కేన్సర్ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత తరానికి సవాలుగా మారుతున్న కేన్సర్ నివారణ, చికిత్సపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు శాసిస్తున్న కేన్సర్ చికిత్సను ప్రభుత్వ పరంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే దాదాపు 350 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి ఉంది. అక్కడ పడకల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎక్కువ మందికి చికిత్స అందించేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో ఎంఎన్‌జే ఆస్పత్రి తరహాలోనే వరంగల్‌లో మరో కేన్సర్ ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.120 కోట్ల వ్యయంతో 250 పడకల సామర్థ్యంతో కొత్త ఆస్పత్రిని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు వైద్య విద్య సంచాలకుడి కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించేలా ప్రణాళిక ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఆస్పత్రి నిర్మాణానికి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్రంలో ఏటా 60 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారు. కేన్సర్ నివారణకు దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రానికి కొత్త ఆస్పత్రి మంజూరైంది.
జిల్లాల్లో కేన్సర్ నిర్ధారణ కేంద్రాలు..
కేన్సర్‌ను ముందుగానే గుర్తించి మరణాల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జిల్లా స్థాయిలో కేన్సర్ నిర్ధారణ, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఆస్పత్రుల్లో 15 చొప్పున పడకలను ప్రత్యేకంగా కేన్సర్ రోగులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’లో భాగంగా కేన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
అలంపూర్‌లో 100 పడకల ఆస్పత్రి
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.23.38 కోట్లను మంజూరు చేసింది. ఈ ఆస్పత్రిలో 50 పడకలను సాధారణ వైద్య సేవలకు, మరో 50 పడకలను మాతాశిశు వైద్యానికి కేటాయించాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment