కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్‌ ఆస్పత్రి | State Level Cancer Hospital in Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్‌ ఆస్పత్రి

Published Sun, Dec 11 2022 7:44 AM | Last Updated on Sun, Dec 11 2022 8:02 AM

State Level Cancer Hospital in Kurnool - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి రాష్ట్ర స్థాయి క్యాన్సర్‌ ఆస్పత్రి త్వరలో కర్నూలులో అందుబాటులోకి రానుంది. రూ.120 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మించారు. ప్రభుత్వ రంగంలో వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్యాన్సర్‌ చికిత్సలపైన కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కర్నూలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా రాష్ట్ర స్థాయి క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణాన్ని శర వేగంగా పూర్తి చేశారు. మిగతా వసతులన్నీ కల్పించి ఆరు నెలల్లో దీనిని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 

ఈ ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం 2017లోనే మంజూరు చేసింది. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీని నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ప్రభుత్వ రంగంలో రాష్ట్రస్థాయి క్యాన్సర్‌ ఆస్పత్రి ఒక్కటి కూడా లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆస్పత్రిపై కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే దీని  నిర్మాణాన్ని చేపట్టి వేగంగా పూర్తి చేసింది.

క్యాన్సర్‌ చికిత్సలకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చేందుకు చర్యలు చేపడుతోంది. తొలి దశలో రూ.53.60 కోట్లతో పరికరాలను ఏర్పాటు చేస్తోంది. హై ఎండ్‌ రేడియేషన్‌ అంకాలజీ, మెడికల్‌ అంకాలజీ, సర్జరీ అంకాలజీ విభాగాలను అందుబాటులోకి తెస్తోంది. రూ.30 కోట్ల వ్యయంతో హై ఎండ్‌ డ్యూయల్‌ ఎనర్జీ లీనియర్‌ యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఎక్విప్‌మెంట్స్‌ను వీలైనంత త్వరగా సమకూర్చాలని వైద్య విద్యా సంచాలకులు ఏపీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. 

ఆరు నెలల్లోగా అందుబాటులోకి 
కర్నూలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా రాష్ట్ర స్థాయి క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ భవనాల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్స పరికరాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఆరు నెలల్లోపే క్యాన్సర్‌ చికిత్సలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలన్నింటిలో ప్రత్యేకంగా  క్యాన్సర్‌ చికిత్సల విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. 
– డాక్టర్‌. శ్రీనివాసన్, రాష్ట్ర క్యాన్సర్‌ విభాగం నోడల్‌ అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement