ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న క్యాన్సర్ సెంటర్
పాలమూరు : చాపకిందనీ రులా వ్యాపిస్తున్న క్యాన్సర్ ఏటా అత్యధిక మంది మరణానికి కారణమవుతోంది. ఈ వ్యాధి సుమారు 200 రూపాల్లో ప్రజలకు సోకుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మారుతున్న వాతావరణం.. జీవన విధానంలో మార్పు కారణంగా రక్త క్యాన్సర్, రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, ఊపిరితిత్తులు ఇలా ఒకటేమిటి మానవ శరీరంలోని అన్ని అవయవాలన్నింటికి క్యాన్సర్ సోకుతోంది. ఈ వ్యాధిపై ప్రజలకు పూర్తిస్థాయి అవగహన లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చికిత్సల కోసం కుటుంబసభ్యులు ఆస్తులను తాకట్టుపెట్టి వైద్యం చేయిస్తున్నారు. ఇకపై ఆ అవస్తలు ఉండకుండా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.
ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించనున్న మంత్రి
ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి ఆవరణలో 7 పడకలతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగాన్ని నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడు, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రారంభించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆస్పత్రి అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన క్యాన్సర్ విభాగం నిర్వహణ పెయిన్ రిలీఫ్ అండ్ పాలియేటివ్ కేర్ సోసైటీ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ విభాగంలో తాత్కాలికంగా ఈ–సేవ భవనంలో రూ.4.50 లక్షలు ఖర్చు చేసి పూర్తిగా ఆధునీకరించారు. దీనిని 24గంటల పాటు రోగులకు వైద్య సేవలు అందేవిధంగా ఏర్పాటు చేశారు. త్వరలోనే టీబీ ఆస్పత్రి భవనాన్ని పూర్తిగా తొలగించి ఆ స్థానంలో క్యాన్సర్ ఆస్పత్రి కోసం నూతన భవనం నిర్మాణం చేయాలని నిర్ణయించారు. సొసైటీ సభ్యులు ఆస్పత్రి నిర్వహణ ఖర్చు, వైద్యులు, సిబ్బంది, వైద్యానికి అవసరం అయిన పరికరాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల రోగ నిర్దరణతోపాటు బాధితులకు వైద్య సేవలు అందనున్నాయి. రోగులకు అవసరమైన పరీక్షలు, ఇతర సేవలు అమల్లోకి రానున్నాయి. ఆస్పత్రిలో ఓపీ చికిత్సతో పాటు, ఇన్ పేషంట్ విధానం, ఇంటికి వెళ్లి క్యాన్సర్ రోగులకు సేవ చేసే విధానానికి కూడా శ్రీకారం చూట్టారు. జిల్లాలో క్యాన్సర్ రోగులను గుర్తించడంతో పాటు వారి ఇంటికి వెళ్లి అవసరం అయిన పరీక్షలు, చికిత్స చేయడంతో పాటు ఉచితంగా మందులు కూడా ఇస్తారు. రోగి చివరి దశలో ఉన్నా వైద్యం అందిస్తారు.
వైద్యుల కేటాయింపు
క్యాన్సర్ విభాగంలో ఒక వైద్యుడు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఫిజియె థెరపిస్టులు, ఒక కౌన్సిలర్, నలుగురు ఆయాలు, ఒక డ్రైవర్ అందుబాటులో ఉంటారు. వీరి నిర్వహణ సంస్థ చూసుకున్నా జీతాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతాయి. అయితే ఇప్పటికే వీరిని ఎంపిక చేసి రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.
అవగాహన తప్పనిసరి
క్యాన్సర్‌పై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేదు. గతంలో వయసు పైబడిన వారికి, చెడు అలవాట్లకు లోనైన వారికి మాత్రమే ఈ వ్యాధి వస్తుందని ప్రజలు భావించేవారు. మారిన జీవన పరిస్థితుల కారణంగా అప్పుడే జన్మించిన చిన్నారుల నుంచి పండు ముసలి వరకు అందరు కూడా ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారు. ఈ ఏడాదిలో జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, నారాయణపేటలకు చెందిన ముగ్గురు పసికందులు ప్రాణాంతక బ్రెయిన్ కేన్సర్ బారినపడ్డారు. పు ట్టకతోనే వారి మెదడులో ఉండే నాడీకణాల్లో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించి చికిత్సకు హైదరాబాద్ పంపారు.
మహిళల్లో అధికం..
మహిళల్లో పెరుగుతున్న గర్భాశయ, రొమ్ము క్యాన్స ర్లపై కూడా ఎవరికీ అవగాహన ఉండటం లేదు. వ్యాధి సోకుతున్న వారిలో గ్రామీణ ప్రాంతాల వారే అధికం గా ఉంటున్నారు. గతంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సరు 50 ఏళ్లపైబడి మోనోపాజ్ దశలో ఉన్న వారికే మాత్రమే వచ్చేది. ప్రస్తుతం యుక్త వయస్సు వారిలో ఇది వస్తున్నట్లు ఇటీవల ఎస్‌వీఎస్‌లో జరిగిన సదస్సులో వైద్యులు వెల్లడించారు. హూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. బాల్య వివాహాలు, సుఖవ్యాధులు, పౌష్టికాహారలోపం, ఎక్కువ మంది పిల్లలను కనటం ఇందుకు కారణంగా చెబుతున్నారు. జిల్లాలో 90 శాతానికి పైగా రొమ్ము క్యాన్సరు బాధితులు వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యుల వద్దకు వెళుతున్నారు. చిన్నచిన్న గడ్డలను గుర్తించినా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వారందరికి జనరల్ ఆస్పత్రి ఆవరణంలో ఏర్పాటు చేయబోతున్న క్యాన్సర్ ఆస్పత్రితో ఎంతో మేలు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment