీటిని మరింత అందంగా కళ్ల ముందు నిలుపుతున్నారు. ‘బాంబర్ జాకెట్స్, ప్లీటెడ్ స్కర్ట్స్, క్రాప్ టాప్స్పైన నాడు పువ్వులు, లతల హవా నడిస్తే నేడు జియోమెట్రికల్ ప్రింట్లు సందడి చేస్తున్నాయి’ అంటున్నారు ముంబై ఫ్యాషన్ డిజైనర్ అనితా డొంగ్రే. ఇటీవల ఇండియన్ లాక్మె ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న అనితాడోంగ్రే, పూర్వి దోషి, పరిణీతా సలూజ ఫ్యాషన్ ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పులను తెలియజేస్తూ జియోమెట్రికల్ లైన్స్ 2014 వింటర్‌ని ఓ కొత్త కళతో చూపనున్నాయ’ని తెలిపారు. ఈ సందర్భంగా డెబ్భైల నాటి కాలపు స్టైల్స్ హైలైట్స్ జాబితాను వీరు విడుదల చేశారు. ఫన్‌గా, అందంగా..! ‘ఫ్యాషన్ ఎప్పుడూ ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒక ప్పుడు అకస్మాత్తుగా వెనకటి కాలమే మన ముందు నిలబడకమానదు. ఆ టైమ్ ఇప్పుడు వచ్చింది. అలనాటి స్టైల్ ఇప్పుడు కొత్తగా, మరింత ఫన్‌గా, మరింత అందంగా రూపుకడుతుంది. ప్రస్తుతం కనువిందు చేస్తున్న ఈ స్టైల్స్ నాటి ట్రెండ్‌కు కొనసాగింపు’ అంటూ ఫ్యాషన్ డిజైనర్ పరిణీతా సలూజా వివరించారు. అంతేకాదు ఇప్పటి ట్రెండ్ ఇదేనంటున్నారు పరిణీత! నాడు, నేడు మేళవింపు... ‘ఫ్యాషన్‌లో ఎన్ని పోకడలు వచ్చినా రెట్రో వైపు దృష్టి ఎప్పుడూ వెళుతూనే ఉంటుంది’ అని తెలిపారు హైదరాబాద్ లఖోటియా ఫ్యాషన్ ఇన్స్ట్యూట్ డిజైనర్ అయేషా! అయితే 70ల కాలం నాటి డ్రెస్సులు, పూర్తి కాపీ అనడానికి వీల్లేదు అంటారీమె! ‘గుడ్డిగా వాటిని అనురించాలనీ లేదు. పాత కథకు కొత్త ముగింపు ఇచ్చినట్టుగా నాటి వేషధారణలోనే సరికొత్త కోణాన్ని ఆవిష్కరించవచ్చు’ అంటూ కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ‘లూప్ స్లీవ్‌లెస్’ 70ల కాలంలోనూ ఉన్నాయి. కానీ, దీంట్లోనే కొన్ని స్టైలిష్ కట్స్‌తో ఇప్పుడు పూర్తి కొత్తదనాన్ని తీసుకురావచ్చు’అని వివరించారు. బెల్ బాటమ్స్ నాటి గొప్ప ట్రెండ్. ఇప్పుడు ఇవే కొద్ది పాటి మార్పులతో పలాజో ప్యాంట్స్గా అలరిస్తున్నాయి. వాటికి ఫిటెడ్ షర్ట్స్, హిప్పీ షర్ట్స్ జత చేస్తే.. మగువలు, మగవారూ హ్యాపీగా ధరింవచ్చు’ అంటూ తెలిపారు ఆమె. పలాజో ప్యాంట్స్ చూస్తే అప్పటి స్టైలిస్ట్ ఐకాన్స్‌గా పేరొందిన ఫరా, జీనత్ అమన్‌లు గుర్తుకువస్తారు. వారు అప్పట్లో వేషధారణలో కొత్త పోకడలు సృష్టించి, స్టైలిస్ట్లుగా పేరొందారు. ఇప్పుడూ వారినే అనుసరించడానికి కారణం ఈ లుక్ ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండటమే! పలాజో ప్యాంట్స్... ఫ్యాషన్ డిజైనర్ పూర్వి దోషి మాట్లాడుతూ- ‘నాటి, నేటి స్టైల్స్‌ను సూచించే పలాజో ప్యాంట్స్ జంప్సూట్స్కి ఒక దారి చూపాయి. జంప్‌సూట్‌లో బాటమ్ (ప్యాంట్ అడుగు భాగాన) కొద్దిగా విచ్చు కున్నట్టు ఫ్లెయిర్గా ఉండటంతో బెల్బాటమ్ను తలపిస్తుంది. దీని పైన న్యారో కట్ ట్రౌజర్ ధరిస్తే ఆధునికంగా కనిపిస్తారు. ఇది యువతల శరీరసౌష్టవానికి చక్కగా సరిపోయే ఎంపిక’ అని తెలిపారు ఆమె. రంగులు, ప్రింట్లు... డెబ్భైల కాలమంతా రంగు రంగుల పువ్వుల ప్రింట్లు, మరీ కొట్టొచ్చినట్టు కన బడే ఎరుపు, గులాబీ.. మొదలైన కాంతిమంతమైన రంగులతో ఉండేవి. ‘అందుకే నాటి నేటి సమ్మేళనమైన కట్స్, కాంతిమంతమైన రంగులు, ప్రస్తుత పువ్వుల ప్రింట్లు.. ఇవన్నీ కలుపుతూనే 70ల నాటి కథనాన్ని ఇప్పుడూ సరికొత్తగా చూపించవచ్చు’ అంటారు అయేషా! అయితే రెట్రో లుక్‌తో అలరించాలంటే దుస్తులే కాదు వాటికి తగిన ఆభరణాలను, ఇతర ఆలంకారాలన్నీ సరిపోలాలి అని కూడా సూచిస్తున్నారు ఈ డిజైనర్లు. తలకట్టు, తలకు వాడే క్లిప్పులు, రబ్బర్‌బ్యాండ్లు, బ్యాగులు, బెల్టులు, చెప్పులు... వంటివన్నీ కూడా 70ల కాలం నాటి స్టైల్‌ను పోలినవాటినే ఎంచుకోవాలి’ అని చెబుతున్నారు. డిజైనర్ల సూచనలు తీసుకుంటూ నాటి అలంకరణతో ఈ వింటర్‌ని సరికొత్తగా ఎంజాయ్ చేయడానికి సిద్ధమవండి. - నిర్మలారెడ్డి -
కెమేరా కన్ను... చేతిలో పెన్ను... పిన్నవయసు ధ్రువ తారక
ప్రకృతి దృశ్యాలు చూస్తే అతని కళ్లు విశాలమవుతాయి. అతని కెమెరా కన్ను ఆ అద్భుతాలను ‘క్లిక్’మనిపిస్తుంది. వన్యప్రాణుల జీవనశైలిని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. జాతీయ ఉద్యానాల్లో అతనితో పాటే అతని కెమెరా పరుగులు పెడుతుంది. కెమెరాతో జాతీయ ఉద్యానాల చరిత్రను కళ్లకు కడుతున్న అతని పేరు ధ్రువ్ వాడ్కర్! వయసు పధ్నాలుగేళ్లు. జాతీయస్థాయిలో అత్యంత పిన్నవయస్కుడైన ఫొటోగ్రాఫర్‌గా పేరు సంపాదించుకున్న ఈ టీనేజర్ సింగపూర్ పార్క్‌లలో ఫొటోలు తీసి ‘పార్క్ ఆఫ్ సింగపూర్’ అని ఒక కాఫీటేబుల్ బుక్‌ను రూపొందించాడు. చిన్ననాటి నుంచి ధ్రువ్ చేసిన ‘గ్రీన్ జర్నీ’ పెద్దవారికీ ఓ పాఠంలా ఉపయోగపడుతోంది. పధ్నాలుగేళ్ల ధ్రువ్ వాడ్కర్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడు. మూడేళ్ల క్రితం వరకు ఇక్కడే చదువుకున్నాడు. తల్లిదండ్రులు సింగపూర్‌లో స్థిరపడడంతో ధ్రువ్ కూడా అక్కడే కెనడియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు. సింగపూర్‌లోని 20 ఉద్యానాలను సందర్శించిన ధ్రువ్ ఇప్పటి వరకు దాదాపు 3000 ఫొటోగ్రాఫ్‌లు తీశాడు. అంతేకాదు పార్క్‌లకు వచ్చే వారిని కలిసి, వారితో మాట్లాడాడు. శ్రద్ధగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. మన ఉద్యానాలకూ, సింగపూర్ ఉద్యానాలకూ ఉన్న తేడా తెలుసుకున్నాడు. వాటన్నింటినీ ఒక చోట పొందుపరచి ‘పార్క్ ఆఫ్ సింగపూర్’ అని ఒక కాఫీ టేబుల్ బుక్‌ను తయారుచేశాడు. అతను చేసిన ‘గ్రీన్ జర్నీ’లో చాలా ఆసక్తికర అంశాలే ఉన్నాయి. ఆకుపచ్చని ప్రయాణం... ‘‘ఏడేళ్లుగా వీలు చిక్కితే మన దేశంతో పాటు సింగపూర్ జాతీయ ఉద్యానాలను సందర్శిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రకృతిని అర్థం చేసుకోవడానికి. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉద్యానాల చరిత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫొటోలతో పాటు, సందర్శకుల అభిప్రాయాలనూ సేకరిస్తున్నాను. రికార్డులను శోధిస్తున్నాను. అలా అన్నింటినీ సమకూర్చి ఒక పుస్తకంలో వాటిని పొందుపరిచాను. ఇదంతా ఉద్యానాల అద్భుతాలను, అక్కడి స్థితిగతులను తెలియజేయడానికి. సింగపూర్ పార్కులలో పచ్చదనం చాలా గొప్పగా ఉంటుంది. చుట్టుపక్కల పట్టణ వాతావరణం ఉన్నప్పటికీ విశాలమైన మైదానాలు అబ్బురపరుస్తాయి. ఏ పార్క్ చూసినా శుభ్రంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. అక్కడి ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా పార్క్‌లను తమ నేస్తాలుగా చూస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మన దేశంలోనూ ఎన్నో పార్కులను చూశాను. అక్కడి పార్కులకూ, ఇక్కడి పార్కులకూ ఎంతో తేడా ఉంది. మన దేశంలో పార్కులను కేవలం ఉదయం, సాయంకాల వేళల్లో వాకింగ్‌కు మాత్రమే ఉపయోగిస్తారు’’ అని వ్యాఖ్యానించాడు ధ్రువ్! పన్నెండేళ్ల వయసులో... అత్యంత పిన్నవయసులోనే మన దేశంలోని రణథంబోర్, కన్హా జాతీయ ఉద్యానాల అధికారుల ఆహ్వానం మేరకు వాటిని సందర్శించి, ఫొటోలు తీసి ప్రసిద్ధుల చేత ప్రశంసలు పొందాడీ కుర్రాడు. పన్నెండేళ్ల వయసులో ఢిల్లీలోని వైల్డ్ లైఫ్ సేవర్స్ సొసైటీ, ఎర్త్ మ్యాటర్ ఫౌండేషన్‌కు ధ్రువ్ వాడ్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. మన దేశంలో రణథంబోర్ జాతీయ ఉద్యానంలో ధ్రువ్ తీసిన 75 ఫొటోలతో హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. హైదరాబాద్‌లోని నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదివే సమయంలో తాను తీసిన పులుల ఫొటోలను స్కూల్‌కు అందజేశాడు. ఢిల్లీలో ‘కాల్ ఆఫ్ ద టైగర్’ పేరుతో వన్యప్రాణుల సంరక్షణ సొసైటీ, ఎర్త్ మ్యాటర్స్ ఫౌండేషన్ ఒక పోటీని నిర్వహించింది. అందులో 32 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వారందరిలో అత్యంత పిన్నవయస్కుడు ధ్రువ్! వారికి దీటుగా ధ్రువ్ తీసిన ఫొటోలు ఎంపికయ్యాయి. హాబీగా ఫొటోగ్రఫీ ధ్రువ్ చిన్నతనమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి రోజూ దగ్గరలోని పార్క్‌కు వెళ్లేవాడు. అక్కడి పచ్చని గడ్డి మీద గంటలు గంటలు ఆడుకునేవాడు. అలా పార్క్‌లతో అనుబంధం ముడిపడిపోయింది అంటాడు ధ్రువ్. ‘‘ఫొటోగ్రఫీలో ధ్రువ్‌కు ఉన్న ఆసక్తి, అభిరుచిని గమనించిన మా ఆవిడ వాడికి ఏడేళ్ల వయసులో ఒక చిన్న కెమేరా కొనిచ్చింది. అప్పుడు మొదలైన హాబీతో ఇప్పటికీ వాడు క్లిక్ మనిపిస్తూనే ఉన్నాడు’’ అంటూ ఆనందంగా వివరిస్తారు ధ్రువ్ తండ్రి అనంత్ వాడ్కర్. ‘‘నా అభిరుచిని గమనించి అమ్మా నాన్న కన్హా జాతీయ ఉద్యానం, సలీమ్ అలీ బర్డ్ శాంక్చ్యువరీ వంటివాట న్నింటికీ తీసుకెళ్లారు’’ అనే ధ్రువ్ మన దేశంలోనూ పార్కులు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తన కాఫీటేబుల్ బుక్‌లో పొందుపరిచాడు. ‘‘చిన్న ప్రయత్నం జగమంతా పచ్చదనం నిండడానికి దోహదం చేస్తుంది. ఆ ప్రయత్నం మనం నిరంతరం చేస్తూనే ఉండాలి’’ అంటాడు ధ్రువ్. ఈ పిన్నవయస్కుడి ఆలోచన ఎందరికో స్ఫూర్తి నిస్తుందని, ఆకుపచ్చని అందాలను కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ఆశిద్దాం. - నిర్మలారెడ్డి -
అష్టాదశ శక్తి పీఠాలు...
చూసొద్దాం శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి, పూజిస్తున్నాం. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో (గుడి ధ్వంసం అయ్యింది), మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన దేశంలోనే ఉన్నాయి. వాటి గురించిన సమాచారం దసరా పండగ సందర్భంగా ఈ వారం... 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీలంకలో పశ్చిమతీరాన గల ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లున్న కొండపైన శాంకరీదేవి ఆలయం, శక్తి పీఠం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. అమ్మవారి ‘తొడ భాగం’ పడిన స్థలంగా ప్రతీతి. 2. కామాక్షీ కాంచికా పురే! కోర్కెలు తీర్చే కన్నులు గల శక్తి స్వరూపిణి కామాక్షి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణానికి 75 కి.మీ దూరంలో కాంచీపురం అమ్మగా వెలగొందుతోంది. అమ్మవారి శరీరభాగమైన ‘కంకాళం’ ఇక్కడ పడినట్లు చెబుతారు. 3. ప్రద్యుమ్నే శృంఖలాదేవి! నేటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు సుమారు 85 కి.మీ దూరంలో హుగ్లీ జిల్లాలోని ‘పాండువా’ అనే గ్రామంలో వెలసిందీ క్షేత్రం. కాలక్రమేణా మహమ్మదీయ పాలనలో గుడిని ధ్వంసం చేసి, పైన మీనార్‌ను నిర్మించారు. దీంతో భారత ప్రభుత్వం నిషేధిత స్థలంగా ప్రకటించింది. శృంఖల అంటే సంకెళ్లు అని అర్థం. భక్తుల సమస్యల సంకెళ్లను అమ్మవారు త్రుంచివేస్తారని నమ్మకం. అమ్మవారి శరీర భాగమైన ‘ఉదరం’ ఇక్కడ పడిందని చెబుతారు. పాండువా గ్రామానికి 10 కి.మీ దూరంలో హంసాదేవి అనే అతి ప్రాచీన దేవాలయం ఉంది. భక్తులు హంసాదేవినే శృంఖలాదేవిగా భావించి పూజలు జరుపుతుంటారు. 4. క్రౌంచపట్టణే చాముండేశ్వరి! కర్ణాటక రాష్ట్రం మైసూరు పట్టణంలో మహిషాసుర మర్దినిగా చాముండేశ్వరి మాత వెలుగొందుతోంది. ఆలయానికి ఎదురుగా సర్వాలంకృతుడైన మహిషుని విగ్రముంది. అమ్మవారి ‘తలవెంట్రుకలు’ పడిన పుణ్య ప్రదేశం చాముండేశ్వరీ ఆలయం. 5. అలంపురే జోగులాంబ:! తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలో కర్నూలుకు 10 కి.మీ దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ. ఈ దేవాలయం ముసల్మానుల దండయాత్రలో ధ్వసం అయ్యి, ఆ తర్వాత పునరుద్ధరించబడింది. సతీదేవి ‘దంతాలు’ ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. 6. శ్రీశైలే భ్రమరాంబికా! దక్షిణాపథంలో ప్రసిద్దికెక్కిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం. కర్నూలుకు 150 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు భ్రమరాంబికగా నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి ‘మెడ’భాగం పడిన స్థలంగా ప్రతీతి. ఈ ఆలయానికి దగ్గరలోని అడవిలో ఇష్టకామేశ్వరి ఆలయం అతి ప్రాచీనమైనది. 7. కొల్హాపురే మహాలక్ష్మీ! మహారాష్ట్రలోని పుణేకి దాదాపు 300 కి.మీ దూరంలో కొల్హాపూర్‌లో వెలసిన అమ్మ మహాలక్ష్మి అవతారం. ఇక్కడ సతీదేవి ‘కనులు’ పడిన ప్రాంతంగా చెబుతారు. 8. మాహుర్యే ఏకవీరికా! మాహుర్యే పురమున వెలసిన శక్తి స్వరూపిణి ఏకవీరిక. మహారాష్ట్రలో నాందేడ్ పట్టణానికి 125 కి.మీ దూరంలో ఉంది మాకుద్యపురం. అమ్మవారి ‘కుడి చేయి’ పడిన స్థలంగా ఇది ప్రతీతి. 9. ఉజ్జయిన్యాం మహాకాళి! సతీదేవి ‘పై పెదవి’ పడిన స్థలం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణానికి 50 కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లంగం, మహాకాళి ఆలయం ఉన్నాయి. మహిమాన్వితమైన క్షేత్రంగా ఈ ప్రదేశానికి పేరు. మంత్ర, తంత్రాలతో ప్రతిష్ఠ చేసిన శక్తిపీఠంగా విరాజిల్లుతోంది మహాకాళి. 10. పీఠికాయాం (పిఠాపురం) పురుహూతికా! ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోటకు 13 కి.మీ దూరంలోని పిఠాపురంలో సతీదేవి ‘పీఠభాగం’ పడడం వల్ల పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది. శ్రీచక్రం, అమ్మవారికి బంగారు చీర ఇక్కడ ఉన్నాయి. ఈ చీరతో ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకారం చేస్తారు. 11. ఓఢ్యాయాం గిరిజా దేవి! ఒడ్యాణం అనగా ఓఢ్ర దేశం (ఒరిస్సా). నేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్ నుంచి 20 కి.మీ దూరం ప్రయాణిస్తే ఈ గిరిజాదేవి (ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయం ఉన్నది. సతీదేవి ‘నాభి స్థానం’ ఇక్కడ పడిందని అంటారు. 2. మాణిక్యామ్ దక్షవాటికే (ద్రాక్షారామం)! సతీదేవి ‘కణతల భాగం’ పడిన ప్రదేశంగా అష్టాదశ పీఠాలలో 12వదిగా, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం. భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందినదీ క్షేత్రం. 13. హరిక్షేత్రే కామరూపా! అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి పట్టణంలో బ్రహ్మపుత్రానది ఒడ్డున నీలాచలంలో వెలసినదీ క్షేత్రం. సతీదేవి ‘యోని’ భాగం పడిన స్థలం. నీలాచలంలో స్త్రీ యోని వంటి శిల ఒకటి ఉంది. ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి మూడు రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది. అమ్మవారు రజస్వల అయిందని, ఈ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు. 14. ప్రయాగే మాధవేశ్వరీ! ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ప్రయాగ క్షేత్రం ఉంది. సతీదేవి ‘హస్త అంగుళీయం’ పడిన ప్రాంతంగా చెబుతారు. యుమన, గంగా నదులు కలిసే ప్రాంతం. శక్తిని మాధవేశ్వరి అంటారు. పిండప్రదానానికి, అస్థికల నిమజ్జనానికి ప్రాముఖ్యత గలదీ క్షేత్రం. 15. జ్వాలాయం వైష్ణవీ దేవి! సతీదేవి ‘పుర్రె’ పడిన ప్రదేశం. జ్ఞాన క్షేత్రం. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు 50 కి.మీ దూరంలో కాట్రా అనే ప్రదేశంలో ఉందీ ప్రాంతం. అక్కడి నుండి గుర్రాల మీద లేదా హెలీకాప్టర్‌లో కొండపైకి వెళ్లి జ్వాలాముఖి లేదా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో గుహ ఉంది. నాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా చేయించి, తన స్వహస్తాలతో మోస్తూ కొండపైకి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించిన వెండి గొడుగు నేటికీ ఈ ఆలయంలో ఉంది. 16. గయాయామ్ మాంగళ్య గౌరీ! బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75 కి.మీ. దూరంలో గయా క్షేత్ర శక్తి స్వరూపిణి మంగళ గౌరి కొలువుదీరి ఉంది. సతీదేవి ‘స్తనం’ పడిన ప్రదేశం. దగ్గరలో బుద్ధగయ, బోధి వృక్షం, బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు. 7. వారాణస్యాం విశాలాక్షీ! సతీదేవి ‘మణికట్టు’ పడిన స్థలం కాశీ పుణ్య క్షేత్రం. శివుని విశిష్ట స్థానంగా కాశి/వారణాశి విరాజిల్లుతోంది. వరుణ, అసి అనే రెండు నదుల సంగమం. గంగాస్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం నయానందకరం. శుభకరం. 