తిరుపతిలో రూ.140 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి
తిరుమల: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా సంస్థ దీనిని నిర్మించనుంది. టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం విషయాన్నితెలియచేశారు. శుక్రవారం శ్రీవారి ఆలయంలో ఆ మేరకు టాటా ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరమణన్, టీటీడీ ఈవో సాంబశివరావు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్, ఎండీ వెంకటరమణన్ మాట్లాడుతూ రెండేళ్లలోనే వైద్యశాల నిర్మాణ పనుల పూర్తి చేసి కేన్సర్ రోగులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు.
టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం తిరుపతి అలిపిరికి సమీపంలో 25 ఎకరాల టీటీడీ స్థలాన్ని లీజు కింద టాటా ట్రస్టుకు కేటాయించామన్నారు. రూ.140 కోట్లతో నిర్మించనున్న ఈ ఆస్పత్రికి టాటా ట్రస్టు ద్వారా రూ.100 కోట్లు, రూ.40 కోట్లు భరించేందుకు కొందరు దాతలు ముందుకొచ్చారన్నారు. టాటా ట్రస్టు వారు ఇప్పటికే ముంబాయి, కోల్‌కత్తాలో కేన్సర్ వైద్యశాలలు నిర్వహిస్తున్నారని, త్వరలో తిరుపతిలో వైద్యశాలను నిర్మించి కేన్సర్ రోగులను విశేష సేవలందిస్తుందని వివరించారు. టాటా సంస్థల ట్రస్టీ ఆర్‌కె.క్రిష్ణకుమార్, టీటీడీ అదనపు ఎఫ్‌ఎ అండ్ సీఏవో బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో కోదండరామారావు పాల్గొన్నారు. కాగా, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రవాస భారతీయ భక్తుడు రూ.33 కోట్ల విరాళం ఇప్పటికే అందజేయటం విశేషం.