
సాక్షి, హైదరాబాద్: ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిపై ఎలాంటి సందేహాలు, అపోహలు, పెట్టుకోవాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజలకు ఉచిత సేవలు అందించడంలో ఎలాంటి తేడాలుండబోవని ఆయన అన్నారు. అయితే నిర్ణీత నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని చెప్పారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ రంగంలో ఏకైక కేన్సర్ ఆసుపత్రి ఎంఎన్‌జే అని, అనేక ఏళ్ళుగా ప్రజలకు సేవలందిస్తూ వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లక్షలాది రూపాయల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తూ వస్తుందన్నారు. ఎంఎన్‌జేను 2006లోనే స్వయంప్రతిపత్తి గల ఆసుపత్రిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు ఉన్న నిబంధనల ప్రకారమే నియామకాలు, ఇతర వ్యవహారాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై అనవసర ఆందోళనకు గురికావద్దని ఎంఎన్‌జే డాక్టర్లు, ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి సూచించారు.