ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.
నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.
నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.
– జశ్వంత్
మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్‌కు వెళ్లాలనుంది.
– రిషి ప్రియ, సిద్దిపేట
చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను.
– ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్
నాకు ఫుట్‌బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్‌కు తీసుకెళతానని కూడా చె΄్పారు.
– చేతన్
విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్‌లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం.
– అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్
అవగాహన వచ్చింది
కేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్‌కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.
– కార్తీక, నేషనల్ ప్లేయర్
హెయిర్ డొనేట్ చేస్తాను
ఈ హాస్పిటల్‌లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను.
–ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్
వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను.
– సాన్విక, సరిపోదా శనివారం
వీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను.
– స్నితిక్, పొట్టేల్ ఫేమ్
భయం లేదు చికిత్సలు ఉన్నాయి
అనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్‌లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్‌కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి.
ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి QR కోడ్‌ను స్కాన్ చెయ్యండి
– డి.జి. భవాని
– హనుమాద్రి శ్రీకాంత్
ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల
Comments
Please login to add a commentAdd a comment