జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి నడిబొడ్డున మురికి కూపంగా మారిన నల్లకుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలసి గురువారం ఆయన నల్లకుంట పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నల్లకుంట అభివృద్ధికి సంబంధించి కలెక్టర్‌తో మంత్రి చర్చించారు.
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ నల్లకుంటలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా పార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నల్లకుంట వద్ద తనకు ఉన్న రూ.10 కోట్ల విలువైన 6 ఎకరాల పట్టా భూమిని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తానన్నారు. కొందరునేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తారని.. కానీ తాను సొంత డబ్బుతో కొనుగోలు చేసిన భూమిని పట్టణ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నానని తెలిపారు.
గతంలోనూ...
మంత్రి లక్ష్మారెడ్డి గతంలోనూ సొంత భూమిని పేదలు, ప్రభుత్వ అవసరాలకు అప్పగించారు. 2003లో తన సొంత గ్రామమైన తిమ్మాజీపేట మండలం ఆవంచలో పది ఎకరాల భూమిని దళిత రైతుల సాగు అవసరాలకు పంపణీ చేశారు.
తాజాగా జడ్చర్లలో రూ.50 లక్షల విలువైన రెండు ఎకరాల భూమిని జర్నలిస్టుల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అప్పగించారు. అక్కడ పనులను కూడా ఆయన ప్రారంభించారు. అలాగే జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.2 కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని కూడా ఇటీవలే అప్పగించి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment