కేఎంసీలో సమీక్షా నిర్వహిస్తున్న డీఎంఈ
- ఎంసీఐ తనిఖీ మళ్లీ జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదన
- పరికరాలు, వైద్యుల కొరతపై స్పష్టత ఇవ్వండి
- కేఎంసీ సమీక్ష సమావేశంలో డీఎంఈ పుట్ట శ్రీను.
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో పెరిగిన సీట్లకు అనుగుణంగా సౌకర్యాలు, వైద్య సిబ్బంది విషయంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) చేసిన తనిఖీలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు డీఎంఈ పుట్ట శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలలో ఆదివారం ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, కేఎంసీ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ఎస్. రమేశ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎం ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలో ఎంసీఐ తనిఖీలు నిర్వహించిన సమయంలో పెరిగిన 50 సీట్లకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేదని వారు అభిప్రాయపడినట్లు ఆయన వెల్లడించారు.
తనిఖీల సందర్భంగా నిజామాబాద్‌లో 100 సీట్లు, గాంధీ ఆస్పత్రిలో 50 సీట్లు, కేఎంసీలో కూడా మరికొన్ని సీట్లు కోల్పోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేఎంసీలో సీట్లు కోల్పోకుండా ఉండేందుకు లోటుపాట్లను సవరించి తిరిగి ఎంసీఐ తనిఖీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఆస్పత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య మెడికల్ సీట్లకు తగినట్లుగా లేదని, వైద్యసిబ్బంది కొరత కూడా ఉందని, కళాశాల పరిధిలో విద్యార్థులకు 8 లెక్చరర్స్ హాల్స్ ఉండాల్సి ఉండగా నాలుగు మాత్రమే ఉన్నావని, పరికరాల కొరత తీవ్రంగా ఉందని ఎంసీఐ తన నివేదికలో పేర్కొనట్లు ఆయన తెలిపారు. వెంటనే ఆయా విభాగాలకు కావాల్సిన పరికరాల వివరాలతోపాటు సిబ్బంది కొరతను తనకు వెంటనే నివేదించాలని ఆయా విభాగాధిపతులను ఆదేశించారు.
క్యాన్సర్ ఆస్పత్రి కోసం ప్రతిపాదనలు
జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని కేఎంసీ ప్రిన్సిపాల్‌ను డీఎంఈ పుట్ట శ్రీనివాస్ ఆదేశించారు. వరంగల్‌లో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన వెల్లడించారు. ఎంజీఎం ఆస్పత్రిలో గత 11 నెలలుగా క్యాన్సర్ విభాగం మూతపడిన విషయాన్ని వైద్యులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయూలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పీజీ విద్యార్థులు డీఎంఈని కలిసి తమకున్న సమస్యలను వివరించారు. డీఎంఈ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.