ముంబై: మహారాష్ట్రలో పలు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీల పెద్దలు అలర్ట్ అయ్యారు. దీంతో, ‘మహా’ రాజకీయం రీసార్ట్‌లకు చేరింది.
కాగా, మహారాష్ట్రలో రేపు(శుక్రవారం) 11 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, 11 స్థానాలకు గాను 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థులు గెలుపునకు అవసరమయ్యే మెజార్టీ ఎంవీఏకు ఉన్నప్పటికీ మూడో అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే.. మిలింద్ నార్వేకర్‌తో నామినేషన్ వేయించారు. దీంతో మూడో స్థానంలోనూ గెలుపొందేందుకు అవసరమైన ఓట్ల కోసం ఎంవీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక ప్రాంతాలకు తరలించాయి. క్రాస్ ఓటింగ్ భయం నేపథ్యంలో శివసేన (యూబీటీ), ఏక్‌నాథ్ శిందే వర్గాలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, లగ్జరీ హోటళ్లకు తరలించినట్లు తెలిసింది. మరోవైపు.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ నేతల కోసం ఎలాంటి హోటళ్లను బుక్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment