సాక్షి, హైదరాబాద్ : కొద్ది రోజులుగా కేరళను వణికిస్తున్న నిపా వైరస్ హైదరాబాద్ వాసులకు సోకిందన్న వార్త తీవ్ర కలకలం సృష్టించింది. నిపా లక్షణాలతో బాధప డుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణ కోసం పుణేకు పంపారు. అయితే అది నిపా కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని ఓ ఐటీ కంపెనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(24) ఈ నెల 18న కేరళ వెళ్లి 21న తిరిగి వచ్చాడు. ఆ వెంటనే జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుం డటంతో ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే నిమ్స్‌లో మరో వ్యక్తి(31) ఎన్‌సెఫలైటిస్(మెదడు సంబంధిత వ్యాధి) లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
వీరిద్దరి నుంచి గురువారం రాత్రి రక్తం, మూత్ర, లాలాజల నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం పుణే తీసుకెళ్లారు. అయితే వీరి నమూనాలు పరీక్షించగా ‘నిపా నెగిటీవ్’గా నిర్ధారనైనట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిపా వైరస్ నిర్ధారణ కాలేదని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిమ్స్, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లో ముందస్తు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో, స్కూళ్లలో పని చేస్తున్న వారిలో కేరళకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మజా తెలిపారు. ప్రస్తుతం కేరళలో నిపా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో వీరు కొద్ది రోజుల వరకు అక్కడికి వెళ్లకపోవడమే ఉత్తమమని సూచించారు. కేరళ వెళ్లాలనుకున్న నగరవాసులు కూడా తాత్కాలికంగా తమ ఆలోచణను వాయిదా వేసుకోవడమే మంచిదని ఆమె అన్నారు.
భయం వద్దు: మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో నిఫా వైరస్ లేనేలేదని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ‘‘వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్న ఇద్దరికి నిపా వైరస్ సోకలేదని వారికి చేయించిన పరీక్షల్లో తేలింది. ప్రజలు అనుమానాలు, ఆపోహలకు, భయాందోళనలకు గురవాల్సిన అవసరం లేదు. వైద్య శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది’’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment