దేశవ్యాప్తంగా ప్రస్తుతం దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా జరుగుతుండటం విశేషం. నవరాత్రులలో గుజరాత్‌లో నిర్వహించే గర్బా నృత్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో యువతతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికలపై దాండియా ఆడుతున్నారు.
నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌లో జరుగుతున్న వేడుకల్లో గుండెపోటు కేసులు అత్యధికంగా వెలుగు చూస్తున్నాయి. గడచిన 24 గంటల్లో గర్బా నృత్యం చేస్తూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రులలో ఇప్పటివరకూ గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి అత్యవసర అంబులెన్స్‌లకు 521 కాల్స్ వచ్చాయి. నవరాత్రి వేడుకల్లో గుజరాత్‌లో ఒక్కసారిగా గుండెపోటు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా యువత గుండెపోటుకు గురవుతోంది. రాజ్‌కోట్‌లో 28 ఏళ్ల యువకుడు గర్బా నృత్యం చేస్తూ, గుండెపోటుకు గురై మృతి చెందాడు. రాయరోడ్డులోని ఓ బిల్డర్‌కు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్యులు ఆ బిల్డర్ ప్రాణాలను కాపాడలేకపోయారు. అహ్మదాబాద్‌లోని హతీజన్‌లో గర్బా నృత్యం చేస్తున్న సమయంలో ఒక యువకుడు మృతిచెందాడు. ద్వారక, గ్రేటర్ అంబాలా, రాంనగర్‌లో ముగ్గురు యువకులు హఠాన్మరణం చెందారు.
సూరత్‌లోనూ గత 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో కన్నుమూశారు. వడోదరలోని హర్ని ప్రాంతంలో గర్బా ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. దభోయ్‌లో కూడా 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. నవ్‌సారిలో ఒక యువకుడు గర్బా నృత్యంలో పాల్గొన్న అనంతరం గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అమ్రేలి, జామ్‌నగర్‌లో ఇద్దరు చొప్పున, ద్వారకలో ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించారు. అమ్రేలికి చెందిన దినేష్ షియాల్ (23) నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంలో మృతి చెందాడు. నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్న యువతలో గుండెపోటు సమస్య పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
ఇది కూడా చదవండి: పుల్ అండ్ పుష్ ట్రైన్ అంటే ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment