గుజరాత్‌లో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల గర్బా ఈవెంట్‌లలో పాల్గొన్నవారిలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన గడచిన 24 గంటల్లో చోటుచేసుకుంది. బాధితుల్లో యువకులు మొదలుకొని 50 ఏళ్లు పైబడిన వారి వరకు ఉన్నారు. వీరిలో అత్యంత పిన్న వయస్కుడు దభోయికి చెందిన 13 ఏళ్ల బాలుడు. శుక్రవారం అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడు కూడా గర్బా ఆడుతూ మృతి చెందాడు. రాష్ట్రంలో ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయి
గర్బా అనేది ఒక తరహా నృత్య రూపం. దీనిలో సామూహికంగా డాన్స్ చేస్తారు. అయితే ఈ విధంగా డ్యాన్స్ చేసేటప్పుడు శారీరక పరిమితికి మించి నృత్యం చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధికసమయం నృత్యం చేయడం వలన గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. నిజానికి అధికంగా నృత్యం చేసినప్పుడు, అది శరీరంపై, ముఖ్యంగా గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో డీహైడ్రేటెడ్‌గా ఉంటే, అనేక శారీరక సమస్యలు ఎదురవుతాయి.
ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం గుండె మన శరీరంలోని రక్తాన్ని పంప్ చేస్తుంటుంది. అయితే మనం జిమ్, వ్యాయామం లేదా డ్యాన్స్ చేసినప్పుడు, మన శరీరం చురుకుగా మారుతుంది. ఫలితంగా మన శరీరం ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో రక్తపోటు పెరగడం సహజం. అదేసమయంలో హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో శరీరానికి గరిష్ట ఆక్సిజన్ అవసరమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి బీపీ బాధితునికి ఎదురైతే గుండె సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు.
మధుమేహం లేదా బీపీ బాధితులు ఏ పరిమితితో పనిచేయాలో ముందుగా తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగానే పనిచేయాలి. వ్యాయామం చేసేటప్పుడు లేదా డ్యాన్స్ చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment