Mini Tankbund
-
మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి
సాక్షి, హైదరాబాద్: సరూర్‌నగర్ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చెరువుకు ఆనుకొని పుర్తిగా ఇళ్లు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెరువులోని మొసలిని పట్టుకెళ్లాలని కోరుతున్నారు. చదవండి: డ్యాన్సర్‌కు రూ.11.75 లక్షల టోకరా -
మినీ ట్యాంక్‌బండ్‌పై సరదాగా..
సాక్షి, సిద్దిపేట: పట్టణంలో పర్యటించిన మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్ రెడ్డిలు ఆదివారం రాత్రి మినీ ట్యాంక్‌బండ్ కోమటి చెరువు వద్ద సరదాగా కాలక్షేపం చేశారు. ముందుగా రాక్ గార్డెన్, మ్యూజికల్ ఫౌంటైన్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. అనంతరం కోమటి చెరువు కట్టపైన బ్యాటరీ బైక్‌లో మంత్రి హరీశ్‌తో కలిసి విహరించారు. అదేవిధంగా చెరువులో మంత్రులు బోటింగ్ చేశారు. చెరువుకట్టపైన సరదాగా పానీపూరి తిని కొద్దిసేపు మినీట్యాంక్‌బండ్ పై సేదతీరారు. హుస్సేన్ సాగర్ తరహాలో కోమటి చెరువును తీర్చిదిద్దడం పట్ల మంత్రి హరీశ్‌రావును ఆయన అభినందించారు. -
కల సాకారమవుతోంది..
సాక్షి, కోరుట్ల: పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మద్దుల చెరువు మినీట్యాంక్ బండ్ ఏర్పాటు కల సాకారమవుతోంది. ఇప్పటికే సుమారు రూ. 3.50 కోట్లు కేటాయించి పూడికతీత, పుట్‌పాత్, గేట్లు, బతుకమ్మ ఘాట్లు, బండ్ నిర్మాణం పూర్తి కాగా..ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు కొంత మేర మిగిలిపోయాయి. ఈ పనుల కోసం ఆరు నెలల క్రితం అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన నిధుల రూ. 25 కోట్ల నుంచి రూ. 33 లక్షలు కెటాయించారు. ఈ నిధులతో మినీట్యాంక్ బండ్‌గా మారిన మద్దుల చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త సోయగాలు.. కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి వెంట ఉన్న మద్దుల చెరువును దాదాపుగా మినీట్యాంక్ బండ్ రూపం సంతరించుకుంది. నిర్మాణపరమైన పనులు పూర్తి కాగా.. మినీ ట్యాంకు బండ్ సుందరీకరణ పనులు మిగిలిపోయాయి. ఈ పనుల్లో బాగంగా ఫిట్నెస్ ఓపెన్ జిమ్, కట్టపై పార్కులు, అందమైన ఆకృతులతో నిర్మాణాలు, చెట్లు, గడ్డిమొక్కలు పెంపకం, ఫుట్‌పాత్ పక్కన అందంగా ఉండటానికి అవసరమైన బొమ్మలు, బతుకమ్మ ఘాట్ వద్ద చిన్నపాటి గద్దెల నిర్మాణం వంటి వాటి కోసం ఈ నిధులు కేటాయించనున్నారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు చెందిన టెండర్లు త్వరలో పూర్తి కానున్నాయి. మరో రూ. 50లక్షలు మినీట్యాంక్ బండ్లో నీటిని ఎప్పకప్పుడు శుద్ధీకరణ చేయడానికి అవసరమైన సాంకేతికతను ఏర్పాటు చేయడంతో పాటు మిషన్ భగీరథ పైప్‌లను అనుసంధానం చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉంది. ఈ పనుల కోసం మరో రూ. 50లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నిధులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారు. త్వరితగతిన ఈ నిధులు మంజూరైతే కోరుట్ల మద్దుల చెరువుకు చెందిన దాదాపు అన్ని పనులు పూర్తి అయినట్లే. ఈ పనులన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది కాలం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మంత్రి లక్ష్మారెడ్డి ఔదార్యం
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి నడిబొడ్డున మురికి కూపంగా మారిన నల్లకుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలసి గురువారం ఆయన నల్లకుంట పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నల్లకుంట అభివృద్ధికి సంబంధించి కలెక్టర్‌తో మంత్రి చర్చించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ నల్లకుంటలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా పార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నల్లకుంట వద్ద తనకు ఉన్న రూ.10 కోట్ల విలువైన 6 ఎకరాల పట్టా భూమిని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తానన్నారు. కొందరునేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తారని.. కానీ తాను సొంత డబ్బుతో కొనుగోలు చేసిన భూమిని పట్టణ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నానని తెలిపారు. గతంలోనూ... మంత్రి లక్ష్మారెడ్డి గతంలోనూ సొంత భూమిని పేదలు, ప్రభుత్వ అవసరాలకు అప్పగించారు. 2003లో తన సొంత గ్రామమైన తిమ్మాజీపేట మండలం ఆవంచలో పది ఎకరాల భూమిని దళిత రైతుల సాగు అవసరాలకు పంపణీ చేశారు. తాజాగా జడ్చర్లలో రూ.50 లక్షల విలువైన రెండు ఎకరాల భూమిని జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి అప్పగించారు. అక్కడ పనులను కూడా ఆయన ప్రారంభించారు. అలాగే జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.2 కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని కూడా ఇటీవలే అప్పగించి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం విశేషం. -
దసరాలోగా ‘డబుల్ బెడ్రూం’
సాక్షి,హుజూరాబాద్: దసరా పండగ లోగా డబుల్ బెడ్రూం పనులను పూర్తి చేయాలని, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పట్టణంలోని మోడల్ చెరువు వద్ద మినీ ట్యాంక్‌బండ్, డబుల్ బెడ్రూం పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. జూన్ లోపు ట్యాంక్‌బండ్ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ట్యాంక్ బండ్ చుట్టూ 4 ప్రాంతాల్లో పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్కుగా చేయాలని అధికారులను ఆదేశించారు. వాకింగ్ ట్రాక్‌ను 30 మీటర్లు వెడల్పుగా చేయాలని సూచించారు. ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గణేశ్‌నగర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీలించారు. నగర పంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, సీఈ శ్యాంసుందర్, ఎస్ఈ వెంకటకృష్ణ, ఈఈ శ్రీనివాస్‌రావు గుప్తా, డీఈ శ్రీనివాసులు, ఏఈ సంజీవ, ఆర్అండ్బీ డీఈ కృష్ణారెడ్డి, ఏఈ రాజునాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్, మండల, పట్టణాధ్యక్షులు కొంరారెడ్డి, శ్రీనివాస్, నాయకులు రమేశ్‌గౌడ్, శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, పంజాల రాంశంకర్‌గౌడ్, పోతుల సంజీవ్, ముక్క రమేశ్, కన్నెబోయిన శ్రీనివాస్, మారపల్లి సుశీల, ఇమ్రాన్, బాలరాజు పాల్గొన్నారు. మానవ కల్యాణ వేదికగా నాయిని చెరువు జమ్మికుంట(హుజూరాబాద్): దర్గంధానికి కేంద్రమైన నాయిని చెరువును మానవ కల్యాణానికి వేదికగా మారుస్తానని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు మినీ ట్యాంక్‌బాండ్ పనులను పర్యవేక్షించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని నక్లెస్ రోడ్డును తలపించేలా జమ్మికుంట నాయిని చెరువు రూపురేఖలు మారుస్తానని అన్నారు. నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిళి రమేశ్, వైస్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, తహసీల్దార్ బావ్‌సింగ్, పోనగంటి మల్లయ్య పాల్గొన్నారు. -
లకారం జనహారం
నగరం జన ఉత్సాహంతో ఉప్పొంగింది. సింగారించుకున్న లకారం ట్యాంక్‌బండ్‌ను చూసి ప్రజలు మురిశారు. 5కే పరుగుతో సంబరాన్ని నింపారు. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించి..హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం అభివృద్ధి చెందుతోందని కితాబునిచ్చారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధతో లకారాన్ని..నగరానికి అలంకారంగా మార్చారని అభినందించారు. ఖమ్మంస్పోర్ట్స్: జాతరను మైమరపించిన జనంతో, ఉవ్వెత్తున ఎగిసిన క్రీడాభిమానంతో 5కే రన్ దిగ్విజయంగా కొనసాగింది. నిర్వాహకులు ఊహించిన విధంగానే 5కే రన్లో ప్రాతినిధ్యం వహించేందుకు వేలాదిగా ఖమ్మం నగరవాసులు తరలివచ్చారు. సర్దార్ పటేల్ స్టేడియం వద్ద రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారే పరుగెత్తాలి అని నిర్వాహకులు తెలపడంతో దాదాపు వెయ్యిమందికి పైగా నగర వాసులు, ఇతర జిల్లాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. తర్వాత నగరంలోని పలు సేవాసంస్థలు, క్రీడా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేట్ విద్యాసంస్థల వారు భాగస్వామ్యులయ్యారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఖమ్మం మున్సిపాల్ కార్పొరేషన్ కమిషనర్ సందీప్‌కుమార్ ఝూ, అడిషనల్ డీసీపీ కె.సురేష్‌కుమార్, బాలకిషన్, నగర మేయర్ డాక్టర్ జి.పాపాలాల్, 5కే రన్ నిర్వాహకులు దొడ్డ రవి, కురువేళ్ల ప్రవీణ్‌కుమార్, సినీనటులు పాల్గొన్నారు. స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ రన్ ఇల్లెందు క్రాస్‌రోడ్, కోర్టు మీదుగా మమత ఆస్పత్రి మార్గం నుంచి లకారం ట్యాంక్‌బండ్ వరకు చేరుకుంది. నిర్వాహకులు 40ఏళ్లలోపు పురుషులు, మహిళల స్థానాలు ప్రకటించారు. ముందుగా నమోదు చేసుకున్నవారు 16నిమిషాల్లో రన్‌ను ముగించగా, తర్వాత మిగతా వారు..అరగంటకు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. సర్దార్ పటేల్స్టేడియం నుంచి ప్రారంభమైన 5కే రన్‌తో లకారం ట్యాంక్‌బండ్ వరకు రోడ్లన్నీ జనంతో నిండాయి. స్టేడియంనుంచి లకారం ట్యాంక్‌బండ్ వరకు ఎక్కడ చూసినా జనమే కనిపించారు. క్రీడా సంఘాలకు చెందిన వారు తమ క్రీడాకారులను తీసుకుకొచ్చి రన్లో పాల్గొనే విధంగా చేశారు. చిప్ అనుసంధానంగా రన్.. జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన 5కే రన్లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. అథ్లెట్ల షూలలో ఒక చిప్‌ను అమర్చి, జీపీఎస్ ద్వారా వీరి గమనం తీరును పరిశీలించారు. తద్వారా తప్పుడు పద్ధతిలో గమ్యస్థానానికి చేరకుండా పకడ్బందీగా వ్యవహరించారు. భారీ బందోబస్తు.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా..పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. స్టేడియం ప్రాంతంలోని రెండురోడ్లలో ఒక మార్గాన్ని మూసివేశారు. భద్రత ఏర్పాట్లను అడిషన్ డీసీపీ కె.సురేష్‌కుమార్ పర్యవేక్షించారు. నగర ఏసీపీలు పీవీ.గణేష్, ట్రాఫిక్ ఏసీపీ సదా నిరంజన్, రెహమాన్, సీఐలు రాజిరెడ్డి, వెంకన్నబాబు, రమేష్, తిరుపతిరెడ్డి, నాగేంద్రచారి ఆధ్వర్యంలో నిరంతరం బందోబస్తు పర్యవేక్షించారు. విజేతలు వీరే.. 40 ఏళ్లలోపు పురుషుల విభాగంలో నిర్వహించిన పరుగులో జి.విజయ్‌కుమార్(వరంగల్), ఆర్.రమేష్‌చంద్ర(మహబూబ్‌నగర్), ఎస్.వినోద్(ఖమ్మం), కె.తిరుపతి, వంశీ(ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీ) విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో బి.నవ్య(నల్లగొండ), పి.ఉషారాణి(యూసీపీఈ వరంగల్), తేజశ్రీ(ఖమ్మం) విజేతలుగా నిలిచారు. సినీ తారల సందడి.. సినిమా తారలు శ్రీకాంత్, శివాజీ, శ్రీనివాసరెడ్డి, తారక్‌రత్న, హేమ, గాయకుడు సింహ తదితరులు హాజరై సందడి చేశారు. నృత్యాలతో ఉత్సాహం నింపారు. ఖమ్మం అంటే..కళాకారుల గుమ్మం..అని, ఇక్కడికి ఎప్పుడొచ్చినా కొత్తదనం కనిపిస్తుందని ఆనందంగా చెప్పారు. మా అసోసియేషన్ 25వ వేడుకను ఖమ్మంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. శాస్త్రీయ నృత్యాలు, సినీ గేయాలపనలు నగరవాసులను అలరించాయి. -
మినీ ట్యాంక్‌బండ్‌గా ‘ఊరు చెరువు’
ధర్పల్లి: మండల కేంద్రంలోని ఊర చెరువు మినీట్యాంక్ బండ్‌గా మారబోతోంది. మిషన్‌కాకతీయ మొదటి విడతలో ఇటీవల రూ.కోటి వ్యయంతో చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీనిని మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం రూ.2.06కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చెరువులో 265.00టీఎంసీల నీరు నిలువ ఉండేలా పనులు చేపట్టారు. చెరువు కింద 500ఎకరాల ఆయకట్టు ఉంది. ఊరచెరువు మినీట్యాంక్‌బండ్‌గా మారితే పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రానుంది. ఊరచెరువులోకి ఇన్‌ఫ్లో వచ్చే రంగం చెరువు ఫీడర్ చానల్ పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే చెరువు జలకళను సంతరించుకోనుంది. రంగం చెరువు ఫీడర్ పనులకు అనుమతి లభించేలా అధికారులు, పాలకులు కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. చెరువుకట్ట అలుగుపై వంతెన నిర్మాణంతో పాటు పోలిస్‌స్టేషన్ నుంచి కట్టపైకి దారి ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతంగా అలరించనుంది. పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలి ఊరచెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చడం సంతోషంగా ఉంది. పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలి. పర్యాటకులను అలరించే విధంగా పరసరాలను తీర్చిదిద్దాలి. చెరువులోకి గ్రామంలోని మురుగునీరు చేరుతోంది. మురుగునీరు చెరువులోకి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అప్పుడే మినీ ట్యాంక్ బండ్ సక్సెస్ అవుతుంది. నిధులు విడుదల చేసిన పాలకులకు కృతజ్ఞతలు కర్క గంగారెడ్డి, సర్పంచ్, ధర్పల్లి మరిన్ని నిధులు కేటాయించాలి ఊర చెరువును మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధులు కేటాయించాలి. సీతాయిపేట్ గ్రామ ప్రజలకు అహ్లాదకర వాతావరణం అందుబాటులో ఉండే విధంగా మినీ ట్యాంక్ బండ్ నిర్మించాలి. ప్రస్తుతం కేటాయించిన నిధులు సరిపోవు. పర్యాటక కేంద్రం ఏర్పాటు రెండు గ్రామస్తులకు ఉపయోగపడేలా ఉండాలి. అప్పుడే ట్యాంక్ బండ్‌కు పర్యాటకుల రద్దీ పెరుగుతుంది. మోహన్‌లాల్, ఎంపీటీసీ సభ్యుడు, సీతాయిపేట్ -
మెదక్ దశ తిరిగినట్లే: మంత్రి హరీశ్ రావు
మెదక్: మెదక్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేలైన్ ఏర్పాటు, మినీట్యాంకు బండ్ నిర్మాణం, రూ.50కోట్లతో పట్టణానికి మిషన్ భగీరథ పథకం అమలుతో మెదక్ దశ తిరిగినట్లేనని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ పనులకు ఆయన మెదక్ మండలం పాతూర్‌లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ రైల్వేలైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ పూర్తి చేసి, పరిహారంలో సగం భరించిందని తెలిపారు. రెండేళ్లలో రైల్వేలైన్ పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మినీ ట్యాంక్బండ్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు
హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టనున్న మినీ ట్యాంక్బండ్ల రూపకల్పనకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం శుక్రవారం ఖరారు చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం చెరువు కట్ట చుట్టూ వాకింగ్, సైక్లింగ్ చేసేలా తీర్చిదిద్దాలని, పిల్లల పార్కును ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. బెంచీలు, తినుబండార కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. బోటింగ్ కోసం జెట్టీలను ఏర్పాటు చేయాలని, బతుకమ్మ ఘాట్లను నిర్మిం చాలని ఆదేశించారు.