వడోదరలో సీ295 విమాన తయారీ కర్మాగారాన్ని ప్రారంభించిన మోదీ, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్
ఇది ‘మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్’ అని వ్యాఖ్యానించిన మోదీ
వడోడర: భారత ప్రైవేట్ రక్షణ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత్‌లోనే తొలి ప్రైవేట్ సైనిక, సరకు రవాణా విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు గుజరాత్‌లోని వడోదర పట్టణంలోని టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వేదికైంది. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో కలిసి భారత ప్రధాని మోదీ సోమవారం ఈ ప్లాంట్‌లో సీ295 రకం సైనిక రవాణా విమాన తయారీని ప్రారంభించారు. అక్కడి విడిభాగాల ఎగ్జిబిషన్‌ను ఇరునేతలు ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంచేయడమే కాకుండా మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. కొత్త ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచి్చన ఎయిర్‌బస్, టాటా బృందాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్‌లో విదేశీ సరకు రవాణా విమానం తయారీ కలను సాకారం చేసిన వ్యాపార జగజ్జేత రతన్ టాటాకు ఘన నివాళులు’’ అని అన్నారు.
కొత్త పని సంస్కృతికి నిదర్శనం
‘‘ నూతన భారత దేశ కొత్తతరహా పని సంస్కృతికి సీ295 ఫ్యాక్టరీ ప్రతిబింబింగా నిలవనుంది. 2022 అక్టోబర్‌లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటినుంచి ఉత్పత్తిదాకా భారత వేగవంతమైన ఉత్పాదకతకు నిదర్శనం ఈ కర్మాగారం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత స్పానిష్ రచయిత ఆంటోనియో మకాడో కవితలోని ‘మనం లక్ష్యం సాధించేందుకు ముందుకెళ్తుంటే మార్గం దానంతట అదే ఏర్పడుతుంది’ అనే వాక్యాన్ని మోదీ గుర్తుచేశారు. ‘‘కొత్తగా మొదలైన టాటా–ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశీయంగా 18,000 విమాన విడిభాగాల తయారీని ఈ ఫ్యాక్టరీ సుసాధ్యం చేయనుంది. భవిష్యత్తులో భారత పౌరవిమానయాన రంగానికి అవసరమైన విమానాల తయారీకి ఈ ఫ్యాక్టరీ బాటలువేస్తోంది’’ అని మోదీ అన్నారు.
స్పెయిన్‌లో యోగా, ఇండియాలో ఫుట్‌బాల్
‘‘ఇరుదేశాల ప్రజల మధ్య బంధమే దేశాల మధ్య బంధాన్ని బలీయం చేస్తోంది. యోగా స్పెయిన్‌లో తెగ పాపులర్. ఇక స్పానిష్ ఫుట్‌బాల్‌ను భారతీయులూ బాగా ఇష్టపడతారు. ఆదివారం రియల్ మాడ్రిడ్‌తో మ్యాచ్ లో బార్సిలోనా బృందం సాధించిన ఘనవిజయం గురించి భారత్‌లోనూ తెగ చర్చ జరుగుతోంది. ఆహారం, సినిమా లు, ఫుట్‌బాల్.. ఇలా ప్రజల మధ్య బంధం దేశాల మధ్య పటిష్ట బంధానికి కారణం. 2026 ఏడాదిని ‘ఇండియా–స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం, ఏఐ’గా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం సంతోషకరం’’ అని మోదీ అన్నారు.
బంధం బలీయం: స్పెయిన్ అధ్యక్షుడు
‘‘1960లలోనే ప్రఖ్యాత స్పెయిన్ క్లాసిక్, జాజ్ సంగీత కళాకారుడు పాకో డిలూసియా, భారతీయ సంగీత దిగ్గజం పండిత్ రవిశంకర్ రెండు దేశాల సంగీత ప్రియులను ఒక్కటి చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, స్నేహబంధాలకు ఈ ఫ్యాక్టరీ గుర్తుగా నిలుస్తుంది’ అని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ అన్నారు.
40 విమానాల తయారీ ఇక్కడే
ఎయిర్‌బస్ సీ295 రకం మధ్యశ్రేణి రవాణా విమానాన్ని తొలుత స్పెయిన్‌కు చెందిన సీఏఎస్‌ఏ ఏరోస్పేస్ సంస్థ డిజైన్‌చేసి తయారుచేసేది. ప్రస్తుతం ఇది యూరప్ బహుళజాతి ఎయిర్‌బస్ సంస్థలో భాగంగా ఉంది. యుద్ధంలో బాంబులతోపాటు అవసరమైన సందర్భాల్లో వైద్య పరికరాలు, విపత్తుల వేళ బాధితుల తరలింపునకు, తీరప్రాంతాల్లో గస్తీ, నిఘా కోసం సైతం పలురకాలుగా వినియోగించుకోవచ్చు. ఎయిర్‌బస్ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తంగా సీ295 రకం 56 విమానాలను సైన్యానికి అప్పగించనున్నారు. వీటిలో 16 విమానాలను స్పెయిన్‌లోని సవీలేలో తయారుచేసి ఎయిర్‌బస్ నేరుగా నాలుగేళ్లలోపు భారత్‌కు పంపనుంది. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వారి ఆధ్వర్యంలో వడోదరలోని తయారీయూనిట్‌లో తయారుచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment