Cancer Hospital
-
Sakshi Little Stars: ఆశీస్సులే ఆయువు
ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.– జశ్వంత్మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్‌కు వెళ్లాలనుంది. – రిషి ప్రియ, సిద్దిపేటచాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను. – ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్నాకు ఫుట్‌బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్‌కు తీసుకెళతానని కూడా చె΄్పారు. – చేతన్విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్‌లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం. – అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్అవగాహన వచ్చిందికేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్‌కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.– కార్తీక, నేషనల్ ప్లేయర్హెయిర్ డొనేట్ చేస్తానుఈ హాస్పిటల్లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. –ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను. – సాన్విక, సరిపోదా శనివారంవీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను. – స్నితిక్, పొట్టేల్ ఫేమ్భయం లేదు చికిత్సలు ఉన్నాయిఅనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్‌కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి QR కోడ్‌ను స్కాన్ చెయ్యండి – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
క్యాన్సర్ ఆస్పత్రికి YSR పేరు తొలగింపు
-
భారత్‌లోనే పెళ్లాడండి: మోదీ
అహ్మదాబాద్: సంపన్న కుటుంబాలు విదేశాల్లో పెళ్లాడుతున్న ఉదంతాలను ఉటంకిస్తూ భారత్‌లోనే పెళ్లాడండి (వెడ్ ఇన్ ఇండియా) అని ప్రధాని మోదీ మరోమారు పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని ఆమ్రేలీ సిటీలో నిర్మించనున్న ఖోదల్‌ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నాక ఆ హాస్పిటల్‌ను నిర్వహించే ట్రస్ట్‌కు చెందిన లేవా పటిదార్ సభ్యులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకోవడం సబబేనా?. సొంత దేశంలో వివాహ కార్యక్రమాలు చేసుకోలేమా? విదేశాల్లో కోట్లు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసే పెళ్లితో కోట్లాది రూపాయల భారతీయ సంపద విదేశాలకు తరలిపోతోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ ఇక్కడి నుంచి విదేశాలకు పెళ్లి కోసమే ప్రత్యేకంగా వెళ్లి వచ్చే పెడధోరణి రోగం మీ పటిదార్ వర్గానికి అంటకుండా జాగ్రత్తపడండి. ఇక్కడి దేవత ‘మా ఖోదల్’ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడే పెళ్లి చేసుకోవచ్చుకదా. ‘మేడ్ ఇన్ ఇండియా’ తరహాలో ‘వెడ్ ఇన్ ఇండియా’ను పాటిద్దాం’’ అని కోరారు. ‘‘ పర్యాటనకు వెళ్లాలనుకుంటే ముందుగా స్వదేశంలోనే పర్యటించండి. దేశవ్యాప్తంగా సుందర, రమణీయ, దర్శనీయ స్థలాలను పర్యటించండి. పర్యాటక రంగాన్నీ ప్రోత్సహించండి’’ అని అన్నారు. దక్షిణాది ఆధ్యాతి్మక పర్యటన పూర్తి ధనుషో్కటి కోదండరామాలయ సందర్శన రామేశ్వరం(తమిళనాడు): గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం అక్కడి శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీలంకకు కూతవేటు దూరంలో ఉండే ధనుషో్కటి, అరిచల్ మునాయ్ల సమీపంలోనే ఈ ఆలయం ఉంది. ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సమీపంలోని అరిచల్ మునాయ్కు వెళ్లి అక్కడి జాతీయ చిహ్నం ఉన్న స్తంభం వద్ద నమస్కరించారు. అక్కడి సముద్రతీరంలో మోదీ కొద్దిసేపు ప్రాణాయామం చేశారు. సముద్ర జలాన్ని చేతులోకి తీసుకుని ప్రార్థనలు చేశారు. రామసేతుకు ప్రారంభ స్థానంగా పేర్కొనే అరిచల్‌మునాయ్ ప్రాంతం వద్దే మోదీ కొద్దిసేపు గడిపారు. బంగళాఖాతం, హిందూ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ సముద్రజలాలు కలిసే చోటునే తమిళంలో అరిచల్ మునాయ్ అంటారు. ఇక్కడి రామసేతుకు ఆడమ్స్ బ్రిడ్జ్ అని మరో పేరు కూడా ఉంది. అయోధ్యలో భవ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కోసం కఠిన దీక్ష చేస్తున్న ప్రధాని గత కొద్దిరోజులుగా రామాయణంతో ముడిపడి ఉన్న ఆలయాలు, ఆధ్యాతి్మక ప్రాంతాలను దర్శిస్తున్న విషయం తెల్సిందే. ఆదివారంతో దక్షిణ భారత పర్యటనను పూర్తిచేశారు. అరిచల్‌మునాయ్ నుంచి తమిళనాడుకు చెందిన పవిత్ర నదీజలాలతో నిండిన కలశాలను వెంట తీసుకుని మోదీ ఢిల్లీ చేరుకున్నారు. -
కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి రాష్ట్ర స్థాయి క్యాన్సర్ ఆస్పత్రి త్వరలో కర్నూలులో అందుబాటులోకి రానుంది. రూ.120 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మించారు. ప్రభుత్వ రంగంలో వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాన్సర్ చికిత్సలపైన కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా రాష్ట్ర స్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణాన్ని శర వేగంగా పూర్తి చేశారు. మిగతా వసతులన్నీ కల్పించి ఆరు నెలల్లో దీనిని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం 2017లోనే మంజూరు చేసింది. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీని నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ప్రభుత్వ రంగంలో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి ఒక్కటి కూడా లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆస్పత్రిపై కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే దీని నిర్మాణాన్ని చేపట్టి వేగంగా పూర్తి చేసింది. క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చేందుకు చర్యలు చేపడుతోంది. తొలి దశలో రూ.53.60 కోట్లతో పరికరాలను ఏర్పాటు చేస్తోంది. హై ఎండ్ రేడియేషన్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, సర్జరీ అంకాలజీ విభాగాలను అందుబాటులోకి తెస్తోంది. రూ.30 కోట్ల వ్యయంతో హై ఎండ్ డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఎక్విప్మెంట్స్ను వీలైనంత త్వరగా సమకూర్చాలని వైద్య విద్యా సంచాలకులు ఏపీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఆరు నెలల్లోగా అందుబాటులోకి కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా రాష్ట్ర స్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ భవనాల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు అత్యాధునిక క్యాన్సర్ చికిత్స పరికరాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఆరు నెలల్లోపే క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటిలో ప్రత్యేకంగా క్యాన్సర్ చికిత్సల విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్. శ్రీనివాసన్, రాష్ట్ర క్యాన్సర్ విభాగం నోడల్ అధికారి -
మరింత సమర్థంగా క్యాన్సర్ కట్టడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్యాన్సర్‌ను సమర్థంగా నియంత్రించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థలను భాగస్వామ్యం చేస్తోంది. ఆయా సంస్థల సలహాలు, సూచనలు, సహకారం తీసుకుంటూ క్యాన్సర్‌పై యుద్ధానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్సకు ప్రసిద్ధి చెందిన టాటా మెమోరియల్ సెంటర్‌కు చెందిన విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌తో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎంవోయూ చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్ అంకాలజీ, క్యాన్సర్ డే కేర్ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది. ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్‌లో నిర్ధారించిన క్యాన్సర్ రోగులు, హైరిస్క్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ దృష్టి సారించింది. భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు. -
అన్ని క్యాన్సర్లకూ ఆరోగ్యశ్రీ
దేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. క్యాన్సర్ బాధితుల సంరక్షణ, చికిత్సపై సీఎం జగన్ దూరదృష్టి అభినందనీయం. రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. – డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు సాక్షి ప్రతినిధి, తిరుపతి: క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసి, పేదలందరికీ ఉచితంగా వైద్య సౌకర్యం అందించాలనేదే తమ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో టాటా సంస్థ అద్భుతమైన క్యాన్సర్ ఆస్పత్రిని తిరుపతిలో ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. తిరుపతి జూపార్క్ రోడ్లో టీటీడీ సహకారంతో టాటా సంస్థ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (స్వీకార్)ను గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రేడియాలజీ విభాగంలో రోగుల కోసం అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన క్యాబిన్లు, వైద్య పరికరాలను, చికిత్సా విధానాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వడమే లక్ష్యమని, రానున్న రోజుల్లో ఆంకాలజీ విభాగంలో అన్ని రకాల సేవలు వర్తింపజేయాలని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందించాలన్నది తమ లక్ష్యమని, ఇందులో భాగంగా అన్ని రకాల క్యాన్సర్లకు ఒకే గొడుగు కింద ఉచితంగా చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్‌తో చనిపోకూడదని, చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనేది తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. క్యాన్సర్ కేర్, అడ్వాన్స్డ్ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సీఎం జగన్, చిత్రంలో మంత్రులు, ఆసుపత్రి బృందం క్యాన్సర్ చికిత్సపై దృష్టి పెట్టిన ఏకైక రాష్ట్రం ఏపీ ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. క్యాన్సర్ సంరక్షణ, చికిత్సపై సీఎం దూరదృష్టి అభినందనీయమన్నారు. పీడియాట్రిక్ ఆంకాలజీ సెంటర్, ప్రివెంటివ్ ఆంకాలజీ, సెంటర్ ఫర్ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తూ.. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని చెప్పారు. టాటా ట్రస్ట్ సీఈవో ఎన్.శ్రీనాథ్, స్వీకార్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వీఆర్.రమణన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతిలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి
తిరుపతి తుడా: రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. క్యాన్సర్ చికిత్స కోసం ఇకపై చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదు. అంతకుమించిన అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆసుపత్రిని శరవేగంగా నిర్మించారు. ఈ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్ కేర్‌కు చిరునామాగా నిలిచే ఈ ఆసుపత్రిని రూ.190 కోట్ల వ్యయంతో 92 పడకలతో నిర్మించారు. దశలవారీగా పడకలను 300కు పెంచనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5వ తేదిన ఈ అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఈ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి టాటా సంస్థకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించాయి. ఇప్పటికే టీటీడీ సహకారంతో నిర్వహిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో ఆంకాలజీ విభాగం ద్వారా క్యాన్సర్ రోగులకు వైద్య సేవలందిస్తోంది. ప్రత్యేకంగా క్యాన్సర్ వైద్యానికి అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చిన టాటా సంస్థకు అలిపిరి వద్ద విలువైన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణానికి ఏడాదికిపైగా ఆటంకం ఏర్పడింది. దీని నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడంతో ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ అమలుకు చర్యలు నూతన ఆసుపత్రిలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సూచనల మేరకు ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్యశ్రీకి అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే టాటా క్యాన్సర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని అమలు చేస్తారు. విస్తృతంగా అవగాహన ఆసుపత్రికి పునాది వేసిన ఆరు నెలల నుంచే ట్రస్టు ద్వారా ఏడుగురు వైద్యుల బృందంతో జిల్లావ్యాప్తంగా క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తోంది. మహిళల కోసం పింక్ బస్సు ఏర్పాటు చేసి గ్రామాల్లో పరీక్షలు చేస్తోంది. రోగ లక్షణాలను గుర్తించిన వారికి తక్కువ ఖర్చుతో ఖరీదైన వైద్యాన్ని అందిస్తోంది. అలానే క్యాన్సర్ మహమ్మారిని గుర్తించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మెడికల్ హబ్‌గా తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. తిరుపతిని మెడికల్ హబ్‌గా చేస్తోంది. నాడు–నేడు ద్వారా రాయలసీమ పెద్దాసుపత్రి రుయాను రూ.450 కోట్లతో ఆధునీకరిస్తోంది. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులను మరింత ఆధునీకరించి మెరుగైన వైద్యం అందిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 11న టీటీడీ శ్రీపద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు తిరుపతిలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తోంది. అత్యాధునిక వైద్యం ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు, సౌకర్యాలు కల్పించారు. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలతో పాటు అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్, పెయిన్ అండ్ పాలియేటివ్, రేడియాలజి, పాథాలజి, మైక్రో బయాలజి, బయో కెమిస్ట్రి, నాణ్యమైన ఫార్మసీ, బ్లడ్‌బ్యాంక్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 120 మంది నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది ఉంటారు. అత్యాధునిక అల్ట్రాసౌండ్, మమోగ్రామ్, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ, లీనాట్, బ్రాకీథెరపీ, కీమోథెరపీ డేకేర్తో పాటు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘టాటా’ సామాజిక స్పృహ దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో టాటా ఒకటి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టాటా సంస్థ వ్యాపారమేగాక సామాజిక స్పృహలోనూ ముందుంది. స్వాతంత్య్రం రాక ముందే 1941లో ముంబై పట్టణంలో టాటా మెమోరియల్ ఆసుపత్రిని నిర్మించింది. 2011లో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని కోల్‌కతాలో అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత అలమేలు మంగ చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తిరుపతిలో ఆసుపత్రిని నిర్మించింది. టాటా ట్రస్టు చైర్మన్‌గా రతన్‌టాటా, అలమేలు చారిటబుల్ ఫౌండేషన్‌కు సీఈగా సంజయ్‌చోప్రా వ్యవహరిస్తున్నారు. క్యాన్సర్ ఆసుపత్రికి మెడికల్ డైరెక్టర్‌గా విఆర్ రమణన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది అత్యాధునిక ఆసుపత్రి అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య సేవలతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాం. దీని నిర్మాణానికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిది. లాభాపేక్ష లేకుండా ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని సాధారణ ఖర్చుతో అందించడమే టాటా సంస్థ లక్ష్యం. ఇప్పటివరకు స్విమ్స్‌తో మాత్రమే ఎంవోయూ కుదిరింది. ఆసుపత్రి సేవలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం, డిఫెన్స్ సంస్థలతో ఎంవోయూ చేసుకుంటాం. – డాక్టర్ విఆర్ రమణన్, మెడికల్ డైరెక్టర్, క్యాన్సర్ ఆసుపత్రి వైద్య సేవలు పొందడం ఇలా ► ఆసుపత్రి టోల్ ఫ్రీ నెం: 18001036123 ► ప్రతిరోజు రేడియో ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ వైద్య సేవలు ► నేరుగా ఆసుపత్రి రిసెప్షన్లో సంప్రదించి ఓపీ పొందవచ్చు ► ఆసుపత్రి ఓపీ సమయం: ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ► ఓపీ టిక్కెట్ రుసుము: రూ.30 ► పేషెంట్‌తో పాటు వచ్చే అటెండెంట్స్ విశ్రమించేందుకు ప్రత్యేకంగా ధర్మశాల నిర్మించారు. ఇందుకోసం రోజుకు రూ.100 (ఒక్కరికి) వసూలు చేస్తారు. ► అతి తక్కువ ధరలతో క్యాంటీన్ కూడా ఉంది. -
స్త్రీ,పురుష సమానత్వమే సమాజ ప్రగతికి మూలం
-
టాటా ఆస్పత్రికి వంద ఇళ్లు
సాక్షి, ముంబై: ముంబై నగరంలో ప్రముఖ టాటా మెమోరియల్ కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగుల బంధువులు బస చేయడానికి 100 ఇళ్లు అందజేసే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేశారు. దీంతో రోగుల బంధువులకు త్వరలో ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే 30 ఏళ్ల వరకు నామమాత్రపు అద్దె ఒప్పందంపై ఈ ఇళ్లను టాటా ఆస్పత్రికి అందజేయనున్నారు. మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) నిర్మిస్తున్న ఇళ్లలో వంద ఫ్లాట్లను టాటా ఆస్పత్రికి అందజేయనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్ ఇటీవల విలేకరుల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే సంతకం చేయడంతో మార్గం సుగమమైంది. కేన్సర్ రోగుల వెంట వచ్చే బంధువులకు తల దాచుకునేందుకు తాత్కాలికంగా ఓ గూడు లభించనుంది. 300 చదరపుటడుగుల ఒక్కో ఇల్లుకు సంవత్సరానికి రూపాయి అద్దె చొప్పున 30 ఏళ్ల వరకు వంద ఇళ్లను టాటా ఆస్పత్రికి ఇవ్వనుంది. కేన్సర్ చికిత్సలో దిట్ట .. ముంబైలోని పరేల్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న టాటా మెమోరియల్ ఆస్పత్రి కేన్సర్ చికిత్సకు పెట్టింది పేరు. భారతదేశంతోపాటు విదేశాలలో కూడా ఈ ఆస్పత్రి ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇందులో చేరిన రోగుల్లో సుమారు 90 శాతం మంది వ్యాధి నయమై ఇంటికి డిశ్చార్జి అవుతారనే నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. దీంతో ఈ ఆస్పత్రి అందించే చికిత్సపై రోగులందరికి నమ్మకం ఉంది. మహారాష్ట్రతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరాంచల్, ఈశాన్య రాష్ట్రాలు తదితర దేశం నలుమూలల నుంచి నిత్యం వందలాది కేన్సర్ రోగులు వస్తుంటారు. ఇందులో 61 శాతం మన దేశానికి చెందిన రోగులుండగా 39 శాతం విదేశాల నుంచి వచ్చినవారుంటారు. ప్రతీ రోగి వెంట ఒకరు లేదా ఇద్దరు బంధువులు కచ్చితంగా వస్తారు. దీంతో ఈ ఆస్పత్రి 24 గంటలు రోగులు, రోగుల బంధువుల రాకపోకలతో రద్దీగా కనిపిస్తుంది. రోగులకు సేవలు చేయడానికి వార్డులో ఒకరికే అనుమతి ఉంటుంది. అది కూడా అవసరమైతేనే. లేదంటే బయటకు పంపిస్తారు. మిగతావారు ఆస్పత్రి బయట గడపాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో కొత్తగా వచ్చిన రోగుల ప్రాథమిక పత్రాల ప్రక్రియ పూర్తిచేసిన తరువాత రక్త, మూత్ర, కాలేయం తదితర ల్యాబ్ పరీక్షలతోపాటు, సోనోగ్రఫీ, ఎక్స్ రే, సిటీ స్కాన్ లాంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అందుకు సుమారు వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 15 నుంచి నెల రోజుల సయమం కూడా పట్టవచ్చు. డాక్టర్లు రిపార్టును పరిశీలించిన తరువాత రోగిని ఆస్పత్రిలో చేర్చుకోవాలా...? వద్దా...? అనేది నిర్ణయిస్తారు. కొందరికి మందులు రాసిచ్చి ఇంటికి పంపిస్తారు. రోగిని ఆస్పత్రిలో చేర్చుకున్న తరువాత ఒకరు మినహా మిగతా బంధువులు ఆస్పత్రి బయటే ఉండాల్సి ఉంటుంది. అదే చిన్న పిల్లలైతే తల్లిని వెంట ఉండేందుకు అనుమతిస్తారు. తండ్రి మాత్రం బయటే పడిగాపులు కాయాల్సి వస్తుంది. రోడ్లపైనే వంటలు.. సాధారణంగా కేన్సర్ వ్యాధి నయమం కావాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. కొంత ఆర్థికంగా ఉన్నవారైతే గెస్ట్‌హౌస్‌లు, లాడ్జింగులు, హోటళ్లలో బస చేస్తారు. కానీ, పేదలు ఆస్పత్రి బయట రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై లేదా ఫ్లై ఓవర్ల కింద, ఉద్యానవనాల్లో కాలం వెల్లదీస్తారు. కొందరు ప్రతీరోజు అస్పత్రి క్యాంటిన్లో, బయట హోటళ్లు, రోడ్లపై విక్రయించే చిరుతిళ్లు తినలేక ఫుట్‌పాత్‌లపైనే ప్లాస్టిక్ కాగితాలు కట్టుకుని పోయ్యి వెలిగించి వంట కూడా చేసుకుంటారు. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి గజగజ వణుకుతూ కాలం వెల్లదీస్తారు. కొన్ని స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలు మానవత్వం ప్రదర్శించి ఉదయం, మధ్యాహ్నం సాయంత్రం, రాత్రి అల్పహారం, భోజనం పంపిణీ చేస్తాయి. కానీ, తల దాచుకునేందుకు ఏర్పాట్లు మాత్రం ఎవరు చేయడం లేదు. దీంతో కరీ రోడ్ ప్రాంతంలో మాడా ఆధీనంలో ఉన్న హాజీ కాసం భవనంలో వంద ఫ్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సంతకం చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. స్థానికుల వ్యతిరేకత.. 100 ఫ్లాట్లు కేన్సర్ రోగుల వెంట వచ్చే నిరుపేదలు తల దాచుకునేందుకు ఎంతో దోహదపడతాయని మంత్రి జితేంద్ర అవ్హాడ్ అన్నారు. ఒక్కో ఫ్లాటు ఖరీదు రూ. కోటి ఉంటుంది. ఇలా వంద ఫ్లాట్లకు రూ.100 కోట్లు విలువ ఉంటుందని ఆయన అన్నారు. కానీ కరీ రోడ్లో మాడా ఆధీనంలో ఉన్న హాజీ కాసం చాల్ నివాసులు వంద ఫ్లాట్లు టాటా కేన్సర్ ఆస్పత్రికి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో కేన్సర్ రోగుల బంధువులు బస చేస్తారు. వారి వెళ్లిపోగానే ఇంకొకరు వస్తారు. వారి రాకపోకల వల్ల తమ కుటుంబాలకు కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదముందని ఆరోపిస్తున్నారు. దీంతో మరోచోట వారికి బస ఏర్పాట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
సీఎం జగన్ కృషి.. సుదీర్ఘ స్వప్నం సాకారం
సాక్షి, అమరావతి : ఆరోగ్య రంగంలో ఇప్పటికే అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేశారు. గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేన్సర్ బ్లాక్ ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి విద్యా, ఆరోగ్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. బ్రిటన్ తరహాలో గ్రామాల్లోనూ వైద్యాన్నిఅందుబాటులోకి తెస్తామని చెప్పారు. డాక్టర్ డే సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. నాట్కో కేన్సర్ బ్లాక్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరో ఏడాదిలోనే కర్నూలు కూడా కేన్సర్ విభాగానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. (ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం) ఎలుకలు కొరికి ప్రాణాలు పోయే పరిస్థితి నాడు ఈ రోజు (బుధవారం) ఉదయం కొత్త 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల రక్షణ కోసం జిల్లాకు రెండు చొప్పున నియోనాటల్ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామని సీఎం జగన్ తెలిపారు. తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొస్తున్నామని, రోగుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.104 అంబులెన్స్‌ల ద్వారా గ్రామాల్లో వైద్యసేవలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. ప్రతి 5 నుంచి 7 గ్రామాలకు ప్రత్యేకంగా ఓ డాక్టర్‌ను నియమిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటి 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించామని సీఎం వెల్లడించారు.104, విలేజ్ క్లినిక్, పీహెచ్‌సీలను అనుసంధానిస్తాని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లల ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేదని, విద్యుత్ సౌకర్యం లేక సెల్‌ఫోన్ లైట్లతో వైద్యం అందించిన పరిస్థితిని చూశామని నాటి గడ్డు పరిస్థితులను గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని ప్రజలకు భరోసానిచ్చారు. ప్రజల ఆరోగ్య రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సీఎం పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికీ క్యూఆర్ కోడ్‌తో ఆరోగ్య కార్డు ‘ప్రతి పీహెచ్సీ సెంటర్‌కూ దాదాపుగా కనీసం ఇద్దరు డాక్టరులు ఉంటారు. అలాగే 104 అంబులెన్స్‌లో మరో డాక్టరు ఉంటారు. ప్రతి మండలానికీ కనీసం రెండు పీహెచ్‌సీలు ఉంటే.. రెండు అంబులెన్స్‌లు వాటి పరిధిలోని గ్రామాలను పంచుకుంటారు:. నెలకు కచ్చితంగా ఒక ఊరికి డాక్టరు పోయే విధంగా వ్యవస్థ ఉంటుంది. ప్రతి పేషెంటు ఆరోగ్య వివరాలు ఎలక్ట్రానిక్ డేటాలోకి వెళ్తాయి. పరీక్షలు చేయడమే కాకుండా వారికి మందులు ఇస్తారు. మిగిలిన రోజుల్లో ఆ డాక్టరు పీహెచ్సీలో ఉంటారు. యూకేలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ఇక్కడ అమలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇది విప్లవాత్మక మార్పు. ఎలక్ట్రానిక్ డేటాలో వివరాల నమోదు దిశగా అడుగులు ముందుకేశాం. ప్రతి వ్యక్తికీ క్యూఆర్ కోడ్‌తో ఆరోగ్య కార్డు ఇవ్వడం జరిగింది. డేటా ఆపరేటర్ వివరాలను కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. ప్రతి వ్యక్తికీ సంబంధించి డిజిటిల్ ఎక్ట్రానిక్ రికార్డు ఉంటుంది. గతానికి, ఇప్పటికి తేడాను గమనించాలి 104, రాబోయే రోజుల్లో విలేజ్, వార్డు క్లినిక్స్‌ను పీహెచ్‌సీలతో అనుసంధానం చేస్తాం. ఆరోగ్య రంగంలో విప్తవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. గతానికి, ఇప్పటికి తేడాను గమనించాలని కోరుతున్నాను. ఆస్పత్రుల్లో పరిస్థితులను, ఇప్పటి పరిస్థితులను చూడమని కోరుతున్నాం. 108,104 పరిస్థితి గతంలో ఎలా ఉండేదో చూశాం. పేరుకు మాత్రమే 104. కాని వాహనాలు ఉండేవి కావు. 336 సంఖ్యలో 108 అంబులెన్స్‌లు మాత్రమే ఉండేవి. ఆస్పత్రుల్లో పరిస్థితులు కూడా ఎలా ఉండేవో చూడమని కోరుతున్నా. ఇవాళ 1088 వాహనాలకు శ్రీకారం చుట్టాం. అంబులెన్స్‌లు సరైన సమయంలో చేరకపోతే మనుషుల ప్రాణాలు పోతాయి. అంబులెన్స్‌లు వస్తాయో, లేవో అన్న పరిస్థితులు ఉంటే.. మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతుంది. 2059 రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తింపు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులను జాతీయ ప్రమాణాలు ఉండేట్టుగా వారిని తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకూ 11 మెడికల్ కాలేజీలు ఉంటే... మరో 16 మెడికల్ కాలేజీలను తీసుకు వస్తున్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక టీచింగ్ ఆస్పత్రి, నర్సింగ్ ఆస్పత్రిని తీసుకు వస్తున్నామని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ట్రైబల్ ఏరియాల్లో 7 మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. పలాస, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ ఆస్పత్రులను కడుతున్నాం. ఆరోగ్యశ్రీ రూపు రేఖలను పూర్తిగా మారుస్తున్నాం. జులై 8 నుంచి మరో ఆరు జిల్లాల్లో, నవంబర్ 14 నాటికి అన్ని జిల్లాల్లో 2059 రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. పక్కరాష్ట్రాల్లోని మంచి ఆస్పత్రుల్లోకూడా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కనిపిస్తున్నా తేడాలు. ప్రజలంతా గమనించాలని కోరుతున్నాం. దేవుడి దయతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.’ అని అన్నారు. -
డాక్టర్‌తో పాటు మరో 11 మంది నర్సులకు కరోనా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. సామాన్యులతో పాటు కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. గత వారం రోజల క్రితం ప్రభుత్వం క్యాన్సర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలికి కరోనా సోకిన విషయం తెలిసిందే. విదేశాలను నుంచి సోదరుడి ద్వారా ఆమెకు ఈ వైరస్ సోకింది. ఆ తర్వాత అదే అస్పత్రిలో పనిచేస్తున్న మరో ఆరుగురు నర్సులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఆ ఆస్పత్రిని మూసేసింది. (చదవండి: పరీక్షలు చేయించుకోకపోతే.. హత్యాయత్నం కేసు) తాజాగా అదే అస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌తో పాటు మరో 11 మంది నర్సులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ ఆస్పత్రిలో కరోనా బాధితుల సంఖ్య 18కి చేరింది. క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 19 మంది రోగుల రక్త నమూనాలను కూడా ల్యాబ్‌కు పంపారు. ఈ నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. క్యాన్సర్ ఆస్పత్రిలో పని చేస్తున్న 45 మంది సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్ జంటకు కూడా కరోనా వైరస్ సోకింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ రోగి ద్వారా వారికి ఈ వైరస్ సోకింది. ఇక ఢిల్లీలో కరనా బాధితుల సంఖ్య సోమవారం సాయంత్రం నాటికి 523కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. దేశ వ్యాప్తంగా 4,281 కరోనా కేసులు నమోదు కాగా, 111 మంది మృతి చెందారు. -
అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ నగరంతోపాటు దాని పరిసర జిల్లాల్లో ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ఐసీఎంఆర్ డేటా ప్రకారం 2016లో ఆంధ్రప్రదేశ్‌లో 58 వేలు, తెలంగాణలో 42 వేల క్యాన్సర్ కేసులు ఉన్నట్లు తేలిందని వివరించారు. స్పిన్నింగ్ మిల్లులను గట్టెక్కించాలి ఆంధ్రప్రదేశ్‌లో స్పిన్నింగ్ మిల్లులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయాన్ని ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాజ్యసభ జీరో అవర్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్పిన్నింగ్ మిల్లులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఉత్పత్తి హాలిడే ప్రకటించా ల్సిన దుస్థితికి చేరుకున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో స్పిన్నింగ్ మిల్లులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాలపై దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలి రోడ్డు ప్రమాదాలపై లోతైన దర్యాప్తునకు వీలుగా కేంద్ర వాహన ప్రమాద దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. మోటారు వాహనాల బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘మోటారు వాహనాల బిల్లు తెచ్చినం దుకు కేంద్ర రవాణాశాఖ మంత్రికి అభినందనలు.. రోడ్డు రవాణా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. అయితే ఈ బిల్లులో మూడింటిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. నిబంధన 36 పరిధిలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు టాక్సీ అగ్రిగేటర్లకు లైసెన్స్‌లు జారీచేయాలి. అయితే ఈ మార్గదర్శకాలపై బిల్లులో స్పష్టత లేదు. రహదారులపై ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో జరిపే పర్యవేక్షణ కోసం అయ్యే ఖర్చును కేంద్రం భరిస్తుందా? రాష్ట్రాలు భరించాలా అన్న అంశంపై స్పష్టత లేదు. మరోవైపు ఈ బిల్లులో క్లాజ్ 65 ద్వారా వేస్తున్న రూ. 100 కోట్ల జరిమానా చాలా పెద్ద మొత్తం. అందువల్ల దీనిని పునఃసమీక్షిం చాల్సిన అవసరం ఉంది.’ అని పేర్కొన్నారు. అవయవ వాణిజ్యంపై ఉక్కుపాదం మోపండి: వేమిరెడ్డి దేశంలో మానవ అవయవ వాణిజ్యం పెరిగిపోయిందని, దీనిపై ఉక్కుపాదం మోపని పక్షంలో వీధి బాలుర అదృశ్యాలు, అపహరణలు పెరిగిపోతాయని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మూత్ర పిండాలు, కాలేయాలకు డిమాండ్ ఉన్న నేప థ్యంలో ఈ అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు అవయవ వర్తక రాకెట్లు తయారవుతున్నాయని వివరించారు. అందువల్ల దోషులకు మరణ శిక్ష విధించేలా చట్ట సవరణ చేయాలని కోరారు. -
కేన్సర్ హాస్పిటల్.. క్యాన్సిల్
మంత్రి నారాయణ స్వార్ధానికి ప్రాంతీయ కేన్సర్ వైద్యశాల ఎగిరిపోయింది. జిల్లా కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ కేన్సర్ వైద్యశాలను నెలకొల్పితే తన వైద్యశాలకు మనుగడకు ముప్పు తలెత్తుతుందని తరలించేశారు. ఘనత వహించిన పాలకుల నిర్లక్ష్యానికి కేన్సర్ ఆస్పత్రి దూరమైంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేశారు. పేదోడికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చారు. జిల్లా కేంద్రంలో కేన్సర్ ఆస్పత్రికి కేంద్రం రూ.45 కోట్లు మంజూరు చేస్తే చేజేతులారా క్యాన్సిల్ చేయించారు. పేదోలు కేన్సర్ వైద్యానికి జిల్లా ప్రజలు చెన్నై, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి తప్పడం లేదు. సాక్షి, నెల్లూరు (బారకాసు): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రి ప్రాంగణంలో ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి కలగానే మిగిలిపోయింది. ఏడాది క్రితం కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.45 కోట్లు నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే జిల్లా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేజారిపోయింది. నెల్లూరు నగరంలో నూతనంగా అత్యాధునిక వసతులతో ఏర్పాటైన ప్రభుత్వ బోధనాస్పత్రికి అనుబంధంగా అదే ప్రాంగణంలో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని 2014లో అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కేంద్రానికి ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు రేడియేషన్ అంకాలజీ (కేన్సర్ విభాగం) పోస్టును భర్తీ చేస్తూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసన్‌ను నియమించారు. ఆ తర్వాత 2015లో కేన్సర్ విభాగం ఏర్పాటుకు తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ప్రభుత్వ బోధనాస్పత్రి ప్రాంగణంలో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ 2015లో రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు అప్పటి కేంద్ర మంత్రి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. డాక్టర్ శ్రీనివాసన్ రెండు పర్యాయాలు నేరుగా వెంకయ్యనాయుడిని కలిసి కేన్సర్ ఆస్పత్రి ఆవశ్యకతపై నివేదికను అందజేశారు. నెల్లూరులో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు అంగీకారం ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 20 ప్రధాన కేన్సర్ ఆస్పత్రులను ఒక్కో ఆస్పత్రికి రూ.120 కోట్లు, 50 ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రులను ఒక్కో ఆస్పత్రికి రూ.45 కోట్లు నిధులు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటి కేంద్ర మంతిగా ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరుకు ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రిని కేటాయించాలని అందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. వెంకయ్యనాయుడు కృషితో నెల్లూరులో ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి కోసం రూ.45 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో 2016 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ప్రధాన కేన్సర్ ఆస్పత్రిని, నెల్లూరులో ప్రాంతీయ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి లేఖ రాసింది. కామ్‌గా.. క్యాన్సిల్ చేయించారు.. నెల్లూరులో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు ఉన్న వసతులపై కేంద్ర ప్రభుత్వం అదే ఏడాది జూన్‌లో వైద్యుల బృందాన్ని ఇక్కడి ప్రభుత్వ బోధనాస్పత్రికి పంపించింది. ఆ బృందం పరిశీలన అనంతరం నివేదికను కేంద్రానికి అందజేసింది. లోటు పాట్లను పూర్తి చేయగానే వెంటనే రూ.45 కోట్లు నిధులు ఇచ్చేందుకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఏసీఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేన్సర్ ఆస్పత్రి కమిటీతో చర్చించారు. ఈ మేరకు 2017 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ బోధనాస్పత్రి అధికారులు నివేదిక అందజేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు కొంత కాలం పట్టించుకోలేదు. దీంతో అదే ఏడాది ఆగస్టులో రెడ్‌క్రాస్ సంస్థ తాము కేంద్రానికి సంబంధించిన హోమిబాబా కేన్సర్ కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని, మీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా మంత్రులు పట్టించుకోవడం మానుకున్నారు. రెండేళ్ల పాటు వేచి చూసిన కేంద్ర ప్రభుత్వం నెల్లూరుకు ఇస్తామన్న రూ.45 కోట్లు నిధులను ఇతర ప్రాంతానికి కేటాయిస్తున్నామని తెలియజేయడంతో అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. విషయం తెలుసుకున్న కొందరు నెల్లూరుకు నష్టం జరుగుతోందని 2018 జనవరిలో కేన్సర్ ఆస్పత్రి సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని పోరాటాలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అప్పటి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రితో పాటు జిల్లా మంత్రులు రెడ్‌క్రాస్ ఒప్పుకోలేదు కాబట్టే నెల్లూరుకు ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు కుదరదని కారణాలు చెబుతూ వచ్చారు. వసతులున్నా.. నిర్లక్ష్యం నూతనంగా నిర్మించిన బోధనాస్పత్రిలో కేన్సర్ ఆస్పత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలంటే అందుకు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెటర్నిటీ, రేడియాలజీ, అనస్థిషియా విభాగాలతో పాటు ప్రత్యేకంగా 50 పడకలు ఉండాలనేది నిబంధన. ఈ నిబంధనలు ప్రస్తుతం నగరంలో ఉన్న ప్రభుత్వ బోధనాస్పత్రికి ఉన్నాయి. నెల్లూరులో ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి జిల్లా యంత్రాంగం, జిల్లా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు లేకపోవడంతో తరలిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేసి ఉంటే జిల్లా ప్రజలతో పాటు చుట్టు పక్కల ప్రకాశం, వైఎస్సార్ జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఏది ఏమైనా పాలకుల నిర్లక్ష్యం మనకు కేన్సర్ వైద్యశాల దూరమైంది. -
నిధులున్నా వినియోగించరా?
సాక్షి, అమరావతి : కేంద్రం నుంచి వచ్చిన నిధులను సకాలంలో వినియోగించి పనులు పూర్తిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడంతో తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఖజానాలో రూ.వందల కోట్ల నిధులున్నా వాటి వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఎప్పటికప్పుడు వినియోగించుకోవడం, ఖర్చు చేసిన నిధులకు వినియోగ పత్రాలు (యూసీలు) సమర్పించడంతో అదనపు నిధులను తెచ్చుకోగలిగాయి. కానీ, మన రాష్ట్రంలో అలా జరగకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఎంబీబీఎస్ సీట్ల పెంపు నుంచి పీజీ వైద్య సీట్ల పెంపు వరకూ, క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం నుంచి సూపర్ స్పెషాలిటీ బ్లాకుల వరకూ అంతటా సగం పనులు కూడా పూర్తికాలేదు. దీంతో రాష్ట్ర వ్యవహార శైలిపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇచ్చిన నిధులను వినియోగించుకోలేకపోయారని, వాటికి లెక్కలు కూడా చెప్పడంలేదని కేంద్రం ఆరోపిస్తోంది. యూసీలు ఇవ్వాలని పలుమార్లు కోరినా రాష్ట్రం స్పందించలేదని కేంద్ర అధికారులు చెప్పారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి రూ.551 కోట్లు గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు రూ.867 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.551.80 కోట్లు ఇచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిలో కేవలం రూ.41.05 కోట్లకు మాత్రమే యూసీలు ఇచ్చింది. అంతేకాక, ఇంకా రూ.239కోట్లకు పైగా నిధులు వ్యయం చేయాల్సింది ఉంది. అలాగే, ఇచ్చిన నిధులను వినియోగించుకోలేకపోవడం, వినియోగించిన నిధులకు లెక్కలు చెప్పకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోలేకపోయారు. ఉదాహరణకు.. అనంతపురం, విజయవాడలో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఒక్కో ఆస్పత్రికి రూ.150 కోట్లు ఇస్తే వాటికి అస్సలు లెక్కలు చెప్పనేలేదు. పైగా రాష్ట్ర సర్కారు ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వలేదు. దీంతో నిర్మాణాలు పూర్తికావచ్చినా అవి ప్రారంభానికి నోచుకోలేదు. ఇలా ఎన్నో పథకాలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. పీజీ వైద్య సీట్లు, యూజీ వైద్య సీట్ల పెంపునకు సైతం సరైన మౌలిక వసతులు కల్పించలేకపోవడంతో సీట్లు పెరగలేదు. నాలుగున్నరేళ్లలో పునాది కూడా వెయ్యలేదు రాష్ట్రం విడిపోయాక ఉన్న ఒక్క క్యాన్సర్ ఆస్పత్రి తెలంగాణకు పోయింది. దీంతో రాష్ట్రంలో స్టేట్ క్యాన్సర్ ఆస్పత్రి లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్‌ను ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ ఆస్పత్రి ప్రాజెక్టు వ్యయం రూ.120 కోట్లు. ఇందులో 60% కేంద్రం వాటా కాగా, 40% రాష్ట్ర వాటా. కానీ, నాలుగున్నరేళ్లుగా దీనికి పునాది రాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యలేకపోయింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటీవల వేశారు. అసలే రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ కేంద్రాన్ని సకాలంలో నిర్మించలేకపోయారని విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. -
రంగు దుప్పటి ఏమాయె?
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు రోజుకో రంగు చొప్పున వారంలో ఏడు రోజులకు ఏడు రంగుల దుప్పట్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల క్రితం రెండు రంగుల దుప్పట్లను సరఫరా చేసింది. వీటిలో ఇప్పటికే చాలా వరకు చిరిగిపోగా, మరికొన్ని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. అసలే కేన్సర్, కిడ్నీ, కాలేయం వంటి భయంకరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులు.. ఆపై ఎముకలు కొరికే చలిలో కప్పుకునేందుకు దుప్పటి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితి ఏ ఒక్క ఆస్పత్రికో పరిమితమైంది కాదు.. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్టీ, ఛాతి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మానసిక ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక వైపు పడకల్లేక రోగులు నేలపైనే చికిత్స పొందుతుండగా, ఉన్న పడకల్లో చాలావరకు పాడైపోయాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు విలవిల్లాడుతున్నారు. రోగులకు సహాయంగా వచ్చిన బంధువుల కోసం నిలోఫర్ ఆస్పత్రి ఆవరణలో నైట్‌షెల్టర్ ఏర్పాటు చేసినప్పటికీ.. వాటిలోనూ సరైన మౌలిక సదుపాయాలు లేవు. దీంతో రోగికి సహాయంగా వచ్చిన వారు ఆరుబయట చెట్టుకిందే గడపాల్సి వస్తోంది. ప్రసూతి ఆస్పత్రుల్లో మరీ దుర్భరం చారిత్రక ఉస్మానియా ఆస్పత్రుల్లోని ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులుకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆస్పత్రిలో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తుండడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. గాంధీలో సరిపడు దుప్పట్లు ఉన్నప్పటికీ వాటిని రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారు. దీంతో రోగులే వీటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పొరపాటున ఎవరైనా దుప్పటి తెచ్చుకోక పోతే రాత్రంగా చలికి వణకాల్సిందే. ఇక సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణులతో పాటు వారికి సహాయంగా వచ్చిన బంధువుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. కేన్సర్ రోగులు విలవిల ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో చేరి, సర్జరీ తర్వాత రేడియేషన్ కోసం ఎదురు చూస్తున్న రోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేక.. కేవలం సర్జరీ అవసరమైన వారికి మాత్రమే పడకలు కేటాయిస్తున్నారు. సర్జరీ తర్వాత సుమారు నెలరోజుల పాటు రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి అడ్మిషన్ లేకపోవడంతో వీరంతా బయటే ఉండాల్సి వస్తోంది. ప్రైవేటుగా గదులను అద్దెకు తీసుకునే స్తోమత లేక చాలామంది ఆస్పత్రి కారిడార్లలో మగ్గుతున్నారు. పడుకునేందుకు మంచం లేక కనీసం కప్పుకునేందుకు దుప్పటి కూడా లేకపోవడంతో చలికి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యం ఇలా.. ఉస్మానియా 1169 గాంధీ 1500 నిలోఫర్ 1000 నిమ్స్ 1500 ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి 450 పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి 450 సుల్తాన్ బజార్ ప్రసూతి 150 ఛాతి ఆస్పత్రి 670 ఈఎన్టీ 300 ఫీవర్ 330 -
ఎంఎన్‌జే స్వయం ప్రతిపత్తిపై సందేహాలొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిపై ఎలాంటి సందేహాలు, అపోహలు, పెట్టుకోవాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజలకు ఉచిత సేవలు అందించడంలో ఎలాంటి తేడాలుండబోవని ఆయన అన్నారు. అయితే నిర్ణీత నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని చెప్పారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ రంగంలో ఏకైక కేన్సర్ ఆసుపత్రి ఎంఎన్‌జే అని, అనేక ఏళ్ళుగా ప్రజలకు సేవలందిస్తూ వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లక్షలాది రూపాయల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తూ వస్తుందన్నారు. ఎంఎన్‌జేను 2006లోనే స్వయంప్రతిపత్తి గల ఆసుపత్రిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు ఉన్న నిబంధనల ప్రకారమే నియామకాలు, ఇతర వ్యవహారాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై అనవసర ఆందోళనకు గురికావద్దని ఎంఎన్‌జే డాక్టర్లు, ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి సూచించారు. -
క్యాన్సర్ కేంద్రంతో మెరుగైన సేవలు
పాలమూరు : మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన క్యాన్సర్ పాలియేటివ్ కేంద్రం ద్వారా రోగులకు మె రుగైన చికిత్స అందుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వె ల్లడించారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఏడు పడకల క్యాన్సర్ పాలియేటివ్ కేంద్రాన్ని సోమవారం ఆయన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడు, కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే రెండో పాలియేటివ్ కేంద్రం ఇక్కడ ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత ఆధునిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఉంటాయన్నారు. ఈ కేంద్రం ద్వారా క్యాన్సర్ తో బాధపడుతూ చివరి దశలో ఉన్న రోగులకు అండగా ఉంటూ అవసరమైన వైద్యం లభిస్తుందని తెలిపారు. త్వరలో జనరల్ ఆస్పత్రి వెనుక భాగం గా పాలియేటివ్ కేంద్రానికి శాశ్వత భవనం నిర్మించడంతో పాటు పది పడకలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. కాగా, జిల్లాలోని ఆస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన లేబర్ రూంలు ఏర్పాటుచేసి, గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ఎరుగైన వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఇక్కడే నిపుణులు ఉమ్మడి జిల్లా నుంచి ఎవరు కూడా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులను నియమించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారని.. దీంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇప్పుడు ఉన్న ఆస్పత్రి సరిపోవడం లేదనందున పక్కనే ఉన్న స్థలంలో మరో భవన నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధ, డీఎంహెచ్ఓ రజని, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డాక్టర్ మీనాక్షి, మల్లికార్జున్, మాస్ మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, సునీల్, శ్రీనివాసరాజు, డాక్టర్ రాధ, చక్రధర్‌గౌడ్, పరంజ్యోతి, సునందిని, సత్యనారాయణరెడ్డి, భీంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ జీవన్, అధికారులు పాల్గొన్నారు. 45మంది ఏఎన్ఎంలకు వాహనాలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన అమలవుతున్న ‘ప్రాజెక్టు రెక్కలు’ పథకంలో భాగంగా 45మంది ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలను మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యే, కలెక్టర్ అందజేశారు. నర్మద హోండ, అశ్విని హీరో షోరూం నుంచి ఏఎన్ఎంలకు వాటిని అందజేశారు. జిల్లాలో మొత్తం 270మంది ఏఎన్ఎంలకు మొదటి విడతలో 45మందికి వాహనాలు ఇచ్చారు. ఆనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ వాహనాల ద్వారా ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్యం అందించడానికి సలువుగా ఉంటుందన్నారు. ఎన్హెచ్ఎం కింద రూ.10వేలు, కలెక్టర్ నిధుల కింద రూ.5వేలు, షోరూం వాళ్లు రూ.3వేలు తగ్గింపు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. -
బేఫికర్!
పాలమూరు : చాపకిందనీ రులా వ్యాపిస్తున్న క్యాన్సర్ ఏటా అత్యధిక మంది మరణానికి కారణమవుతోంది. ఈ వ్యాధి సుమారు 200 రూపాల్లో ప్రజలకు సోకుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మారుతున్న వాతావరణం.. జీవన విధానంలో మార్పు కారణంగా రక్త క్యాన్సర్, రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, ఊపిరితిత్తులు ఇలా ఒకటేమిటి మానవ శరీరంలోని అన్ని అవయవాలన్నింటికి క్యాన్సర్ సోకుతోంది. ఈ వ్యాధిపై ప్రజలకు పూర్తిస్థాయి అవగహన లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చికిత్సల కోసం కుటుంబసభ్యులు ఆస్తులను తాకట్టుపెట్టి వైద్యం చేయిస్తున్నారు. ఇకపై ఆ అవస్తలు ఉండకుండా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించనున్న మంత్రి ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి ఆవరణలో 7 పడకలతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగాన్ని నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడు, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రారంభించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆస్పత్రి అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన క్యాన్సర్ విభాగం నిర్వహణ పెయిన్ రిలీఫ్ అండ్ పాలియేటివ్ కేర్ సోసైటీ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ విభాగంలో తాత్కాలికంగా ఈ–సేవ భవనంలో రూ.4.50 లక్షలు ఖర్చు చేసి పూర్తిగా ఆధునీకరించారు. దీనిని 24గంటల పాటు రోగులకు వైద్య సేవలు అందేవిధంగా ఏర్పాటు చేశారు. త్వరలోనే టీబీ ఆస్పత్రి భవనాన్ని పూర్తిగా తొలగించి ఆ స్థానంలో క్యాన్సర్ ఆస్పత్రి కోసం నూతన భవనం నిర్మాణం చేయాలని నిర్ణయించారు. సొసైటీ సభ్యులు ఆస్పత్రి నిర్వహణ ఖర్చు, వైద్యులు, సిబ్బంది, వైద్యానికి అవసరం అయిన పరికరాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల రోగ నిర్దరణతోపాటు బాధితులకు వైద్య సేవలు అందనున్నాయి. రోగులకు అవసరమైన పరీక్షలు, ఇతర సేవలు అమల్లోకి రానున్నాయి. ఆస్పత్రిలో ఓపీ చికిత్సతో పాటు, ఇన్ పేషంట్ విధానం, ఇంటికి వెళ్లి క్యాన్సర్ రోగులకు సేవ చేసే విధానానికి కూడా శ్రీకారం చూట్టారు. జిల్లాలో క్యాన్సర్ రోగులను గుర్తించడంతో పాటు వారి ఇంటికి వెళ్లి అవసరం అయిన పరీక్షలు, చికిత్స చేయడంతో పాటు ఉచితంగా మందులు కూడా ఇస్తారు. రోగి చివరి దశలో ఉన్నా వైద్యం అందిస్తారు. వైద్యుల కేటాయింపు క్యాన్సర్ విభాగంలో ఒక వైద్యుడు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఫిజియె థెరపిస్టులు, ఒక కౌన్సిలర్, నలుగురు ఆయాలు, ఒక డ్రైవర్ అందుబాటులో ఉంటారు. వీరి నిర్వహణ సంస్థ చూసుకున్నా జీతాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతాయి. అయితే ఇప్పటికే వీరిని ఎంపిక చేసి రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. అవగాహన తప్పనిసరి క్యాన్సర్‌పై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేదు. గతంలో వయసు పైబడిన వారికి, చెడు అలవాట్లకు లోనైన వారికి మాత్రమే ఈ వ్యాధి వస్తుందని ప్రజలు భావించేవారు. మారిన జీవన పరిస్థితుల కారణంగా అప్పుడే జన్మించిన చిన్నారుల నుంచి పండు ముసలి వరకు అందరు కూడా ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారు. ఈ ఏడాదిలో జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, నారాయణపేటలకు చెందిన ముగ్గురు పసికందులు ప్రాణాంతక బ్రెయిన్ కేన్సర్ బారినపడ్డారు. పు ట్టకతోనే వారి మెదడులో ఉండే నాడీకణాల్లో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించి చికిత్సకు హైదరాబాద్ పంపారు. మహిళల్లో అధికం.. మహిళల్లో పెరుగుతున్న గర్భాశయ, రొమ్ము క్యాన్స ర్లపై కూడా ఎవరికీ అవగాహన ఉండటం లేదు. వ్యాధి సోకుతున్న వారిలో గ్రామీణ ప్రాంతాల వారే అధికం గా ఉంటున్నారు. గతంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సరు 50 ఏళ్లపైబడి మోనోపాజ్ దశలో ఉన్న వారికే మాత్రమే వచ్చేది. ప్రస్తుతం యుక్త వయస్సు వారిలో ఇది వస్తున్నట్లు ఇటీవల ఎస్వీఎస్లో జరిగిన సదస్సులో వైద్యులు వెల్లడించారు. హూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. బాల్య వివాహాలు, సుఖవ్యాధులు, పౌష్టికాహారలోపం, ఎక్కువ మంది పిల్లలను కనటం ఇందుకు కారణంగా చెబుతున్నారు. జిల్లాలో 90 శాతానికి పైగా రొమ్ము క్యాన్సరు బాధితులు వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యుల వద్దకు వెళుతున్నారు. చిన్నచిన్న గడ్డలను గుర్తించినా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వారందరికి జనరల్ ఆస్పత్రి ఆవరణంలో ఏర్పాటు చేయబోతున్న క్యాన్సర్ ఆస్పత్రితో ఎంతో మేలు జరగనుంది. -
వరంగల్‌లో కేన్సర్ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత తరానికి సవాలుగా మారుతున్న కేన్సర్ నివారణ, చికిత్సపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు శాసిస్తున్న కేన్సర్ చికిత్సను ప్రభుత్వ పరంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే దాదాపు 350 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి ఉంది. అక్కడ పడకల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎక్కువ మందికి చికిత్స అందించేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో ఎంఎన్‌జే ఆస్పత్రి తరహాలోనే వరంగల్‌లో మరో కేన్సర్ ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.120 కోట్ల వ్యయంతో 250 పడకల సామర్థ్యంతో కొత్త ఆస్పత్రిని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు వైద్య విద్య సంచాలకుడి కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించేలా ప్రణాళిక ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఆస్పత్రి నిర్మాణానికి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్రంలో ఏటా 60 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారు. కేన్సర్ నివారణకు దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రానికి కొత్త ఆస్పత్రి మంజూరైంది. జిల్లాల్లో కేన్సర్ నిర్ధారణ కేంద్రాలు.. కేన్సర్‌ను ముందుగానే గుర్తించి మరణాల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జిల్లా స్థాయిలో కేన్సర్ నిర్ధారణ, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఆస్పత్రుల్లో 15 చొప్పున పడకలను ప్రత్యేకంగా కేన్సర్ రోగులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’లో భాగంగా కేన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అలంపూర్‌లో 100 పడకల ఆస్పత్రి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.23.38 కోట్లను మంజూరు చేసింది. ఈ ఆస్పత్రిలో 50 పడకలను సాధారణ వైద్య సేవలకు, మరో 50 పడకలను మాతాశిశు వైద్యానికి కేటాయించాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
టీటీడీతో భాగస్వామ్యం గొప్పవరం: రతన్ టాటా
సాక్షి, తిరుమల: కేన్సర్ ఆస్పత్రి నిర్మాణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో భాగస్వామ్యం కావటం గొప్పవరమని టాటా సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా అన్నారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం మహదానందంగా ఉందన్నారు. కాగా, రతన్‌టాటా, టాటా సంస్థల ప్రస్తుత చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం కల్పించారు. పండితులు వేద ఆశీర్వాదంతో పాటు శ్రీవారి పట్టువస్త్రంతో సత్కరించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఉన్నారు. -
కేన్సర్ రోగులకు వెంకన్న అభయం
⇒ టీటీడీ స్థలంలో టాటా ట్రస్ట్ కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం ⇒ట్రస్టు ద్వారా రూ.100 కోట్లు , భక్తుల విరాళాలు మరో రూ.40 కోట్లు ⇒రెండేళ్లలో పూర్తికి సన్నాహాలు ⇒ఇప్పటికే నిర్మాణదశలో అరవింద్ కంటి ఆస్పత్రి ఆపదమొక్కులవాడి పాదాల చెంత తిరుపతిలో ఇప్పటికే స్విమ్స్, బర్డ్ ఆస్పత్రులు అత్యా«ధునిక వైద్యసేవలు అందిస్తున్నాయి. ఇదే తరహాలో కేన్సర్ రోగులకూ వెంకన్న అభయ హస్తం అందించనున్నాడు. ధార్మిక సంస్థకు చెందిన 25 ఎకరాల స్థలంలో కేన్సర్ ఆస్పత్రి నెలకొల్పేందుకు టాటా ట్రస్టు ముందుకొచ్చింది. రూ.140 కోట్ల అంచనాలతో ఈ కేన్సర్ ఆస్పత్రి ద్వారా రోగులకు ప్రపంచ స్థాయి వైద్యం అందుబాటులోకి రానుంది. ఇదే తరహాలోనే టీటీడీ సహకారంతో అరవింద్‌కంటి ఆస్పత్రి కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణ దశలో ఉంది. తిరుమల: తిరుపతిలో టీటీడీ సహకారంతో టాటా ట్రస్టు కేన్సర్ ఆస్పత్రి నిర్మించనుంది. ఈ నిర్మాణానికి టీటీడీ రూ.25 ఎకరాల స్థలాన్ని లీజు కింద కేటాయించింది. రూ.100 కోట్లు టాటా ట్రస్టు, మరో రూ.40 కోట్లు దాతల విరాళాలతో టీటీడీ ఆర్థిక సహకారం అందించనుంది. ఓ అజ్ఞాత భక్తుడు రూ.33 కోట్లు టీటీడీకి అందజేశాడు. రెండేళ్లలో ఆస్పత్రిని కేన్సర్ రోగులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో టీటీడీ, టాటా ట్రస్ట్‌ల మధ్య శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతిలో అరవింద్ కంటి ఆస్పత్రి కూడా నిర్మాణదశకు చేరింది. ‘శ్రీవేంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్’, పరిశోధన, శిక్షణా కార్యాలయాల పేరుతో దీనిని రూ.100 కోట్ల అంచనాలతో నిర్మించనున్నారు. టీటీడీ అలిపిరికి సమీపంలోని ఏడెకరాల స్థలాన్ని లీజు కింద కేటాయిం చింది. పనులు 15 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఏడాదిలోపు ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువాలని లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు. రోగులకు అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న స్విమ్స్ టీటీడీ సహకారంతో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తోంది. ఇప్పటికే ప్రాణదానం ట్రస్టు ద్వారా గుండె ఆపరేషన్లతో రోగులకు ప్రాణదానం చేస్తోం ది. స్విమ్స్ ఇన్, ఔట్ పేషెంట్లు రోజూ సుమారు 2,300 మంది వైద్యసేవలు పొందుతున్నారు. ఏటా సుమారు 7 లక్షల మంది రోగులకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందిస్తోంది. మరోపక్క పోలియో వైద్యం, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి నుంచి సమగ్ర వెన్నుపూస శస్త్ర చికిత్స వరకు రోగులకు తక్షణ వైద్య సేవలు అందించే దిశగా టీటీడీ బర్డ్‌ను అభివృద్ధి చేసింది. తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలలో పడకల సంఖ్య 300కి పెంచారు. భవనం నిర్మాణం పూర్తయింది. భవనం అందుబాటులోకి వస్తే ప్రసూతి వైద్యసేవలు కూడా సులభతరం కానున్నాయి. భవన వినియోగంపై వివాదం ఉంది. -
తిరుపతిలో రూ.140 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి
తిరుమల: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా సంస్థ దీనిని నిర్మించనుంది. టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం విషయాన్నితెలియచేశారు. శుక్రవారం శ్రీవారి ఆలయంలో ఆ మేరకు టాటా ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరమణన్, టీటీడీ ఈవో సాంబశివరావు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్, ఎండీ వెంకటరమణన్ మాట్లాడుతూ రెండేళ్లలోనే వైద్యశాల నిర్మాణ పనుల పూర్తి చేసి కేన్సర్ రోగులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం తిరుపతి అలిపిరికి సమీపంలో 25 ఎకరాల టీటీడీ స్థలాన్ని లీజు కింద టాటా ట్రస్టుకు కేటాయించామన్నారు. రూ.140 కోట్లతో నిర్మించనున్న ఈ ఆస్పత్రికి టాటా ట్రస్టు ద్వారా రూ.100 కోట్లు, రూ.40 కోట్లు భరించేందుకు కొందరు దాతలు ముందుకొచ్చారన్నారు. టాటా ట్రస్టు వారు ఇప్పటికే ముంబాయి, కోల్‌కత్తాలో కేన్సర్ వైద్యశాలలు నిర్వహిస్తున్నారని, త్వరలో తిరుపతిలో వైద్యశాలను నిర్మించి కేన్సర్ రోగులను విశేష సేవలందిస్తుందని వివరించారు. టాటా సంస్థల ట్రస్టీ ఆర్కె.క్రిష్ణకుమార్, టీటీడీ అదనపు ఎఫ్ఎ అండ్ సీఏవో బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో కోదండరామారావు పాల్గొన్నారు. కాగా, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రవాస భారతీయ భక్తుడు రూ.33 కోట్ల విరాళం ఇప్పటికే అందజేయటం విశేషం. -
హత్యాయత్నానికి పాల్పడ్డారు...!
పోలీసులను ఆశ్రయించిన ‘బసవ తారకం’ క్యాన్సర్ ఆస్పత్రి పరిశోధకులు హైదరాబాద్: గుర్తు తెలియని పదార్థాన్ని పాలల్లో కలిపి ఇచ్చి తమపై హత్యాయత్నాని కి పాల్పడ్డారంటూ హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధకులు శనివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి ఆర్ అండ్ డీ హెడ్ డాక్టర్ వీవీటీఎస్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. గత ఆరేళ్ల నుంచి తనతోపాటు కపిల్ షా, సతీశ్, సరిత, సౌమ్య, సారిక, శ్రీవాణి తదితర రీసెర్చ్ స్కాలర్లు ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 3న ఆస్పత్రి ఉద్యోగి తమకు ఇచ్చిన పాలు ఉప్పగా, తేడాగా ఉన్నాయని, తాగిన తర్వాత కొన్ని సందేహాలు తలెత్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై అదేరోజు ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. ఆర్ అండ్ డీ నిధులను ఆస్పత్రి నిర్వహణకు మళ్లించడం వల్ల రెండు నెలల నుంచి ఆర్అండ్ డీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల రీసెర్చ్ స్కాలర్లు ఆందోళనకు గురవుతున్నా రని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బసవతారకం ఆస్పత్రిలో కలకలం రేపింది. -
రాష్ట్రంలో రెండు కేన్సర్ వైద్య కేంద్రాలు
♦ రూ.200 కోట్లతో ఆదిలాబాద్, వరంగల్‌లలో ఏర్పాటుకు యోచన ♦ కేంద్ర ఆర్థిక సహకారంతో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ప్రాంతీయ కేన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. దీనికి సంబంధించి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఆదిలాబాద్, వరంగల్‌లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక్కో కేంద్రానికి రూ.100 కోట్ల చొప్పున ఖర్చవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ ప్రాంతీయ కేన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎంఎన్‌జేపై పెరిగిన ఒత్తిడి తెలంగాణ, ఏపీలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రే కీలకంగా మారింది. ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి రోజుకు 500 మందికి పైగా రోగులు వస్తుంటారు. ఏడాదికి లక్ష మందికిపైగా రోగులు చికిత్సానంతర వైద్యం కోసం వస్తుంటారు. మరోవైపు కేన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ఎంఎన్‌జే ఆస్పత్రిలో పడకల సంఖ్య, వైద్య సిబ్బంది సరిపోక.. వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతు న్నారుు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారంతో వరంగల్, ఆదిలాబాద్‌లలో ప్రాంతీయ కేన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో అందే సేవలన్నీ కూడా వాటిలో అందిస్తే.. రోగులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. స్క్రీనింగ్ సహా కేన్సర్ నిర్ధారణ పరీక్షలు ప్రాంతీయ కేంద్రాల్లో చేయడం వల్ల ఎంఎన్‌జేపై ఒత్తిడి తగ్గించే అవకాశం ఉంటుంది. పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ప్రస్తుతం ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో 266 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. పడకల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరుగుతుండటంతో అదనంగా 288 పోస్టులు అవసరమని ఎంఎన్‌జే అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం 100 పోస్టులనే మంజూరు చేసినట్లు తెలిసింది. ఇందులో 50 డాక్టర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. మిగతా 50 పోస్టుల్లో నర్సులు, రేడియో థెరఫిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది. -
క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళం
నెల్లూరు(అర్బన్): నగరంలోని ఇండియన్ రెడ్‌క్రాస్ క్యాన్సర్ ఆస్పత్రికి హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ కంపెనీ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రిలో ఆ కంపెనీ చైర్మ , ఎండీ మంతెన వెంకటరామరాజు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆస్పత్రి పేద రోగులకు సేవలు చేస్తున్నందున తాను విరాళం అందచేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎవీ సుబ్రహ్మణ్యం, గాంధీ ఆశ్రమం కన్వీనర్ కృష్ణారెడ్డి, మహావీర్ జైన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి జేపీ జైన్, డాక్టర్ లక్ష్మీ, కన్యాకుమారి పాల్గొన్నారు. -
కేన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి
- ఆస్పత్రిని పరిశీలించిన సీపీఐ జిల్లా నేతలు అనంతపురం: అనంత శివారులోని కేన్సర్ ఆస్పత్రిని సీపీఐ నేతల బృందం శుక్రవారం పరిశీలించింది. ఆస్పత్రి అందిస్తున్న వైద్య సేవలు, ఎలాంటి లోపాలున్నాయి, ఇంకా ఎలాంటి వైద్య పరికరాలు కావాలన్న విషయాలను వైద్యులు, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ మాట్లాడారు. క్యాన్సర్ ఆస్పత్రి జిల్లా కేంద్రంలో ఉందంటే చాలా సంతోషించామని తెలిపారు. ఆస్పత్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మెడికల్ కళాశాల ఆవరణలో మంచి అధునాతన భవనాలు ఉన్నా కేన్సర్ వ్యాధికి చికిత్స అందించేందుకు సరైన వైద్యులు, సిబ్బంది లేరన్నారు. వ్యాధి నిర్థారణకు అవసరమైన అధునాతన రేడియేషన్ మిషన్, ఆపరేషన్ థియేటర్, మెమోగ్రాఫ్, ఎక్స్‌రే, సిటీస్కాన్, ఎంఆర్ఐ, పెట్‌స్కాన్, రక్త పరీక్షలు అంబులెన్స్ తదితర మిషన్లు ఆస్పత్రిలో లేవన్నారు. కేవలం ఇద్దరు డాక్టర్లు, ఒక టెక్నీషియన్ మాత్రమే ఉన్నారన్నారు. దీంతో రోగులకు వారు మెరుగైన సేవలందించడం ఎలా సాధ్య పడుతుందని అన్నారు. కేన్సర్ ఆస్పత్రిలోనే సర్జికల్ అంకాలజిస్ట్, మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్లను తక్షణం నియమించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. నగర కార్యదర్శి సి.లింగమయ్య, అల్లీపీరా, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రాజేష్‌గౌడ్, మహిళా సమాఖ్య నగర అధ్యక్ష, కార్యదర్శులు పద్మావతి పాల్గొన్నారు. -
కేన్సర్ చికిత్సకు త్వరలో ‘రోబో’
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి రోబో మెషీన్‌ను మంజూరు చేసిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: కేన్సర్ శస్త్రచికిత్సల కోసం త్వరలోనే హైదరాబాద్‌కు రోబో రాబోతోంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రితోపాటు తమిళనాడులోని అడయార్ ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రికి, బెంగళూరులోని కిద్వాయ్ ప్రభుత్వ ఆస్పత్రికి కూడా కేంద్ర ప్రభుత్వం రోబోలను మంజూరు చేసింది. ఈ రోబో విలువ రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఎంఎన్‌జేకు మంజూరైన కేన్సర్ రోబో మెషీన్ అత్యంత ఆధునిక వైద్య సేవలకు ఉపయోగించేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సలో అత్యాధునిక సేవలంటే ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్సలే. చిన్నగాటు వేసి నొప్పిలేకుండా చేస్తున్న వాటినే ల్యాప్రోస్కోపీ చికిత్సలంటారు. దీనికి మించి మెరుగైన సేవలను రోబో అందిస్తుంది. దీనిపై ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి డెరైక్టర్ డా.జయలత స్పందిస్తూ.. రోబో మెషీన్ మంజూరైన విషయం వాస్తవమని, ఇది ఆస్పత్రికి వచ్చేందుకు ఏడాది సమయం పట్టే అవకాశముందన్నారు. దీనివల్ల కేన్సర్ రోగులకు అద్భుతమైన సేవలు అందుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేన్సర్ ఆస్పత్రులే లేకపోవడం వల్ల ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఎలాంటి మేలు జరగలేదు. కాగా ఏపీనుంచి కూడా పేద రోగులు ఇప్పటికీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికే వస్తున్నారు. రోబోతో మెరుగైన సేవలు ► మంజూరైన 3 రోబో మెషీన్లు అత్యాధునికమైనవి. ► ల్యాప్రోస్కోపీ కంటే చిన్నగాటుతో శస్త్రచికిత్సలు చేయడం రోబో వల్ల సాధ్యమవుతుంది ► ఒక్కరోజులో రోగి కోలుకునే అవకాశం ఉంటుంది ► రోబో మెషీన్ ప్రొస్టేట్ కేన్సర్ శస్త్రచికిత్సలకు బాగా ఉపయోగపడుతుంది ► రోబో సర్జరీలో కడుపులోకి చొప్పించే పరికరంలో అత్యంత ఆధునిక కెమెరా ఉంటుంది. దీనికి 3 వైపుల నుంచి టిష్యూస్ను గుర్తించే సామర్థ్యం ఉంటుంది. ► దీనివల్ల అతిపెద్ద కణితుల నుంచి, అతి సూక్ష్మమైన వాటిని తొలగించడం సాధ్యమవుతుంది ► రక్తస్రావం తగ్గిపోవడం, ఆస్పత్రిలో ఉండాల్సిన రోజులు తగ్గడం, చిన్నగాటు, త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుంది ► రోబోటిక్ సర్జరీకి ఒక్కో రోగికి రూ.70 వేల విలువైన డిస్పోజబుల్స్ వాడాల్సి ఉంటుంది -
క్రిష్ కళ్లు చెమర్చిన వేళ...
దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒక సమయంలో ఆయన కళ్లు చెమర్చాయి. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం నిర్వహించారు. బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణితో పాటు.. ప్రస్తుతం బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి'కి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు. అక్కడ చికిత్స పొందుతున్న పిల్లలకు బహుమతులు అందించి, వారితో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా క్రిష్ భావోద్వేగానికి గురయ్యాడు. 'మా అమ్మను ఈ ఆసుపత్రికే తీసుకొచ్చాను.. ఆసుపత్రి అంతా నాకు తెలుసు.. మా అమ్మను నేను అమ్మలా చూసుకోవడం వేరు.. ఇక్కడి డాక్టర్లు ఆమెను అమ్మలా చూసుకోవడం వేరు.. ఎందరో తల్లులకు, ఎందరో పేదలకు ఈ ఆసుపత్రి అద్భుతమైన వైద్యం అందిస్తోంది..' అని చెబుతూ క్రిష్ చెమర్చిన కళ్లతో వ్యాఖ్యానించాడు. ఇంతటి ఘనత ఉన్న ఆసుపత్రికి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలకృష్ణ, ఈ ఆసుపత్రి కోసం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయమని క్రిష్ అన్నాడు. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా గురించి చెప్పడం కన్నా, 56 ఏళ్ళ బాలకృష్ణ, సెట్స్‌లో చిన్న పిల్లాడిగా మారిపోతాడనీ, అదే సమయంలో తమకు మార్గదర్శిగా కన్పిస్తాడని చెప్పాడు క్రిష్. ''నేను చాలా చిన్నవాడ్ని.. కానీ నేను చెప్పింది సెట్స్‌లో ఎంతో ఆసక్తితో గమనిస్తారు బాలయ్య. అది ఆయన గొప్పతనం. ఆయన నిత్య విద్యార్థి. దర్శకుడిగా మాత్రమే నేను షూటింగ్ జరుగుతున్న సమయంలో టీచర్‌గా ఉంటాను. మిగతా సమయాల్లో మాత్రం మాలో బాలయ్య స్ఫూర్తిని నింపుతారు. మాకు మార్గదర్శిలా వ్యవహరిస్తారు..'' అంటూ బాలయ్య గురించి క్రిష్ చెప్పుకొచ్చాడు. ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని రూపొందించే బాధ్యత తనకు అప్పగించినందుకు ఎప్పటికీ బాలయ్యకు రుణపడి ఉంటానని క్రిష్ అన్నాడు. -
విశాఖలో అపోలో క్యాన్సర్ ఆస్పత్రి
♦ 6 నెలల్లో వైద్య సేవలు అందుబాటులోకి ♦ అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని హెల్త్‌సిటీలో ప్రపంచశ్రేణి ప్రమాణాలతో వంద పడకల క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు అపోలో ఆస్పత్రుల గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మరో ఆరు నెలల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర శివారులోని హెల్త్‌సిటీలో రూ.150 కోట్లతో ఎనిమిది ఎకరాల్లో నిర్మించిన ఆస్పత్రిని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. 250 పడకలున్న ఈ ఆస్పత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రిని విస్తరిస్తామన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 1.64 లక్షల పల్మనరీ సర్జరీలు చేశామన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ 35 దేశాలతో టెలిమెడిసిన్ కనెక్టివిటీ కలిగి ఉందన్నారు. గుండె శస్త్రచికిత్సలు విదేశాల్లో కంటే భారత్‌లోనే తక్కువ ఖర్చుతో అవుతున్నాయన్నారు. గుండె మార్పిడికి అమెరికాలో 6.5 లక్షల డాలర్లవుతుంటే భారత్‌లో 50 వేల డాలర్లకే జరగుతున్నాయని చెప్పారు. అందువల్ల ఇతర దేశాల నుంచి మనదేశానికే ఎక్కువ మంది హృద్రోగ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలకు వస్తున్నారన్నారు. భారత్‌లో 2030 నాటికి గుండెజబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి అంటుయేతర వ్యాధుల(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్)తో మరణించే వారి సంఖ్య 3.60 కోట్లకు చేరుకుంటుందని ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఇది ఇతర దేశాలతో పోల్చుకుంటే 4 రెట్లు అధికమన్నారు. విలేకరుల సమావేశంలో అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్, సీఈవో డాక్టర్ సందీప్ పాల్గొన్నారు. -
కేన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
లుథియానా: పంజాబ్‌లోని లుథియానాలో సోమవారం ఓ ప్రైవేట్ కేన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. చండీఘడ్‌కు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక నగరం షేర్పూర్ ప్రాంతంలో మోహన్ దాయి కేన్సర్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో రోగులు ఉన్న గదుల్లోకి మంటలు వ్యాపించడంతో చిన్నారులు సహా 130 మంది రోగులు, ఆస్పత్రి సిబ్బందిని అక్కడి నుంచి తరలించామని, అందరూ క్షేమంగా ఉన్నట్టు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. అత్యవసర చికిత్స విభాగంలో ఉన్న రోగుల్లో ముగ్గురిని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు తరలించినట్టు తెలిపారు. ఈ రోజు ఉదయం తొలుత ఆస్పత్రిలోని లాబొరేటరీలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. పెద్ద ఎత్తునా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది విశ్వయత్నం చేసిన ఫలితం లేకపోయింది. చివరికి అగ్నిమాపక బ్రిగేడ్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్టు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. -
భారత్‌లో యూనివర్సల్ క్యాన్సర్ ఆసుపత్రి
* స్పోర్ట్స్ మెడిసిన్ కేంద్రం కూడా యూనివర్సల్ ఎండీ షబీర్ నెల్లికొడె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అబుదాబికి చెందిన యూనివర్సల్ హాస్పిటల్ బెంగళూరులో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. 360 పడకల సామర్థ్యంతో 2017 నాటికి నిర్మాణం పూర్తి కానుంది. ప్రోటాన్ థెరపీ విధానంలో రోగులకు చికిత్స అందించనున్నారు. అలాగే క్యాన్సర్ చికిత్స పద్ధతులపై పరిశోధన కేంద్రాన్ని సైతం నెలకొల్పనుంది. అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్న బెంగళూరు ఫెసిలిటీకి రూ.6,500 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఎండీ షబీర్ నెల్లికొడె ఆదివారం తెలిపారు. 9.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. ఐఎస్బీలో జరిగిన లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశోధన కేంద్రంలో పాలు పంచుకోవాల్సిందిగా స్టార్టప్ కంపెనీలు, వైద్యులు, పరిశోధకులను ఆహ్వానిస్తామన్నారు. స్పోర్ట్స్ మెడిసిన్, రిహాబిలిటేషన్ కేంద్రం సైతం ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామన్నారు. మానవ వనరుల లభ్యత, తక్కువ వ్యయం కారణంగానే భారత్‌లో అడుగు పెట్టామన్నారు. యూనివర్సల్‌కు దుబాయి, షార్జా, అబుదాబి, కువైట్, ఖతార్‌లో మొత్తం ఆరు ఆసుపత్రులు ఉన్నాయి. భవిష్యత్ మార్కెట్‌గా భారత్‌ను అభివర్ణించిన కంపెనీ.. రానున్న రోజుల్లో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. స్మాల్ వర్షన్ జాగ్వార్.. టాటా మోటార్స్ భారత్‌కు స్మాల్ వర్షన్ జాగ్వార్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ విషయాన్ని కంపెనీ వాణిజ్య వాహనాల విభాగం ఈడీ రవి పిషరోడి ధ్రువీకరించారు. అయితే ఈ కారు గురించి మరిన్ని విషయాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కారు ధర రూ.50 లక్షల రేంజ్లో ఉంటుందని చెప్పారు. -
నేను సీఎం అయ్యే పరిస్థితి రాదు
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ * రాష్ట్రంలో ఎప్పటికీ చంద్రబాబే సీఎం సాక్షి, హైదరాబాద్: ఏపీకి తాను ముఖ్యమంత్రిని అయ్యే పరిస్థితి రాదని హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి చైర్మన్ నంద మూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. కేన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవంలో సోమవారమిక్కడ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి మీరు సీఎం అవుతారని వార్తలు వస్తున్నాయి కదా? అని మీడియా ప్రశ్నించగా.. ‘పరిస్థితి అంతవరకూ రాదు. అలాంటిదేమీ లేదు’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు నిరాటంకంగా అదే పదవిలో కొనసాగుతారని వెల్లడించారు. అడ్డంకులు ఎన్ని ఎదురైనా రాష్ట్రం లో ఎప్పటికీ చంద్ర బాబే సీఎంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అయితేనే రాష్ట్రాన్ని, పార్టీని సమర్థంగా నడపగలరని అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకే తాను వచ్చానని, అందువల్ల రాజకీయాలు మాట్లాడబోనన్నారు. ఏపీలోనూ ఇదే తరహా క్యాన్సర్ ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
సేవ మన తత్వం
‘సేవాతత్పరత అనేది భారతీయుల రక్తంలోనే ఉంది. సేవాగుణంలో ప్రపంచానికే మార్గదర్శనం చేసిన ఎందరో మహనీయులు ఇక్కడ పుట్టారు’ అని అంటున్నారు ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు మహేష్‌భట్. నగరవాసి నిర్వహిస్తున్న రైస్ బకెట్ చాలెంజ్‌కు మద్దతుగా తొలుత ఆయన తాజ్ ఫలక్‌నుమా వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత బంజారాహిల్స్‌లోని కేన్సర్ ఆసుపత్రి దగ్గర అన్నార్తులకు బిర్యానీ ప్యాకెట్ల పంపిణీనిప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కరణ్ జోహార్‌కు రైస్ బకెట్ చాలెంజ్‌ను విసురుతున్నట్టు ప్రకటించిన ఆయన మాట్లాడుతూ ‘ రైస్ బకెట్ చాలెంజ్ అనే నిరుపేదలకు ఉపకరించే కార్యక్రమం రూపుదిద్దినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఈ ప్రోగ్రాం డిజైన్ చేసింది హైదరాబాదీ కావడం ఈ నగరవాసులు గర్వించాల్సిన విషయం’ అనికొనియాడారు. తెలుగు సినిమా రూపొందించడంపై మాట్లాడుతూ.. ‘ప్రాంతీయ భాషల్లో సినిమా తీసే ఆలోచన లేదు. కాబట్టి, తెలుగు సినిమా తీసే అవకాశం లేదు. అయితే ఎన్టీయార్, ఏఎన్నార్ లాంటి గొప్ప నటులున్న రంగంగా తెలుగు సినీ రంగం మీద నాకు చాలా గౌరవం ఉంది’ అన్నారు. కాగా, శృంగారభరిత చిత్రాలను రూపొందించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘ప్రేక్షకులు వాటినే ఆదరిస్తున్నారు. నేను సిటీలైట్ అనే క్లాసిక్ మూవీ తీస్తే ఎవరూ చూడలేదు. అదే జిస్మ్, మర్డర్.. సూపర్‌హిట్ అయ్యాయి. అందుకే అలాంటి సినిమాలే ఎక్కువ తీస్తున్నారు. ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలే ఎవరైనా తీయాలనుకుంటారని, వారికి నచ్చని సినిమాలు తీసి చేతులు కాల్చుకోవాలని ఎవరూ అనుకోరని’ అన్నారాయన. - ఎస్.సత్యబాబు -
'కర్నూలులో రూ. 45 కోట్లతో కేన్సర్ ఆసుపత్రి'
కర్నూలులో రూ. 45 కోట్ల వ్యయంతో కేన్సర్ ఆసుపత్రి నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మంత్రి కామినేని శ్రీనివాస్ తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. స్విమ్స్‌లో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రం, రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ... గుంటూరు, విజయవాడల మధ్య ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకంలో సమూలంగా మార్పులు తీసుకు వస్తామన్నారు. అలాగే ఎన్టీఆర్ హెల్త్ కార్డులతో నిరుద్యోగులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి కామినేని శ్రీనివాస్ తిరుమలలో విఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
మెడికల్ సీట్లు కాపాడుకోవాలి
- ఎంసీఐ తనిఖీ మళ్లీ జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదన - పరికరాలు, వైద్యుల కొరతపై స్పష్టత ఇవ్వండి - కేఎంసీ సమీక్ష సమావేశంలో డీఎంఈ పుట్ట శ్రీను. ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో పెరిగిన సీట్లకు అనుగుణంగా సౌకర్యాలు, వైద్య సిబ్బంది విషయంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) చేసిన తనిఖీలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు డీఎంఈ పుట్ట శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలలో ఆదివారం ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, కేఎంసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎస్. రమేశ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎం ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలో ఎంసీఐ తనిఖీలు నిర్వహించిన సమయంలో పెరిగిన 50 సీట్లకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేదని వారు అభిప్రాయపడినట్లు ఆయన వెల్లడించారు. తనిఖీల సందర్భంగా నిజామాబాద్‌లో 100 సీట్లు, గాంధీ ఆస్పత్రిలో 50 సీట్లు, కేఎంసీలో కూడా మరికొన్ని సీట్లు కోల్పోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేఎంసీలో సీట్లు కోల్పోకుండా ఉండేందుకు లోటుపాట్లను సవరించి తిరిగి ఎంసీఐ తనిఖీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఆస్పత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య మెడికల్ సీట్లకు తగినట్లుగా లేదని, వైద్యసిబ్బంది కొరత కూడా ఉందని, కళాశాల పరిధిలో విద్యార్థులకు 8 లెక్చరర్స్ హాల్స్ ఉండాల్సి ఉండగా నాలుగు మాత్రమే ఉన్నావని, పరికరాల కొరత తీవ్రంగా ఉందని ఎంసీఐ తన నివేదికలో పేర్కొనట్లు ఆయన తెలిపారు. వెంటనే ఆయా విభాగాలకు కావాల్సిన పరికరాల వివరాలతోపాటు సిబ్బంది కొరతను తనకు వెంటనే నివేదించాలని ఆయా విభాగాధిపతులను ఆదేశించారు. క్యాన్సర్ ఆస్పత్రి కోసం ప్రతిపాదనలు జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని కేఎంసీ ప్రిన్సిపాల్‌ను డీఎంఈ పుట్ట శ్రీనివాస్ ఆదేశించారు. వరంగల్‌లో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన వెల్లడించారు. ఎంజీఎం ఆస్పత్రిలో గత 11 నెలలుగా క్యాన్సర్ విభాగం మూతపడిన విషయాన్ని వైద్యులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయూలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పీజీ విద్యార్థులు డీఎంఈని కలిసి తమకున్న సమస్యలను వివరించారు. డీఎంఈ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. -
భారీ వర్షానికి ముగ్గురి దుర్మరణం
గోకులపాడు(కల్లూరు), న్యూస్‌లైన్: సమయానికి పరీక్షకు హాజరుకావాలన్న ఆతృత ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు విద్యార్థిని తండ్రిని బలిగొంది. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగిన వక్కెర వాగు వీరిని కబళించింది. ఈ ఘటన కల్లూరు మండలంలోని గోకులపాడు గ్రామంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కురువ సుశీల(17), హరిజన కళావతి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫెయిలయ్యారు. సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు కర్నూలుకు ప్రయాణమయ్యారు. గ్రామ శివారులోని వక్కెర వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సుశీల తండ్రి నారాయణ(55) వీరి వెంట వెళ్లారు. వీరు వాగు వద్దకు చేరుకునే సరికి అదే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు అదుపుతప్పి వాగులో పడిపోయారు. తల్లీకూతుళ్లు రాములమ్మ, సునీత సమీపంలోని పెంచికలపాడులో ఉన్న కేన్సర్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు.. లక్ష్మీదేవి అనే మహిళ కర్నూలులోని రైస్ మిల్లులో పనిచేసేందుకు వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ఇస్మాయిల్, ఎర్రన్న వీరిని ఒడ్డుకు చేర్చడంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే పరీక్షకు ఆలస్యమవుతుందన్న తొందరలో విద్యార్థులతో పాటు వాగు దాటించేందుకు వచ్చిన తండ్రి నీటిలో కొట్టుకుపోయారు. వీరి వెనకాలే వస్తున్న నారాయణ అల్లుడు రామాంజనేయులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత గ్రామానికి చెందిన యువకులు మూడు బృందాలుగా గాలింపు చేపట్టారు. సల్కాపురం రహదారి వద్ద ముళ్లపొదల్లో నారాయణ మృతదేహం.. మరికొంత దూరంలో కళావతి, సుశీల మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ముగ్గురి మృతదేహాలను గోకులపాడు శ్మశాన వాటికకు తరలించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత గ్రామస్తుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు చేపట్టారు. ఇదిలా ఉండగా మృతుడు కురువ నారాయణ, కాశమ్మ దంపతులకు ఐదుగురు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు సంతానం. నలుగురు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయగా.. కుమార్తె సుశీలతో పాటు ఇరువురు కుమారులను కూలి పనులు చేస్తూ చదివిస్తున్నారు. హరిజన బజారి, నాగశేషమ్మ దంపతుల సంతానమైన కళావతి, సుశీల ఇద్దరూ ప్రాణ స్నేహితులు. గ్రామంలో ఇరువురూ కలసి 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత కర్నూలులోని కేవీఆర్ కళాశాలలో సుశీల హెచ్ఈసీ గ్రూపు, కళావతి బైపీసీ గ్రూపులో చేరారు. ఇటీవల విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిలవడంతో ఇద్దరూ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో వాగు దాటుతూ మృత్యువాత పడటం గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది. -
దానపత్రంపై అమ్మడి సంతకం
ఎప్పుడూ పేజ్ త్రీలో ప్రముఖంగా కనిపించే త్రిష సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో నిలుస్తారు. నోరు లేని జీవాలంటే త్రిషకు ఎనలేని ప్రేమ. ముఖ్యంగా శునకాలపై అపారమైన కరుణ చూపుతారామె. ప్రతి పుట్టిన రోజుకీ అభిమానులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడంతోపాటు, క్యాన్సర్ ఆస్పత్రిలో పిల్లలతో గడపడం, వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం వంటి పలు సేవా కార్యక్రమాలకు పూనుకొంటున్నారు. వీధి కుక్కలను తీసుకొచ్చి వాటి సంరక్షణ బాధ్యతల్ని చేపడుతున్నారు. తాజాగా ఆమె మరో ముందడుగు వేసి అవయవ దానానికి సిద్ధపడ్డారు. మరణానంతరం తన అవయవాలను ఇతరులకు ఉపయోగించుకోవచ్చునంటూ త్రిష ఒక పత్రంపై సంతకం చేశారు. దీంతో త్రిష సేవా గుణాన్ని సినీ ప్రముఖులు కీర్తిస్తున్నారు. ఇదే బాటలో నటి సోనా కూడా పయనిస్తున్నారు. ఆమె కూడా అవయవ దానం చేయనున్నట్లు ప్రకటించారు. -
క్యాన్సర్ వ్యాధి సోకిందని..
ఆదోని అర్బన్, న్యూస్‌లైన్: క్యాన్సర్ సోకితే మరణం ఖాయమని భయపడిన ఓ వ్యక్తి వ్యాధితో బాధపడడంకంటే చావడమే మేలనుకుని ఆత ్మహత్య చేసుకున్నాడు. కుటుంబానిన కష్టాల్లోకి నెట్టాడు. ఆదోని మాసామసీద్ కాలనీకి చెందిన జమీల్‌బాషా(45) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమీల్ బాషా పూల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మొదట స్నేహితులతో కలిసి సరదాగా నమిలిన గుట్కా తర్వాత అలవాటుగా, వ్యసనంగా మారి చివరకు ప్రాణాలకు మీదకు వచ్చింది. గుట్కా కారణంగా క్యాన్సర్ వస్తుందని తెలిసినవారు, భార్య, పిల్లలతోపాటు వైద్యులు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టిన బాషా ఆ అలవాటును మానుకోలేకపోయాడు. చివరకు గుట్కా కారణంగా దవడల్లో పుళ్లు ఏర్పడి రోజురోజుకు తీవ్రమయ్యాయి. రెండు నెలల క్రితం ఆసుపత్రికి వెళ్తే క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కోడుమూరు సమీపంలోని క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లగా ఆపరేషన్ కోసం ఈ నెల 6వతేదీ రావాలని సూచించారు. అయితే వ్యాధి ముదిరి ప్రతి క్షణం ప్రాణాలు తోడేస్తుండడంతో తట్టుకోలేక బాషా సోమవారం ఉదయం బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. భార్య గౌసియా ఫిర్యాదు మేరకు వన్ టౌన్ ఎస్ఐ సుబ్బరామిరెడ్డి కేసు నమోదు చేశారు. -
కేన్సర్ ఆస్పత్రికి పచ్చజెండా
సాక్షి, ముంబై: నగరంలోని రే రోడ్డులో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కేన్సర్ ఆస్పత్రిని నెలకొల్పనుంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ ఆస్పత్రిని అత్యంత ఆధునిక వసతులతో నిర్మించనున్నారు. కేన్సర్ రోగుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. కానీ చికిత్స కోసం సామాన్య ప్రజలకు ఒక్క టాటా ఆస్పత్రి మాత్రమే అందుబాటులో ఉంది. దీని వల్ల వారు అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో సామాన్య ప్రజల సౌకర్యార్థం రే రోడ్డులో పాడుపడ్డ ఆస్పత్రి స్థలంలో కేన్సర్ ఆస్పత్రి నిర్మించాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ ఆస్పత్రిలో 20 శాతం రోగులకు కార్పొరేషన్ ధరపై చికిత్స అందిస్తారు. మిగతా 80 శాతం రోగులకు ప్రైవేట్ ఆస్పత్రుల కంటే తక్కువ ధర (సెమీ ప్రైవేట్)కు చికిత్స అందించాలని ప్రతిపాదించినట్లు కార్పొరేషన్ అధికారి సంతోష్ ముజుమ్దార్ తెలిపారు. అంధేరి-మరోల్‌లో బీఎంసీకి చెందిన కేన్సర్ ఆస్పత్రి కొన్నేళ్ల కిందట మూతపడింది. ఇక ఉపనగరాల్లోని ఆస్పత్రుల్లో కేన్సర్ రోగుల కోసం రిజర్వు చేసిన బెడ్లు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఉన్న స్థలంలో గతంలో బీఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కేన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. కానీ అనివార్య కారణాల వల్ల దానిని ప్రారంభించకముందే కూల్చి వేయాల్సి వచ్చింది. ఆ ప్రదేశంలో తర్వాత ఐదు నక్షత్రాల సెవెన్ హిల్స్ ఆస్పత్రిని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే పెరుగుతున్న కేన్సర్ రోగుల సంఖ్య కారణంగా పేద రోగుల నుంచి టాటా ఆస్పత్రి, బీఎంసీ ప్రధాన ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా టాటా ఆస్పత్రిలో వచ్చే కేన్సర్ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చికిత్స కోసం రోగులు క్యూ కడుతున్నారు. అనేక సార్లు రోగులు రాత్రి సమయాల్లో ఆస్పత్రి బయట గడపాల్సి వస్తోంది. ఈ సమస్యను దూరం చేయాలంటే ప్రత్యేక కేన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సిందేనని బీఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు రే రోడ్డులో ఉన్న బీఎంసీకి చెందిన పాడుపడ్డ ఆస్పత్రిని తొలగించి, ఆ స్థలంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో కేన్సర్ ఆస్పత్రి నెలకొల్పాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే త్వరలో ఆస్పత్రి ప్రతిపాదన స్థాయీ సమితి ముందుకు వెళ్తుందని బీఎంసీ వర్గాలు తెలిపాయి. 80 పడకల ఆస్పత్రి.. ఆస్పత్రిలో మొత్తం 80 పడకలు ఉంటాయి. వాటిపై కేవలం కేన్సర్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తారు. టాటా ఆస్పత్రిలో లాగే ఇక్కడ కూడా అత్యాధునిక చికిత్స లభించనుండటంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.