
ముంబై/న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పుణే కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
ఏఎన్‌ఐ కథనం ప్రకారం.. 2023 మార్చి 5వ తేదీన లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ వీరసావర్కర్(Veer Savarkar)ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు గానూ రాహుల్‌పై సావర్కర్ దగ్గరి బంధువు పుణే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు.. మే 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.
మరోవైపు.. సావర్కర్‌పై మరో సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనుగానూ కేసు నమోదు అయ్యింది. అయితే.. తాజాగా ఆ కామెంట్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
2022లో.. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్ర అకోల్‌లో రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
అయితే, దీనిపై అనేకసార్లు విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని న్యాయస్థానం (ACJM) రాహుల్‌కు రూ.200 జరిమానా కూడా విధించింది. అయితే.. ఈ కేసులో తనకు జారీ చేసిన సమన్లను అలహాబాద్ హైకోర్టు రద్దు చేయడానికి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాజాగా.. విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాహుల్‌ను గట్టిగానే మందలించింది.
వీర్ సావర్కర్‌కు (Vinayak Damodar Savarkar) మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని.. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని పేర్కొంది. ఇకనుంచి వాళ్లను అపహాస్యం చేస్తే ఇకపై కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని తెలిపింది.
అదే సమయంలో.. రాహుల్‌పై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన నృపేంద్ర పాండేకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.