
భారత్‌లో యూనివర్సల్ క్యాన్సర్ ఆసుపత్రి
* స్పోర్ట్స్ మెడిసిన్ కేంద్రం కూడా యూనివర్సల్ ఎండీ షబీర్ నెల్లికొడె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అబుదాబికి చెందిన యూనివర్సల్ హాస్పిటల్ బెంగళూరులో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. 360 పడకల సామర్థ్యంతో 2017 నాటికి నిర్మాణం పూర్తి కానుంది. ప్రోటాన్ థెరపీ విధానంలో రోగులకు చికిత్స అందించనున్నారు. అలాగే క్యాన్సర్ చికిత్స పద్ధతులపై పరిశోధన కేంద్రాన్ని సైతం నెలకొల్పనుంది.
అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్న బెంగళూరు ఫెసిలిటీకి రూ.6,500 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఎండీ షబీర్ నెల్లికొడె ఆదివారం తెలిపారు. 9.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. ఐఎస్‌బీలో జరిగిన లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశోధన కేంద్రంలో పాలు పంచుకోవాల్సిందిగా స్టార్టప్ కంపెనీలు, వైద్యులు, పరిశోధకులను ఆహ్వానిస్తామన్నారు.
స్పోర్ట్స్ మెడిసిన్, రిహాబిలిటేషన్ కేంద్రం సైతం ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామన్నారు. మానవ వనరుల లభ్యత, తక్కువ వ్యయం కారణంగానే భారత్‌లో అడుగు పెట్టామన్నారు. యూనివర్సల్‌కు దుబాయి, షార్జా, అబుదాబి, కువైట్, ఖతార్‌లో మొత్తం ఆరు ఆసుపత్రులు ఉన్నాయి. భవిష్యత్ మార్కెట్‌గా భారత్‌ను అభివర్ణించిన కంపెనీ.. రానున్న రోజుల్లో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
స్మాల్ వర్షన్ జాగ్వార్..
టాటా మోటార్స్ భారత్‌కు స్మాల్ వర్షన్ జాగ్వార్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ విషయాన్ని కంపెనీ వాణిజ్య వాహనాల విభాగం ఈడీ రవి పిషరోడి ధ్రువీకరించారు. అయితే ఈ కారు గురించి మరిన్ని విషయాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కారు ధర రూ.50 లక్షల రేంజ్‌లో ఉంటుందని చెప్పారు.