భారత్‌లోనే పెళ్లాడండి: మోదీ | PM Narendra Modi gives Wed in India call to retain wealth within country | Sakshi
Sakshi News home page

భారత్‌లోనే పెళ్లాడండి: మోదీ

Published Mon, Jan 22 2024 4:26 AM | Last Updated on Mon, Jan 22 2024 7:50 AM

PM Narendra Modi gives Wed in India call to retain wealth within country - Sakshi

ఆదివారం ధనుష్కోటిలో రామసేతు వద్ద సముద్రతీరంలో ధ్యానముద్రలో ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌: సంపన్న కుటుంబాలు విదేశాల్లో పెళ్లాడుతున్న ఉదంతాలను ఉటంకిస్తూ భారత్‌లోనే పెళ్లాడండి (వెడ్‌ ఇన్‌ ఇండియా) అని ప్రధాని మోదీ మరోమారు పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని ఆమ్రేలీ సిటీలో నిర్మించనున్న ఖోదల్‌ధామ్‌ ట్రస్ట్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నాక ఆ హాస్పిటల్‌ను నిర్వహించే ట్రస్ట్‌కు చెందిన లేవా పటిదార్‌ సభ్యులనుద్దేశించి మోదీ ప్రసంగించారు.

‘‘ భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకోవడం సబబేనా?. సొంత దేశంలో వివాహ కార్యక్రమాలు చేసుకోలేమా? విదేశాల్లో కోట్లు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసే పెళ్లితో కోట్లాది రూపాయల భారతీయ సంపద విదేశాలకు తరలిపోతోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

‘‘ ఇక్కడి నుంచి విదేశాలకు పెళ్లి కోసమే ప్రత్యేకంగా వెళ్లి వచ్చే పెడధోరణి రోగం మీ పటిదార్‌ వర్గానికి అంటకుండా జాగ్రత్తపడండి. ఇక్కడి దేవత ‘మా ఖోదల్‌’ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడే పెళ్లి చేసుకోవచ్చుకదా. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ తరహాలో ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ను పాటిద్దాం’’ అని కోరారు. ‘‘ పర్యాటనకు వెళ్లాలనుకుంటే ముందుగా స్వదేశంలోనే పర్యటించండి. దేశవ్యాప్తంగా సుందర, రమణీయ, దర్శనీయ స్థలాలను పర్యటించండి. పర్యాటక రంగాన్నీ ప్రోత్సహించండి’’ అని అన్నారు.  

దక్షిణాది ఆధ్యాతి్మక పర్యటన పూర్తి
ధనుషో్కటి కోదండరామాలయ సందర్శన
రామేశ్వరం(తమిళనాడు): గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం అక్కడి శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీలంకకు కూతవేటు దూరంలో ఉండే ధనుషో్కటి, అరిచల్‌ మునాయ్‌ల సమీపంలోనే ఈ ఆలయం ఉంది. ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సమీపంలోని అరిచల్‌ మునాయ్‌కు వెళ్లి అక్కడి జాతీయ చిహ్నం ఉన్న స్తంభం వద్ద నమస్కరించారు.

అక్కడి సముద్రతీరంలో మోదీ కొద్దిసేపు ప్రాణాయామం చేశారు. సముద్ర జలాన్ని చేతులోకి తీసుకుని ప్రార్థనలు చేశారు. రామసేతుకు ప్రారంభ స్థానంగా పేర్కొనే అరిచల్‌మునాయ్‌ ప్రాంతం వద్దే మోదీ కొద్దిసేపు గడిపారు. బంగళాఖాతం, హిందూ మహాసముద్రంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ సముద్రజలాలు కలిసే చోటునే తమిళంలో అరిచల్‌ మునాయ్‌ అంటారు.

ఇక్కడి రామసేతుకు ఆడమ్స్‌ బ్రిడ్జ్‌ అని మరో పేరు కూడా ఉంది. అయోధ్యలో భవ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కోసం కఠిన దీక్ష చేస్తున్న ప్రధాని గత కొద్దిరోజులుగా రామాయణంతో ముడిపడి ఉన్న ఆలయాలు, ఆధ్యాతి్మక ప్రాంతాలను దర్శిస్తున్న విషయం తెల్సిందే. ఆదివారంతో దక్షిణ భారత పర్యటనను పూర్తిచేశారు. అరిచల్‌మునాయ్‌ నుంచి తమిళనాడుకు చెందిన పవిత్ర నదీజలాలతో నిండిన కలశాలను వెంట తీసుకుని మోదీ ఢిల్లీ చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement