సాక్షి, కర్నూలు : రాజకీయ చైతన్యంతో తిరుగులేని శక్తిగా ఎదిగిన కర్నూలు ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సంసిద్ధమయ్యారు. 14 అసెంబ్లీ, 2 పార్లమెంటరీ స్థానాల్లోనూ మార్పు దిశగా ఓటర్లు సంఘటితం అవుతున్న వాతావరణం జిల్లాలో నెలకొంది. ఐదేళ్లూ వరుస కరువులతో వ్యవసాయం బాగా దెబ్బతిని రైతుల ఆర్థిక పరిస్థితి కుదేలైంది.
ఉల్లి దిగుబడులు భారీగా వచ్చినా.. ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు, మహిళలు, కార్మికులు, నిరుద్యోగులు సహా అన్నివర్గాల ప్రజలు ఐదేళ్ల పాలనలో ఇబ్బందులకు గురయ్యారు. కరువు కోరల్లో చిక్కుకున్న తమను ఆదుకునే సరైన నాయకుడి కోసం నిరీక్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్నిచోట్లా స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు వెళుతున్నారు.
జిల్లా అభివృద్ధి విషయంలో చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యం చేశారనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆర్భాట ప్రకటనలే తప్ప చేసిందేమీ లేదనే చర్చ సాగుతోంది. కనీసం జనాలకు, మూగ జీవాలకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని దుస్థితి నుంచి జిల్లాను రక్షించుకుంటామని.. ఇన్నాళ్లు పాలకులు చెప్పిన మాటలు, చేసిన వంచనలకు చెల్లుచీటీ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆచరణాత్మకంగా చూపించిన సంక్షేమ రాజ్యం మళ్లీ రావాలని.. ఆ రాజ్యం తెచ్చే వైఎస్ జగన్‌ను గెలిపించుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.
పారని పాచికలు
ఎన్నికల ముందు పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరిట చంద్రబాబు వేసిన పాచిక పారడం లేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ పేర్లతో కొంత మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేయడాన్ని ప్రజలు పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కర్నూలు మండలానికి చెందిన వి.మద్దిలేటి అనే రైతు మాట్లాడుతూ ‘చంద్రబాబు గత ఎన్నికల్లో మొత్తం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.
చివరకు వడ్డీల రూపంలో మోయలేని భారం మోపారు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయని కొంత మొత్తం విదిలిస్తే.. రైతులు అర్థం చేసుకోలేనంత వెర్రోళ్లు కాదు’ అని వ్యాఖ్యానించారు. పసుపు–కుంకుమ పథకం పైనా మహిళల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నంద్యాలలోని నూనెపల్లె ప్రాంతానికి చెందిన షేక్ మహమూదా అనే మహిళ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు మా గ్రూపు సభ్యులంతా కలిసి రూ.4 లక్షల రుణం తీసుకున్నాం.
చంద్రబాబు చెప్పినట్టు డ్వాక్రా రుణం మాఫీ కాలేదు. చక్ర వడ్డీలతో కలిపి బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తం తడిసి మోపెడైంది. అప్పుడు రుణమాఫీ చేయకుండా.. ఇప్పుడు పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇస్తున్నామంటూ ప్రలోభపెడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇది కూడా రుణం కిందకే వస్తుందట’ అని వ్యాఖ్యానించారు. ‘వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎన్నికల నాటికి ఉన్న రుణ మొత్తాలను నాలుగు దఫాలుగా మహిళల చేతికే ఇస్తామంటున్నారు. ఇది మహిళలను బాగా ఆకట్టుకుంటోంది’ అని ఆమె చెప్పారు.
ఆదోనికి చెందిన పాత తరం కమ్యూనిస్ట్ నాయకుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘గతంలో ఎన్నడూ చూడని అకృత్యాలను ఈ ఐదేళ్లలో చూశాం. అవినీతి, అకృత్యాలకు పాల్పడిన తెలుగుదేశం సర్కారును ఈ ఎన్నికల్లో కూకటివేళ్లతో పెకలించటం ఖాయం’ అని వ్యాఖ్యానించారు.
డబ్బుకు లొంగని వైఎస్సార్ సీపీ శ్రేణులు
వైఎస్సార్ సీపీ గెలవటం ఖాయమనే నిర్ధారణకు వచ్చిన టీడీపీ ప్రతిపక్ష నాయకులను కొనుగోలు చేసేందుకు బరి తెగించింది. గ్రామాలు, వార్డు స్థాయిలో చురుగ్గా ఉండే నాయకుల ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక్కొక్కరికీ రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చేందుకు టీడీపీ వెనుకాడటం లేదు. వైఎస్సార్ సీపీ నేతలెవరూ ప్రలోభాలను తలొగ్గకపోవటంతో టీడీపీ డీలా పడింది.
ఇదిలా వుంటే.. ముస్లిం, చేనేత, వాల్మీకి, గౌడ తదితర బీసీ కులాల వారు జిల్లాలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వీరందరినీ ఉగాది రోజున వైఎస్ జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఆకట్టుకుంది. ఆరో గ్యశ్రీ పరిధిని పెంచుతానని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ఎంత మొత్తమైనా విద్యార్థులకు చెల్లిస్తామని, పిల్లలను బడికి పంపితే ఏటా రూ.15 వేలు ఇస్తానని ప్రకటించడం, 45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పింఛన్లు ఇసామన్న ప్రకటన బాగా ఆకట్టుకుంటోంది. ‘జగన్‌కు ఓ సారి అవకాశం ఇద్దాం’ అనే మాట వినిసిస్తోంది.
ఫిరాయింపుదారులకు హడల్
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఐదుగురు టీడీపీలోకి ఫిరాయించారు. వారిలో మంత్రి అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డికు మాత్రమే టీడీపీ టికెట్లు లభించాయి. ఈసారి తాను గెలిచే అవకాశం లేదని బుడ్డా రాజశేఖరరెడ్డి చేతులెత్తేసినా.. చంద్రబాబు ఆయనకు బలవంతంగా టికెట్ కట్టబెట్టారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి ప్రత్యర్థిగా బరిలోకి దిగిన రాజశేఖరరెడ్డికి ప్రజల్లో ఆదరణ అంతంతమాత్రంగానే లభిస్తోంది.
మరోవైపు ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఏటికి ఎదురీదుతున్నారు. ఆమెపై యువనేత గంగుల బ్రిజేంద్రారెడ్డి (నాని) ముందంజలో ఉన్నారు. పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గౌరు చరిత పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం పార్టీ శ్రేణులను ఢీలా పడేలా చేస్తోంది. ఇలా ఏ నియోజకవర్గంలో చూసినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment