c laxma reddy
-
ఆర్నెల్లు అధికారం అప్పగిస్తే..అందరికీ ‘బంధు’ ఇస్తారా?: లక్ష్మారెడ్డి
జడ్చర్ల: ‘కాంగ్రెస్, బీజేపీలకు ఆరు నెలలపాటు అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రంలో దళితబంధు వంటి పథకాలను బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలందరికీ ఏకకాలంలో అందజేస్తారా.. ఇంటింటికీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా.. అది సాధ్యమయ్యేనా..’ అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఆయా పార్టీలకు సవాల్ విసిరారు. శనివారం జడ్చర్లలోని తాలుకా క్లబ్ కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ వార్డు కమిటీల ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ కమిటీల నుంచి ఆయా పథకాలు రాష్ట్రవాప్తంగా ఒకేసారి అమలు చేసేలా తీర్మానించి లెటర్ తీసుకొస్తే ఓ ఆరు నెలల పాటు వారికి అధికారం అప్పజెబుతామన్నారు. సీఎం కేసీఆర్ అట్టడుగున ఉన్న దళితుల సంక్షేమం కోసం దశలవారీగా ‘దళితబంధు’ను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో బీసీ, ఎస్టీ, మైనార్టీ తదితరులకు వర్తింపజేస్తారన్నారు. అయితే విపక్ష నేతలు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ‘దళితబంధు’తెచ్చారని, రాష్ట్రమంతా ఎందుకు అమలు చేయడంలేదని, ఇతర వర్గాలకు ఆయా పథకం ఎందుకు ఇవ్వరని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం సరైందికాదన్నారు. -
ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడియో హల్చల్
జడ్చర్ల: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయకపోతే ఇళ్లను ఇవ్వబోమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్న ఓ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 4వ వార్డు పరిధిలోని బోయలకుంటలో ప్రచార సమయంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ‘ఎన్నికలు కాబట్టి ఎవరెవరో వచ్చి ఓట్లు అడుగుతారు. ఎవరొచ్చి ఏం చేసేది ఏమీ లేదు. ఏం చేసినా మనమే చేయాలి. పొరపాటు జరిగి మా అభ్యర్థికి తక్కువ ఓట్లువస్తే ఇళ్లు కూడా ఇవ్వను. బీరుకో, బిర్యానీకో ఆశపడి ఓట్లు వేయొద్దు’ అని అన్నారు. ఈ వీడియోపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్లను బెదిరింపులకు గురిచేసేలా లక్ష్మారెడ్డి వైఖరి ఉండడం సరికాదన్నారు. అర్హులకు పథకాలు అందించడం ప్రభుత్వాల పని అని, ఎవరూ బెదిరింపులకు భయపడొద్దన్నారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: టీకా వేసుకున్న భర్త.. ఆ తర్వాత భార్య -
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మహబూబ్‌నగర్: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్‌ను కోరాలని ఉందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మారెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. '24 గంటల ఉచిత కరెంటు కాకుండా కేవలం 3,4 గంటల కరెంటు ఇవ్వాలని కోరుతానని వెల్లడించారు. మేము చేస్తున్న మేలు సామాన్యులకు అర్థం కావడంలేదు. జనం మంచివారనలా.. అమాయకులనాలో తెలియడంలేదు. పనికిమాలిన భావాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలను ఆపేసి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుంది' అంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చదవండి: (ఏ ఏటికాయేడు అయితేనే..!) -
కేన్సర్ అవేర్‌నెస్‌లో ఎంఎన్‌జే గిన్నీస్ రికార్డ్
సాక్షి, హైదరాబాద్: ప్రొస్టేట్ కేన్సర్‌పై ప్రచారం నిర్వహించి కేవలం గంట వ్యవధిలో 487 మందికి అవగాహన కల్పించినందుకు గుర్తింపుగా ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి అరుదైన గౌరవం లభించింది. ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఎంఎన్‌జే ఆస్పత్రికి చెందిన ప్రొస్టేట్ కేన్సర్ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్‌లు అక్టోబర్ 26న జేబీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ప్రొస్టేట్ కేన్సర్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేవలం గంట వ్యవధిలోనే ప్రొస్టేట్ కేన్సర్ లక్షణాలు, కారణాలు, నివారణ పద్ధతులను వివరించారు. దీంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి అవగాహన కల్పించడం ఓ రికార్డు కాగా, దీన్ని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం కొసమెరుపు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు.. ఎంఎన్‌జే ఆస్పత్రికి రికార్డులు రావడం పట్ల వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి హర్షం ప్రకటించారు. అందుకోసం కృషిచేసిన ఎంఎన్‌జే అధికారులను ఆయన అభినందించారు. సీఎం కేసీఆర్ హర్షం.. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి రెండు ప్రపంచ రికార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి అధికారులను ఆయన అభినందించారు. మొదటిసారిగా ఇలాంటి అవార్డులు ఒక ప్రభుత్వ ఆస్పత్రికి రావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. -
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన అంకాలజీ భవనాన్ని అపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆంకాలజీ భవనాన్ని నిర్మించడమే కాకుండా మూడు సంవత్సరాలు మెయిన్‌టెన్ చేస్తామని చెప్పటం ఆనందంగా ఉందన్నారు. వైద్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. నిమ్స్‌లో అవయవ మార్పిడి చికిత్సలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. సామాన్యులకు అందని కార్పొరేట్ వైద్యం పేదలకు నిమ్స్‌లో అందుతుందన్నారు. కేసీఆర్ కిట్ వచ్చాక రాష్ట్రంలో నార్మల్ డెలివరీలు పెరిగాయని పేర్కొన్నారు. తెలంగాణలో మాత శిశు మరణాలు తగ్గిపోయాయన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మిషన్ ఇంద్ర ధనస్సులో తెలంగాణ దేశంలో ముందుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 45 బస్తీ దవాఖానాలు ప్రాంభిచామని.. వచ్చే ఏడాది మే నాటికి 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వైద్య పరీక్షలు సైతం ప్రభుత్వమే ఉచితంగా చేస్తోందన్నారు. విజన్ ఫర్ ఆల్ నినాదంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రభత్వ రంగంలోని వైద్యులు సిబ్బంది బాగా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మొదలు పెట్టాలని సూచించారు. డీన్ నియామకాన్ని రద్దు చేయాలి నిమ్స్ డీన్‌గా ఆర్వీ కుమార్ నియామకాన్ని రద్దు చేయాలని ఆందోళన చేపట్టిన రెసిడెంట్ డాక్టర్లు కేటీఆర్, లక్ష్మారెడ్డిలను కలిశారు. కాగా రెసిడెంట్ డాక్టర్ల డిమాండ్లపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. -
ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది
-
ఎంఎన్‌జే స్వయం ప్రతిపత్తిపై సందేహాలొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిపై ఎలాంటి సందేహాలు, అపోహలు, పెట్టుకోవాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజలకు ఉచిత సేవలు అందించడంలో ఎలాంటి తేడాలుండబోవని ఆయన అన్నారు. అయితే నిర్ణీత నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని చెప్పారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ రంగంలో ఏకైక కేన్సర్ ఆసుపత్రి ఎంఎన్‌జే అని, అనేక ఏళ్ళుగా ప్రజలకు సేవలందిస్తూ వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లక్షలాది రూపాయల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తూ వస్తుందన్నారు. ఎంఎన్‌జేను 2006లోనే స్వయంప్రతిపత్తి గల ఆసుపత్రిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు ఉన్న నిబంధనల ప్రకారమే నియామకాలు, ఇతర వ్యవహారాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై అనవసర ఆందోళనకు గురికావద్దని ఎంఎన్‌జే డాక్టర్లు, ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి సూచించారు. -
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో మరో మైలు రాయి
-
‘ఇక ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అభివృద్దిలో మరో మైలు రాయి నమోదైంది. సామాన్యులకు, పేదలకు వైద్య పరీక్షలు భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా వ్యాధి నిర్దారణ పరీక్షలను ప్రభుత్వమే నిర్వహించాలని భావించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం నారాయణగూడలోని ఐపీఎం ఆవరణలో ఉచిత డయాగ్నోస్టిక్స్ సెంటర్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు కలిసి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 40 ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పేద వారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి పదివేల మందికి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేసామని మంత్రి వివరించారు. అందులో భాగంగా నగరంలో 17 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. మానవీయ కోణంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందని, ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేసామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్య శాఖలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. -
మంత్రి లక్ష్మారెడ్డి ఔదార్యం
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి నడిబొడ్డున మురికి కూపంగా మారిన నల్లకుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలసి గురువారం ఆయన నల్లకుంట పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నల్లకుంట అభివృద్ధికి సంబంధించి కలెక్టర్‌తో మంత్రి చర్చించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ నల్లకుంటలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా పార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నల్లకుంట వద్ద తనకు ఉన్న రూ.10 కోట్ల విలువైన 6 ఎకరాల పట్టా భూమిని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తానన్నారు. కొందరునేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తారని.. కానీ తాను సొంత డబ్బుతో కొనుగోలు చేసిన భూమిని పట్టణ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నానని తెలిపారు. గతంలోనూ... మంత్రి లక్ష్మారెడ్డి గతంలోనూ సొంత భూమిని పేదలు, ప్రభుత్వ అవసరాలకు అప్పగించారు. 2003లో తన సొంత గ్రామమైన తిమ్మాజీపేట మండలం ఆవంచలో పది ఎకరాల భూమిని దళిత రైతుల సాగు అవసరాలకు పంపణీ చేశారు. తాజాగా జడ్చర్లలో రూ.50 లక్షల విలువైన రెండు ఎకరాల భూమిని జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి అప్పగించారు. అక్కడ పనులను కూడా ఆయన ప్రారంభించారు. అలాగే జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.2 కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని కూడా ఇటీవలే అప్పగించి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం విశేషం. -
హైదరాబాద్‌లో ‘నిపా’ కలకలం
సాక్షి, హైదరాబాద్ : కొద్ది రోజులుగా కేరళను వణికిస్తున్న నిపా వైరస్ హైదరాబాద్ వాసులకు సోకిందన్న వార్త తీవ్ర కలకలం సృష్టించింది. నిపా లక్షణాలతో బాధప డుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణ కోసం పుణేకు పంపారు. అయితే అది నిపా కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని ఓ ఐటీ కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి(24) ఈ నెల 18న కేరళ వెళ్లి 21న తిరిగి వచ్చాడు. ఆ వెంటనే జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుం డటంతో ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే నిమ్స్‌లో మరో వ్యక్తి(31) ఎన్సెఫలైటిస్(మెదడు సంబంధిత వ్యాధి) లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరిద్దరి నుంచి గురువారం రాత్రి రక్తం, మూత్ర, లాలాజల నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం పుణే తీసుకెళ్లారు. అయితే వీరి నమూనాలు పరీక్షించగా ‘నిపా నెగిటీవ్’గా నిర్ధారనైనట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిపా వైరస్ నిర్ధారణ కాలేదని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిమ్స్, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లో ముందస్తు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో, స్కూళ్లలో పని చేస్తున్న వారిలో కేరళకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజా తెలిపారు. ప్రస్తుతం కేరళలో నిపా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో వీరు కొద్ది రోజుల వరకు అక్కడికి వెళ్లకపోవడమే ఉత్తమమని సూచించారు. కేరళ వెళ్లాలనుకున్న నగరవాసులు కూడా తాత్కాలికంగా తమ ఆలోచణను వాయిదా వేసుకోవడమే మంచిదని ఆమె అన్నారు. భయం వద్దు: మంత్రి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నిఫా వైరస్ లేనేలేదని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ‘‘వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్న ఇద్దరికి నిపా వైరస్ సోకలేదని వారికి చేయించిన పరీక్షల్లో తేలింది. ప్రజలు అనుమానాలు, ఆపోహలకు, భయాందోళనలకు గురవాల్సిన అవసరం లేదు. వైద్య శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది’’అని తెలిపారు. -
నా విజయాన్ని ఎవరూ ఆపలేరు...
జడ్చర్ల: వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసినా తన విజయాన్ని ఆపలేరని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జడ్చర్ల నియోజకవర్గం నుంచి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బరిలోకి దిగుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన పైవిధంగా స్పందించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్మించనున్న స్టేడియం నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఎవరు పడితే వారు వచ్చి జడ్చర్ల లో పోటీ చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. కల్వకుర్తిలో స్థానికేతరుడైన ఎన్టీ రామారావును ఓడించి స్థానికుడిని గెలిపించుకున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. -
‘ ఆ మంత్రి పదవికి అనర్హుడు’
హైదరాబాద్‌సిటీ: తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి పదవికి లక్ద్మారెడ్డి అనర్హుడని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. బాలింతలు సరైన వైద్యం అందక చనిపోతుంటే ప్లీనరీ పేరుతో ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. టీఎస్ఎంఐడీసీ మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. నాసిరకం మందులు సరఫరా చేస్తూ జనం ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. కోఠి మెటర్నిటీ మరణాలకు సూపరిండెంట్ శైలజ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు -
‘ఏ సమస్య వచ్చినా ఆర్‌ఎంవోలదే బాధ్యత’
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఎక్కడ సమస్య వచ్చినా ఆర్‌ఎంవోలదే బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. బుధవారం ఆయన గాంధీ దవాఖానను సందర్శించి, రెండు గంటలపాటు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులతో సమావేశమయ్యారు. విధులను నిర్లక్ష్యం చేయటంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోనట్లుగా తేలిన ఆర్ఎంవో, డిప్యూటీ సివిల్ సర్జన్ సరస్వతిని డీఎంఈకి సరెండర్ చేయాలని ఆదేశించారు. ఇంకా...నెల రోజుల్లో ఇక్కడ 65 పడకల ఐసీయూను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి అధునాతన యంత్ర పరికరాలతో మరో ల్యాబ్ ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గాంధీలో ప్రస్తుతం 100 బెడ్లు ఉండగా 2వేల ఇన్ పేషెంట్లకు చికిత్స అందుతోందని వివరించారు. ఇకపై వైద్యులకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 157 పీజీ సీట్లు తెలంగాణకు ఇవ్వడం గొప్ప ఘనత అని చెప్పుకోవచ్చునన్నారు. గాంధీలో కొందరు బయటి వ్యక్తులు పెత్తనం చేస్తున్నారని, ప్రమేయాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు. నర్సుల భర్తీకి ఈ వారంలో నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించారు. సాయి ప్రవళిక మృతిపై ఆయన మాట్లాడుతూ.. పాప బతకదని వైద్యులు ముందే డిక్లేర్ చేశారని, కావాలనే ఆ ఘటనఽను ఇష్యూ చేశారు. మీడియాను కొంత మంది పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఽఈ కార్యక్రమంలో డీఎంఈ రమణి, గాంధీ వైద్యశాల ప్రిన్సిపాల్, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ మంజుల తదితరులు పాల్గొన్నారు.