
క్రిష్ కళ్లు చెమర్చిన వేళ...
దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒక సమయంలో ఆయన కళ్లు చెమర్చాయి. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం నిర్వహించారు. బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణితో పాటు.. ప్రస్తుతం బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి'కి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు. అక్కడ చికిత్స పొందుతున్న పిల్లలకు బహుమతులు అందించి, వారితో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా క్రిష్ భావోద్వేగానికి గురయ్యాడు. 'మా అమ్మను ఈ ఆసుపత్రికే తీసుకొచ్చాను.. ఆసుపత్రి అంతా నాకు తెలుసు.. మా అమ్మను నేను అమ్మలా చూసుకోవడం వేరు.. ఇక్కడి డాక్టర్లు ఆమెను అమ్మలా చూసుకోవడం వేరు.. ఎందరో తల్లులకు, ఎందరో పేదలకు ఈ ఆసుపత్రి అద్భుతమైన వైద్యం అందిస్తోంది..' అని చెబుతూ క్రిష్ చెమర్చిన కళ్లతో వ్యాఖ్యానించాడు.
ఇంతటి ఘనత ఉన్న ఆసుపత్రికి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలకృష్ణ, ఈ ఆసుపత్రి కోసం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయమని క్రిష్ అన్నాడు. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా గురించి చెప్పడం కన్నా, 56 ఏళ్ళ బాలకృష్ణ, సెట్స్‌లో చిన్న పిల్లాడిగా మారిపోతాడనీ, అదే సమయంలో తమకు మార్గదర్శిగా కన్పిస్తాడని చెప్పాడు క్రిష్. ''నేను చాలా చిన్నవాడ్ని.. కానీ నేను చెప్పింది సెట్స్‌లో ఎంతో ఆసక్తితో గమనిస్తారు బాలయ్య. అది ఆయన గొప్పతనం. ఆయన నిత్య విద్యార్థి. దర్శకుడిగా మాత్రమే నేను షూటింగ్ జరుగుతున్న సమయంలో టీచర్‌గా ఉంటాను. మిగతా సమయాల్లో మాత్రం మాలో బాలయ్య స్ఫూర్తిని నింపుతారు. మాకు మార్గదర్శిలా వ్యవహరిస్తారు..'' అంటూ బాలయ్య గురించి క్రిష్ చెప్పుకొచ్చాడు. ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని రూపొందించే బాధ్యత తనకు అప్పగించినందుకు ఎప్పటికీ బాలయ్యకు రుణపడి ఉంటానని క్రిష్ అన్నాడు.