కేన్సర్ రోగులకు వెంకన్న అభయం
⇒ టీటీడీ స్థలంలో టాటా ట్రస్ట్ కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం
⇒ట్రస్టు ద్వారా రూ.100 కోట్లు , భక్తుల విరాళాలు మరో రూ.40 కోట్లు
⇒రెండేళ్లలో పూర్తికి సన్నాహాలు
⇒ఇప్పటికే నిర్మాణదశలో అరవింద్ కంటి ఆస్పత్రి
ఆపదమొక్కులవాడి పాదాల చెంత తిరుపతిలో ఇప్పటికే స్విమ్స్, బర్డ్ ఆస్పత్రులు అత్యా«ధునిక వైద్యసేవలు అందిస్తున్నాయి. ఇదే తరహాలో కేన్సర్ రోగులకూ వెంకన్న అభయ హస్తం అందించనున్నాడు. ధార్మిక సంస్థకు చెందిన 25 ఎకరాల స్థలంలో కేన్సర్ ఆస్పత్రి నెలకొల్పేందుకు టాటా ట్రస్టు ముందుకొచ్చింది. రూ.140 కోట్ల అంచనాలతో ఈ కేన్సర్ ఆస్పత్రి ద్వారా రోగులకు ప్రపంచ స్థాయి వైద్యం అందుబాటులోకి రానుంది. ఇదే తరహాలోనే టీటీడీ సహకారంతో అరవింద్‌కంటి ఆస్పత్రి కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణ దశలో ఉంది.
తిరుమల: తిరుపతిలో టీటీడీ సహకారంతో టాటా ట్రస్టు కేన్సర్ ఆస్పత్రి నిర్మించనుంది. ఈ నిర్మాణానికి టీటీడీ రూ.25 ఎకరాల స్థలాన్ని లీజు కింద కేటాయించింది. రూ.100 కోట్లు టాటా ట్రస్టు, మరో రూ.40 కోట్లు దాతల విరాళాలతో టీటీడీ ఆర్థిక సహకారం అందించనుంది. ఓ అజ్ఞాత భక్తుడు రూ.33 కోట్లు టీటీడీకి అందజేశాడు. రెండేళ్లలో ఆస్పత్రిని కేన్సర్ రోగులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో టీటీడీ, టాటా ట్రస్ట్‌ల మధ్య శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది.
తిరుపతిలో అరవింద్ కంటి ఆస్పత్రి కూడా నిర్మాణదశకు చేరింది. ‘శ్రీవేంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్’, పరిశోధన, శిక్షణా కార్యాలయాల పేరుతో దీనిని రూ.100 కోట్ల అంచనాలతో నిర్మించనున్నారు. టీటీడీ అలిపిరికి సమీపంలోని ఏడెకరాల స్థలాన్ని లీజు కింద కేటాయిం చింది. పనులు 15 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఏడాదిలోపు ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువాలని లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు.
రోగులకు అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న స్విమ్స్
టీటీడీ సహకారంతో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తోంది. ఇప్పటికే ప్రాణదానం ట్రస్టు ద్వారా గుండె ఆపరేషన్లతో రోగులకు ప్రాణదానం చేస్తోం ది. స్విమ్స్ ఇన్, ఔట్ పేషెంట్లు రోజూ సుమారు 2,300 మంది వైద్యసేవలు పొందుతున్నారు. ఏటా సుమారు 7 లక్షల మంది రోగులకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందిస్తోంది. మరోపక్క పోలియో వైద్యం, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి నుంచి సమగ్ర వెన్నుపూస శస్త్ర చికిత్స వరకు రోగులకు తక్షణ వైద్య సేవలు అందించే దిశగా టీటీడీ బర్డ్‌ను అభివృద్ధి చేసింది. తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలలో పడకల సంఖ్య 300కి పెంచారు. భవనం నిర్మాణం పూర్తయింది. భవనం అందుబాటులోకి వస్తే ప్రసూతి వైద్యసేవలు కూడా సులభతరం కానున్నాయి. భవన వినియోగంపై వివాదం ఉంది.