ముంబై: లోక్‌సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. నార్త్ మహారాష్ట్రలోని జల్గావ్ ఎంపీ ఉన్మేష్ పాటిల్ ప్రతిపక్ష శివసేనలో(ఉద్ధవ్ వర్గం) చేరారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ వద్ద తన సహచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే జల్గావ్ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన ఉన్మేష్‌కు ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. స్మితా వాఘ్‌ను సీటు కేటాయించడంతో బీజేపీకి ఆయన రాజీనామా చేశారు.
ఇదిలా ఉండగా శివసేన(ఉద్దవ్ వర్గం) ఇప్పటికే జల్గావ్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థుల రెండో జాబితాలో భాగంగా కరణ్ పవార్‌ను జల్గావ్ నుంచి బరిలోకి దింపింది. అతని పేరుతో పాటు మరో మూడు నియోజకవర్గాల అభ్యర్థులను(కళ్యాణ్ నుంచి వైశాలి దారేకర్, హత్యనంగలే నుంచి సత్యజీత్ పాటిల్, పాలఘర్ నుంచి భారతి కమ్డి) ప్రకటించింది. దీంతో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో భాగమైన ఈ పార్టీ ఇప్పటి వరకు 21 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.
పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పు కోసమే తాను శివసేనలో చేరినట్లు వెల్లడించారు. ప్రతీకారం కోసం కాదని అన్నారు. బీజేపీ యూజ్ అండ్ త్రో విధానాన్ని పాటిస్తుందని మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేసింది శివసైనికులేనని అన్నారు.
అయితే జల్గావ్ లోక్‌సభకు శివసేన పటీ చేయడం ఇదే తొలిసారి అని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. 2019 వరకు అవిభక్త శివసేన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో భాగంగా ఉన్నప్పుడు బీజేపీ ఇక్కడి నుంచి పోటీ చేసిందని తెలిపారు. కాగా 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు అయిదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment