
షెగావ్: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలకు కొత్త చిక్కొచ్చిపడింది. ఆ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోయిన వింత పరిస్థితి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.. అప్పుడు జుట్టు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడగా, ఇప్పుడు గోళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు.
గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న మహిళలు, పురుషులు జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి బట్టతల కూడా వచ్చేసింది. మొదట్లో కొద్దిగా జుట్టు రాలడం మొదలై.. ఒక్క వారంలోనే ఇలా బట్టతలగా మారిపోయింది. జిల్లాలోని షెగావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా జుట్టు సమస్య కొనసాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, మరో సమస్యతో ఆ గ్రామాలు భయపడుతున్నాయి.
ఇప్పుడు నాలుగు గ్రామాల్లోని ప్రజలు గోళ్లు రాలిపోవడం, ముడతలు పడటం వంటి కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తదుపరి పరీక్షల కోసం షెగావ్ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సమస్యకు కారణం సెలీనియం స్థాయిలు పెరగడమే కారణంగా భావిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఇక్కడి గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోవడం, గోళ్లు రాలిపోవడానికా కారణం.. వారు తింటున్న గోధుములకు సంబంధముందని కొందరు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆ గోధుమల్లో సెలీనియం అధిక మోతాదులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. గతంలో విపరీతంగా జుట్టు కోల్పోయిన వారిలో అనేక మంది ఇప్పుడు గోళ్ల సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.