18. కాశ్మీరేతు సరస్వతియనా! ఇక్కడ సతీదేవి ‘చేయి’ పడినదని కొందరు, కుడి చెంప పడిన స్థలమని కొందరు చెబుతారు. పురాణేతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం కాశ్మీర్లో ఉందని తెలుస్తోంది. కానీ ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగడం లేదని శంకచార్యులు ఆ పీఠాన్ని శృంగేరిలో (కర్ణాటక రాష్ట్రంలో) ప్రతిష్ఠించారని తెలుస్తోంది. మంగుళూరుకు 100 కి.మీ దూరంలో సరస్వతి ఆలయ రూపకల్పన చేసి, ఒక రాయిపై చక్రయాత్ర స్థాపన చేసి, సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. శక్తి పీఠాల సందర్శన భాగ్యం.. అష్టాదశ శక్తి పీఠాల సందర్శన ఫలితంగా మనశ్శాంతి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆర్యోక్తి. అటువంటి 18 పీఠాలను స్వయంగా సందర్శించడం నా పూర్వజన్మ సుకృతం. ఒక్కో రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఒక్కోటి, ఒక్కోసారి రెండు-మూడు శక్తి పీఠాలను దర్శించి వచ్చాను. దసరా పండగ నాడు ఈ 18 క్షేత్రాలలో శక్తి పూజ కన్నుల పండగగా జరుగుతుంది. - ఎస్.వి.ఎస్.భగవానులు, విశ్రాంత డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒంగోలు కూర్పు: నిర్మలారెడ్డి -
అహింసా సిల్క్పట్టుపురుగుకు పునర్జన్మ
పట్టువస్త్రం నేయడానికి పట్టుదారం కావాలి... పట్టుదారం పట్టుపురుగు నుంచే రావాలి. ప్రకృతి ఇచ్చిన ఆకులను తిని పెద్దదైన పట్టుపురుగు గూడు కట్టుకుంటే... బతికుండగానే ఆ గూడుతో సహా దాన్ని వేడి వేడి నీళ్లలో వేసి, మరిగించాలి... ఆ వేడికి పట్టుపురుగు చనిపోతేనేం..?! అంతచిన్ని ప్రాణంతో పనేంటి మనకు?! పదిహేనేళ్ల క్రితం వరకు ఇంచుమించు అందరి ఆలోచన ఇదే! కానీ పట్టుపురుగుకూ బతికే స్వేచ్ఛ ఉందని చాటుతూ వచ్చిన ‘అహింసా సిల్క్’ అందరి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. పట్టుకు ప్రాణం ఉందని నిరూపించింది. ‘సృష్టిలో ప్రతి జీవికీ బతికే స్వేచ్ఛ ఉంది. పట్టుపురుగు ఆ స్వేచ్ఛకు మినహాయింపు కాదు కదా!’ అంటారు కుసుమరాజయ్య. పట్టుపురుగును చంపకుండా ‘పట్టుబట్టి’ పట్టువస్త్రాన్ని తయారుచేశారీయన. ఆ పట్టుకు ‘అహింసా సిల్క్’ అని పేరు పెట్టారు. ‘సృష్టిలో ప్రతి జీవికి బతికే స్వేచ్ఛ ఉంది’ అనే ఈ మాట ఎన్నో దేశీ విదేశీ వేదికలపై మరీ మరీ చెప్పారు. తాను రూపొందించిన అహింసా పట్టును చేత పట్టి చూపించారు. పాతికేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయాణానికి పదమూడేళ్లుగా ప్రశంసలు వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ నాణ్యత సదస్సు రాజయ్యను ఆహ్వానించి, అవార్డుతో సత్కరించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భార్యా బిడ్డలతో నివాసం ఉంటున్న రాజయ్య వరంగల్ జిల్లా, నాగారం గ్రామవాసి. హైదరాబాద్‌లోని ఆప్కో సంస్థలో ఉద్యోగం చేసి, ఇటీవలే పదవీ విరమణ పొందిన రాజయ్య ‘అహింసా పట్టు’ అనుభవాలను ఇలా పంచుకున్నారు. చేనేతకు చేయూత.. ‘చదువు పూర్తయ్యాక ఆప్కో సంస్థలో ఉద్యోగిగా చేరాను. అన్ని రకాల వస్త్ర తయారీలను పరిశీలించడంతో పాటు చేనేతకారుల కష్టాలూ గమనించేవాడిని. చేసే పనిలోనే ఏదైనా కొత్తదనం తీసుకువస్తే చేనేతకు మరింత పేరు తీసుకురావచ్చు అనేది నా ఆలోచన. పట్టుపురుగుల పెంపకం కేంద్రాలకు వెళ్లాను. పట్టు వచ్చే పద్ధతుల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. కకూన్స్ (పట్టుపురుగు గూడు)ను వేడినీళ్లలో వేసి మరిగించే పద్ధతులు చూశాక ప్రాణం విలవిల్లాడింది. అన్ని వేల, లక్షల పురుగుల ప్రాణాలు మరిగిపోవడం... కొన్నేళ్ల పాటు ఆ బాధ నన్ను విపరీతంగా వేధించింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. గూడు నుంచి పట్టుపురుగు ఒకసారి బయటకు వస్తే ఆ దారం వస్త్రం నేయడానికి పనికి రాదు. పట్టుదారం కావాలి. కానీ, పట్టుపురుగు చావకూడదు. ఇవే ఆలోచనలతో కొన్నాళ్లు గడిచిపోయాయి. పట్టుపురుగును చంపి తయారుచేసే వస్త్రాన్ని ఆధ్యాత్మికవేత్తలు ధరించేవారు కాదు. పట్టును అహింసావాదు లూ ధరించేలా చేయాలి.. చేనేతకారుడికి సాయమవ్వాలి. ఈ తరహా ఆలోచనకు 1990లో ఒక రూపం వచ్చింది. పట్టుపురుగుకు స్వేచ్ఛ... ‘పట్టుపురుగును చంపకుండా ఎక్కడైనా పట్టు తీసే ప్రక్రియ జరుగుతుందా’ అని దేశమంతా తిరిగాను. అన్ని స్పిన్నింగ్ మిల్స్ వారిని సంప్రదించాను. అంతా ఒకటే పద్ధతి. అహింసా మార్గాన పట్టును తయారుచేసేవారు ఎక్కడా కనిపించలేదు. మన దగ్గర పట్టుదారాన్ని చేత్తోనే తీస్తారు. ఒకసారి పురుగు బయటకు వచ్చాక దారమంతా తెగిపోతుంది. దాంతో వస్త్రాన్ని నేయడం సాధ్యం కాదు. పనికిరాని దారాన్ని తీసేస్తూ, పనికొచ్చే దారాన్ని వేరుచేసే మిషనరీస్ కావాలి. ఇందుకు ఛత్తీస్‌గడ్‌లోని లోహియా గ్రాప్ కంపెనీ వారిని మూడు నెలల పాటు కోరితే, చివరకు దారం తీసివ్వడానికి ఒప్పుకున్నారు. వారికి చిన్న మొత్తంలో కకూన్స్ ఇస్తే సరిపోదు, కనీసం వంద కేజీలైనా ఇవ్వాలి. ఏ నెల జీతం ఆ నెల ఖర్చులకే సరిపోయేది. అందుకని పి.ఎఫ్ డబ్బు 80 వేలు, స్నేహితుల దగ్గర మరో 50 వేల రూపాయలు తీసుకొని కకూన్స్ వంద కేజీలు కొన్నాను. మామూలుగా అయితే ఒక్కో కకూన్ నుంచి దాదాపు వెయ్యి గజాల దారం లభిస్తుంది. కకూన్ నుంచి పురుగు బయటకు వచ్చాక 150 గజాలకు మించదు. పనికిరానిది తీసేయగా వందకేజీలకు పదహారు కేజీల దారం వచ్చింది. దాంతోనే చేనేతకారులచేత మన జాతీయ జెండాను పోలిన మూడురంగుల పట్టువస్త్రాన్ని నేయించాను. అహింసా మార్గంలో జరిపే కృషికి గాంధీజీ మంత్రమైన ‘అహింస’ను ఈ పట్టుకు పేరు పెట్టాను. ఎల్లలు దాటిన కృషి... దేశంలోని పలురాష్ట్రాలలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలో ‘అహింసా సిల్క్’ చోటుచేసుకుంది. రంగుల కలయిక, నాణ్యత, హింసలేని పట్టు... ఎంతోమంది దృష్టిని ఆకట్టుకుంది. కంచి కామాక్షి, పుట్టపర్తి సత్యసాయిబాబా .... దేశంలోని ప్రముఖ దేవాలయాలకు అహింసా పట్టు వెళ్లింది. విదేశాలలో జరిగే ఎగ్జిబిషన్లలో ప్రముఖంగా నిలిచింది. ఇండోనేషియా రాజకీయవేత్త మేఘావతి సుఖర్నోపుత్రి, అవతార్ డెరైక్టర్ కామరూన్ భార్యతో సహా గాంధీజీని తమ వాడు అనుకున్న ప్రతి ఒక్కరూ అహింసా సిల్క్ కావాలనుకున్నారు. మొదట ఇది అయ్యేపని కాదు అన్నవారే తర్వాత నా కృషిని మెచ్చుకున్నారు. అహింసాపట్టుతో ఎన్నో దేశాలు తిరిగాను, ఎంతో మంది ప్రముఖులను కలిశాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను. అయితే, మొదటిసారి అహింసా సిల్క్ మూడు రంగుల వస్త్రాన్ని మా అమ్మనాన్నలకు చూపినప్పుడు, వారి కళ్లలో మెరిసిన గర్వం ఈ జన్మకు సరిపడిన ఆనందాన్ని ఇచ్చింది’ అని చెబుతూ సుతిమెత్తగా ఉన్న అహింసా పట్టు వస్త్రాన్ని బిడ్డలా నిమురుతూ ఆ వస్త్రం తయారీ వెనక చోటుచేసుకున్న పరిణామాలను, అనుభవాలను పంచుకున్నారు కుసుమరాజయ్య. అందరూ పనులు చేస్తారు. కొత్తగా ఆలోచించనవారే విజేతలుగా నిలబడతారు. దాంట్లో సహప్రాణుల పట్ల కరుణ చూపేవారు ప్రత్యేకతను చాటుకుంటారు. వారిలో కుసుమరాజయ్య ముందుంటారు. - నిర్మలారెడ్డి, ఫొటోలు: శివమల్లాల -
నవరాత్రుల్లో...వెలుగుపూల కోలాటం
దేశమంతా ఎదురుచూసే నవరాత్రి సంబరాలు నేటి నుంచే మొదలు. ఈ తొమ్మిది రాత్రులను అత్యంత వైభవంగా మార్చేసి, శక్తిస్వరూపిణి అయిన దుర్గామాతను నృత్యోల్లాసాలతో కొలవడానికి స్త్రీలతో పాటూ పురుషులూ పోటీపడుతుంటారు. ఈ సందర్భంగా గర్బా, దాండియా నృత్యాలుపత్యేక ఆకర్షణగా నిలుస్తుంటే వీటికి మరింత వన్నెలద్దుతున్నవి వస్త్రాలంకరణలే! గుజరాతీల సంప్రదాయ వైభవం తెలుగురాష్ట్రాలలోనూ సందడి చేయడంతో ఇక్కడా గర్బా, దాండియా నృత్యాల ఆనందహేల ప్రతి మదిని తట్టి లేపుతోంది. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల వెలుగుల్లో మరింత దేదీప్యమానంగా సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయే స్త్రీ, పురుషులు ఈ తొమ్మిది రాత్రులకు కొత్త భాష్యం చెప్పనున్నారు. దాండియా, గ ర్బా నృత్యాలలో సందడి చేయడానికి మీ వేషధారణను సరికొత్తగా మార్చుకునే సమయం ఇదే! గర్బా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ‘గర్భ’, ‘దీపం’ అనే సంస్కృత పదాల నుంచి ఈ పేరు పుట్టింది. గర్బా పాటలలో శ్రీకృష్ణుడి లీలను కీర్తిస్తూ, తొమ్మిది మంది దేవతామూర్తులను కొలిచే ప్రక్రియ కనపడుతుంది. ఈ నృత్యం మొట్టమొదట శ్రీకృష్ణుని పట్టమహిషి అయిన రాణీ రుక్మిణీ దేవి ద్వారకలో నవరాత్రి ఉత్సవాల సందర్భం గా చేసిందని అంటారు. అతివలు వలయాకా రంగా చేరి చేతులతో చప్పట్లు తడుతూ తిరుగు తారు. దీనిని దేవతకు ఇచ్చే హారతిగా భావిస్తారు. కోలాటం కర్రలతో స్త్రీ, పురుషులిరువురూ ఆడేది దాండియా! మహిళల అలంకరణ గర్బా, దాండియా నృత్యానికి మహిళలు రంగు రంగులలో లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్‌ను ధరిస్తారు. దీంట్లో ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ.. వంటి కాంతిమంతమైన రంగు దుస్తులను ఎంచుకుంటారు. పూసలు, పెద్ద పెద్ద అద్దాలు, గవ్వలను ఉపయోగిస్తూ చేసిన ఎంబ్రాయిడరీ అంచులతో ఈ దుస్తులను ఆక ర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఇది పూర్తిగా గుజరాతీ సంప్రదాయ కట్టు. దీంతో పాటూ సంప్రదాయ ఆభరణాలైన మెరిసే గాజులు, జుంకాలు, రెండు-మూడు హారాలు, నడుము పట్టీలు, కాళ్లకు గజ్జెలు.. మేని అలంకరణకు ఉపయోగిస్తారు. నవరాత్రులలో మీ అలంకరణ మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే వీటన్నింటి ఎంపిక అవసరం. ప్రయోగం ఎంత సంప్రదాయ దుస్తులైనా మీదైన ప్రత్యేకత మీరు ధరించే దుస్తుల్లో కనబరచాలి. ఇందుకు ప్రసిద్ధ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్ అస్మితా మార్వా, అనితా అరోరా, రాహుల్ మిశ్రా.. వంటి వారి డిజైన్స్‌తో మీ దుస్తుల్లోనూ వైవిధ్యం తీసుకురావచ్చు. కాటన్ ప్రధానం దాండియా ఆటలో చెమట అధికంగా పడుతుంది. ఇలాంటప్పుడు చెమటను పీల్చుకునే దుస్తులు సరైన ఎంపిక. మగవారి ముస్తాబు జీన్స్, టీ షర్ట్స్‌తో విసుగెత్తిపోయిన వారు దాండియా రాత్రులను మరచిపోలేరు. దీనికి కారణం మగవారి వేషధారణ ఎంతో వైవిధ్యంగా, సంప్రదాయబద్ధంగా ఉండటమే! దాండియా ఆటలో మగవారు ‘కెడియు’ అనే సంప్రదాయ దుస్తులను దరిస్తారు. చిన్న కుర్తా, కుచ్చుల బాటమ్, తలపై పెట్టుకునే టోపీ (టర్బన్)తో ప్రత్యేకంగా కనిపిస్తారు. బాందీనీ ప్రింట్ కుర్తాకి అద్దాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. షేర్వాణీ ‘కెడియా’ ధరించ డానికి ఇబ్బంది పడేవారు వదులుగా ఉండే పైజమా, లాల్చీ/ ధోతీ, షేర్వాణీ ధరించవచ్చు. బెనారస్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ చేసిన షేర్వాణీ దాండియాను శోభాయమానం చేస్తుంది. రాజ్‌పుత్ కుర్తా కూడా ఈ వేడుకలో వైవిధ్యం కనబరచడంతో పాటు సంప్రదాయపు కళను ఉట్టిపడేలా చేస్తుంది. మేకప్ ఎంత అలంకరణ అయినా బాగుంటుందని అతిగా మేకప్ చేసుకోకూడదు. దాండియా నృత్యంలో పట్టే చెమట వల్ల మేకప్ ముఖమంతా అలుక్కుపోయే ఆస్కారమూ ఉంటుంది. అసౌకర్యంగానూ ఉంటుంది. అందుకని పెద్దగా మేకప్ లేకుండా కళ్లకు మస్కారా, ఐ షాడో తీర్చిదిద్దుకుంటే చాలు. నుదుటన ఆకట్టుకునే బిందీ, చుబుకం పైన చిన్న కాటుక చుక్కలే వీటికి సింగారం. బరువు తగ్గచ్చు క్రమం తప్పకుండా చేసే యోగా, జిమ్,వ్యాయామాలు విసుగు పుట్టిస్తాయి. అదే దాండియా మనోల్లాసాన్ని కలిగిస్తుంది. నవరాత్రు లకు ముందు నెల రోజుల ముందుగా దాండియా సాధన చేయడం వల్ల దాదాపు 4 కేజీల బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు ఫిట్నెస్ ట్రైనర్లు. గర్బా డ్యాన్స్ వల్ల శరీర మంతా కదులుతుంది. భావోద్వేగా లను అదుపు చేసుకోగలుగుతాం. గంట సేపు చేసే ఈ నృత్యం వల్ల సుమారు 500-700 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. నడుము పై భాగం, పిరుదులు, పాదాలకు మంచి వ్యాయామం అవుతుంది. మనసు, శరీరం ఉత్తేజం పొందుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. బృందావనంలో రాధాకృష్ణుల ప్రణయగీతాల మధురిమలను దాండియా నృత్యం గర్తుచేస్తుంటుంది. ఓ వైపు నృత్యం, సంగీతంతో ఆధ్యాత్మికత ఊపిరిపోసుకుంటుంది. మరోవైపు ఎటు చూసినా ఆనందం తాండవం చేస్తుంది. ఇలాంటి అపురూప సమయాలను పూర్తిగా ఆస్వాదించడానికీ.. శరీరానికి, మనసుకు కొత్త ఉల్లాసాన్ని అందించడానికి ఇప్పుడే సిద్ధం కండి. దాండియా అడుగులు వేయడానికి కోలాటం కర్రలు చేత పట్టండి. సంగీతానికి అనుగుణంగా పాదాలు కదపండి. లయబద్ధమైన నృత్యంలో దుస్తుల మెరుపులలో మైమరచిపోండి. - నిర్మలారెడ్డి -
టూర్ ఏదైనా! జైత్రయాత్ర
‘గో యునెస్కో’ పోటీలో విజేతగా నిలిచిన జైభారతికి పర్యటనలంటే ప్రాణం. ‘సోలో ట్రావెలర్’గా గుర్తింపు పొందిన జైభారతి హైదరాబాద్‌లో ఆర్కిటెక్చర్ వృత్తిలో రాణిస్తున్నారు. మూడు పదుల వయసున్న ఆమె జైత్ర యాత్ర ఆమె మాటల్లోనే... ‘‘నా కూతురు నీలా డేరింగ్‌గా ఉండాలి. ప్రపంచమంతా చుట్టి రావాలి’ అంటుంటాడు మా అన్నయ్య. ఇంట్లో అమ్మానాన్నలదీ ఇదేమాట. వారి ప్రోత్సాహమే నన్ను ‘గో యునెస్కో’ ట్రావెలర్‌ని చేసింది. విహారయాత్ర నుంచి... ఆడపిల్లని అయినా పెంపకంలో ఎక్కడా తేడా చూపించలేదు మా పేరెంట్స్. అన్నయ్య, తమ్ముడితో పాటు నాకూ సైకిల్, బైక్ నేర్పించారు. ఆ విధంగా ఇప్పుడు బైక్రైడింగ్లోనూ ముందంజలో ఉన్నాను. కాలేజీ రోజుల్లో అయితే ఫ్రెండ్స్ తో కలిసి బైక్ మీదే ట్రావెల్ చేసేవాళ్లం. అప్పుడే గ్రూప్ టూర్స్‌ను ఆర్గనైజ్ చేయడంలో పట్టు పెరిగింది. వృత్తిరీత్యా ఆర్కిటెక్చర్ కావడంతో కేరళలోని వాయనాడులో ఒక ఇంటిని డిజైన్ చేయడానికి వెళ్లాను. అటు నుంచి కేరళ అంతా తిరిగాను. ఎక్కడికెళ్లినా వృత్తితో పాటు పర్యటన కూడా ఒక భాగంగా ఉంటుంది. ఒక చోటకి వెళితే అక్కడే ఉండకుండా చుట్టుపక్కల ప్రాంతాలు, కట్టడాలు, అక్కడి ప్రజల జీవనవిధానం తెలుసుకుంటూ ఉంటాను. విజేతగా నిలిపిన ‘గో యునెస్కో...’ రెండేళ్ల క్రితం ఒక రోజు పేపర్లో ‘గో యునెస్కో’కు సంబంధించిన ప్రకటన చూశాను. 2012 వరకు ఉన్న ప్రపంచవారసత్వ జాబితాలో ఉన్న ప్రదేశాలు, కట్టడాలను చూసి రావాలనేది ఒక సవాల్‌తో కూడిన యాడ్ అది. నాకు చాలా ఆసక్తి కలిగింది. అమ్మానాన్నలకు చెప్పాను. వారు ‘సరే’ అన్నారు. యునెస్కో ట్రావెల్ గ్రూప్ గురించి అప్పుడే తెలియడంతో అందులో నేనూ జాయిన్ అయ్యాను. ఈ గ్రూప్‌లో చేరినప్పటికీ నా వీలును బట్టి వారాంతంలో ఒక ప్రాంతానికి మాత్రమే వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాను. కానీ, నెల రోజులకు ఒక ప్లేస్ చూడటమే వీలయ్యేది. అనుకోకుండా ఆఫీస్ మారాల్సి వచ్చింది. కొత్త ఆఫీస్‌లో చేర డానికి 12 రోజుల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ను ట్రావెల్‌కు ఉపయోగించుకున్నాను. ఆ విధంగా సెప్టెంబర్‌లో ఢిల్లీ నుంచి ట్రిప్ మొదలు పెట్టి ఆగ్రా, రిషీకేష్, రాజస్థాన్ల మీదుగా మొత్తం మన దేశంలోని 12 హెరిటేజ్ సైట్స్‌ను చూసొచ్చాను. అదీ ఒక్కదాన్ని. ఆ విధంగా ‘గో యునెస్కో ట్రావెలర్’ అవార్డు తీసుకున్నాను. రైలు..బస్సు.. ఏదైనా..! ఎక్కడికెళ్లినా ఒక చోట విశ్రాంతి తీసుకోవాలి, మరో చోట ఫ్లైట్‌లో అయితేనే చేరుకోగలం.. ఇలాంటివేవీ పట్టించుకోను. రైలు, బస్సు, ఆటో.. ఏదుంటే అది పట్టుకొని ప్రయాణించడమే! ఎక్కువగా రాత్రి సమయాలను ప్రయాణానికి ఎంచుకుంటాను. ఆ విధంగా హోటల్ రూమ్‌లలో ఉండాల్సిన అవసరం తప్పుతుంది. దసరా సెలవుల్లో చెన్నై, దీపావళి సెలవులో ఉత్తర భారతదేశం.. ఇలా దేశంలోని అన్ని ప్రదేశాలను సందర్శించి వచ్చాను. టర్కీకి ఒంటరిగా! ఆ తర్వాత టర్కీ, మలేషియా, హాంగ్కాంగ్లనూ సందర్శించాను. కిందటేడాది టర్కీలో 15 కిలోమీటర్ల రన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. రన్లో పాల్గొనడానికి ఎలాగూ వెళుతున్నాను కాబట్టి యునెస్కో జాబితాలో ఉన్న అక్కడి వారసత్వ ప్రదేశాలన్నీ చూసి రావాలనుకున్నాను. అందుకే మిగతా అందరికంటే 10 రోజుల మందుగానే ఒంటరిగా బయల్దేరాను. ఢిల్లీ నుంచి టర్కీకి ఎక్కువ దూరం ప్రయాణించే విమానాన్ని ఎంచుకున్నాను. ఆ విధంగా ఖర్చు తగ్గింది. టర్కీ చేరుకున్నాక 11 రోజుల్లో ఆ అక్కడి అన్ని వారసత్వ ప్రదేశాలను చుట్టి వచ్చాను. టర్కీలో మన దగ్గర ఉన్నంతగా రైల్వే వ్యవస్థ లేదు. అందుకే అన్ని చోట్లకూ బస్సులలోనే ప్రయాణించాను. టర్కీలో పెద్ద పెద్ద బస్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడే రిఫ్రెష్ అయ్యి, తిరిగి ప్రయాణించేదాన్ని. టికెట్లు కూడా అప్పటికప్పుడే కొనేదాన్ని. సురక్షితంగా ప్రయాణం... అమ్మాయి ఒంటరిగా ప్రయాణించడమా అనేది ఇప్పటికీ మనవాళ్లు విడ్డూరంగా చెప్పుకుంటారు. కానీ ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆలోచనకు ఆడ-మగ తేడాలేదు. ఎక్కడికెళ్లినా ఒక్కదాన్నే! అయితే నేను ఏ ప్రదేశంలో, ఎలా ఉన్నదీ ఎప్పటికప్పుడు ఇంటికి చేరవేస్తుంటాను. ఆ విధంగా ఇంట్లో వారికి ఆందోళన ఉండేది కాదు. వచ్చే నెలలో సతారాలోని కాస్వ్యాలీకి వెళు తున్నాను. పర్యటన ఎప్పటికప్పుడు మనల్ని రీఛార్జ్ చేస్తూనే ఉంటుంది.’ - నిర్మలారెడ్డి ప్లానింగ్ ఉంటే ఖర్చు తక్కువే! ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలంటే లక్షల రూపాయలు ఉండాల్సిన అవసరం లేదు. అవగాహన ఉండి, ఇతరులతో పరిచయాలు పెంచుకుంటే చాలు... ఎంత దూరమైనా హ్యాపీగా ప్రయాణించవచ్చు. దూరప్రాంతాలకు ప్రయాణం అనగానే చాలా మంది ముందుగానే హోటల్స్, ట్రైయిన్స్ బుక్ చేసుకుంటారు. కుటుంబంతో వెళితే అలాంటివి తప్పవు. కానీ ఒంటరిగా వెళితే ఇలాంటివేవీ అవసరం లేదు. నేను ఎక్కడకు వెళ్లినా రాత్రిపూట ప్రయాణాన్ని ఎంచుకునేదాన్ని. దాంట్లో భాగంగా హోటల్స్‌లో ఉండాల్సిన అవసరమే రాలేదు. తప్పదు అనుకున్న చోట మహిళల హాస్టల్స్ గురించి వాకబు చేసి వె ళ్లేదాన్ని. అలాంటి చోట అయితే రోజుకు రూ.500 చెల్లిస్తే సరిపోయేది. అవకాశం ఉన్నంత వరకు ఇక్కడకు వచ్చిన విదేశీయులకు మనం వసతి కల్పించవచ్చు. ఆ విధంగా జపాన్ నుంచి, చైనా నుంచి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు 15 రోజుల పాటు నా వద్ద ఉండి, ఇక్కడి ప్రదేశాలను చూసి వెళ్లారు. నేనూ వారి దేశాల సందర్శనకు వెళ్లినప్పుడు వారి స్నేహితుల ఇళ్లలో ఉన్నాను. దీనివల్ల డబ్బుకే కాదు, భద్రతకూ బెంగ ఉండదు. ప్రపంచాన్ని కొత్త కోణంలో దర్శించడం మొదలుపెడతాం. ఈ విధానం వల్ల మన చుట్టుపక్కలే కాకుండా ప్రపంచంలో ఎంతోమందితో స్నేహసంబంధాలు పెరుగుతాయి. -
‘ప్లస్’ అయ్యే అలంకరణ
వయసు పైబడడం, ఆరోగ్యం, వంశపారంపర్యం, పని ఒత్తిడి... ఇలా రకరకాల కారణాల వల్ల అధిక బరువు ఓ బెడదలా ఇటీవల చాలామందిని వేధిస్తోంది. పెరిగిన బరువు అందానికి ‘మైనస్’ అనుకోవడం కన్నా.. దానినే ‘ప్లస్’గా మార్చుకుంటే మేలు అని భావించేవారి కోసమే ఈ కథనం... సాధారణంగా అన్ని షాపులలో జీరో (0) నుంచి ఫార్టీ (40) సైజ్ లోపు కొలతలలో రకరకాల దుస్తులు లభిస్తున్నాయి. నలభై కన్నా పై కొలతలలో ఉన్నవారిని ‘ప్లస్ సైజ్’ అంటారు. ఈ సైజ్ వారికి డ్రెస్సులు కావాలంటే మాత్రం ‘సారీ, టైలర్‌తో చెప్పి కుట్టించుకోండి..’ అని సలహా ఇస్తుంటారు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకుని సరైన కొలతలలో లేని దుస్తులు తెచ్చుకొని ఇబ్బంది పడటం, టైలర్ సరైన కొలతలలో డ్రెస్ కుట్టకపోవడం, తమ శరీరాకృతికి సరిపడా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, డిజైన్ చేయించుకోవాలో తెలియకపోవడం.. ఇవన్నీ అధికబరువు (ప్లస్ సైజ్) ఉన్నవారి ప్రధాన సమస్యలు. లావుగా ఉన్నా అందంగా, కాలానుగుణంగా వేషధారణ హుందాగా ఉండాలంటే... దుస్తుల ఎంపిక సరిగ్గా ఉండాలి. ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటేమీ జీవనశైలి మరింత సులభంగా, మరింత సుందరంగా మారిపోతుంది. మీ శరీరాకృతి లావుగా ఉంటే... బాధాపడాల్సిన అవసరమే లేదు. ఫ్యాషన్ డిజైనర్లు. ప్లస్ సైజ్ ఉమన్ దుస్తుల ఎంపికకు ఇస్తున్న ఈ సూచనలు పాటించండి... బిగుతుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. చిన్న సైజు, బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. మరీ వదులుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. ‘బాగా వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సన్నగా కనపడతాం’ అనుకోవడం అపోహ. వేలాడుతున్నట్టుగా ఉండే దుస్తులను ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. అధికబరువున్న వారు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్లస్ సైజ్ ఉమన్‌కు డిజైన్ చేసిన బ్రాండెడ్ దుస్తుల్లోనూ అన్నీ ఒకే తరహావి ఉంటాయి. ఒక్కోసారి ఆ డ్రెస్ కొలతలు మీకు నప్పకపోవచ్చు. అందుకని ఎంపిక చేసుకునేటప్పుడు ఒకసారి కొనుగోలు చేసే దుస్తులను వేసుకొని, అద్దంలో చూసుకొని, నప్పితేనే తీసుకోవాలి. లావుగా కనిపించే శరీర భాగాలలో ముదురు రంగులతో కవర్ చేసే డిజైన్లు గల దుస్తులను ఎంపిక చేసుకోవాలి. కాంతిమంతమైన/లేత రంగులకన్నా ఫ్యాషన్‌లో ముదురు రంగులు ఎప్పుడూ ముందుంటాయి. లావుగా ఉన్నవారు వీటిని నిరభ్యంత ధరించవచ్చు. అంతేకాదు ఈ రంగులు అధికబరువును తక్కువగా చూపిస్తాయి. వంగపండు, గోధుమ, బూడిద... రంగువి కూడా ముదురు రంగులలో ఎంపిక చేసుకోవచ్చు. అయితే టాప్ (నడుము పై భాగంలో) కలర్ ముదురు రంగులో ఎంపిక చేసుకుంటే బాటమ్ (నడుము కింది భాగంలో) లేత రంగులో తీసుకోవాలి. అధికబరువు ఉన్నవారు దుస్తులతో ఇంకాస్త బరువును పెంచుకోకూడదు. దుస్తులకు వచ్చే పెద్ద పెద్ద బటన్స్, పెద్ద పాకెట్స్, వెడల్పాటి కుచ్చులు.. ఎదుటివారి దృష్టి పడేలా చేస్తాయి. అందుకని దుస్తులపై డిజైన్స్ ఇలా అన్నీ పెద్ద పెద్దగా ఉండేవి ఎంచుకోకూడదు. ప్యాంట్స్ అయితే బ్యాక్ పాకెట్స్‌పై, టాప్స్ అయితే చేతులు లేని జాకెట్‌పై ఎంబ్రాయిడరీ లేకుండా జాగ్రత్తపడాలి. మీ వార్డ్రోబ్ నుంచితొలగించాల్సినవి..! చాలా పొట్టిగా ఉండే షార్ట్స్ వదులుగా ఉండే ట్రౌజర్స్ పొట్టి లంగాలు (మినీ స్కర్ట్స్) మామ్ జీన్స్ (నడుము, పిరుదుల భాగం ఎక్కువ వదులు ఉండేవి) రిప్డ్ జీన్స్ (అక్కడక్కడా చిరుగులు ఉన్న జీన్ ప్యాంట్స్), కార్గో ప్యాంట్స్ బ్యాగీ జీన్స్ (పూర్తి వదులుగా ఉండేవి) ఫిట్‌గా లేని బ్లేజర్స్ బ్యాగీ స్వెట్స్ పొడవు లంగాలు మెరిసే రాళ్లు, కుందన్స్, చమ్కీతో చేసిన డిజైన్లు గల దుస్తులు ఎక్కువ కుచ్చులు ఉన్న డ్రెస్సులు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న దుస్తులు రంగురంగులుగా ఉండే కౌబాయ్ బూట్లు. ‘ప్లాట్’గా పై నుంచి కిందకు ఒకే విధంగా ఉండేలాంటి దుస్తులు తీసుకోకూడదు. మహిళలు సాధారణం గా తమ వేషధారణ ఒకే రంగు (మ్యాచింగ్)లో ఉండాలనుకుంటారు. మ్యాచింగ్ అధికమైతే ఇంకాస్త లావుగా కనిపిస్తారు. ‘కాంట్రాస్ట్’ (ఒకదానితో ఒకటి పోలిక లేనివి) కలర్స్ దుస్తులు వేసుకుంటే మేలు. ఉదా: స్కర్ట్/ప్యాంట్స్ వేసుకునేవారు అదే రంగు టీ షర్ట్ వేసుకోకూడదు. టీ షర్ట్‌పైన వేసుకునే ఓవర్‌కోట్ స్కర్ట్/ప్యాంట్ ఒకే రంగులో ఉండేలా ఎంపిక చేసుకోవాలి. సైజ్ చార్ట్! ఛాతీ పరిమాణం 41-45, నడుము పరిమాణం 33-37 హిప్ (పిరుదుల)పరిమాణం 43-47 ఉన్నవారు XXSసైజ్ దుస్తులను ... ఛాతీ పరిమాణం 77-83, నడుము 71-78 హిప్ (పిరుదుల)పరిమాణం 80-90 ఉన్నవారు XXLసైజ్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ప్లస్ సైజ్ వారు ఆన్లైన్ చార్ట్‌ను అనుసరించవచ్చు. అలంకరణ అనేది వస్తువుల స్థాయిని పెంచాలి. మీరు లావుగా ఉంటే ధరించే ఆభరణా లు సన్నగా ఉంటే ఏ మాత్రం కనిపించవు. అందుకని మధ్యస్థం- పెద్ద సైజున్నవి ఎంచుకోవాలి. మీ కాళ్లకు తగిన మందపాటి హీల్ ఉన్న చెప్పులు ధరించాలి. అలాగే పెద్ద పర్స్/బ్యాగ్ వెంట తీసుకెళ్లాలి. ఈ తరహా ఇతర అలంకరణ వస్తువులు మిమ్మల్ని సన్నగా చూపిస్తాయి. నోట్: మరీ పెద్ద పెద్దవి కాకుండా... మీరు ఉన్న లావును కొద్దిగా అధిగమించేలా మాత్రమే మీ ఇతర అలంకరణ వస్తువులు ఉండాలనే విషయం మర్చిపోవద్దు. అలంకరణ సమయంలో మీ బరువు, మీ ఎత్తు సైజ్, ఎముక సామర్థ్యం.. ఇవన్నీ దృష్టిలోపెట్టుకోవాలి. మీ వార్డ్రోబ్లోఉండాల్సివి..! వి నెక్ గల తెల్లటి చొక్కా (బటన్ డౌన్ షర్ట్) శరీరాకృతికి సరిగ్గా సరిపడే నలుపు రంగు డ్రెస్. ఫిట్‌గా ఉండే లాంగ్ ప్యాంట్స్ ఫిటెడ్ బ్లేజర్స్ ప్రస్తుత కాలానికి తగ్గ దుస్తులు మీకు మాత్రమే ప్రత్యేకం అనిపించే స్టైల్ దుస్తులు హాఫ్ స్కర్ట్(మోకాళ్ల వరకు ఉండేది) ఎంపిక సరైనది పొట్టను కవర్ చేసే డిజైనర్ దుస్తులు. (వీటి ఎంపికలో డిజైనర్/షాప్/ ఆన్లైన్ సాయం తీసుకోవచ్చు) శరీరాకృతికి సరిగ్గా నప్పేవి, సరైన ఫిట్‌తో ఉన్న లో దుస్తులు బెల్ట్‌లు, ఆభరణాలు, పాదరక్షలు.. వీటితోనూ మీ దుస్తుల్లో కొత్త మార్పులు తీసుకురావచ్చు. దుస్తులు కుట్టించుకోవాలంటే... కుర్తా, టాప్స్ టైలర్‌తో కుట్టించుకునేటప్పుడు ‘సైడ్ ఓపెన్స్’ పిరుదుల పై భాగం వరకు పెట్టించుకోవాలి. దీని వల్ల కూర్చునేటప్పుడు డ్రెస్ ముందు భాగం పొట్టమీదకు రాకుండా ఉంటుంది. వెయిస్ట్ భాగంలో బిగుతుగా ఉండే డ్రెస్ వల్ల మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. జాకెట్టు చేతులు కుచ్చులున్నవి డిజైన్ చేయించుకుంటే చేతులు మరింత లావుగా కనిపిస్తాయి. లావుగా ఉన్నవారికి బ్రాడ్, ఓవర్ నెక్స్ సరిగ్గా నప్పుతాయి. నోట్: లావుగా ఉన్నప్పటికీ పొడవుగా ఉన్నవారు... స్లీవ్స్, ప్యాంట్స్, లెగ్గింగ్స్ సరైన ఫిట్‌తో ఉండేవి తీసుకోవచ్చు. పొట్టిగా ఉంటే నిలువు చారలు ఉన్నవి, విభిన్న రకాల రంగుల్లో ఉన్న డ్రెస్సులను ఎంచుకోవాలి. చీరలు కట్టుకునేవారు కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. 42 - 62 అంగుళాల పరిమాణంలో ఉన్నవారి కోసం సాధారణ దుస్తుల నుంచి పార్టీవేర్ వరకు ప్లస్ సైజ్ స్టోర్లలో అన్ని రకాల బ్రాండ్లలో (టాప్స్, కుర్తీస్, లెగ్గింగ్స్, జీన్స్, టీ షర్ట్స్, పార్టీవేర్, వెస్ట్రన్‌వేర్, ట్రెడిషనల్ వేర్..) నాణ్యమైన దుస్తులు లభిస్తున్నాయి. ఇవన్నీ కాటన్, టెరీకాటన్, సిల్క్, సింథటిక్... మెటీరియల్స్‌లో లభిస్తున్నాయి. - నిర్మలారెడ్డి కర్టెసీ ప్లస్ సైజ్, పంజగుట్ట, హైదరాబాద్ -
మన ఆధ్యాత్మిక రాజధాని
కాశీకి ఇప్పుడు మన రాష్ట్రం నుంచి రైలులో వెళితే (హైదరాబాద్-కాశీకి రైలు మార్గం 1,230 కి.మీ.)ఒకటిన్నరరోజులో చేరుకోవచ్చు. అదే విమానంలో అయితే 3-4 గంటల్లో వెళ్లిపోవచ్చు. రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో కాశీకి వెళ్లి రావడం అంటే పొరుగూరు వెళ్లి వచ్చినంత సులువు. కాని ఒకప్పుడు.. అంటే రెండుమూడు వందల ఏళ్ల క్రితం... కాలినడకన ప్రయాణం కాశీకి పోవటం అంటే కాటికిపోవటంతో సమానమే అనేవారు. అంటే ఆ రోజుల్లో భద్రతలేని కారణంగా కాశీ వెళ్లినవారు క్షేమంగా ఇంటికి చేరేవారు కారు. కానీ, కాశీ పుణ్యరాశి. వరుణ-అసి నదుల సంగమస్థలి. భారతీయులకు అత్యంత పవిత్ర తీర్థస్థానం. కాబట్టి కాశీ వెళ్లి తీరాల్సిందే! కాని వాహనసదుపాయం లేని రోజులవి. కాలినడకనే ప్రయాణం. కొండకోనలు, నదీప్రవాహాలు, దుర్భేద్యమైన అడవులు, క్రూరమృగాలు, దారిదోపిడీలు... అన్నింటినీ దాటుకొని కాశీ చేరేసరికి ఎన్నో గండాలు. అన్నదాన సత్రాలలో భోజనాలు.. లేదంటే ఉపవాసాలు... అడవుల గుండా ప్రయాణించేటప్పుడు కాయగసరే మహాప్రసాదాలు. అందుకే జీవితంలో అన్ని బాధ్యత లూ తీరిన 60 ఏళ్లకు పైబడినవారే కాశీ ప్రయాణమయ్యేవారు. 1800 ప్రాంతంలో! ఏనుగుల వీరాస్వామయ్య, ఆయన బంధుగణం, పరిజను లు సుమారు వందమందితో కలిసి మద్రాసు నుండి బయలుదేరి తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాద్, నాగపూర్, ప్రయాగల మీదుగా కాశీ వెళ్లారు. అప్పటికి రోడ్లు కూడా సరిగా లేవు. ప్రయాణం ఎక్కువగా పల్లకీలు మోసే బోయీల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. యాత్రాఫలాన్ని తనకొకడికే పరిమితం చేసుకోకుండా 40 బిందెల గంగాజలాన్ని 10 గుర్రాల మీద చెన్నైకి పంపించే ఏర్పాటు చేయించాడట. 15 నెలలు సాగిన ఆ ప్రయాణపు రోజులను ‘కాశీయాత్రా చరిత్ర’గా గ్రంథస్థం చేశారు. ఆ తరువాతి సంగతులకొస్తే- ఇప్పటికి సరిగ్గా వందేళ క్రితం రచయిత చెళ్లపిళ్లవెంకటశాస్త్రీ కాశీ వెళ్లిన తన అనుభవాలను పుస్తకంగా తీసుకొచ్చారు. ఐతే ఈయన కాలానికి పరిస్థితులలో మార్పులు వచ్చాయి. బ్రిటీషువారి హయంలో రైలు-పడవలు వంటి ప్రయాణ సాధనాలు ఉన్నాయి. గంగానదికి వరదలు వస్తే బల్లకట్టువేసి బండ్లు దాటించేవారనీ, ఎద్దు లు నడవకపోతే బండివాడే కాడి భుజానికి ఎత్తుకునేవాడ నీ, మిగతావారు కాలినడకన సాగేవారని.. తెలియజేశారు. తిరిగొస్తే పండగే! కాశీ వెళ్లిన వారు తిరిగి ఊరు చేరుకున్నారంటే.. వారిని సాక్షాత్తు భగవత్స్వరూపులుగా భావించేవారు. మేళతాళాలతో ఎదురెళ్లి, ఇంటికి తీసుకెళ్లి, పెద్ద పండగ చేసుకునేవారు. వెళ్లిన వారు తమ ప్రయాణపు అనుభవాలను చెబుతుంటే ఆ అనుభూతిలో తామూ ప్రయాణించేవారు. ఆ రోజుల్లో కాశీ చేరాలనే సంకల్పం రైలు, విమాన ప్రయాణాలను మించిన ధైర్యాన్ని కలిగించేది. ఇప్పటికీ కొంతమంది కాలినడకన కాశీ చేరేవారున్నారు. అయితే నేడు వారి ప్రయాణానికి భరోసానిచ్చే అనేక మార్గాలున్నాయి. - నిర్మలారెడ్డి -
పెళ్లి కూతురికి పువ్వుల శోభ
పుట్టినింటి బంగారుతల్లి, మెట్టినింట సిరులరాణిగా, మారే శుభతరుణాన సిరిమల్లెలదే ప్రధాన అలంకరణ. ముద్దబంతిలాంటి మోము ,ముచ్చటైన వేడుకకు మురిసేవేళ గులాబీలదే అసలైన అలంకరణ. ఇంతుల నాజూకు చేతుల్లో వరసలుగా రూపుకట్టిన చామంతులదే చూడచక్కని అలంకరణ. మల్లెలు, గులాబీలు, చామంతులు.. పూలతేరులా వధువు మేనికి సింగారంలా మారితే...‘ఎంతందంగా ఉన్నావే..’ అంటూ ఆమె నవ్వులతో పోటీపడటమే సిసలైన అలంకరణ. వివాహ వేడుకలలో పువ్వుల సుగంధాలదే పెద్దపీట. పెళ్లికి ముందు జరిపే సంగీత్, మెహిందీ సంబరాల్లో బంగార ం కన్నా వధువుకు పువ్వులనే ఆభరణాలుగా అలంకరించడం ట్రెండ్‌గా మారుతోంది. వధువుతో పాటూ వేడుకలో పాల్గొనే ప్రతి పడతీ పువ్వుల అలంకరణ పట్ల మక్కువ చూపుతోంది. ఉత్తరభారతదేశంలో మొదలైన ఈ కళ ఇప్పుడు దక్షిణభారతదేశపు తెలుగింటి లోగిళ్లలోనూ సందడి చేస్తోంది. పువ్వుల ఎంపిక: బంతి, చామంతి, లిల్లీ, మల్లెమొగ్గలు, గులాబీలు.. ఏ పువ్వులనైనా ఆభరణాల అలంకరణకు ఎంచుకోవచ్చు. మెడలో హారాలు, చెవి లోలాకులు, వేళ్లకు ఉంగరాలు, కాళ్లపట్టీలు, గాజులు.. అన్నీ పువ్వులే! అయితే ధరించిన దుస్తుల రంగుకు సూటయ్యేలా పువ్వుల ఎంపిక ఉండాలి. ఆభరణాల తయారీకి ఎంపిక... ఎంపికచేసుకున్న పువ్వులు, కుందన్స్ పొదిగిన లాకెట్స్, చమ్కీ, పూసలు, ముత్యాలు, బంగారు వర్ణపు లేసు, ఇతర ఆభరణాలు... ఇవన్నీ జతచేర్చడానికి సూది-దారం. మనిషి రూపురేఖలను బట్టి ఎంత పరిమాణంలో ఆభరణాలను తయారు చేయాలో ముందుగా కొలతలు తీసుకోవాలి. రకరకాల రూపాల్లో పువ్వుల ఆభరణాలను నచ్చిన విధంగా తయారు చేసుకున్నాక, వాటిని లేసుకు గుచ్చాలి. ఆ పైన నచ్చిన లాకెట్స్ జత చేయాలి. చిన్న చిన్న లాకెట్స్లా రూపొందించిన పువ్వులను ఇతర ఆభరణాలకూ అమర్చుకోవచ్చు. పువ్వుల ఆభరణాలకు విడిగా హుక్స్ అమర్చుకోవచ్చు. లేదా ఎలాంటి ఆభరణాలు అవసరం లేకుండా జరీ దారాలతోనూ కట్టేసుకోవచ్చు. నోట్: పువ్వుల ఆభరణాలు త్వరగా వాడిపోకుండా తయారీలో మొగ్గలు ఎక్కువ ఉపయోగించాలి. చల్లదనం ఉంటే పువ్వులు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. మాఘమాసం పెళ్లి పందిళ్లు పువ్వుల అలంకరణతో మెరిసిపోతే... అతివల నగుమోము ఇలా పువ్వుల ఆభరణాల మధ్య మురిసిపోతుంది. - నిర్మలారెడ్డి మోడల్: గ్రీష్మ, ఫొటోలు: శివమల్లాల - కల్పన పువ్వుల ఆభరణాల నిపుణురాలు www.pellipoolajada.com -
చల్లచల్లని కూల్ కూల్..
‘ఈసారి వేసవి ముందే వచ్చేస్తోంది. ఫిబ్రవరి తొలివారానికే పెరిగిన ఉష్ణోగ్రతలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఓ వైపు ఎండవేడి, ఉక్కపోత భరించలేకపోతుంటే మరోవైపు సంప్రదాయదుస్తులు ఊపిరాడనివ్వడం లేదు’ అంటూ వాపోయేవారికి చల్ల చల్లగా కూల్ కూల్‌గా ‘సమ్మర్వేర్’ ఆహ్వానం పలుకుతోంది. చల్లచల్లని ఫ్యాబ్రిక్: సింథటిక్ దుస్తులు ధరిస్తే వేడికి చికాకు కలుగుతుంది. చర్మం మీద దద్దుర్లు వస్తాయి. అందుకని చర్మానికి సౌకర్యంగా ఉండేవి, వీలైనంతవరకు ప్రకృతి సిద్ధమైన రంగులు, ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటే మేలు. కలంకారీ, మంగళగిరి, ప్లెయిన్ మల్ మల్, ప్రింటెడ్ మల్ మల్, కోరా, ఛీజ్ కాటన్, ఖాదీ కాటన్లు... తక్కువ రేటుకే లభిస్తాయి. ఇవి చర్మానికి సౌకర్యంగానూ ఉంటాయి. వీటితో వదులుగా ఉండేలా నచ్చినట్టు దుస్తులను డిజైన్ చేసుకోవచ్చు. లేదా ఈ ఫ్యాబ్రిక్‌తో ఉన్న రెడీమేడ్ దుస్తులను కొనుగోలు చేయవచ్చు. కాలానుగుణంగా దుస్తులను ధరించడంలో భారతీయులు ఏ మాత్రం ఆసక్తి చూపరంటూ విదేశీయులు విమర్శ చేస్తుంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. అయితే మన చర్మ రంగు, శరీరాకృతి, వాతావరణం, సంప్రదాయాలు.. ఇవన్నీకురచ దుస్తులు ధరించడానికి సహకరించవు. అయితే ఆధునికపు హంగులతో పాటు సౌకర్యాలను కోరుకునే నేటికాలపు మహిళలు, కాలేజీ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందిన వేసవి దుస్తులు ఇప్పటికే మార్కెట్లో ప్రత్యేక అమ్మకాలకు వచ్చి కనువిందు చేస్తున్నాయి. అయితే వాటి ఎంపికలోనే ఎవరికి వారు తమదైన ముద్ర చూపించాలి. లేత రంగులు... ధరించిన దుస్తుల రంగు గాడీగా ఉంటే బయట వేడి మరికాస్త పెరిగిందేమో అనిపిస్తుంటుంది. అందుకని లేత రంగులను ఎంచుకోవాలి. అంటే ఆకుపచ్చను ఇష్టపడే వారు లేత ఆకు పచ్చ, పసుపును ఇష్టపడేవారు లేత పసుపు, ఎరుపు అయితే లైట్ ఆరెంజ్, బ్లూ అయితే లైట్ బ్లూ... ఇలా ఎంపిక చేసుకోవచ్చు. నూలుతో ఆధునికం: నూలు వస్త్రంతో ఆధునిక, సంప్రదాయ తరహా రెండువిధాల దుస్తులనూ తయారు చేయించుకోవచ్చు. సల్వార్ కమీజులను ఏ నూలు వస్త్రంతో అయినా కుట్టించుకోవచ్చు. అనార్కలీ అయితే ఫ్లెయిర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఛీజ్, మల్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. పాశ్చాత్య దుస్తులైన గౌన్లను కలంకారీ, ఖాదీ కాటన్‌తో కుట్టించుకుంటే లుక్ స్టైలిష్‌గా మారిపోతుంది. స్కర్ట్స్ కోసం లినెన్, ఖాదీని వాడుకోవచ్చు. లినెన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఖరీదులోనూ లభిస్తుంది. దీనితో కుర్తీలు, ట్రౌజర్లను డిజైన్ చేసుకోవచ్చు. ఆఫీసుకు వేసుకెళ్లడానికి లినెన్ ట్రౌజర్లు, లినెన్ షర్ట్స్, షార్ట్స్ డిజైన్ చేయించుకోవచ్చు. అయితే ఏ తరహా దుస్తులైనా పగటి పూట సాదాగా ఉండే లేత రంగులు గలవి, సాయంకాలం ప్రింట్లు ఉన్న దుస్తులను ఎంచుకోవాలి. లేత రంగుల గౌనులు వేసవి ప్రత్యేకం. ఇలాంటప్పుడు కాంట్రాస్ట్ బెల్ట్ వాడితే స్టైలిష్‌గా కనిపిస్తారు. చమట, ఉక్కపోతల బాధలేకుండా లాంగ్ కాటన్ స్కర్ట. ఈ వేసవికి మీ వార్డరోబ్లో ఉండాల్సినదుస్తులు: పలాజో ప్యాంట్స్, గౌన్లు, షార్ట్స, స్కర్టలు, కెప్రిస్... కాటన్ కార్గో కెప్రిస్! వదులుగా, మోకాళ్ల వరకు ఉండే కెప్రిస్ వేసవి వేడిని దూరం చేస్తుంది. సౌకర్యంగానూ, ఆధునికంగానూ ఉంటుంది. వేసవి ఉక్కపోతకు చెక్ పెట్టాలంటే వార్డరోబ్లో స్కర్టలా ఉండే పలాజో ప్యాంట్స్ ఉండాల్సిందే! కురచ దుస్తులు ధరించలేం కదా అని ఇబ్బందిపడేవారికి ఈ ప్యాంట్స్ మంచి ఎంపిక. పొట్టివి, పొడవైన స్కర్టలు, గౌనులు అనుకూలమైన ఎంపిక. నిర్వహణ: నిర్మలారెడ్డి -
బాధ్యతలే సంతోషాలు సర్దుబాట్లే సంబరాలు!
పుట్టింట్లో చిన్న కూతురు, మెట్టినింట్లో పెద్ద కోడలు! ఎలా ఉంది టైటిల్? సౌమ్యంగా, సంప్రదాయంగా ఉంది. మరి కథో? దశరథే రాయాలి. మాటలు? అవి కూడా ఆయనే. స్క్రీన్‌ప్లే, డెరైక్షన్? ఇక అడక్కండి. దశరథ్ మాత్రమే చేయగలరు ఇవన్నీ. బహుశా ఆయనకు ఐడియా వచ్చి వుండదు కానీ... దాంపత్యబంధంపై ఒక చక్కటి సినిమా తీయడానికి కావలసిన కథ, మాటలు, మలుపులు... సర్వం... వాళ్ల పెళ్లిపుస్తకంలోనే ఉన్నాయి! సౌమ్య, దశరథ్ భార్యాభర్తలు. కుటుంబ అనుబంధాలకు వారధులు. వారి వైవాహిక జీవితంలోని బాధ్యతల సంతోషాలు, సర్దుబాట్ల సంబరాలే... ఈవారం ‘మనసే జతగా...’ కొండపల్లి దశరథ్కుమార్గా కంటే డెరైక్టర్ దశరథ్‌గా ఆయన సుపరిచితులు. కుటుంబంలో ప్రేమతో ‘సంతోషం’ నింపడం ఎలాగో తెలిసిన వ్యక్తి. ప్రశాంతంగా ఉండడమే తనకు ‘సంబరం’ అని చెప్పే ఈ డెరైక్టర్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’గా బయటివారికంటే ఇంట్లో వారి చేత కితాబులు అందుకుంటే చాలు అని హాయిగా నవ్వేస్తారు. ఆయన నవ్వులతో భార్య శేషసౌమ్య జతకలుపుతారు. తమ అనుబంధం గురించి వీరేమంటున్నారంటే...! రెండు కుటుంబాల బంధం పెళ్లంటే ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కాదు రెండు కుటుంబాలకు సంబంధించింది అంటారు దశరథ్. అందుకేనేమో అత్తమామల చేత ‘మా పెద్ద కొడుకు’ అనిపించుకునేంత ఆత్మీయతను దశరథ్ పెంచుకుంటే, ‘వదిన మా అమ్మ’ అనిపించేటంత ఆప్యాయతను శేషసౌమ్య పొందారనిపించింది వీరి మాటల్లో! ‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! డిగ్రీ చదివాను. పుట్టింట్లో చిన్నకూతురుని. అత్తింట్లో పెద్దకోడలిని. అల్లుడి హోదా కోసం, అత్తింటి మర్యాదల కోసం ఆశించరు ఈయన. అమ్మవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా వారికి సపోర్ట్‌గా ఉంటారు. అందుకే ఈయన అంటే మా అమ్మానాన్నలకు అమితమైన ఇష్టం... అని ఆమె చెబుతుంటే అంతే సౌమ్యంగా నవ్వుతూ తన అభిప్రాయాలను తెలిపారు దశరథ్- ‘మేం ముగ్గురన్నదమ్ములం. మా బాల్యంలోనే అమ్మనాన్నలు చనిపోయారు. ఎలాగో‘లా’ చదివాను. తర్వాత సినిమా రంగంలోకి వచ్చాను. బంధువుల ద్వారా సౌమ్య సంబంధం వచ్చినప్పుడు, మొదటి చూపులోనే నచ్చింది. అప్పుడే సౌమ్యకు, తన తల్లిదండ్రులకు ఒకే మాట చెప్పాను ‘నాకు ఇద్దరు తమ్ముళ్లు. వారు జీవితంలో స్థిరపడేంతవరకు నా దగ్గరే ఉంటారు. వదినగానే కాదు తల్లిగానూ వారి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని, సౌమ్య ‘సరే’ అనడంతో మా పెళ్లి నవంబర్ 13, 2005లో అయ్యింది. ఆ తర్వాత ఈ ఏడేళ్లలో ఇద్దరు తమ్ముళ్ల పెళ్లిళ్ళు అయ్యాయి. వారూ స్థిరపడ్డారు. మా ఇంట అడుగుపెట్టిన నాటి నుంచి మరుదుల పెళ్లిళ్ళ బాధ్యతలు దగ్గరుండి చూసుకోవడం, ఇంటిని చక్కదిద్దుకోవడంలో ఎక్కడా ఏ లోపమూ రానివ్వలేదు సౌమ్య. అందుకే నేను నా పని మీద దృష్టిపెట్టగలుగుతున్నాను’ అన్నారు ఈ నంది అవార్డు గ్రహీత. హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటున్న వీరికి కార్తీక, షణ్ముఖప్రియ ఇద్దరు కూతుళ్లు. మొదటి అడుగు ‘శుభవేళ’ భార్యగానే కాదు ఇద్దరు మరుదులకు తల్లి స్థానంలో ఉండి బాధ్యతలు నిర్వర్తించాలి. అత్తమామలు లేని ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టినప్పుడు తనలో వచ్చిన ఆందోళన ఎలా సద్దుమణిగిందో సౌమ్య చెబుతూ - ‘ముందు ఆశ్చర్యపోయాను. ఆడవారు లేరు అంటే నమ్మలేనంత నీటుగా, పద్ధతిగా ఉంది ఇల్లు. వీరికి వంట దగ్గర నుంచి అన్ని పనులు వచ్చు అని తర్వాత అర్థమైంది. ఎవరినీ నొప్పించని స్వభావాలు. పరిస్థితులు త్వరగానే అర్థమయ్యాయి. వాటికి తగ్గట్టుగా నేనే మార్పులు చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ మధ్యే చిన్న మరిదికి కూడా పెళ్లైంది. తను వేరు కాపురం పెట్టాడు’ అని ఆమె అంటుండగా దశరథ్ మాట్లాడుతూ - ‘మేం ముగ్గురం మాకు మేమే ఒక రూల్ పెట్టుకున్నాం. పెళ్లిళ్ళు అయ్యాక అందరం ఒకే చోట ఉంటే ఏవో మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. వాటి కారణంగా విడిపోకుండా... వేరుగా ఉంటూనే ఒకరిగా ఉండాలి... అని. అలా విడిగా ఉంటూనే కలుస్తున్నాం’ అన్నారు. ఒకే స్వభావాలు.... సినీదర్శకుని ఇల్లు అంటే కథలపై కసరత్తులు ఉంటాయి. కొన్ని ‘స్వగతాలు’ ఉంటాయి. ఇంకొన్ని సంభాషణలు ఉంటాయి. కాని, ‘మా ఇంట్లో సినిమాల గురించి అసలు ప్రస్తావనే ఉండదు’ అంటారు సౌమ్య. ‘షూటింగ్ స్పాట్‌కి ఈవిడ ఇంతవరకు రాలేదు. ఆ ఆసక్తీ చూపలేదు. కొత్తవాళ్లు, హడావుడి ఉన్న చోటికి వెళ్లడానికి అసలు ఇష్టపడదు. రెస్టారెంట్కైనా సరే ప్రశాంతంగా ఉండే వాతావరణం కావాలి. నాదీ అలాంటి స్వభావమే! ప్రశాంతతను ఎక్కువ కోరుకుంటాం. పెళ్లిరోజులు, పుట్టిన రోజులు ఆడంబరంగా జరుపుకోవడానికి ఇష్టపడం. మా అమ్మాయి మొదటి పుట్టినరోజు కూడా ఎంత ఖర్చు అవుతుందో ఒక అంచనా వేసుకొని, అంత మొత్తాన్ని ఒక హోమ్‌కి విరాళంగా ఇచ్చేశాం’ అంటూ తమ స్వభావాలను వెలిబుచ్చారు దశరథ్! ‘నువ్వు నేను’ అనే మాటకు దూరం... ‘కాపురంలో చిన్న చిన్న గొడవలు, మాటపట్టింపులు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. మళ్లీ ఇద్దరి మధ్య సఖ్యతను తెచ్చుకోవాలి. మా ఇద్దరిలో నేను టైమ్ సరిగ్గా కేటాయించను అని తను, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు అని నేను అనుకుంటూనే ఉంటాం. పిల్లల విషయంలోనూ కొన్ని చికాకులు చోటుచేసుకుంటూనే ఉంటాయి’ అని దశరథ్ చెబుతుంటే ‘దంపతుల మధ్య అనురాగం ఉండాలి, అహం ఉండకూడదు. మా ఇద్దరి మధ్యా అహానికి తావు ఉండదు. కాబట్టి ‘నువ్వు -నేను’ అనుకున్న సందర్భమే రాలేదు’ అన్నారు సౌమ్య. పెళ్లంటే భార్య, భర్త మాత్రమే కాదు రెండు కుటుంబాలు ఒక కుటుంబంగా మారడం. అన్నదమ్ములు, తోడికోడళ్లు, బావమరుదులు, అత్తమామలు... ఒకరికొకరు అభిమానంగా ఉంటూ, ఆత్మీయంగా ఉండడం. ఆ సంతోషాల మధ్య తమ సంతోషాన్ని వెదుక్కోవడం. సంబరంగా జీవితాన్ని గడపడం. ఈ పదాలకు సరైన అర్థంలా అనిపించారు వీరు. - నిర్మలారెడ్డి పేరుకు తగ్గట్టే సౌమ్యంగా ఉంటుంది. బంధువులతో కలివిడిగా ఉండటం, మరుదుల పెళ్లిళ్ళ బాధ్యతలు దగ్గరుండి చూసుకోవడం, ఇంటిని చక్కదిద్దుకోవడం...లో ఎక్కడా ఏ లోపమూ రానివ్వలేదు. అందుకే నేను నా పని మీద పూర్తి దృష్టిపెట్ట గలుగుతున్నాను. - దశరథ్ అమ్మవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద కొడుకుగా ఈయన వారికి సపోర్ట్‌గా ఉంటారు. అల్లుడి హోదా కోసం, అత్తింటి మర్యాదల కోసం ఆశించరు. స్నేహంగా కలిసిపోతారు. - శేషసౌమ్య్చ