కేన్సర్‌ హాస్పిటల్‌.. క్యాన్సిల్‌ | Nellore Cancer Hospital Shift To Vizag | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ హాస్పిటల్‌.. క్యాన్సిల్‌

Published Sun, Mar 24 2019 1:37 PM | Last Updated on Sun, Mar 24 2019 1:37 PM

Nellore Cancer Hospital Shift To Vizag - Sakshi

మంత్రి నారాయణ స్వార్ధానికి ప్రాంతీయ కేన్సర్‌ వైద్యశాల ఎగిరిపోయింది. జిల్లా కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ కేన్సర్‌ వైద్యశాలను నెలకొల్పితే తన వైద్యశాలకు మనుగడకు ముప్పు తలెత్తుతుందని తరలించేశారు. ఘనత వహించిన పాలకుల నిర్లక్ష్యానికి కేన్సర్‌ ఆస్పత్రి దూరమైంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేట్‌ పరం చేశారు. పేదోడికి మెరుగైన కార్పొరేట్‌ వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చారు. జిల్లా కేంద్రంలో కేన్సర్‌ ఆస్పత్రికి కేంద్రం రూ.45 కోట్లు మంజూరు చేస్తే చేజేతులారా క్యాన్సిల్‌ చేయించారు. పేదోలు కేన్సర్‌ వైద్యానికి జిల్లా ప్రజలు చెన్నై, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి తప్పడం లేదు.

సాక్షి, నెల్లూరు (బారకాసు): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రి ప్రాంగణంలో ప్రాంతీయ కేన్సర్‌ ఆస్పత్రి కలగానే మిగిలిపోయింది. ఏడాది క్రితం కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.45 కోట్లు నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే జిల్లా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేజారిపోయింది. నెల్లూరు నగరంలో నూతనంగా అత్యాధునిక వసతులతో ఏర్పాటైన ప్రభుత్వ బోధనాస్పత్రికి అనుబంధంగా అదే ప్రాంగణంలో కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని 2014లో అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కేంద్రానికి ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు రేడియేషన్‌ అంకాలజీ (కేన్సర్‌ విభాగం) పోస్టును భర్తీ చేస్తూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీనివాసన్‌ను నియమించారు. ఆ తర్వాత 2015లో కేన్సర్‌ విభాగం ఏర్పాటుకు తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ప్రభుత్వ బోధనాస్పత్రి ప్రాంగణంలో కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ 2015లో రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు అప్పటి కేంద్ర మంత్రి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.  డాక్టర్‌ శ్రీనివాసన్‌ రెండు పర్యాయాలు నేరుగా వెంకయ్యనాయుడిని కలిసి కేన్సర్‌ ఆస్పత్రి ఆవశ్యకతపై నివేదికను అందజేశారు.

నెల్లూరులో కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటుకు అంగీకారం
ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 20 ప్రధాన కేన్సర్‌ ఆస్పత్రులను ఒక్కో ఆస్పత్రికి రూ.120 కోట్లు, 50 ప్రాంతీయ కేన్సర్‌ ఆస్పత్రులను ఒక్కో ఆస్పత్రికి రూ.45 కోట్లు నిధులు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటి కేంద్ర మంతిగా ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరుకు ప్రాంతీయ కేన్సర్‌ ఆస్పత్రిని కేటాయించాలని అందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. వెంకయ్యనాయుడు కృషితో నెల్లూరులో ప్రాంతీయ కేన్సర్‌ ఆస్పత్రి కోసం రూ.45 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో 2016 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో ప్రధాన కేన్సర్‌ ఆస్పత్రిని, నెల్లూరులో ప్రాంతీయ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి లేఖ రాసింది.

కామ్‌గా.. క్యాన్సిల్‌ చేయించారు..
నెల్లూరులో కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటుకు ఉన్న వసతులపై కేంద్ర ప్రభుత్వం అదే ఏడాది జూన్‌లో వైద్యుల బృందాన్ని ఇక్కడి ప్రభుత్వ బోధనాస్పత్రికి పంపించింది. ఆ బృందం పరిశీలన అనంతరం నివేదికను కేంద్రానికి అందజేసింది. లోటు పాట్లను పూర్తి చేయగానే వెంటనే రూ.45 కోట్లు నిధులు ఇచ్చేందుకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఏసీఎస్సార్‌ ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేన్సర్‌ ఆస్పత్రి కమిటీతో చర్చించారు. ఈ మేరకు 2017 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ బోధనాస్పత్రి అధికారులు నివేదిక అందజేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు కొంత కాలం పట్టించుకోలేదు. దీంతో అదే ఏడాది ఆగస్టులో రెడ్‌క్రాస్‌ సంస్థ తాము కేంద్రానికి సంబంధించిన హోమిబాబా కేన్సర్‌ కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని, మీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని తేల్చి చెప్పింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా మంత్రులు పట్టించుకోవడం మానుకున్నారు. రెండేళ్ల పాటు వేచి చూసిన కేంద్ర ప్రభుత్వం నెల్లూరుకు ఇస్తామన్న రూ.45 కోట్లు నిధులను ఇతర ప్రాంతానికి కేటాయిస్తున్నామని తెలియజేయడంతో అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. విషయం తెలుసుకున్న కొందరు నెల్లూరుకు నష్టం జరుగుతోందని 2018 జనవరిలో కేన్సర్‌ ఆస్పత్రి సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని పోరాటాలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అప్పటి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రితో పాటు జిల్లా మంత్రులు రెడ్‌క్రాస్‌ ఒప్పుకోలేదు కాబట్టే నెల్లూరుకు ప్రాంతీయ కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు కుదరదని కారణాలు చెబుతూ వచ్చారు.

వసతులున్నా.. నిర్లక్ష్యం
నూతనంగా నిర్మించిన బోధనాస్పత్రిలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలంటే అందుకు జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మెటర్నిటీ, రేడియాలజీ, అనస్థిషియా విభాగాలతో పాటు ప్రత్యేకంగా 50 పడకలు ఉండాలనేది నిబంధన. ఈ నిబంధనలు ప్రస్తుతం నగరంలో ఉన్న ప్రభుత్వ బోధనాస్పత్రికి ఉన్నాయి. నెల్లూరులో ప్రాంతీయ కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి జిల్లా యంత్రాంగం, జిల్లా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు లేకపోవడంతో తరలిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రాంతీయ కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేసి ఉంటే జిల్లా ప్రజలతో పాటు చుట్టు పక్కల ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఏది ఏమైనా పాలకుల నిర్లక్ష్యం మనకు కేన్సర్‌ వైద్యశాల దూరమైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement