దేశమంతా ఎదురుచూసే నవరాత్రి సంబరాలు నేటి నుంచే మొదలు. ఈ తొమ్మిది రాత్రులను అత్యంత వైభవంగా మార్చేసి, శక్తిస్వరూపిణి అయిన దుర్గామాతను నృత్యోల్లాసాలతో కొలవడానికి స్త్రీలతో పాటూ పురుషులూ పోటీపడుతుంటారు. ఈ సందర్భంగా గర్బా, దాండియా నృత్యాలుపత్యేక ఆకర్షణగా నిలుస్తుంటే వీటికి మరింత వన్నెలద్దుతున్నవి వస్త్రాలంకరణలే!
గుజరాతీల సంప్రదాయ వైభవం తెలుగురాష్ట్రాలలోనూ సందడి చేయడంతో ఇక్కడా గర్బా, దాండియా నృత్యాల ఆనందహేల ప్రతి మదిని తట్టి లేపుతోంది. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల వెలుగుల్లో మరింత దేదీప్యమానంగా సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయే స్త్రీ, పురుషులు ఈ తొమ్మిది రాత్రులకు కొత్త భాష్యం చెప్పనున్నారు. దాండియా, గ ర్బా నృత్యాలలో సందడి చేయడానికి మీ వేషధారణను సరికొత్తగా మార్చుకునే సమయం ఇదే!
గర్బా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ‘గర్భ’, ‘దీపం’ అనే సంస్కృత పదాల నుంచి ఈ పేరు పుట్టింది. గర్బా పాటలలో శ్రీకృష్ణుడి లీలను కీర్తిస్తూ, తొమ్మిది మంది దేవతామూర్తులను కొలిచే ప్రక్రియ కనపడుతుంది. ఈ నృత్యం మొట్టమొదట శ్రీకృష్ణుని పట్టమహిషి అయిన రాణీ రుక్మిణీ దేవి ద్వారకలో నవరాత్రి ఉత్సవాల సందర్భం గా చేసిందని అంటారు. అతివలు వలయాకా రంగా చేరి చేతులతో చప్పట్లు తడుతూ తిరుగు తారు. దీనిని దేవతకు ఇచ్చే హారతిగా భావిస్తారు. కోలాటం కర్రలతో స్త్రీ, పురుషులిరువురూ ఆడేది దాండియా!
మహిళల అలంకరణ
గర్బా, దాండియా నృత్యానికి మహిళలు రంగు రంగులలో లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్‌ను ధరిస్తారు. దీంట్లో ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ.. వంటి కాంతిమంతమైన రంగు దుస్తులను ఎంచుకుంటారు. పూసలు, పెద్ద పెద్ద అద్దాలు, గవ్వలను ఉపయోగిస్తూ చేసిన ఎంబ్రాయిడరీ అంచులతో ఈ దుస్తులను ఆక ర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఇది పూర్తిగా గుజరాతీ సంప్రదాయ కట్టు. దీంతో పాటూ సంప్రదాయ ఆభరణాలైన మెరిసే గాజులు, జుంకాలు, రెండు-మూడు హారాలు, నడుము పట్టీలు, కాళ్లకు గజ్జెలు.. మేని అలంకరణకు ఉపయోగిస్తారు. నవరాత్రులలో మీ అలంకరణ మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే వీటన్నింటి ఎంపిక అవసరం.
ప్రయోగం
ఎంత సంప్రదాయ దుస్తులైనా మీదైన ప్రత్యేకత మీరు ధరించే దుస్తుల్లో కనబరచాలి. ఇందుకు ప్రసిద్ధ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్ అస్మితా మార్వా, అనితా అరోరా, రాహుల్ మిశ్రా.. వంటి వారి డిజైన్స్‌తో మీ దుస్తుల్లోనూ వైవిధ్యం తీసుకురావచ్చు.
కాటన్ ప్రధానం
దాండియా ఆటలో చెమట అధికంగా పడుతుంది. ఇలాంటప్పుడు చెమటను పీల్చుకునే దుస్తులు సరైన ఎంపిక.
మగవారి ముస్తాబు
జీన్స్, టీ షర్ట్స్‌తో విసుగెత్తిపోయిన వారు దాండియా రాత్రులను మరచిపోలేరు. దీనికి కారణం మగవారి వేషధారణ ఎంతో వైవిధ్యంగా, సంప్రదాయబద్ధంగా ఉండటమే! దాండియా ఆటలో మగవారు ‘కెడియు’ అనే సంప్రదాయ దుస్తులను దరిస్తారు. చిన్న కుర్తా, కుచ్చుల బాటమ్, తలపై పెట్టుకునే టోపీ (టర్బన్)తో ప్రత్యేకంగా కనిపిస్తారు. బాందీనీ ప్రింట్ కుర్తాకి అద్దాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు.
షేర్వాణీ
‘కెడియా’ ధరించ డానికి ఇబ్బంది పడేవారు వదులుగా ఉండే పైజమా, లాల్చీ/ ధోతీ, షేర్వాణీ ధరించవచ్చు. బెనారస్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ చేసిన షేర్వాణీ దాండియాను శోభాయమానం చేస్తుంది. రాజ్‌పుత్ కుర్తా కూడా ఈ వేడుకలో వైవిధ్యం కనబరచడంతో పాటు సంప్రదాయపు కళను ఉట్టిపడేలా చేస్తుంది.
మేకప్
ఎంత అలంకరణ అయినా బాగుంటుందని అతిగా మేకప్ చేసుకోకూడదు. దాండియా నృత్యంలో పట్టే చెమట వల్ల మేకప్ ముఖమంతా అలుక్కుపోయే ఆస్కారమూ ఉంటుంది. అసౌకర్యంగానూ ఉంటుంది. అందుకని పెద్దగా మేకప్ లేకుండా కళ్లకు మస్కారా, ఐ షాడో తీర్చిదిద్దుకుంటే చాలు. నుదుటన ఆకట్టుకునే బిందీ, చుబుకం పైన చిన్న కాటుక చుక్కలే వీటికి సింగారం.
బరువు తగ్గచ్చు
క్రమం తప్పకుండా చేసే యోగా, జిమ్,వ్యాయామాలు విసుగు పుట్టిస్తాయి. అదే దాండియా మనోల్లాసాన్ని కలిగిస్తుంది. నవరాత్రు లకు ముందు నెల రోజుల ముందుగా దాండియా సాధన చేయడం వల్ల దాదాపు 4 కేజీల బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్లు. గర్బా డ్యాన్స్ వల్ల శరీర మంతా కదులుతుంది. భావోద్వేగా లను అదుపు చేసుకోగలుగుతాం. గంట సేపు చేసే ఈ నృత్యం వల్ల సుమారు 500-700 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. నడుము పై భాగం, పిరుదులు, పాదాలకు మంచి వ్యాయామం అవుతుంది. మనసు, శరీరం ఉత్తేజం పొందుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది.
బృందావనంలో రాధాకృష్ణుల ప్రణయగీతాల మధురిమలను దాండియా నృత్యం గర్తుచేస్తుంటుంది. ఓ వైపు నృత్యం, సంగీతంతో ఆధ్యాత్మికత ఊపిరిపోసుకుంటుంది. మరోవైపు ఎటు చూసినా ఆనందం తాండవం చేస్తుంది. ఇలాంటి అపురూప సమయాలను పూర్తిగా ఆస్వాదించడానికీ.. శరీరానికి, మనసుకు కొత్త ఉల్లాసాన్ని అందించడానికి ఇప్పుడే సిద్ధం కండి. దాండియా అడుగులు వేయడానికి కోలాటం కర్రలు చేత పట్టండి. సంగీతానికి అనుగుణంగా పాదాలు కదపండి. లయబద్ధమైన నృత్యంలో దుస్తుల మెరుపులలో మైమరచిపోండి.
- నిర్మలారెడ్డి
నవరాత్రుల్లో...వెలుగుపూల కోలాటం
Published Wed, Sep 24 2014 10:19 PM | Last Updated on Sat, Oct 20 2018 4:29 PM
Advertisement