
ముంబై: మహారాష్ట్రలో విపక్ష శివసేన(ఉద్ధవ్), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) చేతులు కలుపబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ రెండు పార్టీల అధినేతలు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వరుసకు సోదరులే. రెండు పార్టీల మధ్య త్వరలో పొత్తు కుదరబోతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అయితే, రెండు పార్టీలతో కూటమి ఏర్పాటు అనే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. రెండు పార్టీల నడుమ భావోద్వేగపూరిత చర్చలు నడుస్తున్నాయని వెల్లడించారు. కుటుంబ కార్యక్రమాలు, వేడుకల్లో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలుసుకోవడం, మాట్లాడుకోవడం సాధారణమేనని చెప్పారు. ఉమ్మడి శివసేన పార్టీలో పని చేసినప్పుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఎలాంటి విభేదాలు తలెత్తలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ ఠాక్రే చెప్పడం సంచలనాత్మకంగా మారింది.
ఇక, ఇరువురు నేతలు చేతులు కలుపబోతున్నట్లు మహారాష్ట్రలో ఊహాగానాలు మొదలయ్యాయి. మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో కలిసికట్టుగా పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఇప్పటికే సంకేతాలిచ్చారు. తాజాగా రాజ్ ఠాక్రే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మా మధ్య ఉన్నవి చిన్న విభేదాలే. మహారాష్ట్ర ప్రయోజనాల ముందు ఇవి చాలా చిన్నవి. మేం కలవడం కష్టమేమీ కాదు. అందుకు సంకల్పం ఉండాలి అని ఆయన అన్నారు. అయితే, కలయికకు ఉద్ధవ్ థాక్రే ఓ షరతు విధించారు. చిన్నచిన్న గొడవలు పక్కన పెట్టడానికి నేను సిద్ధం. కానీ, ఒకరోజు మద్దతిచ్చి, మరుసటి రోజు వ్యతిరేకించి, ఆపై రాజీ పడే ద్వంద్వ వైఖరి పనికిరాదు. మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా వారితో కలిసేది లేదు అని స్పష్టం చేశారు. రాజ్ థాక్రే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఉద్ధవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
థాక్రే సోదరుల కలయికను బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. అయితే, వారు కలిసినా రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో తమ కూటమిని ఓడించలేరని బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేతలు కూడా ఈ కలయికను సానుకూలంగా చూస్తున్నారు. థాక్రే సోదరులు ఏకమైతే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఉమ్మడి శివసేనలో కీలకంగా వ్యవహరించిన రాజ్ ఠాక్రే 2006లో ఎంఎన్‌ఎస్ పేరిట సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.